సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 585వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అతి పెద్ద గండం (కరోనా మహమ్మారి) నుండి అతి తేలికగా కాపాడారు బాబా
  2. బాబా ప్రసాదించిన స్వప్నానుభవాలు

అతి పెద్ద గండం (కరోనా మహమ్మారి) నుండి అతి తేలికగా కాపాడారు బాబా

సద్గురు సాయినాథునికి హృదయపూర్వక, కృతజ్ఞతాపూర్వక అంగాంగ సర్వాంగ సాష్టాంగ నమస్కారములు. నా పేరు కుమార్. నా వయసు 40 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుకొనే రోజుల నుంచే బాబాను పూజించటం ప్రారంభించాను. ప్రతి గురువారం బాబా గుడికి వెళుతూ, ప్రతిరోజూ ఇంట్లో బాబా పటానికి పూజచేసుకుంటూ ఉండేవాడిని. సాయిలీలామృతము నాకు నిత్యపారాయణ గ్రంథం. నా జీవితంలో బాబా నన్ను ఎన్ని విధాలుగా కాపాడారో, ఎన్నిసార్లు రక్షించారో, ఎన్ని సలహాలనిచ్చి నన్ను ఎన్ని సమస్యల నుంచి గట్టెక్కించారో చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే వ్రాయవచ్చు. అవన్నీ ఒక్కొక్కటిగా నేను మీతో పంచుకుంటాను.

నేను హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉండి ఆఫీస్ పని చేసుకుంటున్నాను. ఏదైనా అవసరమైనపుడు మాత్రమే బయటికి వెళుతూ వుండేవాడిని. బయటనుంచి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవాడిని. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ఒకరోజు అకస్మాత్తుగా నాకు జలుబు మొదలైంది. అసలే బయట కోవిడ్ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ వుంది. రోజుకి కొన్ని వేల కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. అలాంటి గందరగోళ పరిస్థితులలో నాకు జలుబు (ముక్కు దిబ్బడ) మొదలైంది. ఆ తరువాత ఒళ్ళునొప్పులు, కొద్దిగా జ్వరం కూడా మొదలైంది. ఆ రాత్రి నిద్రపోవడం కూడా చాలా కష్టమైంది. ఆ తరువాత ముక్కుకి వాసన తెలియడం ఆగిపోయింది. దాంతో నాకు చాలా భయం వేసింది. అసలే ఇంట్లో చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా వున్నారు. ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే (కోవిడ్ అయితే) అందరం చాలా ఇబ్బందిపడతామని అనుకొని చాలా చాలా భయపడ్డాను. వెంటనే నేను రోజూ పూజ చేసే నా తండ్రి సాయిబాబా పటం ముందు నిలుచొని, “బాబా! ఇప్పటివరకు మాకు ఏ కష్టం వచ్చినా మీకు చెప్పుకుంటే వెంటనే ఆ కష్టాన్ని తీరుస్తూ నన్ను, మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వున్నారు. చల్లటి మీ పాదాల నీడలో మేమంతా హాయిగా వున్నాము. కానీ ఇప్పుడు నాకు వచ్చిన లక్షణాలు చూస్తుంటే చాలా భయంగా వుంది బాబా. నన్ను, నా కుటుంబాన్ని కోవిడ్ బారినుండి కాపాడండి బాబా! నాకున్న ఏకైక దిక్కు మీరే, మీ మీదే ఆధారపడి ఇన్ని రోజులు గడిపాము. ఇప్పుడు కూడా మీరే నాకు దిక్కు. కాపాడండి బాబా! రక్షించండి బాబా!” అని కన్నీళ్ళతో బాబాను వేడుకున్నాను. కొంచెంసేపటి తరువాత, మా అమ్మ మంచినీళ్ళలో బాబా ఊదీ కలిపి తెచ్చి త్రాగమని ఇచ్చింది. ఊదీనీళ్ళు త్రాగిన తరువాత సాయినాథుని దయవలన కొద్దిసేపటికే జ్వరం తగ్గిపోయింది. ఆ తరువాత ఒళ్ళునొప్పులు కూడా తగ్గిపోయాయి. ఆరోజు నుంచి సరిగ్గా నాలుగు రోజులు అలాగే బాబా ఊదీ కలిపిన నీళ్ళు తాగుతూ, మందులు వేసుకుంటూ బాబా పుస్తకాలు, బాబా లీలలు చదువుకుంటూ ఉన్నాను. అయిదవరోజుకి జలుబు (Nose Block) కూడా పూర్తిగా తగ్గిపోయింది. అసలు విషయం ఏమిటంటే, నాకు హై బి.పి వుంది. హై బి.పి ఉన్నవాళ్ళకి కోవిడ్ వస్తే చాలా సీరియస్ అవుతుందని చాలాచోట్ల చదివాను. కానీ నా బాబా నన్ను అతి పెద్ద గండం నుంచి అతి తేలికగా కాపాడాడు. కేవలం బాబా దయవల్ల మాత్రమే అంత పెద్ద గండం నుంచి బ్రతికి బయటపడ్డాను. ఎంతోమంది జీవితాలు కోవిడ్ బారినపడి, హాస్పటల్ బిల్స్ కట్టలేక, ఉన్న ఆస్తులన్ని అమ్మి, అప్పులపాలై, అస్తవ్యస్తమైపోయిన ఘటనలు ఎన్నో చదివాను. నా జీవితం అస్తవ్యస్తం కాకుండా నా తండ్రి సాయినాథుడు నన్ను కాపాడాడు. “బాబా! అంతటి మహమ్మారి నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడినందుకు ఈ బ్లాగ్ వేదికగా మీకు కోటానుకోట్ల కృతజ్ఞతాపూర్వక, హృదయపూర్వక నమస్కారములు అర్పించుకుంటున్నాను. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను బాబా! ఏ జన్మలోనో నేను చేసిన పుణ్యం ఈ జన్మలో నాకు సాయినాథుని రూపంలో దొరికింది. బాబా! మీరు ఎప్పుడూ మా క్షేమం కోసం పరితపిస్తూ, మేము ఎప్పుడూ సుఖంగా వుండాలని ఆశిస్తారు. భగవంతుడు ఎలా వుంటాడో మాకు తెలియదు గానీ, మీరు మాపై చూపించే ప్రేమను చూస్తే మాత్రం మాకు మీరే భగవంతుడని ఖచ్చితంగా అర్థమవుతుంది. భగవంతుడు ప్రేమ స్వరూపమని, ఎంతో దయ, జాలి గల ప్రభువని ఇంకా ఖచ్చితంగా అర్థమవుతుంది. బాబా! కన్నీటితో వేడుకుంటే మీరు కరిగిపోతారు. ఎంతో గొప్ప హృదయం మీది. దయ, జాలి చూపించడంలో మీకు మీరే సాటి బాబా. మీలాంటి ప్రేమ స్వరూపం ఈ యుగాంతం వరకు వుండాలి బాబా. మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళొద్దు బాబా. మీరు లేకుండా మేము ఈ జీవితం ఒక్క క్షణం కూడా గడపలేము బాబా. చివరగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే బాబా, మా మనసు వేరే విషయాల జోలికి వెళ్ళకుండా, మా మనసు నిండా మీ రూపం నిండిపోయేలా అనుగ్రహించి, స్థిరమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యములను అనుగ్రహించి, చివరికి మమ్మల్ని గమ్యం చేర్చండి బాబా!”

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ప్రసాదించిన స్వప్నానుభవాలు

షాద్నగర్ నుండి ప్రవీణ్ కుమార్ తన స్వప్నానుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిరాం! ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్ కుమార్. సాయే నాకు అన్నీ. నేను చేసే ప్రతి పనీ సాయి చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే, నా చేయి పట్టుకుని నడిపించేది నా సాయే. ఈ బ్లాగులో వచ్చే ప్రతి సాయిభక్తుని అనుభవం నాకు కలిగినట్లే ఉంటోంది. ఇక నా అనుభవానికి వస్తే... 

ఈమధ్యన నాకు రెండు స్వప్నాలు వచ్చాయి. మొదటి స్వప్నంలో నాకు దత్తాత్రేయుని దర్శనమైంది. ఆ కలలో ఎవరిదో వివాహం జరుగుతున్నది. ఆ కలలోనే రామాయణం పుస్తకం కూడా కనబడుతోంది. నాకు దత్తాత్రేయుడు చెబుతున్నారో లేక ఎవరు చెబుతున్నారో స్పష్టంగా తెలియటం లేదు కానీ ఆ రామాయణం పుస్తకాన్ని చదవమని చెబుతున్నారు. అంతటితో ఆ కల పూర్తయింది.

రెండవ స్వప్నంలో బాబా ఊదీ దర్శనమిచ్చింది. నేను ప్రతి సంవత్సరం విజయదశమికి శిరిడీ వెళతాను. శిరిడీ వెళ్ళినప్పుడు ఒక సంవత్సరానికి సరిపోయేలా బాబా ఊదీని తెచ్చుకుంటాను. ఒకరోజు రాత్రి, ‘ఈ సంవత్సరం కరోనా కారణంగా శిరిడీ వెళ్ళడానికి కుదురుతుందో, లేదో’ అని అనుకుంటూ పడుకున్నాను. అప్పుడు బాబా ఊదీ కలలో దర్శనమిచ్చింది. ఆ మరునాడు మా సార్ నాకు ఫోన్ చేసి, ‘తాము సాయిమందిరం నిర్మించాలని అనుకుంటున్నామని, విజయదశమి రోజున భూమిపూజ చేద్దామనుకుంటున్నామ’ని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషం కలిగింది. ఈ సంవత్సరం శిరిడీ వెళ్ళే అవకాశం లేనందువల్ల ఈ విజయదశమికి బాబా నన్ను ఇక్కడే ఉంచి నా చేత సేవ చేయించుకుంటారని భావిస్తున్నాను.

ఓం శ్రీ సాయి సమర్థ.



11 comments:

  1. అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Baba tondarga e corona na ni pogattandi sai

    ReplyDelete
  4. Baba me biddalani kapadandi sai na korikalini teerchu thandri

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo