సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 580వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. దిక్కుతోచని స్థితిలో సాయి తన బిడ్డలకి నిజంగా తోడు ఉంటారు
  2. బాబా దయతో పూర్తి ఆరోగ్యం


దిక్కుతోచని స్థితిలో సాయి తన బిడ్డలకి నిజంగా తోడు ఉంటారు

సాయిభక్తురాలు సాహిత్య ఇటీవల తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా మనతో పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. ఇదివరకు నేనొక అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మా జీవితంలో జరిగిన ఇంకొక సాయిలీలను సాయికృపతో మీఅందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నెలరోజుల క్రితం ఒకరోజు రాత్రి మూడు- నాలుగు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మా అమ్మగారికి తీవ్రమైన చలిజ్వరం వచ్చింది. నేను నిద్రలో నుంచి హఠాత్తుగా లేచి చూసేసరికి అమ్మ చలికి తట్టుకోలేక ముడుచుకుపోయి బాధతో ఒకటే ఏడుస్తుంది. కారణమేంటో, ఏమవుతుందో నాకు తెలియలేదు. తన నుదిటి  మీద చేయి వేసి చూస్తే, చాలా వేడిగా ఉంది. నేను అడిగినదానికి అమ్మ సమాధానం కూడా చెప్పలేకపోతుంది. తన మాట సరిగ్గా రావట్లేదు. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అసలే బయట పరిస్థితులు ఏమీ బాగాలేవు అని కోవిడ్ 19ని తలుచుకోగానే, అమ్మకి 'కోవిడ్ 19' ఏమో! అని నా భయం ఇంకా ఎక్కువైంది. ఆ సమయంలో ఏం చేయాలో నాకేమీ అర్థంకాక సాయి వైపు చూశాను. మరుక్షణంలో అమ్మకి ఊదీ పెట్టాలని నా మనసుకి అనిపించింది. వెంటనే వెళ్లి సాయి ఊదీ తీసుకుని, కొంచం అమ్మ నుదుటిపై పెట్టి, మరికొంత నీటిలో కలిపి ఆమెచేత త్రాగించాను. దాంతోపాటు పారాసిటిమాల్ టాబ్లెట్ ఒకటి ఇచ్చాను. 15 నిమిషాలపాటు అమ్మ చలిజ్వరంతో బాధపడిన తరువాత మెల్లగా నిద్రలోకి జారుకుంది. నేను హాల్లోని సోఫాలో కూర్చుని మొబైల్ లో సాయి సూక్తులు చదువుతూ, "అమ్మకి జ్వరం తగ్గేలా చేయి సాయి" అని సాయిని తలుచుకుంటూ ఒక సాయి లీల చదవడం మొదలుపెట్టాను. అప్పుడే! మా ఇంటి డోర్ మీద సాయి ముఖం నాకు దర్శనం అయింది. బాబా తమ తలకు తలపాగా చుట్టుకుని, గడ్డంతో ఉన్నారు, కళ్ళు తెరిచి నావైపు చూస్తున్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. "నువ్వు మాతోనే ఉన్నావు కదా సాయి" అని నాకు చాలా ధైర్యంగా అనిపించింది. నేను చదువుతున్న సాయిలీలలో భక్తునికి తీవ్రమైన జ్వరం వస్తే, సాయి తనకి ఊదీపెట్టి, "కొంచెం నీళ్లలో కలుపుకుని త్రాగమ"ని ఆదేశించి, "ఉదయం 6:30 కల్లా జ్వరం తగ్గిపోతుంద"ని చెప్పారు. ఆ మాటలు సాయి నాతోనే చెప్తున్నట్లు అనిపించింది. అప్పుడు నేను, "అమ్మకి కూడా ఉదయం ఆరున్నరగంటలకల్లా జ్వరం భాధ తగ్గించు సాయి. నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. సరిగ్గా అదే జరిగింది. ఉదయం 6:30 కి అమ్మకి చలిజ్వరం అస్సలు లేదు. అప్పుటిదాకా ఏసి ఆపేయమని అడిగిన ఆమె ఏసి వేసుకుని కూడా "చెమటలు పడుతున్నాయి" అని అన్నది. అమ్మ జ్వరం తగ్గిపోయిందని లేచి కూర్చుని, కాసేపు మామూలుగా ఉండి, ఇంకేం ఫరవాలేదని, మళ్ళీ కాసేపు రెస్టు తీసుకుంటానని వెళ్లి పడుకుంది. దిక్కుతోచక కంగారుపడే పరిస్థితుల్లో సాయి తన బిడ్డలకి నిజంగా తోడు ఉంటారని నాకు ఈ అనుభవం ద్వారా అర్థం అయింది.

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.


బాబా దయతో పూర్తి ఆరోగ్యం

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఈ మధ్యకాలంలో తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం. సాయిబంధువులందరికీ  నా నమస్కారములు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి హృదయపూర్వక నమస్కారములు. ఈమధ్య కాలంలో మా చెల్లికి కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసింది. దానికోసం తాను కొద్దిరోజులుగా మందులు వాడుతుంది. ఇటీవల ఒకరోజు హఠాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చి తను చాలా బాధపడింది. ఆ విషయం మాకు చెప్పి, దాంతోపాటు కిడ్నీలో స్టోన్ ఉన్న వైపు కాలు కూడా గత కొంతకాలంగా నొప్పిగా ఉంటుందని చెప్పింది. కిడ్నీలో ఏమైనా పెద్ద సమస్య ఉందేమోనని మాకు చాలా భయమేసి, డాక్టర్ని సంప్రదించి స్కానింగ్ చేయించాలని అనుకున్నాము. నేను బాబాని ప్రార్థించి, "చెల్లికి ఎటువంటి సమస్య లేదని, రిపోర్టులన్నీ నార్మల్ అని వస్తే గనక నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. తరవాత చేసిన టెస్టుల రిపోర్టులన్నీ నార్మల్ గా రావడం చూసి అందరం ఆశ్చర్యపోయాం. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్ కూడా కరిగిపోయిందని డాక్టర్ చెప్పారు. మా సంతోషానికి అవధులు లేవు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే భక్తులందరినీ చల్లగా ఆశీర్వదించండి. త్వరలో కరోనా నుండి విముక్తిని ప్రసాదించి ప్రపంచమంతా బాగుండేలా అనుగ్రహించండి బాబా".



7 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo