సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 643వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  1. సర్జరీ విషయంలో బాబా అనుగ్రహం
  2. బాబా చికిత్స ఎంత చిత్రం!

సాయిభక్తురాలు శ్రీమతి శ్రావణి తనకు బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు

సర్జరీ విషయంలో బాబా అనుగ్రహం

ఈ మధ్య మా నాన్నగారికి మరియు మా బాబుకి జరిగిన సర్జరీల విషయంలో బాబా నాకెలా సహాయం చేసి అనుగ్రహించారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా నాన్నగారి కంట్లో శుక్లము ఉండేది. రెండు సంవత్సరాల క్రితమే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెప్పారు. అయితే నాన్న భయపడుతుండటంతో మేము సర్జరీ గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ 2020, నవంబరులో ఆ సమస్య కాస్తా తీవ్రమవ్వడంతో మరలా డాక్టరుని సంప్రదించాము. డాక్టరు నాన్నను పరిశీలించి, “ఆలస్యం చేయకుండా తొందరగా సర్జరీ చేయాలి, నవంబర్ 19వ తేదీన స్లాట్ ఖాళీ ఉంది. ఆరోజు సర్జరీ చేద్దామ”ని చెప్పారు. అంతేకాదు, “సర్జరీకి ఒకరోజు ముందుగా హాస్పిటల్లో అడ్మిట్ అవాలి. పేషెంట్ యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలి. ముఖ్యంగా EHS పాలసీననుసరించి సర్జరీ చేయబోతున్నాం కాబట్టి సర్జరీ తేదీని మార్చలేము. అందుకే బాగా ఆలోచించుకొని ఆ తేదీ మీకు సమ్మతమో కాదో చెప్పండి” అని అన్నారు. ఆ సమయంలో మాకు ఎటువంటి ఇబ్బందులు కనిపించకపోవడంతో అన్నింటికీ అంగీకరించి ఇంటికి వచ్చేశాము.

ఇకపోతే, గత 3 నెలలుగా మా బాబు మూత్రవిసర్జన చేసేటప్పుడు ఇబ్బందిపడుతుండేవాడు. డాక్టరుకి చూపిస్తే, ‘బాబుకి సున్తీ చేయాల’ని చెప్పారు. ప్రస్తుతం కరోనా సమయం కావటంతో మేము భయపడ్డాము. దాంతో, సమస్యను మందులతో తగ్గించటానికి ప్రయత్నిద్దామని డాక్టర్ కొన్ని మందులు వ్రాసిచ్చారు. కానీ మందులతో సమస్య తగ్గకపోవడంతో మళ్ళీ డాక్టరుని సంప్రదించాము. ఆయన వేరే డాక్టరు గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. సరేనని, నవంబర్ 13న ఆ డాక్టరుని కలవడానికి వెళ్ళాము. అక్కడికి వెళుతూనే, నేనున్నానుఅంటూ పెద్ద క్యాలెండరు రూపంలో బాబా దర్శనమిచ్చారు. ఇక అంతా బాబా చూసుకుంటారని తలచి డాక్టరుని కలిశాము. బాబును పరీక్షించిన డాక్టరు, “వెంటనే ఆపరేషన్ చెయ్యాల”ని చెప్పారు. మేము దీపావళి తరువాత చేయించుకుంటామని చెప్పాము. ఆయన నవంబరు 16వ తేదీన ఆపరేషన్ చేస్తానన్నారు. అయితే నవంబరు 19న నాన్న ఆపరేషన్ కూడా ఉండటంతో, “ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ అంటే కష్టమవుతుంది, కాబట్టి బాబుకి సర్జరీ ఇప్పుడు చేయించొద్దు” అన్నారందరూ. పైగా ఆ సమయంలో బాగా వర్షాలు పడుతున్నాయి. అయినా నేను ఎవరి మాటా వినకుండా బాబాపై విశ్వాసముంచి ఆయన మీద భారం వేశాను. నేను, మావారు వానలోనే బాబుని తీసుకొని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కానీ నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, ఆపరేషన్ తరువాత బాబు కదలకుండా కుదురుగా మంచం మీద విశ్రాంతి తీసుకోవాలి. కానీ మా బాబు చాలా అల్లరివాడు, ఒక్కక్షణం కూడా కుదురుగా ఉండడు. అలాంటి వాడిని కదలకుండా ఉండేలా ఎలా చూసుకోవాలో అర్థం కాలేదు. పైగా చిన్నపిల్లాడు, ఆపరేషన్ తరువాత నొప్పిని ఎలా తట్టుకుంటాడోనని నాకు చాలా భయమేసింది. నా బాధను బాబాకే చెప్పుకొని, “బాబుకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకోమ”ని బాబాను వేడుకున్నాను. బాబు ఏ మాత్రమూ ఇబ్బందిపడకుండా బాబా ఎంతో చక్కగా చూసుకున్నారు. ఆరోజు సాయంత్రం నేను ఏదో పనిలో ఉంటే, మా బాబు ఎటువంటి మారాం చేయకుండా, భయపడకుండా నర్సులతో కలిసి ధైర్యంగా ఆపరేషన్ థియటర్‌కి వెళ్ళాడు. బాబా దయవలన ఆపరేషన్ బాగా జరిగింది. ఆపరేషన్ తరువాత బాబు చిన్న నొప్పి అని కూడా అనలేదు. మరుసటిరోజు బాబు, “బాబా ఫోటో ఇవ్వు మమ్మీ. బాబాను పట్టుకొని పడుకుంటాను” అని అడిగాడు. “ఎందుకు రా?” అని అడిగితే, “బాబానే కదా నాకు నొప్పి లేకుండా చూసుకొనేది” అని అన్నాడు. అది విని, 'వాడికి నొప్పి తెలియకుండా బాబా చూసుకుంటున్నార'ని తెలిసి మేము చాలా సంతోషించాము. కనీసం మూడురోజులు మంచం మీదే ఉండాలని డాక్టరు చెప్పారు. కానీ వాడు తిరుగుతూనే ఉన్నాడు. అయినప్పటికీ వాడికి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. బాబా కృప వలన త్వరగానే వాడికి నయమైంది. అంతలా బాబా వాడిని జాగ్రత్తగా చూసుకున్నారు.

ఇక నాన్న విషయానికి వస్తే, మా బాబు సర్జరీ టెన్షన్‌లో పడి ముందుగా కావాలని చెప్పిన నాన్న ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను. మరునాడు నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనగా ఆ విషయం గుర్తొచ్చి, సర్టిఫికెట్ కావాలని మాకు తెలిసిన ఒక అబ్బాయిని అడిగాను. అతను చివరి నిమిషందాకా తెచ్చిస్తానని చెప్పి, ఆఖరులో వర్షం వల్ల ఆ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళెవరూ దొరకలేదని చెప్పాడు. ఇక బాబా మీద భారం వేసి నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు తీసుకెళ్తూనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ చేయించుకునేందుకు దారిపొడుగునా హాస్పిటల్ కోసం వెతకసాగాను. సాధారణంగా మా ఊరిలో ఉదయం 9 గంటలకే ఎవరూ హాస్పిటల్ తెరవరు. అందువలన దారిలో ఒక్క డాక్టర్ కూడా దొరకలేదు. ఆలోగా నాన్నను చేర్చాల్సిన హాస్పిటల్ వచ్చేసింది. అమ్మను అక్కడే కూర్చోబెట్టి, “బాబా! ప్లీజ్ మీరే నాకు దారి చూపి సహాయం చేయండి” అనుకుంటూ నాన్నతో కలిసి దాదాపు 5 హాస్పిటల్స్ తిరిగాను. కానీ పని జరగలేదు. అప్పుడు “ఏ ఆటంకం లేకుండా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెపుకున్నాను. అంతే! మరుక్షణంలో నాకు “సాయి దీక్షిత” అనే హాస్పిటల్ కనిపించింది. బాబా పిలుస్తున్నట్టుగా అనిపించి నాన్నను తీసుకొని ఆ హాస్పిటల్‌ వెళ్లి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని రిసెప్షన్‌లో అడిగాను. అందుకు వాళ్ళు, “డాక్టరుగారు ఇలాంటివి ఇవ్వరు” అని అన్నారు. అంతలో ఒక నర్సు వచ్చి, విషయం తెలుసుకొని, డాక్టరుతో మాట్లాడి వస్తానని వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్లి విషయం చెప్పగానే డాక్టరు మమ్మల్ని లోపలకి రమ్మని పిలిచారు. మేము లోపలికి వెళ్తూనే ఆశ్చర్యపోయాము. కారణమేమిటంటే, అక్కడ డాక్టర్ టేబుల్ మీద వివిధ ఆకృతుల్లో ఉన్న పది బాబా విగ్రహాలు దర్శనమిచ్చాయి. ఇంకా అక్కడున్న స్లైడర్ విండో కర్టెనుపై కూడా బాబా ఉన్నారు. బాబా క్యాలెండర్లు గదిలో అన్నివైపులా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తరువాత  సర్టిఫికెట్ కోసం డాక్టర్ని బాగా రిక్వెస్ట్ చేశాక ఆయన అందుకు అంగీకరించి, నా ఫోన్ బ్యాక్ కవరుపై ఉండే బాబాను చూస్తూ సర్టిఫికెట్‌పై సంతకం పెట్టారు. “నేనున్నాను. అంతా సవ్యంగా జరుగుతుంది. ధైర్యంగా ముందుకి వెళ్ళు” అని బాబా చెప్తున్నట్టుగా నా మనసుకి అనిపించింది. తరువాత బాబా అనుగ్రహంతో నాన్న ఆపరేషన్ బాగా జరిగింది, త్వరగానే కోలుకున్నారు కూడా. “బాబా! మీకు అనేకానేక కృతజ్ఞతలు".

బాబా చికిత్స ఎంత చిత్రం!

స్వప్నంలో బాబా నాకు ఒక ఫోటో మాధ్యమంగా ఎలా వైద్యం చేశారో ఇప్పుడు మీకందరికీ తెలియజేస్తాను.

2020, డిసెంబరు నెల రెండవవారంలో నాకు కాస్త తల తిరుగుతునట్లుగా అనిపిస్తూ ఉండేది. పడుకొని పైకి లేచినప్పుడు ఆ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. ఇదిలా ఉంటే, మా బాబుకి సున్తీ ఆపరేషన్ అయ్యాక వాడు కుదురుగా ఉండకుండా కాస్త పరుగులు పెడుతుండేవాడు. దాంతో ఒకరోజు కుట్లు వేసిన చోట కొంచెం బ్లీడింగ్ కనిపించింది. నాకు చాలా కంగారుగా అనిపించి, "బాబుకి త్వరగా నయం అయ్యేలా చెయ్యమ"ని బాబాను ప్రార్థించి, "దివ్యపూజ చేస్తాన"ని చెప్పుకున్నాను. బాబా కృపతో బాబుకి త్వరగా నయమవడంతో డిసెంబరు 10వ తేదీ నుండి నేను దివ్యపూజ ప్రారంభించాను. ఆరోజు ఎందుకో కొంచెం అలసిపోయినట్లుగా ఉండడంతో త్వరగా నిద్రపోయాను. వేకువఝామున 4.30 గంటల సమయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మా ఇంట్లో ఉండే లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న బాబా ఫోటో కనిపించింది. 2018లో నేను శిరిడీ వెళ్ళినప్పుడు నాకిష్టమైన లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న తమ ఫోటోను బాబా నాకు అనుగ్రహించారు. ఆ అనుభవాన్ని చదవాలనుకునేవారికోసం దానికి సంబంధించిన లింక్‌ను ఈ క్రింద జతపరుస్తున్నాను.



ఇకపోతే కలలో లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న ఫొటోలోని బాబా అకస్మాత్తుగా పైన ఇవ్వబడిన బాబా ఒరిజినల్ ఫోటో రూపంలోకి మారిపోయారు. దాంతో నేను, "బాబా! ఇదేంటి? మీరు నా దగ్గరున్న ఫోటోలో ఉన్నట్లు లావెండర్ రంగు దుస్తుల్లో ఉండాలి కదా, ఇలా మారిపోయారేమిటి?" అని బాబాను అడిగాను. అందుకు బాబా, "అయితే నేను ఆ ఫోటోలో లాగా మారిపోవాలని అంటున్నావా?" అని అన్నారు. మరుక్షణం బాబా ఫోటో గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. ఫోటోతో పాటు నేను కూడా తిరుగుతూ ఉన్నాను. అది కలే అయినా నిజంగా తిరుగుతున్న అనుభూతి నాకు కలిగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా నాకు భయమేసి, "ఆపండి బాబా, నాకు భయమేస్తోంది" అని అరుస్తున్నాను. కొంతసేపు అలా తిరిగాక నా దగ్గరున్న లావెండర్ రంగు దుస్తుల్లో ఉన్న ఫోటో రూపంలోకి బాబా మారిపోయారు. వెంటనే నేను కళ్ళు తిరిగి క్రిందపడుతున్న అనుభూతితో మేలుకొన్నాను. భయంగా బాబా ఫోటో వంక ఒకసారి చూసి అదంతా కల అనుకొని మళ్ళీ నిద్రపోయాను. తరువాత ఆ కల గురించి నేను పూర్తిగా మరచిపోయాను. కానీ ఆ కలలో బాబా నాకు వైద్యం చేశారని ఆ సమయంలో నేను గుర్తించలేకపోయాను. వారం రోజుల తరువాత మా అత్తయ్య తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసరికి కొన్నిరోజుల క్రితం నాకు కళ్ళు తిరుగుతుండిన సంగతి గుర్తొచ్చింది. ఆ కళ్ళు తిరగడం ఎప్పుడు తగ్గిపోయిందని ఆలోచిస్తే, ఆ స్వప్నం వచ్చినప్పటి నుండి ఆ సమస్య లేదని అర్థమై ఆశ్చర్యపోయాను. 'కలలో బాబా చుట్టూ తిరగడం-కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలలో కళ్ళు తిరగడం తగ్గిపోవడం' నాకు ఎంతో అద్భుతంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా చికిత్స ఎంత చిత్రమో చూశారా! 


5 comments:

  1. Avunu! Baba!🙏🙏🙏Eppudhu mana andaritho untaru. I trust You Baba 🙏🌺🌹🌿🌻🌹🌹🌺🥀🌷💐💐💐

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo