సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

గోవిందస్వామి – ఆదిలక్ష్మియమ్మ



మద్రాస్ నివాసి గోవిందస్వామి అలియాస్ భావుస్వామి 1915 ప్రాంతంలో మద్రాసు ఎలక్ట్రిక్ ట్రామ్‌వేస్‌లో పని చేస్తుండేవాడు. అప్పటికి అతనికి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అతని భార్య పేరు ఆదిలక్ష్మియమ్మ. దక్షిణ కెనరా (దక్షిణ కన్నడ) ప్రాంతంలో నివసించే  'రామ్ భావు' అనే ఆయన అతని గురువు. ఆ కారణంగా అతనిని 'భావుస్వామి' అని పిలిచేవారు.

1915వ సంవత్సరంలో అతను తన కుటుంబంతో కలిసి భారతదేశ యాత్ర చేయాలని సెలవుపై బయలుదేరాడు. మార్గమధ్యంలో వాళ్ళు నాసిక్ వెళ్లి, అక్కడ ఉన్న శ్రీకాలారామ్ ఆలయంలో ‘నరసింగ్ మహారాజు’ను దర్శించి సేవించారు. ఆ మహరాజ్ వాళ్లతో, “శిరిడీ వెళ్ళి శ్రీసాయిబాబాను దర్శించుకోండి” అని సలహా ఇచ్చారు. ఆ మహరాజ్ సలహా ప్రకారం వాళ్ళు అక్కడి నుండి  శిరిడీ చేరుకున్నారు. 1915, ఆగస్టు 23(రాక్షసి నామ సంవత్సరం, ఆవని మాసం 6వ రోజు), ఉదయం 10:30 గంటలకు వాళ్ళు శిరిడీ చేరుకొని శ్రీసాయిబాబాను ప్రథమంగా దర్శించుకుని సంతుష్టులయ్యారు. ఆరోజు వారు మసీదులో శ్రీసాయిబాబా సన్నిధిలో భజన చేసారు, గోవిందస్వామికి 8 అణాలు కానుకగా ఇచ్చారు శ్రీసాయిబాబా.

శ్రీసాయిబాబా దర్బారు ఎంతో వైభవంగా ఉండేది. ఆయన సన్నిధిలో, అనేకమంది నర్తకీమణులు నాట్యం చేసేవారు. హరికథా కాలక్షేపాలు జరుగుతుండేవి. రకరకాల విన్యాసాలు ప్రదర్శించబడేవి. మసీదు వద్ద ఎప్పుడూ జనసందోహంతో కోలాహలంగా ఉండేది; శ్రీసాయిబాబాను మసీదు నుండి ‘చావడి’కి భక్తులందరూ కలిసి ఊరేగింపుగా తీసుకువెళ్లేవారు. ఇదంతా గోవిందస్వామి కుటుంబం గమనించింది. ఇంకా వాళ్ళు శిరిడీలో శ్రీసాయిబాబా గొప్ప యోగీశ్వరులు, పరబ్రహ్మస్వరూపులు, ప్రశాంతులు, ఉదారస్వభావులు, కరుణాస్వరూపులు అని తెలుసుకున్నారు. శ్రీసాయిబాబా తన భక్తులకు ప్రతిరోజు డబ్బును పంచుతారని, విద్యావంతులు మరియు కళాకారులను వారి వారి కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరిస్తారని విన్నారు. కేవలం పండుగలు, పర్వదినాలలోనే కాకుండా, ప్రతిరోజు ఆయన నియమంగా 1 రూపాయి నుండి 50 రూపాయల వరకు భక్తులకు, పేదలకు పంచుతుండేవారు. పావలా, అర్థరూపాయలు అయితే వర్షంలా కురిపించేవారు. శ్రీసాయిబాబా గొప్ప కరుణామయులే కానీ అందరికీ దానం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే ఘడియ వచ్చిన వారికే శ్రీసాయిబాబా హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. గోవిందస్వామి కుటుంబంవారు రామదాసి సంప్రదాయానికి చెందినవారు. వారు ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగాను, ఉల్లాసంగాను భజనలు చేసేవారు. శ్రీసాయిబాబా తమకు తోచినప్పుడు వారికి ఒకరూపాయో, అర్థరూపాయో ఇచ్చేవారు. ఒక్క ఆదిలక్ష్మియమ్మ తప్పించి, ఆ కుటుంబంలోని మిగిలన వారందరు శ్రీసాయిబాబా పంచే ధనాన్ని ఆశించసాగారు. ఆమె స్వభావం తక్కిన కుటుంబసభ్యుల కంటే భిన్నమైంది.

ఆదిలక్ష్మియమ్మకు శ్రీసాయి పవిత్రపాదాల యందు ఎంతో భక్తి కుదిరింది. వారు శిరిడీ చేరిన వారం రోజులకు అంటే ఆగస్టు 30వ తేదీన ఆమె శ్రీసాయిబాబాకు నైవేద్యం సమర్పించింది(ఆ ఒక్కసారి మాత్రమే ఆమె నైవేద్యం సమర్పించింది). ఆమె తాను సమర్పించే నైవేద్యాన్ని బాబా స్వీకరిస్తారో, లేదో అన్న సంకోచం వల్ల ఎంతో భక్తితో శ్రీసాయిబాబా నామాన్ని స్మరించుకుంటూ నైవేద్యాన్ని అంటే పాయసం, బజ్జీలు సిద్ధం చేసింది. వాటిని తీసుకెళ్లి శ్రీసాయిబాబా ముందు ఉంచినప్పుడు, దుర్గాబాయి అనే బ్రాహ్మణ వితంతువు ఆమె తెచ్చిన నైవేద్యాన్ని వరుసక్రమంలో చివరగా, అంటే శ్రీసాయిబాబాకు చాలా దూరంగా ఉంచింది. అయితే శ్రీసాయిబాబా నెమ్మదిగా ఆదిలక్ష్మియమ్మ తెచ్చిన నైవేద్యం దగ్గరకు వెళ్ళి, వాటిని ఎంతో ఇష్టంగా తినడం మొదలుపెట్టారు. అంతేకాకుండా, ప్రక్కనే ఉన్న షామా మొదలైన భక్తులతో పంచుకుంటూ వాటిని పూర్తిగా ఆరగించారు. శ్రీసాయిబాబా తన భక్తిని ఆమోదించినందుకు ఆదిలక్ష్మియమ్మ ఎంతో ఆనందించింది. శ్రీసాయిబాబా సర్వహృదయాంతరస్థుడు. తమ భక్తుల హృదయాలలో ఉన్న వారి ప్రేమకు శ్రీసాయిబాబా అంతే గొప్పగా ప్రతిస్పందిస్తారని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది.

ఇంకొకరోజు ఆదిలక్ష్మియమ్మ శ్రీసాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళింది. అప్పుడు అక్కడే ఉన్న శ్రీమతి తారాబాయి తర్ఖడ్‌తో “ఈరోజు నేను ఏదో పొరపాటు చేసినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు బాబా నన్ను కొడతారేమో!” అని తన మనోభావాలను వ్యక్తం చేసింది. అదే భావనతో ఆమె శ్రీసాయిబాబా వద్దకు వెళ్లి, నమస్కరించుకోబోతుండగా, శ్రీసాయిబాబా ఆయన ఆమెను తిట్టి అక్కడినుండి తరిమేసారు. ఆమె హృదయంలోని భావాలు మరియు ఆమె మానసిక స్థితి అన్నీ శ్రీసాయిబాబాకు తెలుసు కాబట్టి, ఆయన తమదైన శైలిలో, ఆమె ఊహించినట్లుగానే శ్రీసాయిబాబా ప్రవర్తించారు(శిక్ష విధించారు) అని ఆమె భావించింది.

ఆమె భక్తి విశ్వాసాలకు ప్రీతిచెంది శ్రీసాయిబాబా ఆమెకు సెప్టెంబర్ 3వ తేదీన మసీదులో మధ్యాహ్నఆరతి జరుగుతుండగా ఆమె ఇష్టదైవమైన శ్రీరామునిలా దర్శనాన్ని ప్రసాదించారు. తన ఇష్టదైవాన్ని చూసి ఆమె కరిగిపోయింది. మిగిలిన వారందరికీ శ్రీసాయిబాబావలె దర్శనమిస్తున్నారు, కానీ ఆమెకి మాత్రం శ్రీరాముని వలె దర్శనమివ్వగా ఆమె కళ్లనుండి ఆనందాశ్రువులు జలజలా రాలుతుండగా, ఆమె ఎంతో ఆనందంతో రెండు చేతులతో తాళాలు వాయిస్తున్న, అపూర్వ దృశ్యాన్ని చూచిన తక్కిన భక్తులు, “ఆహా, ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది? ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది?” అని ఆశ్చర్యచకితులయ్యారు. కానీ ఆమె అలా ప్రవర్తించటానికి కారణాన్ని మాత్రం గ్రహించలేకపోయారు.

ఆరోజు సాయంత్రమే ఆమె తన భర్తకు శ్రీసాయిబాబా ప్రసాదించిన అద్భుతలీలను వర్ణించింది.  శ్రీసాయిబాబా తనకు ప్రసాదించిన శ్రీరామదర్శన విశేషాన్ని ఆనందంగా వివరించింది. ఆమె గొప్ప భక్తురాలు అయినప్పటికీ ఆమె భర్తకు శ్రీసాయిబాబా పట్ల అంత భక్తి లేదు. అతడు, “స్త్రీలు అమాయక స్వభావం కలవారు. అమాయక భక్తుల మనసులో ఏదైతే ఉన్నదో అదే పైకి భాసిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే, నీకు మాత్రం శ్రీరాముని రూపమెలా కనిపించింది? నీకు ఇక్కడ శ్రీరాముని దర్శనమెలా సంభవమయింది? అదంతా నీ భ్రమ. వట్టి చాదస్తం” అని కుతర్కబుద్ధితో ఆమెను రకరకాలుగా అవహేళన చేశాడు. అయితే ఆమె ఈ ఆక్షేపణలకు ఏమీ కోపగించుకోలేదు, బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎఱుగదు. అంతకుమునుపు కూడా ఆమెకు శ్రీరాముని దర్శనం అప్పుడప్పుడూ కలుగుతుండేది. ఆ తరువాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు ఉన్నచోట దైవం ఉండడు. అందువల్ల ఆమెకు శ్రీరాముని దర్శనం కరువైపోయింది. అయితే శ్రీసాయిబాబాకు సర్వము విదితమే, కనుక ఆమె శ్రీసాయిబాబా చెంతకు చేరిన తరువాత, ఆమెలో శ్రీసాయిబాబా పట్ల భక్తివిశ్వాసాలు కుదరటంతో, ఆమెకు మరల శ్రీరాముని దర్శనాన్ని అనుగ్రహించారు.

శిరిడీ వచ్చిన మొదట్లో గోవిందస్వామికి శ్రీసాయిబాబా పట్ల అంతగా నమ్మకం ఉండేది కాదు. అయితే అతని భార్య ఆదిలక్ష్మియమ్మకు శ్రీరామునిగా దర్శనమిచ్చిన రోజు రాత్రి(1915, సెప్టెంబర్ 3) గోవిందస్వామికి ఒక వింతైన స్వప్నదర్శనాన్ని శ్రీసాయిబాబా ప్రసాదించారు. అప్పటి నుండి అతడికి శ్రీసాయిబాబాపై నమ్మకం కలిగింది. ఆ కలలో అతను ఒక పట్టణంలో ఉండగా, అక్కడి పోలీసులు అతడిని ఒక పెద్ద పంజరంలో పెట్టి అతడి చేతులను తాళ్ళతో గట్టిగా బంధిస్తున్నారు. అదే సమయంలో శ్రీసాయిబాబా పంజరం సమీపంలోనే ఊరకే ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడివున్నారు. అతడు శ్రీసాయి మహారాజును చూచి, రెండు చేతులు జోడించి, దీనవదనంతో ప్రార్థించాడు. వారి మధ్య జరిగిన సంభాషణ

గోవిందస్వామి - “బాబా! మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే, మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకీ దుస్థితి ఎందుకు?”

శ్రీసాయిబాబా - “నీవు చేసుకున్న కర్మనంతా నీవే అనుభవించి తీరాలి”

గోవిందస్వామి (అత్యంత వినయంగా) - “ఇటువంటి కష్టాన్ని అనుభవించటానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు”

శ్రీసాయిబాబా - “పూర్వజన్మలలో చేసి ఉండవచ్చు”

గోవిందస్వామి - “పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా! మీ దర్శనంతో అగ్ని ముందు ఎండుగడ్డివలె భస్మమై పోయి నేను ఎందుకు కర్మనుండి విముక్తుణ్ణి కాలేదు?”

శ్రీసాయిబాబా - “నీకంతటి విశ్వాసముందా?”

గోవిందస్వామి - “ఉంది బాబా”

శ్రీసాయిబాబా – "అయితే కళ్లు మూసుకో" అని ఆజ్ఞాపించారు.

గోవిందస్వామి కళ్లు మూసుకోగానే, ఎవరో క్రిందపడినట్లుగా పెద్ద శబ్దమయింది. ఆ శబ్దాన్ని విని చకితుడై అతడు కళ్ళు తెరచి చూడగా, అతను బంధవిముక్తుడై ఉన్నాడు. కానీ పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో అతడు చాలా గాబరాపడుతూ సాయిమహరాజు వైపు చూడసాగాడు.

శ్రీసాయిబాబా నవ్వుతూ - “ఇప్పుడు భలే పట్టుబడ్డావు. ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్థుడవని మరల నిన్ను బంధిస్తారు”

గోవిందస్వామి - "మీరు చెప్పింది నిజమే. ఏదో విధంగా నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించటం లేదు".

శ్రీసాయిబాబా – "అయితే మళ్ళీ కళ్లు మూసుకో" అని ఆజ్ఞాపించారు.

అతడు అలాగే చేసి తిరిగి కళ్ళు తెరిచినంతలో, అతడు పంజరం నుండి విడుదలయినట్లు, శ్రీసాయిబాబా ప్రక్కనే ఉన్నట్లు కనిపించింది. వెంటనే అతడు శ్రీసాయిబాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు

శ్రీసాయిబాబా - "ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకుముందు చేసిన నమస్కారానికి ఏమైనా భేదమున్నదా? బాగా ఆలోచించి చెప్పు!"

గోవిందస్వామి - "బాబా! భూమికి, ఆకాశానికి ఉన్నంత భేదమున్నది. మొదట కేవలం ద్రవ్యాన్ని ఆశించి నమస్కరించాను. ఇప్పుడు మీరే పరమేశ్వరుడు అనే భావంతో వందనం చేస్తున్నాను. మొదట నాకు మీపై ఏమాత్రం భక్తిలేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్మల్ని భ్రష్టుపట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది".

శ్రీసాయిబాబా – "అయితే నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా(దేవతలపై భక్తి లేదా)?"

గోవిందస్వామి – "లేదు".

శ్రీసాయిబాబా - "మీ ఇంట్లో పంజాలేదూ? మొహరమప్పుడు దానిని పూజచేయవూ? బాగా ఆలోచించి చెప్పు.  మీ ఇంట్లో మహమ్మదీయ దేవతయైన కాడ్ బీబి ఉంది. ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా!"

గోవిందస్వామి – "అవును బాబా, మీరు చెప్పింది అంతా నిజమే" (అని ఒప్పుకున్నాడు).

శ్రీసాయిబాబా - "నీకేమైనా కోరిక ఉందా? నీకు ఇంకా ఏం కావాలి?".

గోవిందస్వామి – "నా గురువును దర్శించాలి".

శ్రీసాయిబాబా – "అయితే వెనుకకు తిరిగి చూడు".

అతను వెనుకకు తిరిగి చూసేసరికి, అతని ఎదుట అతని గురువు దర్శనమిచ్చారు. అతను తన గురువు పాదాలపై పడి నమస్కరించగా వారు వెంటనే అదృశ్యమయ్యారు.

గోవిందస్వామి జిజ్ఞాసతో - "బాబా! మీకు బాగా వయసుమళ్లి, ముసలివారి వలె కన్పిస్తున్నారు. మీ వయస్సు మీకు తెలుసా?"

శ్రీసాయిబాబా – "ఏంటి, నేను ముసలివాడినని అంటున్నావా? ఏదీ నాతో సమానంగా పరుగెత్తి చూడు!".

అని అంటూ శ్రీసాయిబాబా పరుగెత్తసాగారు. వారి వెనుక అతను పరుగుపెట్టాడు. శ్రీసాయి మహరాజ్ వేగంగా పరుగెత్తుతుంటే లేచిన ధూళిలో వారు అదృశ్యమయ్యారు. ఇంతలో అతను స్వప్నం నుండి మేలుకున్నాడు. వెంటనే తనకొచ్చిన స్వప్నం గురించి తీవ్రంగా ఆలోచించగా, అతని మనోవైఖరి పూర్తిగా  మారిపోయింది. శ్రీసాయిబాబా గొప్పతనాన్ని గ్రహించాడు. అది స్వప్నమే అయినా అందులోని ప్రశ్నోత్తర సంవాదన ద్వారా అతను చక్కటి జ్ఞానాన్ని పొందాడు. శ్రీసాయి పాదాల యందు అతనికి భక్తి కుదిరింది. అంతకుముందు తనకు శ్రీసాయి పట్ల ఉన్న దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయి, వారి మహిమను స్తుతించాడు.

మరునాడు ఉదయం గోవిందస్వామి, అతని కుటుంబం దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు శ్రీసాయిబాబా కరుణించి వాళ్ళకు రెండురూపాయల బర్ఫి మిఠాయి, అలాగే రెండురూపాయలు కానుక ఇచ్చి, "కొంతకాలం శిరిడీలోనే ఉండండి" అన్నారు. శిరిడీలో ఉన్నన్ని రోజులు శ్రీసాయిబాబా సన్నిధిలో వాళ్లు భజన చేసేవాళ్ళు. వారికి ఎంతో ప్రశంసలు లభించేవి. శ్రీసాయిబాబా ప్రతిరోజు వారికి 2 రూపాయల విలువైన బర్ఫీ(స్థానిక దుకాణాదారుని దగ్గర నుండి), మరియు 2 రూపాయల ధనం కానుకగా ఇస్తుండేవారు. (ప్రతిరోజు అంతమొత్తంలో మిఠాయి వారికి అవసరం లేదనిపించేది. అందువలన ఆ బర్ఫీని వెంటనే దుకాణదారుడికి 1 రూపాయి 12 అణాలకు అమ్మేసేవాళ్ళు.) అయితే ఒకరోజు మాత్రం శ్రీసాయిబాబా వారికి 4 రూపాయలు ఇచ్చారు. అలాగే అప్పుడప్పుడు, రాధాకృష్ణఆయి ఇంట్లో కూడా వారు భజన చేసేవాళ్ళు. శ్రీసాయిబాబా జీవితచరిత్రకు సంబంధించిన ఒక మరాఠీ గ్రంథాన్ని రాధాకృష్ణఆయి వారికి బహుకరించింది.

శిరిడీవాసులు గోవిందస్వామిని ‘భావుస్వామి’ అని, ఆదిలక్ష్మియమ్మను ‘బువామాయి’ అని పిలిచేవారు. సుమారు ఒక నెలన్నర రోజులు శిరిడీలో గడిపాక వాళ్ళు శిరిడీ విడిచి వెళ్ళటానికి శ్రీసాయిబాబా అనుమతి లభించింది. వాళ్ళకు ఎక్కువ మొత్తంలో డబ్బు కానుక రూపంలో దొరకలేదు గాని శ్రీసాయిబాబా ఆశీస్సులు మాత్రం పుష్కలంగా లభించాయి. వారు శిరిడీ వదిలి వెళ్ళేటప్పుడు, శ్రీసాయిబాబా వారిని “అల్లా మీకు చాలా ఇస్తాడు(అల్లా మాలిక్ బహుత్ దేగా)”, “అల్లా మీకు మంచి చేస్తాడు(అల్లా తుమ్హారా అచ్చా కరేగా) అని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలూ ఉపయోగపడ్డాయి. వారు శిరిడీ నుండి బయలుదేరేటప్పుడు అక్కడున్న భక్తులతో శ్రీసాయిబాబా, “కాశీకి వెళ్ళడానికి అయ్యే రైలు ఖర్చు (సుమారు 200 లేదా 300 రూపాయలు) వాళ్ళకు ఇవ్వాలి”  అని అన్నారు. అయితే శిరిడీలో ఎవ్వరూ వాళ్ళకు డబ్బు ఇవ్వలేదు. కానీ మార్గమధ్యంలో హర్దా ఘాట్‌కు వెళ్ళినప్పుడు, శ్రీసాయిబాబా అనుగ్రహం వల్ల, అక్కడ కొంతమంది భక్తులు విరాళాల సేకరించి వారి ప్రయాణానికి కావలసిన ధనాన్ని సమకూర్చారు. వారు తమ ప్రయాణంలో శ్రీసాయిబాబాను మనసులో ధ్యానించుకోవటం వలన వారికి కలలోనైనా కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు. వారు సంకల్పించిన యాత్రలే కాక, ఇతర యాత్రలు కూడా పూర్తిచేయగలిగారు. శ్రీసాయిబాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటూ లేక, సుఖంగా సాగి, వారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వాళ్లందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. శ్రీసాయిబాబా వచనాలలోని అమోఘమైన శక్తిని కొనియాడారు. గోవిందస్వామికి డైరీ వ్రాసుకునే అలవాటుండేది. శ్రీసాయిబాబాతో తమ కుటుంబానికి గల అనుభవాలన్నీ డాక్టరి పిళ్ళై కోరితే అన్నీ వ్రాసిచ్చాడు.

సోర్స్: సాయిలీల పత్రిక, 1939, Ank 4,5,6.pdf, శ్రీసాయి సచ్చరిత్ర.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo