ఈ భాగంలో అనుభవాలు:
1. సాయిని తలస్తే కానిదేముంది?
2. నమ్ముకుంటే నిదానంగానైనా అన్ని సమస్యలు తీరుస్తారు బాబా
3. బాబా కృపతో ఆరోగ్యం
సాయిని తలస్తే కానిదేముంది?
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయి నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 2023, అక్టోబర్ నెలలో దసరా పండగ తర్వాత మావారు అయ్యప్పస్వామి మాల వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అప్పటికి కొన్ని నెలల ముందు నుండి నాకు నెలసరి సమయానికి రావట్లేదు. అందువల్ల నాకు ఏం చేయాలో అర్థంకాక, "సాయితండ్రీ! నన్ను మీరే రక్షించాలి. ఆయన స్వామి మాల వేసుకున్నప్పుడు కానీ, ఇరుముడి అప్పుడుగానీ ఏ ఇబ్బంది కలుగకుండా చూడు సాయి" అని బాబాను ప్రార్థించాను. సాయి నా మొర ఆలకించారు. మధ్యలో నెలసరి వచ్చింది కానీ స్వాములకు బిక్ష పెట్టేటప్పుడు గానీ, ఇరుముడి అప్పుడుగానీ ఏ ఇబ్బంది కలగలేదు. ఇంకో విషయం, బిక్ష పెట్టినప్పుడు మా పుట్టింటి తరఫు వాళ్లు రానన్నారు. అప్పుడు నేను, "సాయీ! అందరూ వచ్చి ఏ అరమరికలు, గొడవలు లేకుండా అంతా సక్రమంగా అయ్యేటట్లు చూడండి" అని సాయిని కోరుకున్నాడు. మనం బాధతో అడిగితే బాబా కాదంటారా? ఏ గొడవలూ లేకుండా అంతా సక్రమంగా జరిగింది. ఇకపోతే, తిరుపతి వెళ్లడానికి నాకు కూడా రిజర్వేషన్ చేశారు. అది నా నెలసరి సమయమైనందున "టాబ్లెట్స్ వేసుకోవాలా?" అని బాబాను అడిగితే, 'వద్ద'ని సమాధానమిచ్చారు. ఇంకా నేను ధైర్యంగా తిరుపతి వెళ్లాను. బాబా దయవల్ల తిరుపతి నుండి వచ్చి ప్రసాదాల పంచేవరకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు.
2023లో మా ఏసీ పని చేయలేదు. E5 అని ఎర్రర్ వచ్చేది. ఇద్దరు టెక్నీషియన్ల చూసి, "బోర్డు పోయింద"ని చెపితే, రిపేరు చేయించాం కానీ, ఆ ఎర్రర్ పోలేదు. అప్పుడు నేను, "ఏంటి సాయి ఇలా జరుగుతుంది? ఏదో విధంగా బాగు చేయించండి" అని బాబాను ప్రార్థించి, 'మా ఎదురింటికి వచ్చే మెకానిక్‌తో రిపేర్ చేయించమంటారా?' అని అడిగితే, చేయించమన్నారు. అతన్ని పిలిస్తే అతను వచ్చి ఏసీ ఓపెన్ చేసి, వెంటనే సమస్యను గుర్తించి, ఏదో పార్టు వదులుగా బిగించారని చెప్పి 600 రూపాయలతో రిపేర్ చేశారు. సాయిని తలస్తే కానిదేముంది? "శతకోటి ధన్యవాదాలు బాబా. ఇలాగే మమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడండి"
నమ్ముకుంటే నిదానంగానైనా అన్ని సమస్యలు తీరుస్తారు బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయినాథునికి శతకోటి వందనాలు. నేను చాలారోజుల నుండి బాబానే నమ్ముకు న్న సామాన్య భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, తోడు-నీడ అన్ని ఆ సాయినాథుడే. మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలతో బాధపడుతున్న నేను బాబా దయ, వారి ఊదీతో అన్నింటిని దాటుకుని బాగానే ఉన్నాను. 2025, మార్చి నెల చివరి వారంలో 3 రోజులు నా మోకాలు చాలా నొప్పిగా ఉండి కదపడానికి కూడా లేక చాలా బాధపడ్డాను. అయినా ఏ మందులు వాడకుండా సాయి నామస్మరణ చేసుకుంటూ, నొప్పి ఉన్న దగ్గర ఊదీ వ్రాస్తుంటే మార్చి 26 సాయంకాలానికి నొప్పి తగ్గింది. అలాగే ఒంటిమీద ఎలర్జీ లాగా ఎర్రగా దద్దుర్లు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకొని కూడా వెళ్లకుండా ఆగి సాయితండ్రిని తలుచుకొని, ఊదీ దద్దుర్లు ఉన్న చోట రాసుకుని "నీదే భారమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల అవి కూడా తగ్గాయి. బాబాను నమ్ముకుంటే నిదానంగానైనా అన్ని సమస్యలు తీరిపోతాయి. "ధన్యవాదాలు బాబా. మా కుటుంబంలో కొన్ని సమస్యల వలన నేను చాలా బాధపడుతున్నాను. వాటి భారం మీ మీదే వేసాను. తొందరగా వాటిని తీర్చి నాకు మనశాంతిని ప్రసాదించండి. నా తప్పులేమన్నా ఉంటే క్షమించండి సాయిమాత".
బాబా కృపతో ఆరోగ్యం
సాయిభక్తులకు నమస్కారం. నాకు చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. 2024, చివరిలో నా కుడికాలు తీవ్రంగా నొప్పి పెట్టింది. దానివల్ల నడవడం చాలా కష్టమైంది. అదే సమయంలో కుడి చేయి కూడా నొప్పి పెట్టడం మొదలుపెట్టింది. కొన్నిరోజుల తర్వాత ఎడమ కాలు కూడా నొప్పి పెట్టసాగింది. ఇదివరకు ఎప్పుడూ నేను ఇలాంటి సమస్యను అనుభవించనందున ఏదైనా అనారోగ్య సమస్య ఏమో, భవిష్యత్తులో ఇంకేమైనా సమస్యలు వస్తాయేమోనని భయపడ్డాను. ఇంకా బాబాను, "ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య కాకూడదు. శస్త్రచికిత్స అవసరం ఉండకూడదు" అని ప్రార్థించి మా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదిస్తే, కేవలం కొన్ని మందులిచ్చారు. వాటిని 3, 4 నెలలు వాడితే సమస్య పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహాన్ని మీ భక్తులపై ఎప్పుడూ ఇలాగే కురిపించండి".
