సాయినాథుడే మన ఏకైక రక్షకుడు
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను మన ప్రియమైన శిరిడీ సాయిబాబా భక్తుడిని. ముందుగా ఈ విశ్వమునందు మన ఏకైక రక్షకుడైన సాయిబాబాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ప్రతి శ్వాసలో నా సాయి నాతో ఉన్నారు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు అన్నీ ఆయనే. ఆయన గొప్పతనాన్ని, అనంతమైన ఆయన ప్రేమను, సంరక్షణను వ్రాయాలని ప్రయత్నిస్తే మాటలు సరిపోవు. బాబా మా కుటుంబంపై చూపించిన కృపను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
లాక్‌డౌన్ సమయంలో మా నాన్నగారు మలబద్ధకంతో వారానికి పైగా బాధపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా బయటకి వెళ్లలేక చిట్కా వైద్యాలన్నీ ఉపయోగించాం. కానీ ఏదీ సత్ఫలితాన్ని చూపలేదు. ఆ సమస్య కారణంగా నాన్న సరిగా తినేవారు కాదు. ఆయనకి నిద్ర కూడా కరువైంది. రోజులు గడుస్తున్నకొద్దీ సమస్య తీవ్రమైంది. దాంతో మేము ఫోనులోనే డాక్టరుని సంప్రదించాము. డాక్టరు సూచించిన మందులు ఉపయోగించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నా కరోనా కారణంగా నాన్నను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళడానికి మేము చాలా భయపడ్డాము. అప్పుడు నేను వైద్యులకే వైద్యుడు, కంటిచూపుతో ఎంతటి వ్యాధినైనా నయం చేయగల సాయి ముందు కూర్చుని ఏడుస్తూ, "ఈ సమస్య కోసం మమ్మల్ని హాస్పిటల్‌కి వెళ్లనివ్వకండి. ఈ కష్టం నుండి బయటపడటానికి ఏదో ఒకటి చేసి మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఆ ప్రార్థన ముగించిన వెంటనే నేను ఇంగ్లీష్ బ్లాగు ఓపెన్ చేశాను. అక్కడ దాదాపు మేము అనుభవిస్తున్నటువంటి సమస్యే నా కంటపడింది. లాక్‌డౌన్ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళకుండా బాబా తన భక్తుని కాపాడిన ఒక అనుభవాన్ని చదివాక బాబా నా ప్రార్థనకు సమాధానమిచ్చారని నేను అర్థం చేసుకున్నాను. ఆ అనుభవం ద్వారా ఖచ్చితంగా నాన్నకు నయమవుతుందన్న నమ్మకం వచ్చింది. నాన్న కూడా బాబాను ప్రార్థించారు. నేను నాన్నకు ఊదీ పెట్టి, కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి త్రాగమని ఇచ్చాను. మీరు నమ్ముతారో లేదోగానీ, వారం రోజులుగా ఉన్న సమస్య నుండి కేవలం ఒక్క గంటలోనే నాన్న ఉపశమనం పొందారు. నాన్న ఆ మాట చెప్పగానే నా నోట మాట రాలేదు. వెంటనే పరుగుపరుగున బాబా వద్దకు వెళ్లి, ఆయన చూపిన అద్భుతలీలకు, ఆశీర్వాదానికి నమస్కారాలు చెప్పుకున్నాను. నిజంగా మన బాబా దయామయులు.
హృదయపూర్వకంగా బాబాను విశ్వసించండి. కష్టసమయాల్లో ఆయన మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. సాయే మన ఏకైక రక్షకుడు. "ప్రియమైన బాబా! మీకు నా కృతజ్ఞతలు. ఎప్పటికీ నేను మీకు ఋణపడివుంటాను. దయచేసి నా తప్పులన్నింటినీ క్షమించి, మీ పాదకమలాల వద్ద సదా నాకు స్థానం కల్పించండి".
అనంతకోటి బ్రహ్మాండనాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!