సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 673వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాపై ఆధారపడితే అంతా మంచే జరుగుతుంది
  2. నా జీవితమంతా బాబా ఆశీస్సులే

బాబాపై ఆధారపడితే అంతా మంచే జరుగుతుంది


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!

  

సాయిబిడ్డలకు నా నమస్కారాలు. అందరికీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. నేను బాబాను ఎంతలా నమ్ముతానంటే, ఉదయాన లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు 'బాబా' అని అనని రోజు ఉండదు. నాకు ఒకసారి నెలసరి సమయంలో చాలా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యింది. సాధారణంగా నేను ఎప్పుడూ సంప్రదించే డాక్టరు వద్దకు వెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డాక్టరు నాతో, "మీకు పాలిప్స్ ఉన్నాయి, హిస్టెరోస్కోపీ చెయ్యాలి" అని అన్నారు. నాకు చాలా భయం వేసింది. మేము మా తల్లిదండ్రులకు దూరంగా వేరే చోట ఉంటున్నాము. కరోనా సమయంలో వాళ్ళు మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఒకప్రక్క తన ఉద్యోగాన్ని చూసుకుంటూ మరోవైపు టెస్టుల కోసం నాతో తిరగాలంటే మావారికి చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బాబా తప్ప మాకు వేరే దిక్కులేదు. అందువలన మేము బాబానే ప్రార్థించి ముందుకి సాగాము. పరీక్షలన్నీ అయ్యాక ఆపరేషన్ చేయడానికి ఒక గంట ముందు హఠాత్తుగా నాకు కరోనా పరీక్ష చేయించమన్నారు. ఒకవేళ ఆ పరీక్షలో నెగిటివ్ రాకపోతే ఆపరేషన్ మరో రోజుకి మార్చాల్సి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆపరేషన్ కాస్త ఆలస్యంగా చేయించుకునేంత సమయం కూడా లేదు. అయినా చేసేది లేక బాబా మీద భారం వేసి కరోనా పరీక్షకి వెళ్ళాను. బాబా దయవలన రిపోర్టు నెగిటివ్ వచ్చింది. తరువాత జరిగిన ఆపరేషన్ కూడా విజయవంతమైంది. ఇదంతా బాబా మాతో ఉన్న కారణంగానే జరిగింది. తరువాత పాలిప్స్‌ని బయాప్సీకి పంపించారు. టెస్టు ఫలితాలు ఎలా వస్తాయో ఏమోనని నాకు చాలా భయమేసింది. ఆ స్థితిలో ఒకరోజు నేను, "బాబా! సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో నా సమస్యకు సంబంధించిన అనుభవం రావాల"ని బాబాతో చెప్పుకుని బ్లాగు ఓపెన్ చేశాను. ఆరోజు కామెంట్స్ సెక్షన్లో, 'మా అమ్మకి రిపోర్టు నార్మల్‌గా వచ్చింది' అని ఎవరో భక్తులు తమ అనుభవాన్ని పంచుకున్నారు. అది చూసి నేను ఎంతో సంతోషించి, "బాబా! నాకు ఏమీ కాకుండా సురక్షితంగా ఉండేలా చూడండి" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా ఆశీస్సులతో అంతా నార్మల్ ఉందనీ, క్యాన్సర్ కణాలేమీ లేవనీ రిపోర్టు వచ్చింది. బాబా దయతో నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. "ధన్యవాదాలు బాబా! ఇలా ఎల్లప్పుడూ మీ బిడ్డల్ని రక్షించండి తండ్రీ. మీ పాదాలకు వందనాలు".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా జీవితమంతా బాబా ఆశీస్సులే


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులకి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా గురించి చెప్పడానికి మాటలు చాలవు. బాబా మనకోసం చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. శ్రీ సద్గురు సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ నా కోరికను నెరవేర్చినందుకు శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాను. 


2019 అక్టోబరులో నా భర్త ఉద్యోగం పోయింది. తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా కారణంగా తనకు ఉద్యోగం లభించలేదు. దాదాపు సంవత్సరంపాటు తను ఉద్యోగావకాశం కొరకు నిరీక్షిస్తూ ఉన్నా కానీ ఏ కంపెనీ నుంచీ తనకు  ఉద్యోగావకాశం రాలేదు. దాంతో తను చాలా కుమిలిపోయారు. నేను మాత్రం, “బాబా! నీవే దిక్కు! నా భర్తకు త్వరగా ఉద్యోగాన్ని ప్రసాదించండి” అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా దయార్ద్రహృదయం వలన మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందీ లేకుండా సంవత్సరం మూడునెలల కాలం గడిచింది. 2020 డిసెంబరులో బాబా దయవల్ల మరో సాయిభక్తుడి ద్వారా నా భర్తకు ఉద్యోగం లభించింది. ఇదంతా బాబా లీల. పూర్వజన్మ కర్మఫలం వలన 15 నెలల పాటు నా భర్తకు ఉద్యోగం లేకపోయినా బాబా దయార్ద్రహృదయం వలన సంతోషంగా ఉద్యోగం చేసుకునే అవకాశం  వచ్చింది. 


శిరిడీ దర్శించాలని నా చిరకాలవాంఛ. ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదు. బాబా పిలుపుకోసం నేను ఎదురుచూస్తున్నాను. నా మనస్సులో ఒక విన్నపం ఉంది. దాన్ని బాబా వింటారని ఆశిస్తున్నాను. “బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నాకు అండగా నిలిచి నా జీవితాన్ని అందంగా మలిచారు. అందరినీ ఆశీర్వదించండి బాబా!”. మనమందరం బాబా లీలలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. సాయినాథుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ.. సెలవు.


సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo