కరోనావైరస్ బారినుండి రక్షించిన బాబా
నేను సాయి భక్తురాలిని. నేను యుఎస్ఏలో నివాసముంటున్నాను. 2020లో మా నాన్న కరోనా వైరస్ బారినపడి అనారోగ్యం పాలయ్యారు. కేవలం సాయిబాబా దయతో అతను తిరిగి కోలుకుని మా మధ్యకి వచ్చారు. ఈ అనుభవం ద్వారా భక్తులకు బాబాయందు విశ్వాసం దృఢపడుతుందన్న నమ్మకంతో నేను నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
2020, ఏప్రిల్ నెలలో ఒకరోజు మా నాన్న కడుపునొప్పి కారణంగా హాస్పిటల్‌కి వెళ్లారు. అప్పుడు ఆయనకి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో డాక్టర్లు, "నాన్న శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నందున రాత్రంతా అతనికి ఆక్సిజన్ పెట్టి ఉంచుతామ"ని మాకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులెవ్వరికీ హాస్పిటల్లో ఉండటానికి అనుమతించలేదు. కేవలం విజిటింగ్ అవర్‌లో నాన్నను చూడటానికిగాని, మాట్లాడటానికిగాని అవకాశం మాకు ఇచ్చారు. నాన్న చాలా ఆందోళన చెందారు. దాంతో అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది.
మరుసటిరోజు హాస్పిటల్ నుండి అకస్మాత్తుగా మాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు, "నాన్నకి డబుల్ న్యుమోనియా ఉందని, శ్వాసించడం చాలా ఇబ్బందిగా ఉందని, పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అతన్ని పూర్తిగా వెంటిలేటర్ మీద ఉంచవలసి వచ్చింద"ని చెప్పారు. మేమంతా చాలా భయపడిపోయాము. ఇక మేము రాత్రి, పగలు తేడా లేకుండా, "బాబా! నాన్నకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు శుభవార్త వినిపించండి" అని బాబాను ప్రార్థిస్తూ గడిపాము. అయితే నాలుగవరోజు నుండి నాన్న పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మాకు కాల్స్ రాసాగాయి. అయినా మేము బాబాపై విశ్వాసాన్ని కోల్పోకుండా నిరంతరం బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. నెమ్మదిగా అతని పరిస్థితి మెరుగుపడసాగింది. వెంటిలేటర్ మీద మూడు వారాలు గడిచాక డాక్టర్స్, "ఒక చిన్న శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వెంటిలేటర్ తీస్తే అతను ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఈ వారాంతంలో ఏదైనా అద్భుతం జరగకపోతే, సోమవారం శస్త్రచికిత్స చేస్తామ"ని చెప్పారు.
బాబా అద్భుతం చేసారు. ఆదివారంనాడు నాన్న వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారని మాకు వార్త వచ్చింది. సోమవారం వెంటిలేటర్‌ను పూర్తిగా తొలగించారు. కానీ నాన్న చాలా బలహీన పడిపోయారు, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మేము నిరంతరం చేసిన ప్రార్థనలకు బాబా, ఇంకా ఇతర దేవతలందరూ కరుణ చూపారు. రోజురోజుకి నాన్న పరిస్థితి మెరుగుపడింది. వెంటిలేటర్ తీసేసిన నాలుగురోజుల తరువాత నాన్నని పునరావాస విభాగానికి తరలించారు. సరిగ్గా ఐదువారాల తరువాత నాన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. నిజానికి మేము మా నాన్నను కోల్పోతామని అనుకున్నాము. అతను మృత్యువు అంచువరకు వెళ్లారు. కాని విశ్వాసంతో, సానుకూల దృక్పథంతో మేము నిరంతరం బాబాను ప్రార్థిస్తూ ఉండబట్టి, ఆయన అనుగ్రహం వలన నాన్న ఇప్పుడు మాతో ఉన్నారు.
జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా బాబాపై విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు, మనల్ని బలోపేతం చేస్తారు. ఈ సంఘటన బాబాపై నా విశ్వాసాన్ని దృఢం చేసింది. "నన్ను క్షమించండి బాబా, కొన్నిసార్లు మిమ్మల్ని అనుమానిస్తుంటాను. మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారన్న విశ్వాసం మాకు చాలా అవసరం. ఏది ఏమైనా అన్నిటికి మీకు ధన్యవాదాలు. దయచేసి నా తప్పులను క్షమించండి".
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba amma ki problem tondarga cure cheyi thandri
ReplyDelete