సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 649వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. స్వయంగా వచ్చి దక్షిణ స్వీకరించిన బాబా
  2. బాబా అద్భుతం చేస్తారు!

స్వయంగా వచ్చి దక్షిణ స్వీకరించిన బాబా


సాయిభక్తులందరికీ సాయిరాం! నాపేరు అరుణలక్ష్మి. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


మొదటి అనుభవం:


2020, డిసెంబరు 15వ తేదీ మంగళవారంరోజు ఒక అద్భుతమైన సంఘటన నా జీవితంలో జరిగింది. నేను సోమవారంనాడు ముఖం కడుక్కుంటున్నప్పుడు నా చేతికున్న బంగారు లక్ష్మీదేవి ఉంగరం జారి పడిపోయింది. వెంటనే దాన్ని తీసి బాత్రూం తలుపుపైన ఉంచాను. కానీ, అక్కడ ఉంగరం ఉంచిన సంగతి మర్చిపోయి నిద్రపోయాను. మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఉంగరం సంగతి గుర్తొచ్చి బాత్రూంలోకి వెళ్లి వెతికితే ఎక్కడా ఉంగరం కనిపించలేదు. ఆ చుట్టుప్రక్కల కూడా ఎంతో వెతికాను, అయినా ఉంగరం దొరకలేదు. దాంతో ఎంతో బాధపడి, ఉంగరం దొరికేలా చేయమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా నిత్యం తన భక్తుల మాటలు వింటూ ఉంటారు, వారిని ఆదుకుంటూ ఉంటారు. బాబాను స్మరించుకుంటూ మరలా వెతకగా మా ఇంట్లోని ఓ అలమరాలో ఒక ప్రక్కన నా ఉంగరం దొరికింది. అసలా ఉంగరం అక్కడికి ఎలా వచ్చిందోనని ఇంట్లో అందర్నీ అడిగితే, మా ఇంట్లో పనిచేసే ఆవిడకు ఆ ఉంగరం దొరికిందనీ, తనే అక్కడ పెట్టిందనీ, కానీ ఆ విషయం మాకు చెప్పడం మర్చిపోయిందనీ తెలిసింది. ఇలా బాబా నా సమస్యను తీర్చారు


రెండవ అనుభవం:


ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన అనుభవం. ఒకరోజు నేను ఆర్టీసీ బస్టాండులో నా స్నేహితులను కలిసి మాట్లాడుతూ ఉండగా, లుంగీ కట్టుకుని, మాసిన గడ్డంతో ఉన్న ఒక ముసలివ్యక్తి అక్కడున్న వాళ్ళనెవరినీ యాచించకుండా నేరుగా నా దగ్గరకు వచ్చి, “నాకు మూడు రూపాయలు ఇవ్వు” అని అడిగారు. నేను బ్యాగులోంచి ఐదు రూపాయలు తీసి ఇస్తే, “నాకు ఐదు రూపాయలు వద్దు, మూడు రూపాయలు మాత్రమే కావాలి” అని అన్నారు. నేను మళ్ళీ బ్యాగులో వెతికి మూడు రూపాయలు తీసి ఇవ్వగానే ఆయన ఇంకెవరినీ ఏమీ అడగకుండా అక్కడినుంచి వెళ్ళిపోయారు. అది చూసిన నా స్నేహితురాలు, “భిక్షాటన చేసే వ్యక్తి అలా డిమాండ్ చేస్తున్నారేమిటి?” అని అడిగింది. బాబా చూపిన కరుణకు కరిగిపోతున్న నేను, అది డిమాండ్ చేయడం కాదనీ, ఆరోజు ఉదయం నేను బాబా గుడికి వెళ్లి బాబాను దర్శించుకుని, మూడు రూపాయలు దక్షిణ బాబాకు సమర్పించుకోవాలని అనుకున్నాననీ, కానీ తొందరలో ఆ మూడు రూపాయలు దక్షిణ బాబాకు సమర్పించకుండానే వెళ్ళిపోయాననీ, అందుకే ఆ ముసలివ్యక్తి రూపంలో బాబానే స్వయంగా వచ్చి దక్షిణ స్వీకరించారని ఎంతో ఆనందంతో చెప్పాను.  


బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఎంతో ఆనందంతో మీతో పంచుకుంటున్నాను. ఇటువంటి అనుభవాలు మన సాయిభక్తుల జీవితాలలో ఎన్నో ఉంటాయి. నాకు ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నా అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం ఇచ్చిన ఈ గ్రూపు సభ్యులకు చాలా చాలా ధన్యవాదాలు. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా అద్భుతం చేస్తారు!


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు వాణిశ్రీ. మాది నరసాపురం. సాయి నా జీవితంలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అప్పటినుండి నా సాయిదేవునితో స్నేహం, కోపం, అలకలు, వేడుకోవడం, బాధపడి మాట్లాడడం మానేయడం, మరలా తలచుకోవడం.. ఇట్లా నా సాయిదేవుడు నన్ను ఏనాడూ వదలకుండా అనుక్షణం నా ప్రక్కనే ఉండి చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద సమస్యల వరకు నా దాకా రాకుండానే తొలగిస్తున్నారు. అవి వెళ్ళిపోయాక తెలుస్తోంది అవి ఎంత పెద్ద కష్టాలోనని. ఇటీవల నా స్నేహితురాలికి చేసిన ప్రాథమిక పరీక్షల్లో తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించారు డాక్టర్లు. ఈ విషయం తెలిసిన నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. వెంటనే సాయి వద్దకు వెళ్ళి నా స్నేహితురాలు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని మొరపెట్టుకున్నాను. కొద్దిరోజుల క్రితం, “నా స్నేహితురాలికి ట్యూమర్ తగ్గి తను ఆరోగ్యంగా ఉంటే ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెప్పుకున్నాను. నాకు తెలుసు బాబా అద్భుతం చేస్తారు అని. సరిగ్గా బాబాకు మ్రొక్కుకున్న వారం రోజులకి తెలిసింది, ‘తనకు ఉన్నది ట్యూమర్ కాదు’ అని. ‘తనకేదో ఇన్ఫెక్షన్ ఉందని, అదేమీ ప్రమాదకరమైనది కాద’ని చెప్పారు డాక్టర్లు. ఆ విషయం తెలియగానే ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు మాట ఇచ్చినట్లు, వెంటనే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. నా అనుభవాన్ని పంచుకోవటంలో తప్పులేమైనా ఉంటే క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఓం సాయిరాం!



4 comments:

  1. Om sai ram please bless my family

    ReplyDelete
  2. Be with us and save us.please give baba
    To pray you with faith and trust

    ReplyDelete
  3. Sai ma amma arogyam bagundela chudu thandri pleaseeee baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo