సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 651వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. నా మొర ఆలకించి బాబా మహిమ చూపించారు
  2. బాబాకు ప్రార్థన - వచ్చిన ఓ.సి.ఐ కార్డు


నా మొర ఆలకించి బాబా మహిమ చూపించారు


సాయిభక్తురాలు సాయిలక్ష్మి ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


అందరికీ నమస్కారం. నా పేరు సాయిలక్ష్మి. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను బాబా భక్తురాలిని. బాబా ఎల్లవేళలా నాకు తోడుగా ఉండి కష్టాల నుండి నన్ను ముందుకు నడిపించారు. ఇటీవల నాకు ఒక పెళ్ళిసంబంధం కుదిరింది. నేను బాబాను ప్రార్థించి, నిశ్చితార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా జరగాలని, అలా జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాను. తరువాత ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ నేను బాబా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎలాగైనా నేను కోరుకున్నట్టు బాబా ఆశీర్వదిస్తారని నమ్మకంతో ఉన్నాను. అలాగే బాబా నాపై ఎంతో కృప చూపించారు. మా నిశ్చితార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఘనంగా జరిగింది. “థాంక్యూ బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలానే మా వివాహం కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా బాగా జరిగేలా చూడండి బాబా!” చివరిగా, నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు.


రెండవ అనుభవం:


నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (PharmD) చదువుతున్నాను. నేను హాస్పిటల్ క్లినికల్ రీసెర్చిలో చదువుతూ ఉద్యోగం చేసుకుంటున్నాను. మా ఊరినుండి హాస్పిటల్‌కి ఒక గంట ప్రయాణం ఉంటుంది. ఒక్కోసారి కాలేజీ బస్సులో, మరోసారి ఆర్టీసీ బస్సులో ఇంటికి తిరిగి వస్తుంటాను. ఒకరోజు హాస్పిటల్ నుండి ఆర్టీసీ బస్సులో ఇంటికి బయలుదేరాను. ఆరోజు బస్సు చాలా రద్దీగా ఉండటం వల్ల నేను నిలబడి ఉండాల్సి వచ్చింది. నాకు అప్పటికే కాలు ఫ్రాక్చర్ అయివుంది. దానికి తోడు నిల్చుని ఉండటం వల్ల కాలు వాచి నొప్పిపుట్టసాగింది. దాంతో మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఎలాగైనా నాకు సీటు దొరికేలా చూడు” అని వేడుకున్నాను. సగం దూరం ప్రయాణించాక ఒక సీటు ఖాళీ అయింది. ఒక ముసలాయన నన్ను కూర్చోమని సీటు ఇచ్చారు. నాకన్నా వయసులో పెద్దవారిని నిలుచోపెట్టడం తప్పనిపించి నేను కూర్చోలేదు. కానీ కాలునొప్పి ఎక్కువై నేను నిలుచోలేకపోతున్నాను. నొప్పి భరించలేక బాబాను మళ్ళీ ప్రార్థించాను. నా మొర ఆలకించి బాబా మహిమ చూపించారు. ఒక అబ్బాయి తన సీటులోంచి లేచి నన్ను ఆ సీటులో కూర్చోమని చెప్పాడు. అతనికేమైనా ఇబ్బందిగా ఉంటుందేమోనని అడిగితే, “ఏం పర్లేదు, మీరు కూర్చోండి” అని అన్నాడతను. బాబానే అతని రూపంలో వచ్చి నాకు సహాయం చేశారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! నిన్ను వేడుకున్నవారికి నువ్వు ఎల్లప్పుడూ తోడుగా ఉంటావు”.


జై సాయిరాం!


బాబాకు ప్రార్థన - వచ్చిన ఓ.సి.ఐ కార్డు


అఖిలాండకోటి, అనంతకోటి బ్రహ్మాండనాయకునికి శతకోటి నమస్కారములు. బాబా గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే. ఇటీవల నేను పంచుకున్న అనుభవాలను ప్రచురించినవారికి, వాటిని చదివినవారికి నా ధన్యవాదములు. బ్లాగ్ నిర్వాహకులకు హృదయపూర్వక వందనములు.


మేము ప్రస్తుతం అమెరికాలో ఉన్నాము. మాకు మనవడు పుట్టాడని మేము ఇక్కడికి వచ్చాము. బాబా దయవల్ల అన్నీ బాగా జరిగాయి. మేము మా అబ్బాయిని, కోడలని, మనవడిని ఇండియాకి తీసుకొని రావాలని మనవడి ఓ.సి.ఐ (OVERSEAS CITIZEN OF INDIA) కార్డు కోసం దరఖాస్తు చేశాము. అయితే కరోనా కారణంగా కార్డు రావడానికి కాస్త ఆలస్యమవుతోంది. మరోవైపు మేము తిరిగి ఇండియాకి రావాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఏదేమైనా అన్నిటికీ బాబా ఉన్నారు కదా! ఎప్పటిలాగే బాబాను తలచుకొని, “బాబా! ఏదైనా మీరే చేయాలి. మీరు తప్ప మాకు ఏ దారీ లేదు. మీ దయవలన మా మనవడి ఓ.సి.ఐ కార్డు తొందరగా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. నా ప్రార్థనను మన్నించి బాబా ఉత్తర్వులు జారీచేశారు. బాబా ఉత్తర్వులు కార్యాలయ సిబ్బంది మదిని చేరాయి. వెంటనే వాళ్ళు, “మీరు వచ్చి కార్డు తీసుకుని వెళ్లండ”ని మాకు మెయిల్ చేశారు. మేము ఎంతగా ఆనందించామో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! బాబా ప్రేమను నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. “బాబా! చాలా చాలా ధన్యవాదాలు. చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగినట్లు మేము నిన్ను ఎన్నో అడుగుతున్నాము. నువ్వు అన్నీ ఇస్తూనే ఉన్నావు. మేము తింటూనే ఉన్నాము. ఎప్పటికీ ఇలాగే మా అందరినీ నీ ఒడిలో సేదతీర్చు తండ్రీ!” చివరిగా, నేను ఈ అనుభవాన్ని పంచుకోవటంలో ఏమైనా తప్పులుంటే క్షమించమని మనవి.


ఇట్లు,

బాబా బిడ్డ.



6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo