సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 656వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో చాలావరకు తగ్గిన సమస్య
  2. మన తండ్రి మనసు వెన్న కదా! నా నొప్పిని తగ్గించారు
  3. నాన్నకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా ఊదీ

బాబా అనుగ్రహంతో చాలావరకు తగ్గిన సమస్య


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయిరాం! సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని సాటి సాయిభక్తులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 


చదువుకునే రోజుల్లో మా అక్క, నేను తరచుగా శ్రీసాయిబాబా గుడికి వెళ్లేవాళ్ళం. ఇంట్లో కూడా సాయంకాల ఆరతి పాడుకునేవాళ్లం. సాయిబాబా నాకు ఎన్నో మంచి అనుభవాలను ప్రసాదించారు, ఎన్నో సమస్యలలో మాకు అండగా ఉండి పరిష్కారాలు చూపించారు. బాబాకు భక్తిపూర్వక ప్రణామాలు. ఈమధ్య నేను ఒక సంవత్సరం నుంచి హార్మోనుల అసమతుల్యతతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. మూడు నెలల క్రిందట ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును చూశాను. అందులోని సాయిభక్తుల అనుభవాలను చదివి, “నా సమస్య తగ్గిపోతే నేను కూడా నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకుని, శ్రీసాయిలీలామృతము, శ్రీగురుచరిత్ర పారాయణ చేశాను. బాబా అనుగ్రహంతో నా సమస్య చాలావరకు తగ్గిపోయింది. బాబా దయవల్ల త్వరలోనే నా సమస్య పూర్తిగా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. ఆ సమస్య వల్ల నేను అనుభవించిన మానసిక ఒత్తిడి నుంచి కూడా నాకు ఉపశమనం లభించింది. “బాబా! ఎల్లప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడు తండ్రీ! నీ యందు అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉండేలా అనుగ్రహించు బాబా!”


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః.


మన తండ్రి మనసు వెన్న కదా! నా నొప్పిని తగ్గించారు


సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న అన్నయ్యకి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బాబా నాకు ఇచ్చిన అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకోవాలని నేనిప్పుడు మీ ముందుకు వచ్చాను. బాబా కృపవల్ల నా జీవితంలోని కష్టకాలాన్ని నేను దాటగలిగాను. నాకు ఈమధ్య ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అది నన్ను మానసికంగా, శారీరకంగా చాలా బాధపెట్టింది. ఆ సమస్య వల్ల నేను మానసికంగా కృంగిపోయినప్పటికీ నాకు హాస్పిటల్‌కి వెళ్ళాలనిపించలేదు. కరుణామయుడైన మన బాబాను నమ్ముకొని, నొప్పి ఉన్న చోట బాబా ఊదీని రాసుకుంటూ, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగుతూ ఉన్నాను. బాబాకు నమస్కరించుకుని, “నొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని మ్రొక్కుకున్నాను. మన తండ్రి మనసు వెన్న కదా! నా నొప్పిని తగ్గించారు. కొద్దిగా నొప్పి మిగిలివుంది. ఆ కాస్త నొప్పి కూడా పోయేలా ఇప్పటికీ ప్రతిరోజూ బాబా ఊదీని, ఊదీనీళ్ళని తీసుకుంటున్నాను. “నా కష్టం తీర్చినందుకు థాంక్యూ సో మచ్ బాబా! అజ్ఞానంతో మేము చేసే అన్ని తప్పులను క్షమించండి తండ్రీ!”


నాన్నకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా ఊదీ


సాయి భక్తుడు రవి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ఓం సాయిరామ్! 2020, మార్చ్ నెలలో తీవ్రమైన దగ్గు, వాంతులతో  మా నాన్నగారు చాలా అనారోగ్యానికి గురయ్యారు. బయట ఫుడ్ తీసుకున్నందువల్ల అలా అయ్యుంటుందని నేను దాన్ని తీవ్రంగా పరిగణించలేదు. అప్పటినుండి నాన్న ఆహారం తీసుకోవడం మానేశారు. నేను తినమని చెప్తే, "ఆకలి లేదని, ఆకలేస్తే తింటాన"ని చెప్పేవారు. సోమవారం ఉదయం నుండి మంగళవారం రాత్రి వరకు ఆయన కొబ్బరినీళ్లు వంటి ద్రవ పదార్థాలనే తీసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆయన చాలా బలహీనపడిపోయారు. అయినప్పటికీ ఆయన ఇంటికి అవసరమైన సరుకులు తేడానికి వెళ్లి చాలా నీరసంగా తిరిగి వచ్చారు. ఆ రాత్రి దగ్గుకోసం కొన్ని టాబ్లెట్స్ వేసుకొని రాగి జావ తీసుకొన్నారు. తరువాత ఆయన మళ్ళీ వాంతులు చేసుకున్నారు. అసలే కరోనా ప్రభావం ఉన్న రోజులైనందున నాకు భయమేసింది. ఒకటి తరువాత ఒకటి ప్రతికూల ఆలోచనలతో నా మనస్సు గందరగోళమైపోయింది. మరుసటిరోజు ఉగాది కూడా. అప్పుడు నేను నా ప్రియమైన సాయి తండ్రిని తలుచుకుని, "బాబా! రేపు పండగరోజు. ఉదయానికి నాన్న ఆరోగ్యం బాగుపడి, తన పనులు తాను చేసుకోగలిగితే నేను నా   అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. తరువాత నా సోదరితో, "నాన్న నుదిటిపై ఊదీ పెట్టి, కొంత నీటిలో కలిపి ఇవ్వు" అని చెప్పాను. తను అలాగే చేసింది. మరుసటిరోజు ఉదయం 5:30 కల్లా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కొంచం దగ్గు మాత్రమే ఉంది. ఆయన తన రోజువారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. "శతకోటి ధన్యవాదాలు బాబా. నాన్న పూర్తి ఆరోగ్యంతో ఉండేలా ఆశీర్వదించండి. నా సోదరి కొడుకు ప్రశాంతంగా నిద్రపోయేలా చేసారు. అందుకు కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలు. సాయిబాబా మీ పవిత్ర పాదాలకు నా సాష్టాంగ నమస్కారం.


అనంత కోటి బ్రాహ్మణడ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


source: http://www.shirdisaibabaexperiences.org/2020/04/shirdi-sai-baba-miracles-part-2695.html#experience3



5 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Baba amma arogyam tondarga manchiga cheyi thandri enka pariksha pettaku thandri ne anugraham kosam chustuna sai thandri

    ReplyDelete
  3. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః

    ReplyDelete
  4. అనంత కోటి బ్రాహ్మణడ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo