సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తారాబాయి సదాశివ తర్ఖడ్



పూణే నివాసస్థులైన శ్రీ సదాశివ తర్ఖడ్, శ్రీమతి తారాబాయి తర్ఖడ్ దంపతులు బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళ కుటుంబానికి బాబాతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. వాళ్ళు తమ సెలవు దినాలను ఎక్కువగా శిరిడీలో గడుపుతుండేవారు. శిరిడీ వెళ్ళినప్పుడల్లా సుమారు నెలరోజుల నుండి ఆరునెలల వరకు బాబా సన్నిధిలో ఉంటుండేవారు. బాబా వాళ్ళకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు.

ఒకసారి సదాశివ తర్ఖడ్ తన భార్య తారాబాయితో కలిసి బొంబాయిలో ఉన్న తన సోదరుడు శ్రీ రామచంద్ర ఆత్మారామ్ తర్ఖడ్ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని సోదరుడు బాబా గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తూ చెప్పాడు. బాబా గురించి వినడం తారాబాయికి అదే మొదటిసారి. అయినప్పటికీ అతని మాటలు ఆమెపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపాయి. ఆ సమయంలో పదిహేను నెలల వయసున్న వారి బిడ్డ నళినీ తర్ఖడ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఏమి చేయాలో తోచక ఆ దంపతులు ఎంతో ఆందోళనతో ఉన్నారు. అటువంటి సమయంలో బాబా కీర్తి విన్న తారాబాయి, “బాబా మా బిడ్డకు నయం చేసినట్లయితే, కుటుంబంతో శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటాను” అని మ్రొక్కుకున్నది. బాబా కృపతో కొద్దిసేపట్లోనే బిడ్డ ఆరోగ్యం కుదుటపడింది. అంతటితో వాళ్ళు ఆలస్యం చేయక వెంటనే బాబా దర్శనానికి శిరిడీ వెళ్లారు.

తారాబాయి తర్ఖడ్ ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న సౌశీలవతి. అవకాశం దొరికినప్పుడల్లా ఆమె సత్పురుషుల దర్శనం చేసుకుంటూ ఉండేది. అయితే, తొలి దర్శనంలోనే బాబా ఆమె మనసుపై ప్రత్యేకమైన ముద్ర వేశారు. బాబాలోని ప్రత్యేక ఆకర్షణ వారి కనులు అని ఆమె తొలి దర్శనంలోనే గుర్తించింది. అప్పటి తన అనుభూతిని ఆమె ఇలా చెప్పింది: “ప్రప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరినైనా అమితంగా ఆకర్షించేవి వారి కళ్ళు. బాబా చూపులోని శక్తి(తీక్షణత), చొచ్చుకుపోయే విలక్షణత వలన ఎవరూ ఎక్కువసేపు బాబా కళ్ళలోకి చూస్తూ ఉండలేకపోయేవారు. బాబా దృష్టి తమ అణువణువును పరిశీలిస్తున్నట్లు ఎవరికైనా అనుభూతి కలుగుతుంది. వెంటనే వారు తమ దృష్టిని క్రిందికి మరల్చి బాబాకు నమస్కరిస్తారు. బాబా మన హృదయంలోనేకాక, శరీరంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని అనుభూతి కలుగుతుంది. బాబా మాట్లాడే కొద్ది మాటలు, సంజ్ఞలను బట్టి వారు భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని తెలుస్తుంది. ఒకసారి బాబాను దర్శించిన తరువాత విశ్వాసంతో వారికి సర్వస్యశరణాగతి చెందడం కన్నా చేయవలసింది మరేదీ ఉండదు. అంతటితో బాబా ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, మన జీవితంలోని ప్రతి మలుపులో, సుఖదుఃఖాలలో మార్గనిర్దేశం చేస్తూ సంరక్షిస్తుంటారు. వారిని దైవం లేదా సహజస్థితిలో ఉన్న సత్పురుషులు లేదా ఇంకేమైనా అనండి, వారు మన అంతర్యామి. అత్యంత శక్తిమంతులైన వారి సన్నిధిలో ఎటువంటి సందేహాలకు, భయాలకు, ప్రశ్నలకు తావుండదు. ఎవరైనా సరే, తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి వారి సన్నిధి సురక్షితమని, ఉత్తమమైన తమ గమ్యమని తెలుసుకుంటారు. బాబాను దర్శించిన వెంటనే వారి శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవమవడం మొదలవుతుంది. సర్వకాల, సర్వావస్థలయందు వారి కృపాదృష్టి మనపై ఉంటుందనీ, మనకు ఏ ఆపదా వాటిల్లదనీ నమ్మకం ఏర్పడుతుంది”.

ఆ రోజుల్లో వీధిదీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు లేని కుగ్రామం శిరిడీ. తరువాతి కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. శ్రీమతి తారాబాయి మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పుడు వీధిదీపాలు లేనందున వీధులన్నీ చీకటిగా ఉండేవి. ఒకరోజు రాత్రి ఆమె వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒకచోట ఆగిపోయింది. దేనినైనా చూడటం వలనో, ఏదైనా శబ్దం వినడం వలనో ఆమె ఆగిపోలేదు. ఆమె మనసుకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయింది. కొద్దిసేపటి తరువాత ఎవరో దీపం తీసుకొని అటుగా వచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే, ఆమె ముందు ఒక పాము నిశ్చలంగా పడుకొని ఉండటం కనిపించింది. ఆమె ఆగకుండా ఒక్క అడుగు ముందుకు వేసుంటే ఆమె పాదం సరిగ్గా ఆ పాము మీద పడి ఎంతో ప్రమాదం జరిగేది. అక్కడ పాము ఉందని ఏమాత్రం తెలియని ఆమె సరిగ్గా అడుగు దూరంలో అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయింది? సరిగ్గా సమయానికి ఎవరో దీపాన్ని తీసుకొచ్చి ముందున్న ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే! అనుక్షణం జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వాంతర్యామి అయిన బాబా అనుగ్రహమే! “ఈ విధంగా బాబా తమ మహాసమాధికి ముందు, తరువాత కూడా అనేక సందర్భాల్లో నన్ను మృత్యువు నుండి రక్షించారు” అని ఆమె చెప్పింది.

మొదటిసారి బాబాను దర్శించినప్పటి నుండి తారాబాయి తర్ఖడ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా బాబా శక్తి, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, వారి రక్షణకి సంబంధించిన అనుభవాలను పొందుతుండేది. తద్వారా ఆమె పూర్తి విశ్వాసంతో సర్వస్యశరణాగతి చెంది బాబాకు అంకిత భక్తురాలైంది. ఇతరుల శ్రేయస్సుకోసం బాబా అంతర్యామిత్వానికి సంబంధించి ఉదాహరణలుగా తన అనుభవాలతో పాటు కొంతమంది సన్నిహితుల అనుభవాలను చెప్తూ ఉండేది.

బాబా అదృశ్యంగా ఉంటూ తమ బిడ్డలపై దృష్టి నిలుపుతారని పై(ముందుభాగంలో చెప్పబడిన అనుభవం) ఒక్క అనుభవమేకాక తారాబాయికి ఇంకా ఇతర నిదర్శనాలున్నాయి. ఆమె శారీరక ఆరోగ్యానికి సంబంధించి - ఆమె కళ్ళు ఎప్పుడూ చాలా బాధపెడుతుండేవి. ఒకసారి శిరిడీలో ఉన్నప్పుడు నొప్పి ఎక్కువై ఆమె కళ్ళనుండి నీళ్లు కారసాగాయి. అటువంటి స్థితిలో ఆమె మశీదుకెళ్ళి బాబా ముందు కూర్చుంది. బాబా ఆమె వైపు చూశారు. అంతే! ఆమె కళ్ళనొప్పి తగ్గిపోయి కళ్ళనుండి నీరు కారడం ఆగిపోయింది. కానీ, బాబా కళ్ళనుండి నీరు కారడం ప్రారంభమైంది. ఖచ్చితమైన రోగ నిర్ధారణకు, దానికి తగిన పరిష్కారాన్ని కనుగొనటానికి ఎంతో సమయం, ఎన్నో ప్రయత్నాలు వైద్యులకు అవసరమయ్యేది. కానీ, బాబా ఒక్క చూపుతోనే రోగమేమిటో తెలుసుకోవడం అద్భుతం! ఏ మందూ వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం! శాస్త్రవేత్తలు గానీ, వైద్యులు గానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం ఆమె అనుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేకాక, బాబా భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ.

తారాబాయి తర్ఖడ్ ఇలా చెప్పింది: “మాకు ఏవైనా కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు, సర్వజ్ఞులైన బాబా మాకొచ్చిన సమస్య తెలుసుకొని ఆ కష్టాలు తొలగిపోయే మార్గం చూపేవారు”. అందుకొక ఉదాహరణ: ఒకసారి తర్ఖడ్ కుటుంబం శిరిడీ వెళ్తూ, నడుమునొప్పితో బాధపడుతున్న తమ పనివాడిని కూడా తీసుకొని వెళ్లారు. సదాశివ తర్ఖడ్ మశీదుకి వెళ్లి బాబా ముందు నిలబడ్డాడు. అప్పుడక్కడ కొందరు భక్తులు కూడా ఉన్నారు. హఠాత్తుగా బాబా, “నా కాలు విపరీతంగా నొప్పిపుడుతోంది” అని చెప్పారు. అప్పుడొక భక్తుడు, “బాబా! నొప్పి నివారణకు ఏదైనా చేయవచ్చు కదా?” అని అడిగాడు. బాబా, “అవును చేయాలి. పచ్చని ఆకులు వేడి చేసి పెడితే నొప్పి తగ్గిపోతుంది” అని అన్నారు. ఆ భక్తుడు, “బాబా! అవి ఏమి ఆకులు?” అని అడిగాడు. “లెండీ వాగు దగ్గర ఉన్న ఆకులు” అని బాబా చెప్పారు. అప్పుడు ఒక భక్తుడు ఒక ఆకు పేరు చెప్పాడు, మరో భక్తుడు మరో ఆకు పేరు చెప్పాడు. అంతలో ఇంకో భక్తుడు, “అవి కలబంద ఆకులా?” అని అడిగాడు. అప్పుడు బాబా, “ఆ! అవే. వాటిని తెచ్చి రెండుగా చీల్చి, కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట కట్టాలి, అంతే!” అన్నారు. బాబా చెప్పిన చికిత్స తమ పనివాడికోసమేనని సదాశివ తర్ఖడ్‌కి అనిపించి, వెంటనే వెళ్లి ఆ ఆకులు తెచ్చి బాబా చెప్పినట్లే చేశాడు. అతని బాధ నివారణ అయింది.

బహుశా 1915 వేసవిలో పాంచ్ గని శానటోరియంలో ఉన్నప్పుడు నెలరోజులకు పైగా శ్రీమతి తర్ఖడ్ నరాలకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడింది. తలనొప్పి ఎంత తీవ్రంగా ఉండేదంటే ఆ నొప్పికి తన తల బద్దలైపోతుందేమో అనిపించేది ఆమెకి. ఎన్నో వైద్య చికిత్సలు చేసినప్పటికీ నొప్పి నివారణ కాలేదు. ఇక ఆమెకి మరణం తప్పదనిపించింది. దాంతో ఆమెకి బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమమనిపించి శిరిడీకి వెళదామని నిశ్చయించుకుంది. మొదట ఆమె భర్త కొంత అభ్యంతరం తెలిపినా చివరకు వారిద్దరూ శిరిడీ బయలుదేరారు. కోపర్గాఁవ్ వద్ద గోదావరి దాటి శిరిడీ వెళ్ళేందుకు నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడామెకు, “ఎలాగూ చనిపోతున్నాను కదా? చనిపోయేముందు పవిత్ర గోదావరిలో స్నానమాచరిస్తే మంచిది. కానీ చన్నీళ్ళ స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరౌతానేమోన”ని అనిపించింది. నిజానికి అంతకుముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చెయ్యడమన్న ఆలోచనే ఆమెను వణికించేది. అలాంటిది ఆమె, ‘ఏమైతే అది కానీ’ అని ధైర్యంగా గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చింది. ఆశ్చర్యం! ఎక్కువవుతుందనుకున్న తలనొప్పి శాశ్వతంగా మాయమైంది. ఖచ్చితంగా ఇది బాబా చేసిన అద్భుతం!

పూణేలోని ఒక టెక్స్‌టైల్ మిల్లులో కొంతకాలం మేనేజరుగా పనిచేశాక అక్కడ కాంట్రాక్టు ముగియడంతో సదాశివ తర్ఖడ్ చాలాకాలం ఉద్యోగం లేకుండా ఉండవలసి వచ్చింది. దాంతో అతను బాబా సహాయాన్ని అర్థించి శిరిడీ వెళ్లి కొద్దిరోజులు అక్కడ ఉన్నాడు. ఒకరోజు తాత్యాపాటిల్ తదిరులు వినోద కాలక్షేపానికి అహ్మద్‌నగర్‌ బయలుదేరుతున్నారు. అప్పుడు బాబా సదాశివ తర్ఖడ్‌తో, “నువ్వు కూడా వాళ్లతో వెళ్ళు! తరువాత అటునుంచి అటే పూణే వెళ్లి అక్కడనుండి మీ ఇంటికి వెళ్ళు!” అని ఆదేశించారు. బాబా నోట ఆ మాటలు విన్న తర్ఖడ్ కలవరపడి తనలో తాను, “నేనున్న ఈ పరిస్థితిలో వినోద కాలక్షేపానికి వెళ్ళమని బాబా ఎందుకు చెప్తున్నారు?” అని అనుకున్నాడు. ఏమైనప్పటికీ బాబాపై పూర్తి విశ్వాసమున్న అతను వారి ఆదేశానుసారం తాత్యాపాటిల్‌తో కలిసి అహ్మద్‌నగర్‌ వెళ్లాడు. తరువాత అక్కడినుండి పూణే వెళ్లి ఒక స్నేహితుని ఇంటిలో బస చేశాడు. అప్పుడు ఒక విషయం అతనికి తెలిసింది. అదేమిటంటే, అంతకుముందు తాను పనిచేసిన మిల్లులో కార్మిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించగల సమర్థత తనకుందని తలచి సంబంధిత అధికారులు తనను తిరిగి ఉద్యోగంలో తీసుకోదలచి తనకోసం తీవ్రంగా గాలిస్తున్నారని. సదాశివ తర్ఖడ్‌ను వెంటనే ఉద్యోగంలో చేరమని బొంబాయి తదితర ప్రదేశాలకు సమాచారం కూడా పంపారు. సర్వజ్ఞుడైన బాబాకు అదంతా తెలుసు. అందుకే సరైన సమయానికి తర్ఖడ్‌ను పూణే పంపారు. ఆ విధంగా బాబా అనుగ్రహంతో తర్ఖడ్ తిరిగి ఉద్యోగం పొందాడు. బాబా ఆదేశాలు మొదట్లో అస్పష్టంగా, అసంబద్ధంగా ఉన్నప్పటికీ అవి చాలా అర్థవంతమైనవి. భక్తుని శ్రేయస్సు అందులో దాగివుంటుంది.

ఒకరోజు మసీదులో చాలామంది భక్తులున్నారు. శ్రీమతి తారాబాయి తర్ఖడ్ మసీదులో సాయిబాబాకు సమీపంలో కూర్చొని ఉంది. అకస్మాత్తుగా ఆమె దృష్టి ఎదురుగా ఉన్న వీధిలో నడుస్తున్న ఒక వృద్ధుడిపై పడింది. అతను మసీదు వైపుగా అడుగులు వేస్తున్నాడు. ఆమె కాస్త పరిశీలనగా అతన్ని చూసినప్పుడు, అతను కుష్టువ్యాధిగ్రస్తుడని అర్థమైంది. ఆ రోజుల్లో కుష్టువ్యాధిని ఒక వ్యాధిగా కాక ఒక పాపంగా భావించేవారు. అందుచేత తారాబాయి అతను మసీదులోకి రాకుండా వేరే దారిలో వెళ్ళాలని మనసులో అనుకుంది. వ్యాధిగ్రస్తులైనా, ఆరోగ్యవంతులైనా, పేదవారైనా, ధనవంతులైనా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా, దయార్ద్రహృదయులైనా, కపటులైనా అందరికీ సాయిబాబా దర్బారు‌లోకి స్వాగతం లభిస్తుంది. మరి, బాబా ఆ వృద్ధుని మాత్రం తమ మసీదులోకి రాకుండా ఎలా ఆపుతారు? ఆ వృద్ధుడు నేరుగా మసీదులోకి వచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి, శరీరం నుండి దుర్వాసన వస్తుంది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో, అతికష్టం మీద నెమ్మదిగా మసీదు మెట్లెక్కి, అందరి భక్తుల మాదిరే ధుని వద్దకి వెళ్లి కొద్దిగా ఊదీ తీసుకొన్న తరువాత బాబాను సమీపించి వారి చేతిలో ఊదీ పెట్టి, వారి పాదాలపై తలను ఉంచి నమస్కరించాడు. అందుకు చాలా సమయమే పట్టింది. అతని శరీరం నుండి వస్తున్న దుర్గంధాన్ని భరించలేక అతనెప్పుడు బయటికి వెళ్ళిపోతాడా అని తారాబాయి నిరీక్షించసాగింది. కొద్దిసేపటికి ఆ వృద్ధుడు బాబా పాదాలు తాకి నమస్కరించుకుని మసీదు మెట్లు దిగసాగాడు. అతను వెళ్ళిపోగానే తారాబాయి ఊపిరి పీల్చుకొని, “దేవుడా! బ్రతికించావు. అతను వెళ్ళిపోయాడు” అని మనసులో అనుకుంది. మరుక్షణం బాబా ఆమె వైపు తీక్షణంగా చూశారు. తన మనసులోని భావాలను బాబా గ్రహించారని ఆమెకు అర్థమైంది. ఆ వృద్ధుడు ఎక్కువ దూరం పోకముందే బాబా ఒక భక్తునితో అతనిని పిలుచుకొని రమ్మని ఆదేశించారు. ఆ వృద్ధుడు అతిప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చి బాబాకు నమస్కరించాడు. బాబా అతన్ని తమ చెంత కూర్చుండబెట్టుకొని మాటల్లో పెట్టారు. అతని నడుముకి మాసిన గుడ్డతో కట్టిన ఒక మూట ఉంది. అకస్మాత్తుగా బాబా దానిగురించి ప్రస్తావిస్తూ, “దానిలో ఏముంది?” అని అడిగారు. అతను స్పష్టంగా ఏమీ చెప్పక ఆ మూటను తన వెనుక దాచుకొనే ప్రయత్నం చేశాడు. కానీ బాబా ఆ మూటను అతని వద్దనుండి లాక్కొని దాన్ని విప్పారు. అందులో కొన్ని పేడాలున్నాయి. బాబా ఒక పేడాను తీసి, మసీదులో ఎంతోమంది భక్తులున్నా తారాబాయికి మాత్రమే ఇచ్చి తినమన్నారు. “కుష్టురోగి తెచ్చిన పేడా తినడమా?” అనే భయంతో ఆమె దాన్ని తన చేతిరుమాలులో చుట్టిపెట్టుకుంది. మసీదులో, అదీ బాబా సమక్షంలో ఆమె మనసును పలురకాల సందేహాలు చుట్టుముట్టడంతో బాబా పవిత్ర హస్తాల ద్వారా లభించిన ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడక చేతిలోనే పట్టుకొని నిశ్చలంగా కూర్చుంది. అప్పుడు బాబా, “అమ్మా! నేను నీకు ప్రసాదం ఇచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు” అని అన్నారు. ఇక తప్పనిసరై అయిష్టంగానే ఆమె ఆ పేడాను తిన్నది. తరువాత బాబా ఆ మూటలోంచి మరొక పేడాను తీసుకొని తామూ తిన్నారు. మిగిలిన పేడాలను ఆ వృద్ధునికి తిరిగి ఇచ్చారు. నిజానికి అతను ఆ పేడాలను బాబా కోసమే తీసుకొని వచ్చాడు. బాబా వాటిలో కొన్ని స్వీకరించి, మిగిలినవి తిరిగి ప్రసాదంగా తనకు ఇవ్వాలని ఆశించాడు. కానీ మాసిన వస్త్రంలో ఉన్న ఆ పేడాలను బాబాకి సమర్పించే ధైర్యం చేయలేకపోయాడు. అయినప్పటికీ బాబా అతన్ని సంతృప్తిపరిచారు.

బాబా ఆ వృద్ధుని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా పేడాను ఆమెకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో ఆమెకు తప్ప అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. ‘మానవత్వం, సోదరభావం, సానుభూతి, ఓర్పు మరియు ఏది ప్రమాదమో, ఏది కాదో తెలుసుకోగల బాబా యొక్క అత్యుత్తమ జ్ఞానంపై నమ్మకం కలిగి ఉండాల’న్న విలువైన పాఠాన్ని ఆమెకు నేర్పడానికి బాబా ఆ సందర్భాన్ని ఉపయోగించారు. ఆ విధంగా, ఆరోగ్యపరమైన జాగ్రత్తలకంటే బాబా శక్తి మీద నమ్ముకముంటే చాలని తెలియజేశారు.

1915 ప్రాంతంలో ఒకసారి తర్ఖడ్ దంపతులు శిరిడీ వెళ్ళినప్పుడు బాబా వాళ్ళను రాధాకృష్ణఆయీ ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం వాళ్ళు ఆయీ ఇంటికి వెళ్ళి తమకు వసతి కల్పించమని అడిగారు. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. అందుకు శ్రీమతి తర్ఖడ్ అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేస్తుండేది. కానీ పనిలో ఏ మాత్రం లోటుపాట్లు జరిగినా ఆయీ చాలా పరుషంగా మాట్లాడేది. దాంతో శ్రీమతి తర్ఖడ్ ‘తమకెందుకు ఇటువంటి కఠిన పరిస్థితిని బాబా కల్పించారు? దీని పర్యవసానం ఏమిటి?’ అని చింతించసాగింది. కానీ రానురానూ ఆయీ గురించి తెలుసుకున్నకొద్దీ ఆమె మనసు సమాధానపడింది. ఆమె ఇలా చెప్పింది: “రాధాకృష్ణఆయీ ఒక బ్రాహ్మణ వితంతువు. ఆమెకు సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. ఆయీకి కొన్ని దివ్యశక్తులుండేవి. ఎదుటివారి మనస్సును ఆమె చదవగలిగేది. ఆమె నా గతచరిత్రంతా పూసగ్రుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు, ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి, వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనస్సు చదివి, నేనివ్వదలచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. బహుశా మాలో సహనాన్ని పెంపొందించేందుకు బాబా మమ్మల్ని ఆయీ ఇంటికి పంపించి ఉండవచ్చు”.

బాబా సమాధి చెందిన తొమ్మిది సంవత్సరాలకు, 1927లో శ్రీమతి తర్ఖడ్ ఆరునెలల గర్భవతిగా ఉన్నప్పుడు కుటుంబమంతా శిరిడీ వెళ్ళారు. వాళ్ళు శిరిడీ చేరుకున్నాక ఆమె గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచినా ప్రసవం కాలేదు. ఇలాంటి సమయాలలో ఆపరేషన్ చేసి మృతశిశువును బయటకు తీస్తారు. కానీ శిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్‌నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. సదాశివ్ తర్ఖడ్‌కి ఏం చేయాలో పాలుపోక సాకోరి వెళ్ళి శ్రీఉపాసనీ మహరాజ్‌ను కలిసి సహాయాన్ని అర్థించారు. ఆయన అంతా విని, “ఉత్తమోత్తమ వైద్యుడు (సాయిబాబా) శిరిడీలోనే ఉండగా నా దగ్గరకెందుకొచ్చావు?” అన్నారు. రోజుల తరబడి మృతశిశువు గర్భంలో ఉన్నందువల్ల రక్తమంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయి శ్రీమతి తర్ఖడ్ స్పృహ కోల్పోయింది. తరువాత ఏం జరిగిందో, ప్రసవమెలా జరిగిందో తన భర్త చెపితేనే ఆమెకు తెలిసింది. 

స్పృహలేని స్థితిలోనే ఆమె మాట్లాడుతూ, మొదట తనకు బాబా ఊదీ పెట్టి, బాబా పాదతీర్థాన్ని తన నోట్లో పోయమని తన భర్తకు చెప్పింది. అలాగే మరికొన్ని ఆదేశాలిచ్చింది. సదాశివ తర్ఖడ్ ఆమె చెప్పినట్లే చేశాడు. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటకు వచ్చేసింది. కానీ ఆమె నెలరోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి ఆ తరువాత స్పృహలోకి వచ్చింది. ఆరోగ్యం కూడా కుదుటపడింది. తమ బిడ్దలపట్ల బాబా కృపకు నిదర్శనమైన అద్భుత లీల ఇది! వారు విదేహులైనప్పటికీ వారి రక్షణ, సహాయము మనకు అందుతూనే ఉంటాయనడానికి నిదర్శనమీ సంఘటన.

1936లో బి.వి.నరసింహస్వామిగారితో శ్రీమతి తారాబాయి తర్ఖడ్ పంచుకున్న వివరాలు:

బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వర్తించగలరు. వారు సర్వాంతర్యామి. సర్వజీవులలోనూ, సకల జీవ, నిర్జీవ పదార్థాలలోనూ వసించి ఉంటారు. వాటి కదలికలను, కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే - శిరిడీలోనే ఉంటూ “నేను శిరిడీలో లేను” అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. “సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు, రక్తమాంసాలతో కూడిన ఈ మూడుమూరల దేహానికే పరిమితమై లేను” అని వారు తరచూ చెబుతుండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వజంతుజాలంలోనూ, సర్వమానవులలోనూ వారు వసించి ఉంటారు. ‘మనం కేవలం మన భౌతిక శరీరమే’ అన్న భావన మనల్ని వీడదు. ఐహికబంధాలతో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి, భవబంధాలకు అతీతులుఎప్పుడూ సహజ సమాధి స్థితిలో ఉండే జ్ఞానమయ శరీరులు.

శ్రీసాయిబాబాకు, ఇతర సాధు సత్పురుషులకు గల ముఖ్యమైన తేడా గమనించదగ్గది. నేను ఎంతోమంది సత్పురుషులను దర్శించాను. వారు తమ శరీరాన్ని, పరిసరాలను పూర్తిగా మరచి ‘సమాధి’ స్థితిలోనికి వెళ్ళిపోతారు. తరువాత సమాధి స్థితి వీడి బాహ్యస్పృహలోకి వచ్చి, మన హృదయంలో ఏముందో తెలుసుకొని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకుగానూ లేదా మరేదైనా తెలుసుకొనేందుకుగానీ బాబా సమాధి స్థితికి వెళ్ళనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ రెండు స్థితులయందు ఉండేవారు. ఒకటి, ‘సాయిబాబా’గా శిరిడీలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక, ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది, పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇతర సాధువులు మన మనస్సు చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీసాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు రెండు స్థితుల సహజమైన గుణగణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞస్థితిలో ఉంటారు.

సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు: బాబా కఫ్నీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం ఎనిమిదణాలు చెబితే, వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించినవారు తొందరపడి బాబా లోభి అని, అత్యాశాపరుడని, డబ్బంటే వ్యామోహమని అనుకొంటారు. తరువాత ఆ వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి నాలుగు రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడదే ప్రేక్షకులు బాబానొక పిచ్చివానిగానూ, డబ్బు విలువ తెలియనివానిగానూ అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్రదానమని కూడా అనుకుంటారు. పై రెండు సందర్భాలలోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహనారాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించడానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి, వారు ఎవరికి విశదపరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది.

భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవ్యాజమైన ప్రేమానురాగాలతో మిళితమైనందువలన భక్తులకు శిరిడీ ఒక స్వర్గధామమయింది. బాబా సన్నిధిలో ఉంటే తమకు ఏ ఆపదా వాటిల్లదని, క్షేమంగా ఉంటామనే నమ్మకం భక్తులకు కలుగుతుంది. నేను శిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధల్నే కాదు ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మరచిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతే పొందివుంటారన్నది నా నమ్మకం. సర్వత్రా ఆయనే నిండి ఉన్నారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు.

బాబా మనల్ని వీడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి, మనం కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉన్నామనిపిస్తుంది. వారి ప్రత్యక్షసన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా వీడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవమవుతూనే ఉంటాయి. కానీ వీటన్నింటినీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము. 

శ్రీసాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచ్చీలత కీర్తించదగినది. ఇంతకుమునుపు చెప్పిన సంఘటనలలో బాబా దయాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశీస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా, శిరిడీ నుండి ఎంతో దూరప్రాంతాలలోనున్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు వేలమైళ్ళ దూరంలో ఐరోపాలోనున్న తమ భక్తులు ప్రమాదస్థితిలో ఉన్నప్పుడు బాబా వాళ్ళను ఆదుకొని మృత్యువు నుండి కాపాడారు. బాబా దయాస్వరూపులే కాక వారి న్యాయదృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. “అవసరమైతే ఎవరైనా తమ బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాల”ని బాబా చెప్పేవారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా బాబా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమీషనర్లు వచ్చేవారు. మామ్లతదార్లు, డి.ఓ.లు, డి.సి.లు, క్రిందిస్థాయి ఉద్యోగులు ఎంతోమంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా ప్రాతిపదికగా ఎవరిపై ఎట్టి ప్రత్యేకతా చూపేవారు కాదు. అందరికీ, అన్నివేళలా అందుబాటులో ఉండటం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. “నా దర్బారు అన్నివేళలా తెరిచే ఉంటుంది” అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేమీ లేవు. వారి చర్యలన్నీ బాహాటంగా ఉండేవి.

బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం - వారు ఎలాంటి బాదరబందీలు లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు, మఠాలు లేవు; సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. వారు భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు. కానీ ఆ మొత్తాన్ని తిరిగి భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడేబాబాకు ప్రతిరోజూ 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనోనిగ్రహము, వైరాగ్యము చెప్పుకోదగినవి. జిహ్వచాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి అధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు.

బాబా దాతృత్వము ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక తమకు సమర్పించిన కానుకలను కూడా పంచేసేవారు. కొందరు బాబా ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు. కానీ అది వాస్తవం కాదు. బాబా కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. వారి గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజనబృందాలు తమను దర్శించినప్పుడు బాబా వాళ్ళకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తిభావంతో, ఆర్తిగా, ఒక భగవద్భక్తునివలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లుగా ఎవరూ చూసి ఎరుగరు. ప్రతి ఉదయం ధుని దగ్గర కూర్చొని చేతులు, వ్రేళ్ళు తిప్పుతూ ఏవేవో సంజ్ఞలు చేస్తూ “హక్” (భగవంతుడు) అని మాత్రం ఉచ్ఛరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎల్లప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటనతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడూ వెళ్ళే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తాము తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్థరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్ళకు అవి నిస్సందేహంగా అర్థరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సుకోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే ఆ మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. “జయామని జైసాభావ, తయాతైసా అనుభవ”. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో, అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలుగజేస్తారన్నదే దీని భావం.

బాబా తమకెలాంటి సుఖాలుగానీ, సౌకర్యాలుగానీ ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పాడుబడి పడిపోయేటట్లుండేది. భక్తులు దానిని మరమ్మత్తు చేయదలచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మత్తులు పూర్తిచేశారు.

బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడూ యోగ, ప్రాణాయామం, కుండలిని మొదలైనవాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే, వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరేచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి శిరిడీలో కొద్దిరోజులున్న తరువాత అతని ఆరోగ్యం కుదుటపడింది. శిరిడీలో మేము ఉపాసనీబాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము.

 సమాప్తం .......

Source: మూలం: గుజరాతీ పుస్తకం "సాయి సరోవర్".
http://www.shirdisaibabastories.org/2008/06/shirdi-sai-babas-diseased-peda.html
http://saiamrithadhara.com/mahabhakthas/tarabai_sadashiva_tarkad.html

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. సాయిశ్వర నీవే కలవు నీవే తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో.. నన్ను మా కుటుంబ సభ్యులందరినీ మా వాళ్లందర్నీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తరతరాలుగా తరగని సిరిసంపదలతో దీవించండి బాబా...

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo