శ్రీసాయినాథుని దివ్య ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
"బాబా! మీ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ మీ ప్రేమలో ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో.. మీ ప్రేమను పంచుకుంటూ, ఆస్వాదిస్తూ సదా మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి."
నరహరి వాసుదేవ్ రాయికర్
ఇది 21 రోజుల పాటు శిరిడీలో బాబా ప్రత్యక్ష సన్నిధిలో గడిపే మహద్భాగ్యాన్ని పొందిన ఒక యువకుడి కథ. ఆ యువకుని పేరు నరహరి వాసుదేవ్ రాయికర్. తనకు 16 సంవత్సరాల వయస్సున్నప్పుడు తాననుభవిస్తున్న దౌర్భాగ్య జీవితంతో విసుగు చెందిన నరహరి శిరిడీ వెళ్లి బాబా పాదాలను ఆశ్రయించాలని నిర్ణయించుకొని, 1912, డిసెంబర్ నెలలో ఒక సోమవారంనాడు ఒంటరిగా బొంబాయి నుండి బయలుదేరి ప్రయాసతో కూడుకున్న సుదీర్ఘ ప్రయాణం చేసి చివరికి సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శిరిడీ చేరుకున్నాడు.
శిరిడీ ఒక కుగ్రామం. ఆ గ్రామంలోకి వెళ్లే మట్టిమార్గమంతా గుంటలతోనూ, అక్కడక్కడ చెత్తాచెదారంతోనూ నిండి ఉంది. ఆ మార్గంలో వెళ్తున్న నరహరి ఎదురుగా వస్తున్న ఒక మహిళను చూసి, "బాబా ఎక్కడ ఉంటారు?" అని అడిగాడు. ఆమె మౌనంగా ఒక దిక్కుగా చూపించింది. ఆమె చూపిన వైపుగా కాస్త ముందుకు వెళ్లిన నరహరి ఒక గుడిసె ముందు నిల్చొని ఉన్న మహిళతో, తనకు చాలా దాహంగా ఉందని, త్రాగడానికి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆమె ఎంతో వాత్సల్యంగా, "నువ్వు ఎక్కడనుండి వస్తున్నావు?" అని అడిగింది. అందుకు నరహరి, “నేను బాబాను దర్శించుకోవాలని ముంబాయి నుండి వస్తున్నాను” అని బదులిచ్చాడు. అది విని ఆశ్చర్యపోయిన ఆమె అతన్ని కూర్చోమని చెప్పి, వడివడిగా లోపలికి వెళ్లి, ఒక పళ్లెంలో వేరుశెనగలు, కొద్దిగా బెల్లం, వాటితోపాటు ఒక గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి, వాటిని అతనికిచ్చి తినమని చెప్పింది. నరహరి ఆమె ఇచ్చిన ఆహారాన్ని తిని, మంచినీళ్ళు త్రాగి కుదుటపడిన తర్వాత ఆమె అతని వద్ద కూర్చొని, ముంబాయిలో అతని జీవన విధానం గురించి అడిగింది. అందుకతను, "నేనొక అనాథను. నా తల్లిదండ్రులు ఎప్పుడు మరణించారో నాకు గుర్తులేదు. టెక్స్‌టైల్ మిల్లులో పనిచేసే మా మామయ్య నన్ను తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె నన్ను చూడటానికి కూడా ఇష్టపడేది కాదు. ఉదయం నుండి రాత్రి బాగా పొద్దుపోయేవరకు నా చేత ఎంతో పని చేయించుకొని కూడా సరిగా ఆహారం పెట్టేది కాదు. అందరూ తినగా మిగిలిన ఆహారాన్ని, అది కూడా చాలా స్వల్పంగా మాత్రమే పెట్టేది. అదీ చాలక, నేను ఉత్తపుణ్యానికే అన్నం తింటూ తన కుటుంబానికి భారంగా మారానని సూటిపోటి మాటలు అంటుండేది. ఆ మాటలు నన్ను చాలా బాధించేవి. మా మామయ్య తరచూ శ్రీసాయి సచ్చరిత్ర రచించిన శ్రీదభోల్కర్ ఇంటికి వెళ్తుండేవారు. నేను కూడా ఆయనతో కలిసి తరచూ అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ బాబా దైవత్వం గురించి విన్న నేను ఎలాగైనా శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని, నాకు చక్కని భవిష్యత్తును ప్రసాదించమని బాబాను ప్రార్థించి, ఆయన ఆశీస్సులతో నా కాళ్లపై నేను జీవించాలని నిర్ణయించుకొని కేవలం మూడు అణాలు జేబులో పెట్టుకొని శిరిడీ వచ్చే ధైర్యం చేశాను" అని చెప్పాడు. అదంతా విన్న దయామయి అయిన ఆ తల్లి, "అయ్యో, నాయనా! నీ కథ విని నా హృదయం ద్రవించిపోతోంది. ఆ భగవంతుడు నీకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాడు. రాత్రి భోజనానికి మా ఇంటికి రా. నేను పేదరాలినైనప్పటికీ నాకు ఉన్నంతలో నీకు తప్పక భోజనం పెడతాను. నువ్వు మా ఇంటి ముందున్న అరుగు మీద పడుకోవచ్చు" అని అంది. ఆమె మాటలు విన్న నరహరి నయనాలు అశ్రువులతో నిండిపోగా అపరిచితురాలైన ఆ స్త్రీ ప్రవర్తనకు, తన అత్త ప్రవర్తనకు మధ్యనున్న అంతరాన్ని పోల్చుకోకుండా ఉండలేకపోయాడు.
తర్వాత నరహరి నేరుగా మసీదుకు వెళ్ళాడు. అక్కడ గోడకు అభిముఖంగా ముఖం పెట్టి పడుకొనివున్న ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి మాసిన తెల్లని చింకి కఫినీ ధరించి ఉన్నారు. తలకు మాసిన ఒక తెల్లని వస్త్రం చుట్టి ఉంది. ఆయన సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్నారు. సన్నగా ఉన్నప్పటికీ దృఢంగా ఉన్నారు. ఆయన లేచేవరకు వేచి ఉండదలచి అక్కడే మశీదు మెట్ల మీద కూర్చున్నాడు నరహరి. అరగంట తర్వాత ఆయన లేచి, "అబ్దుల్! నాకు కొంచెం నీళ్లు ఇవ్వు" అని అన్నారు. వెంటనే నరహరి లేచి నిలబడి, చుట్టూ ఎవరూ లేకపోవడం చూసి తనే స్వయంగా సమీపంలో ఉన్న ఒక బకెట్‌లోంచి నీళ్ళు తెచ్చి ఆయన ముందుంచాడు. ఆయన ఏదో గొణుగుతూ నరహరిని చూసి, "ఎవరు నువ్వు?" అని అడిగారు. దానికి నరహరి, "నేను సాయిబాబాని దర్శించుకోవాలని ముంబాయి నుండి వచ్చాను. ఆయన ఎక్కడ ఉంటారు?" అని అడిగాడు. అందుకాయన, "గాడిదా! నీ ముందు ఎవరిని చూస్తున్నావ్?" అని గద్దించారు. దాంతో నరహరికి తన ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరో కాదు, సాయిబాబానేనని అర్థమై బాబా పాదాలపై తన శిరస్సును ఉంచాడు. బాబా అతనిని ఆశీర్వదించి మసీదులో తమ వద్దనే మూడు వారాలు ఉంచుకున్నారు.
నరహరి మసీదులో బసచేసిన 5వ రోజు అతను ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడు. దాని గురించి అతనిలా చెప్పాడు: "ఆ రోజంతా బాబా చాలా అశాంతిగా ఉన్నట్టు కనిపించారు. చీకటిపడ్డాక బాబా అందరినీ తమతమ ఇళ్ళకి వెళ్ళమన్నారు. తర్వాత అబ్దుల్‌ను కూడా వెళ్ళమని చెప్పి, "ఈరోజు ఎవ్వరూ ఇక్కడ ఉండొద్దు, రాత్రివేళ ఇక్కడికి రావద్దు. రేపు ఉదయం రావచ్చు. కానీ సూర్యోదయం తర్వాత మాత్రమే" అని కఠినంగా అన్నారు. తర్వాత బాబా నా వైపు తిరిగి, "నువ్వు ఇక్కడే పడుకో" అని అన్నారు. అది విని మిగతా భక్తులందరూ నా వైపు తీవ్రంగా చూస్తూ, అయిష్టంగానే మసీదు నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను తమ దగ్గర కూర్చుండబెట్టుకొని త్రాగడానికి కొంచెం పాలు ఇచ్చారు. ఆ తర్వాత బాబా నాతో, "నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వేమీ భయపడకు. ఏమి చూసినా నువ్వు లేవకూడదు, కదలకుండా పడుకొని చూస్తూండు. లేచి నిలబడితే నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు. ప్రశాంతంగా పడుకో! శబ్దంచేయకు, అరచి గోలచేయకు. ఏది వచ్చినా, ఏ రూపంలో వచ్చినా నువ్వు మాత్రం నీ పడక మీద నుండి లేవకు. ప్రశాంతంగా పడుకుని చూడు, అర్థమైందా?" అని అన్నారు. తర్వాత నన్ను నా గోనెసంచి పడక మీద పడుకోమని ఆదేశించి, తమ సట్కాను పాత్రలోని పాలలో ముంచి, దానితో గోనెసంచి చుట్టూ ఒక గీత గీసి, "నా సూచనలను పాటించు. కదలకు! లేవకు!" అని మళ్ళీ చెప్పారు. నేను ప్రశాంతంగా పడుకున్నాను. చాలాసేపటి తర్వాత కళ్ళు తెరచి బాబా వైపు చూశాను. బాబా ధునికి ఎదురుగా గోడ ప్రక్కన కూర్చొని ఉన్నారు. ఆయన ప్రక్కన కుండతో నీళ్లు, ఒక చిన్న గిన్నెతో పాలు, రుద్రాక్షమాల ఉన్నాయి. బాబా ప్రశాంతంగా కూర్చొని అల్లా నామాన్ని జపిస్తున్నారు. అదంతా చూశాక నేను గాఢంగా నిద్రపోయాను. అర్థరాత్రి సమయంలో ఏదో ప్రాకుతున్న శబ్దానికి నేను ఉలిక్కిపడి మేల్కొన్నాను. కానీ బాబా ఆదేశం నా చెవులలో మారుమ్రోగుతున్నందువల్ల చనిపోయినట్లు అలాగే పడుకున్నాను. ఒక పెద్ద నల్లటి కొండచిలువ నా పాదాల దగ్గర జరజరా ప్రాకుతూ కనిపించింది. కానీ అది నా పడక చుట్టూ బాబా గీసిన గీతను దాటే ధైర్యం చేయలేదు. ఆ కొండచిలువ ప్రాక్కుంటూ వచ్చి నా తల వద్ద తన శరీర సగభాగాన్ని నిటారుగా పైకి లేపి పడగవిప్పి కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిల్చుంది. దాని పడగ దాదాపు 3, 4 అడుగుల పొడవుతో చాలా పెద్దదిగా వుంది. దాని కళ్ళు ఎర్రటి మణుల్లా ఉన్నాయి. అది కోపంగా బాబా వైపు చూస్తూ, ఆయన్ని కాటేసే ప్రయత్నంలో ఉంది. నిజానికి అది ఉన్న చోటు నుంచి బాబాని సులువుగా కాటు వేయగలదు. కానీ ఎంత ప్రయత్నించినా దానికి అది సాధ్యం కాలేదు. కారణం నాకు అర్థం కాలేదు కానీ, బాబా ముందు వెలుగుతున్న ధుని కారణంగా అది ఆ ధైర్యం చేయలేదని అనిపించింది. బాబా మాత్రం ప్రశాంతంగా అక్కడే కూర్చుని, అల్లా నామాన్ని జపిస్తున్నారు. బాబా తల వెనుక ఒక ప్రకాశవంతమైన వలయం వుంది. ఆ వలయం మరింత ప్రకాశవంతంగా మారి మసీదంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఆ కొండచిలువ పదేపదే బాబాను కాటేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ దాని ప్రయత్నాలు ఫలించలేదు. అది ధునిని దాటి వెళ్ళలేక నిరాశతో తన తోకను నేలకేసి కొట్టింది. ఇలా చాలాసేపు కొనసాగింది. చివరగా బాబా ధ్యానం నుండి బయటికి వచ్చారు. బాబా తల వెనుకనున్న కాంతివలయం అదృశ్యమైంది. బాబా కన్నుల నుండి ప్రకాశవంతమైన ఒక కాంతి కిరణం వెలువడి ఆ కొండచిలువపై పడింది; ఆ కొండచిలువ కన్నుల నుండి కూడా ఒక కాంతి కిరణం వెలువడి, బాబా కన్నుల నుండి వచ్చిన కాంతి కిరణాన్ని కలిసింది. ఆ రెండు కిరణాలు కలిసిన చోట ఒక చిన్న బొమ్మవలె ఉన్న బాబా సూక్ష్మరూపం దర్శనమిచ్చింది. ఆ బొమ్మ మెల్లగా ముందుకు కదులుతూ కొండచిలువ నుండి వస్తున్న కాంతి కిరణాన్ని మింగేసింది. తరువాత బాబా సూక్ష్మరూపం మెల్లగా బాబాలోనే ఐక్యమైంది. ఆ తర్వాత ఆ కొండచిలువ నా శరీరం మీదుగా ప్రాక్కుంటూ వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్లిందో భగవంతునికే తెలుసు. నేను భయంతో వణికిపోయాను, నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. నేను సగం చనిపోయినట్లు నాకు అనిపించింది. ఆ స్థితిలో నేను ఎప్పుడు నిద్రపోయానో నాకు గుర్తులేదుగానీ మరుసటిరోజు ఉదయం బాబా నన్ను కుదిపి నిద్రలేపారు. ఆ సమయంలో నాకు విపరీతమైన జ్వరం వుంది. బాబా తమ సట్కాను చేతిలోకి తీసుకొని, దానితో నా తలపై మూడుసార్లు మెల్లగా తట్టారు. దాంతో నా జ్వరం తగ్గిపోయింది. బాబా నన్ను ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కొని తమతో రమ్మన్నారు. నేను అలాగే చేశాను. బాబా వేగంగా గ్రామంలోకి నడుస్తుంటే నేను వారి వెనుక పరుగెత్తాను. ఆయన ఒక ఇంటి ముందు ఆగి, హరి అనే అతనిని పిలిచి, "మాకు టీ ఇవ్వు" అని అడిగారు. అతను టీ ఇస్తే, మేము త్రాగాము. బాబా హరిని ఆశీర్వదించి, నన్ను వెంటబెట్టుకుని ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్న చెట్టు వద్దకు తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ చెట్టు క్రింద మునుపటి రాత్రి కనిపించిన భయంకర దృశ్యంలోని కొండచిలువ చచ్చిపడివుంది. బాబా కన్నీళ్లతో, “బిడ్డా, ఒకరి కోసం నీ ప్రాణాన్ని అర్పించడం కంటే గొప్ప కార్యం ఈ లోకంలో మరేదీ లేదు” అని అన్నారు. తర్వాత బాబా ఒక పెద్ద రాయి తీసుకొని, దానితో గుంట త్రవ్వడం మొదలుపెట్టారు. నేను కూడా వారితో పాటు గుంట త్రవ్వడం మొదలుపెట్టాను. కొద్దిసేపట్లో ఒక పెద్ద గొయ్యి తయారైంది. బాబా ఆ గుంటలో ఆ కొండచిలువను వేసి కొంతసేపు అలాగే నిలబడి, ఆ తర్వాత తమ చేతులను ఆకాశంకేసి చాచి, "అల్లా! ఈ కొండచిలువపై దయచూపండి" అని అన్నారు. తర్వాత ఆ గుంటను మట్టితో కప్పి, పైనున్న చెట్టు ఆకును దానిపై వేశారు. ఇంతలో ఒక్కసారిగా బలమైన గాలి వీచి చిన్నపాటి పెనుగాలిని సృష్టించి మా ఇద్దరినీ దుమ్ముతో కప్పేసింది. దాదాపు 5 నిమిషాలపాటు ఆ స్థితి కొనసాగిన తరువాత వాతావరణం ప్రశాంతించింది. నేను ఆ కొండచిలువ సమాధి వైపు చూశాను. అది పారిజాత పుష్పాలతో కప్పబడివుండటం కనిపించింది. “వెనక్కి తిరిగి చూడవద్దు” అని బాబా నన్ను గట్టిగా హెచ్చరించి వేగంగా శిరిడీ గ్రామం వైపు నడిచారు. నేను వారిని అనుసరించాను. మేము మసీదుకి చేరుకునేసరికి, ముందురోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తితో గ్రామస్థులు అక్కడ గుమిగూడి ఉన్నారు. వాళ్లలో చాలామంది నేను వాళ్లకు ఏదైనా చెబుతాననే ఆశతో వస్తువులు లంచంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ నేను వాళ్ళతో, "రాత్రంతా హాయిగా నిద్రపోయాన"ని మాత్రమే చెప్పాను. అప్పుడు వాళ్ళు కనీసం మేము ఆ ఉదయం ఎక్కడికెళ్ళామో తెలుసుకోవాలనుకున్నారు. అయితే నేను అమాయకంగా, “మేము వాహ్యాళికి వెళ్ళాము” అని మాత్రమే వాళ్లతో అన్నాను”.
నరహరి శిరిడీలో ఉన్న 8వ రోజున బాబా తాత్యాకోతేపాటిల్‌తో, “తాత్యా! నాకు కొత్త జీవితం లభించింది. నేను మరో ఐదారు సంవత్సరాలు జీవిస్తాను. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు” అని చెప్పడం విన్నాడు. అది విన్నాక నరహరి, 'బాబా ఎందుకిలా చెప్పారు? ఆరోజు రాత్రి ఆ కొండచిలువ ధునిని దాటి బాబాను కాటు వేయలేకపోయింది. ఆ రాత్రి ఎవరు చనిపోవాల్సి ఉంది? ఆ కొండచిలువ ఎవరికోసం తన ప్రాణాన్ని విడిచింది?' అని అయోమయంలో పడ్డాడు. కానీ ఆ విధంగా బాబా తమ మహాసమాధి గురించి ముందుగా చెప్పారు. బాబా ఇంకా ఇలా చెప్పారు: "తాత్యా! నువ్వు చింతించకు. నేను సుమారు 1918 వరకు ఉంటాను. నా దగ్గర ఉన్న ఈ ఇటుకరాయి నా జీవితానికి రక్ష. కాబట్టి నేను దీనిని జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ ఈ ఇటుక విరిగితే నేను ఎక్కువకాలం జీవించను. పుట్టినవాడు ఖచ్చితంగా మరణిస్తాడు. కాబట్టి నువ్వు దానిగురించి ఎందుకు బాధపడాలి? జనాభా స్థిరస్థాయిలో ఉంచడానికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని కలిగి ఉన్నాడు; ఇందువల్లనే మానవులు మరణిస్తున్నారు. అయితే మరణానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. కొందరు ఆకలితోను, కొందరు అనారోగ్యంతోను, మరికొందరు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగాను మరణిస్తారు. అయితే, 80-90 ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్ఫోటనం జరుగుతుంది. అసాధారణ వ్యాధులు ప్రబలుతాయి. పెద్దసంఖ్యలో ప్రజలు ఆ వ్యాధుల బారినపడతారు. ప్రపంచంలోని వివిధ ఖండాలలో క్రొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి, వాటికి చికిత్స కనుగొనడం కష్టం. మానవులు ఇతరుల పట్ల సానుభూతిని కోల్పోతారు. ప్రజలు తమ వద్ద ఉన్న సంపద ద్వారా మాత్రమే గుర్తింపు పొందుతారు. ధర్మం చాలా కష్టాల్లో కూరుకుపోతుంది. సత్పురుషులు నానారకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వానికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని న్యాయబద్ధంగా పాలించడం కష్టమవుతుంది. ఇది మానవజాతి ఎదుర్కొనబోయే దుర్భరమైన భవిష్యత్తు". (బాబా చెప్పినవన్నీ నిజం. HIV-AIDS, డెంగ్యూ, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, ఎబోలా, ఇటీవల కరోనా వంటి వ్యాధులకు కారణమయ్యే అనేక కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చాయి). తర్వాత బాబా నరహరితో, "నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు ఎన్నటికీ ఆకలితో ఉండవు. నీకు నిద్రించడానికి స్థలం, ధరించడానికి బట్టలు ఉంటాయి. ఇది నీకు నా ఆశీర్వాదం” అని అన్నారు.
మిగతాది తరువాయి భాగంలో ..
మూలం: బాబా స్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.
Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba me leelalu amogam ayya.. Sai Deva. Sai Rama.. Sai Krishna..
ReplyDeleteSai .. tammudini kapadu tandri please please.. anugrahinchu.. Karuna chupu. Inka Daya raleda.. repatikalla tana sthithi ni merugu paruchu 🙏🙏🙏
ReplyDeleteOm sai ram 🙏🙏🌹🌹
ReplyDelete