ఈ భాగంలో అనుభవాలు:
1. ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి
2. మనసు మార్చి దొంగింలించిన చైన్ తిరిగి ఇచ్చేలా అనుగ్రహించిన బాబా
ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి
రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా భక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు పుష్పలత. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం ఆ సాయినాథుడే. నాకు ఎటువంటి ఆపద, సమస్య వచ్చినా నేను వెంటనే ఆ తండ్రికి చెప్పుకుంటాను. 2025, జూలై 1న మా పాప కాన్పుకోసం నేను యూఎస్ఏ వెళ్లాను. బాబా దయవలన చక్కటి బాబు పుట్టి అంతా సాఫీగా జరిగింది. తర్వాత నవంబర్ నెలలో మేము ఇండియాకి తిరిగి రావలసి ఉండగా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ప్రభుత్వం షట్ డౌన్ ప్రకటించడంతో విమానాలన్నీ రద్దయ్యాయి. దాదాపు 47 రోజులపాటు ఈ పరిస్థితి కొనసాగింది. మేము తిరిగి రావలసిన సమయం దగ్గర పడుతుండేసరికి, 'పరిస్థితి ఇలాగే ఉంటే ఎలా?' అని నాలో ఆందోళన, భయం మొదలై బాబాకి వినతి చేసుకున్నాను. 'సాయీ అనగానే ఓయీ అంటూ' మన ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి నా మొర విన్నారు. వెంటనే ఆయన నాపై అపారమైన దయ చూపించారు. మా తిరుగు ప్రయాణానికి 5 రోజుల ముందు సంకట పరిస్థితి తొలగిపోయింది. అమెరికా ప్రభుత్వము షట్ డౌన్ ఎత్తివేసింది. విమానాల రాకపోకలు మొదలయ్యాయి. నా ఆనందానికి అంతే లేదు.
ఆ తర్వాత 2026, ఫిబ్రవరిలో మా అల్లుడు ఇండియా రావడానికి వీసా స్లాట్ దొరికింది. కానీ అప్పటి పరిస్థితులలో చాలావరకు స్లాట్స్ అన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ ఉండటం వల్ల మా అల్లుడు రావాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అయినా మేము బాబాపై భారం వేసి ఇండియాకి రమ్మని చెప్పాము. బాబా దయవలన వీసా ఇంటర్వ్యూతో సహా అన్ని ప్రశాంతంగా జరిగి మా అల్లుడు ఇండియా వచ్చి, తిరిగి అమెరికా వెళ్ళాడు. నన్ను అడుగడుగునా కరుణించి కాపాడుతూ, ఆపదలని గట్టెక్కిస్తున్న సాయితండ్రికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. నిత్యం ఆయనను స్మరించుకోవడం, కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప ఇంకేమిచ్చి నా ఋణం తీర్చుకోగలను? "మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు, కరుణకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే అందరినీ ఎల్లవేళలా కరుణించాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చరణములకు నమస్సుమాంజలి".
మనసు మార్చి దొంగింలించిన చైన్ తిరిగి ఇచ్చేలా అనుగ్రహించిన బాబా
శ్రీసాయినాథునికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పద్మిని. 2026, మార్చి నెలలో మేము ఇల్లు మారాలని సామాన్లు సర్దుతున్నప్పుడు కిటికీ దగ్గర ఒక బాక్స్‌లో నా నల్లపూసల గొలుసు పెట్టాను. ఆ సమయంలో కొంతమంది పనివాళ్ళు, అలాగే మా ఇంట్లో పనిచేసే ఆమె ఉన్నారు. మరుసటిరోజు చూస్తే, నల్లపూసల గొలుసు కనిపించలేదు. ఇంట్లో నేను, మావారు మాత్రమే ఉంటాం. మావారు ఆ బాక్స్ గురించి తనకి తెలియదన్నారు. ఇకపోతే, ఆ గదిలోకి శుభ్రం చేయడానికి మా పని ఆమె వెళ్లి, రావటం నేను చూశాను. ఇంకెవరూ వెళ్లలేదు. కాబట్టి ఆమె మీద అనుమానమొచ్చి అడిగితే, తాను తీయలేదని చాలా గట్టిగా వాదించింది. మేము ఇల్లంతా వెతికి పోలీసు రిపోర్ట్ ఇచ్చాము. నేను సాయినాథుని మనసారా, " చైన్ దొరికేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. పోలీసులు ఆమెతో మాట్లాడితే, తాను తీయలేదని చెప్పింది. కానీ ఆమే తీసిందని నాకు నమ్మకం గనక, "ఆమె మనసు భగవాన్ మార్చి, నా చైన్ నాకు తెచ్చి ఇచ్చేలా చేయాలి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఆమె మా ఇంటికి వచ్చి చైన్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. నేను ఆ చైన్ చూసి ఎంతో బాధ నుంచి ఉపశమనం పొందాను. నా అనుభవాన్ని బ్లాగుకి వ్రాసి పంపాలనుకొని పంపకుండా కాలయాపన చేసి మరిచిపోయాను. చాలారోజుల తర్వాత 2026, జూలై 27న ఈ బ్లాగులో భక్తులొకరు తమ నెక్లస్ దొరికిన అనుభవం పంచుకున్నారు. అది చదివాక నా అనుభవం నాకు గుర్తొచ్చి ఇలా మీ అందరితో పంచుకున్నాను. సాయినాథుని నమ్ముకుంటే, ఆయనే అన్ని చూసుకుంటారు. అందరికీ నమస్కారాలు.
"నన్ను క్షమించు తండ్రీ. నేను మీ బిడ్డను. ఆశాశ్వతమైన వాటికోసం ఏడుస్తాము కానీ, అసలైన, విశ్వరూపుడైన మిమ్మల్ని మరిచాను. సాయి స్తవనమంజరిలో గోదావరి నది మురికి కాలువను కూడా తనలో కలుపుకుంటుందని ఉంది. మరి నన్ను, నా బలహీనతలు క్షమించి మీ సన్నిధిని నాకు ప్రసాదించండి ప్రభువు! మీరే నా దైవం. మీ లీలలు చదవటమే మాకు ఆనందం. నిరంతరం మీ నామజపం చేసే భాగ్యం నాకు కలిగించండి".

Baba me daya valana Kalyan ki marriage ipoindi variddarini kalipi unchu swamy house kosam kattina money vapasu ippinchu thandri meku sathakoti vandanalu 🙏
ReplyDelete