సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 224వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి అనుగ్రహంతో డెంగ్యూ నయమైంది
  2. సాయిలీల అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది

సాయి అనుగ్రహంతో డెంగ్యూ నయమైంది

సాయిభక్తుడు ప్రవీణ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయిసమర్థాయ నమః

నా పేరు ప్రవీణ్. నా నివాసం హైదరాబాదులోని షాద్‌నగర్. ఇదివరకు నా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు సాయి నాపై ఇటీవల చూపిన ప్రేమను మీతో పంచుకుంటున్నాను.

క్రిందటి అనుభవంలో నా భార్యకు డెంగ్యూ అని చెప్పాను కదా! ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, మొదట మా అమ్మాయికి, తరువాత మా అమ్మకి, ఆ తరువాత నా భార్యకు ఇలా వరుసగా ఒకరి తరువాత ఒకరు డెంగ్యూ బారినపడటం, చేతిలో డబ్బులు లేకపోవటం వలన నా పరిస్థితి దయనీయంగా అయ్యింది. ఇక నేనేమీ చేయలేక సాయిపై భారం వేసి, అంతా ఆయనే చూసుకుంటారని అనుకున్నాను. నేను విశ్వసించినట్లే నా సాయి బాధ్యత తీసుకొని నాపై ప్రేమను చూపారు. మొదట నా భార్యకు ప్లేట్లెట్స్ 2,65,000 వున్నాయి. తరువాతరోజుకి 3,25,000 కు పెరిగాయి. అప్పుడు మేము, 'ఇక తగ్గిపోతుంది. రేపు ఒక్కరోజు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. బాబా దయవలన తొందరగానే తగ్గిపోయింది' అనుకున్నాము. అయితే మరునాడు బ్లడ్ టెస్ట్ చేయిస్తే, ప్లేట్లెట్స్ 1,55,000 కు పడిపోయాయి. దాంతో నాకు టెన్షన్ పెరిగిపోయింది. నాకు ఏదన్నా సమస్య వస్తే, బాబా ప్రశ్నావళి చూస్తాను. అలా చూసినప్పుడు, "భయపడకు, ఆరోగ్యం కుదుటపడుతుంది" అని వచ్చింది. కానీ నా మనస్సు కుదుటపడలేదు. మరునాడు మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే, ప్లేట్లెట్స్ 93,000 కు పడిపోయాయి. దాంతో నా భయం ఇంకా పెరిగిపోయింది. అప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, "రేపటి నుండి నీ బాధలు తగ్గుముఖం పడతాయి" అని సాయి సందేశం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నా భార్యకు ప్లేట్లెట్స్ పెరిగితే నీ మందిరానికి వచ్చి, పూలమాల సమర్పించుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. మరునాడు మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే, ప్లేట్లెట్స్ 1,10,000 కు పెరిగాయి. ఆరోజు సాయంత్రం సంధ్య ఆరతికి వెళ్లి, బాబాకు పూలమాల సమర్పించుకున్నాను. తరువాత డాక్టర్ నా భార్యకు తగ్గిపోయిందని చెప్పారు. కానీ నేను, "ప్లేట్లెట్స్ ఇంకా పెరిగితే మళ్లీ పూలమాల సమర్పించుకుంటాన"ని అనుకున్నాను. మొన్న టెస్ట్ చేయిస్తే ప్లేట్లెట్స్ 2,52,000 కు పెరిగాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" 

అన్నట్టు ఒక విషయం చెప్పడం మరచిపోయాను. నేను ఈ టెన్షన్‌లో ఉన్నప్పుడు, నా అనుభవాలను బ్లాగులో పబ్లిష్ చేసినట్లు బ్లాగు నడిపే సాయి(అసలు పేరు తెలియదు) మెసేజ్ పెట్టారు. అప్పుడు, నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియని స్థితిలో ఉన్న నేను ఈ సాయితో నా బాధను పంచుకున్నాను. అప్పుడు తను, "భయం ఏమీలేదు సాయి. నమ్ముకున్నవారికి బాబా ఎప్పుడూ అండగా ఉంటారు. బాబా ఆశీస్సులతో త్వరలోనే మీ భార్యకు నయమవుతుంది. దైర్యంగా ఉండండి సాయి" అని ధైర్యం చెప్పారు. ఈ సాయికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే, ఈ సాయి నోటివెంట బాబాయే పలికారని నా నమ్మకం

ఓం సాయిరామ్!
ఓం శ్రీసాయిసమర్థాయ నమః

సాయిలీల అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను సాయి బిడ్డని. నాకు ప్రతిదీ సాయే. ఆయన లేకుండా నేను జీవించలేను. నేను నా ప్రార్థనకు సమాధానం లభించిన తర్వాత నా అనుభవాన్ని తోటిభక్తులతో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

నా సోదరి భర్త జూన్ నెలలో మా ఇంటికి వచ్చేందుకు నా సోదరికి, వాళ్ళ ఇద్దరమ్మాయిలకి విమాన టిక్కెట్లను బుక్ చేసి నా సోదరిని ఆశ్చర్యపరిచారు. నిజానికి వాళ్ళనుండి చాలా దూరంగా బెంగళూరులో ఉన్న నా వద్దకు వాళ్ళని పంపేందుకు అతను అనుమతించడం అంటే అది పూర్తిగా అసాధ్యమైన విషయం. అందువలన నా సోదరి చాలా ఆశ్చర్యపోయింది. కానీ నాకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వనందున, నాకు ఇబ్బంది అవుతుందేమోనని నా సోదరి ఆ టికెట్లను రద్దు చేయమని తన భర్తతో చెప్పింది. దానితో అతను టిక్కెట్లను రద్దు చేసేశారు. ఆ తరువాత ఆమె నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయమంతా చెప్పింది. నేను తనతో, "నువ్వెందుకు అలా చేశావు? పిల్లలతో నువ్వు వచ్చి ఉంటే ఎంత బాగుండేది! ఆనందంగా గడిపేవాళ్ళం కదా!" అని తనని కోప్పడ్డాను. దాంతో తను తన తెలివితక్కువ పనికి చాలా బాధపడింది. నేను, "ఏదైతే జరిగిందో, అది మన మంచికోసమే జరిగి ఉంటుంది. నువ్వేమీ బాధపడకు. టికెట్లు మళ్ళీ బుక్ చేయమని నీ భర్తను అడగు" అని చెప్పాను. నిజానికి అతను చాలా కోపిష్టి. అందువల్ల తను భయపడుతూనే తన భర్తతో ఆ విషయంగా చర్చించింది. కానీ, అతని నుండి సానుకూల స్పందన రాలేదు. దాంతో నేను తనతో, "బాబాను సహాయం చేయమని ప్రార్థించి, ఆయన పవిత్ర పాదాలని నమ్ముకో! గురువారం మనకి శుభవార్త అందుతుంది" అని చెప్పాను. తరువాత నేను కూడా, "బాబా! నా సోదరి మా ఇంటికి వచ్చేలా చేయండి. ఎందుకంటే అమ్మ నా వద్దనే ఉంటుంది. కాబట్టి తను అమ్మని కూడా కలుసుకుంటుంది. దయచేసి మేము అనుకున్నది సాధ్యమయ్యేలా చేయండి" అని ప్రార్థించాను. మరుసటిరోజు గురువారం. ఆరోజు నా సోదరి నాకు ఫోన్ చేసి, "టికెట్లు బుక్ అయ్యాయి. మేము వస్తున్నాము" అన్న సంతోషకరమైన సమాచారాన్ని చెప్పింది. బాబా అద్భుతం చూడండి. నా సోదరి ముందు టికెట్లు రద్దు చేయమని చెప్పి తప్పు చేసింది. అలాంటిది తనే మళ్ళీ టిక్కెట్లు బుక్ చేయమని అంటే కోపిష్టి అయిన తన భర్త ఒప్పుకోవడమనేది అసాధ్యం. కానీ సాయిలీల అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. "చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి". 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo