సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 668వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. 'సాయీ' అని తలచినంతనే తాను పలుకుతానని బాబా తెలియజేసారు
  2. క్షేమంగా ప్రయాణం చేయించిన బాబా
  3. అంతా బాబా చూసుకుంటారు, నమ్మకం ఉంచడం మాత్రమే మన వంతు

'సాయీ’ అని తలచినంతనే తాను పలుకుతానని బాబా తెలియజేసారు


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శిరిడీ సాయిరాం! ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నాకు సమస్యలు వచ్చినప్పుడు నేను సాయిని ప్రార్థించి, ‘ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి’ అనే సాయినామాన్ని స్మరించి, సాయి చాలీసాను చదువుకుంటాను. అప్పుడు బాబా నా సమస్యలను పరిష్కరిస్తుంటారు. మా అబ్బాయిల ఉద్యోగాల విషయంలో బాబా ఎంతో సహకరించి వాళ్ళకు ఉద్యోగాలను ప్రసాదించారు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబానే. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులందరికీ తెలియజేయదలచుకున్నాను. 


మా అబ్బాయి వివాహ విషయంలో నేను ఆంజనేయస్వామి చుట్టూ 5 శనివారాలు ప్రదక్షిణలు చేయాలని అనుకున్నాను. 2020, కార్తీకమాసంలో నేను ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేస్తూ, కార్తీకమాసం కదా అని ఆ గుడిలో కార్తీకదీపాలు కూడా వెలిగించాను. ఆ గుడిలో నవగ్రహాలు, వినాయకుడు, శివుడు, బాబా, నాగదేవతల ప్రతిమలు కూడా చిన్నవి ఉన్నాయి. నేను అక్కడ కూడా దీపాలు వెలిగించి వచ్చాను. కానీ ఒక శనివారంరోజు మాత్రం అక్కడ బాబా విగ్రహం కనపడలేదు. బాబా విగ్రహాన్ని అక్కడినుంచి తీసి వేరే చోట పెట్టారేమోనని అక్కడంతా వెతికాను. కానీ, ఎక్కడా కనిపించలేదు. దాంతో నేను మనస్సులోనే బాబా అక్కడే ఉన్నారని భావించుకుని బాబాను స్మరించుకుంటూ దీపాలు వెలిగించాను. ఇంతలో ఒకామె మూడేళ్ళ వయసున్న తన బాబుతో వచ్చింది. ఆమె ఆ బాబుని ‘సాయీ, సాయీ’ అని పిలుస్తోంది. నాకు అప్పుడు అనిపించింది, “నేను బాబా కోసం వెతుకుతుంటే, బాబానే ఆమె నోటినుంచి ‘సాయీ’ అని పిలిపించి, నేను ఆ బాబును చూసేటట్లు చేసి, మనం ‘సాయీ’ అని తలచినంతనే తాను పలుకుతానని బాబా నాకు తెలియజేస్తున్నారు” అని. ఆ తరువాత ‘సాయి’ అనే పేరుగల ఒక పెద్దబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నాకు బాబా సన్నిధిలో దీపాలు వెలిగించిన తృప్తి కలిగింది. మా ఇంట్లో మా పిల్లల అందరి పేర్ల ముందు ‘సాయి’ ఉంటుంది. “మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు బాబా! నా మనస్సులోని కోరికలు మీకు తెలుసు బాబా, దయచేసి వాటిని నెరవేర్చండి”.


క్షేమంగా ప్రయాణం చేయించిన బాబా


బెంగళూరు నుండి ఒక సాయిభక్తురాలు బాబా ఇటీవల తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవాళ్లందరికీ కూడా నా నమస్కారాలు. కరోనా కారణంగా దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము ఇల్లు విడిచి బయటకెక్కడికీ వెళ్లలేదు. ఇంట్లోనే ఉండటం వలన పిల్లలు తమకు చాలా బోర్ కొడుతోందని అంటుండేవారు. కానీ, ‘ఇదంతా తప్పదు’ అంటూ వాళ్ళకి నేను, మావారు నచ్చజెప్తూండేవాళ్ళం. ప్రతి సంవత్సరం మా పిల్లలకి డిసెంబరు నెలలో క్రిస్మస్ సెలవులు ఇస్తారు. ఆ సెలవుల్లోనైనా ఎక్కడికైనా వెళదామని చాలాసార్లు మా పిల్లలు అడిగారు. దాంతో, నోయిడాలో ఉన్న మా ఆడపడుచు దగ్గరికి సెలవుల్లో వెళదామని నిర్ణయించుకున్నాము. కానీ ఏదో తెలియని భయం. టిక్కెట్లు బుక్ చేసినప్పటినుంచి నేను, "నువ్వే మమ్మల్ని క్షేమంగా నోయిడా తీసుకెళ్లి, తీసుకురావాలి బాబా" అని బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవల్ల నోయిడా వెళ్లి, పదిరోజులు అక్కడ ఆనందంగా గడిపి తిరిగి వచ్చాము. పిల్లలు అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా ఎంజాయ్ చేశారు, ఎంతో ఆనందంగా గడిపారు. తరువాత ఈమధ్య మా అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. ఆరోజు మేము బాబా గుడికి వెళ్ళాము. నేను బాబా దర్శనం చేసుకొని, "థాంక్యూ సాయీ! మీ దర్శనభాగ్యాన్ని కలిగించారు. నా మొర విని క్షేమంగా మమ్మల్ని నోయిడా తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చారు. పిల్లలు చాలా సంతోషించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే అందరికీ తోడుగా ఉండండి సాయీ. ఎప్పుడూ నా మనసున మీ నామస్మరణ నడిచేలా చూడండి స్వామీ! మా ప్రయాణమంతా బాగా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు మాటిచ్చాను. మాటిచ్చినట్టుగానే ఇప్పుడు నా అనుభవాన్ని పంచుకున్నాను. థాంక్యూ సాయీ!"


అంతా బాబా చూసుకుంటారు, నమ్మకం ఉంచడం మాత్రమే మన వంతు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకి ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


అందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. బాబాపై నాకున్న నమ్మకం కొన్ని నెలల క్రితం ఇంకా దృఢమైంది. నేను ఈమధ్య చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ, బాబా దయవల్ల సమస్యలన్నీ సమసిపోయాయి. ఇటీవల నాకు కొద్దిగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్ సలహాతో టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ రిపోర్టు రావటానికి చాలా ఆలస్యం అయింది. రిపోర్టు వచ్చేలోపు అందులో ఏముంటుందోనని నాకు చాలా భయంగా ఉండేది. కానీ నేను బాబాకు గట్టిగా నా సంకల్పం చెప్పుకున్నాను. రిపోర్టు నార్మల్‌గా రావాలని బాబాను ప్రార్థిస్తూ, ప్రతిరోజూ బాబా ఊదీని నీటిలో కలుపుకుని త్రాగేదాన్ని. అంతేకాకుండా, “రిపోర్టు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మాట ఇచ్చాను. బాబా దయవల్ల నా రిపోర్టంతా నార్మల్‌గా వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అంతా బాబా చూసుకుంటారు. బాబాపై నమ్మకం ఉంచడం మాత్రమే మన వంతు. “ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా!” నాకు ఇంకో సమస్య కూడా ఉంది. బాబా దయవల్ల అది పరిష్కారమైతే, ఆ అనుభవాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 


సాయినాథ్ మహరాజ్ కీ జై!



4 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Om sai ram baba amma problem tondarga cure cheyi sai thandri pleaseeee

    ReplyDelete
  3. 🌺🙇‍♂️Om Sri Sai ram🌺🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo