సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 602వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మీద ప్రేమా? లేక కోపమా?
  2. బాబా సర్వవ్యాపకత్వానికి, ప్రేమకు నిదర్శనం

బాబా మీద ప్రేమా? లేక కోపమా?

సాయిరామ్! నా పేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. నేను ఇదివరకు చాలా అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు విజయదశమి ముందురోజు జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను.

సుమారు రెండేళ్ళుగా మావారి ఆరోగ్యం బాగోలేదు, పైగా ఇతరత్రా సమస్యలతో నేను పడుతున్న బాధ వర్ణనాతీతం. నా కష్టాన్ని తీర్చాల్సిన బాబా చూస్తూ ఉన్నారే తప్ప నాకీ బాధల నుండి ఉపశమనాన్ని ప్రసాదించడం లేదు. అలాగని బాబాని వదిలేద్దామనుకున్నా వదలలేను. అట్లాగని నా కష్టాలూ పోవు. బాబా అలా చేస్తున్నారు. ఇక నా అనుభవానికి వస్తే... నా కష్టాలు బాబా తీర్చటం లేదని, ఈసారి విజయదశమిరోజున ఆయనకి ఏమీ చెయ్యకూడదని అనుకున్నాను. కానీ బాబా ఒక్కటీ వదలకుండా అన్నీ నా చేత ఎలా చేయించుకున్నారో చూడండి.

విజయదశమి ముందురోజు సాయంత్రం నేను లలితాసహస్రనామం చదువుతున్నాను. మా చిన్నబ్బాయి ఇంటి క్రింద నుంచి ఫోన్ చేసి, "అమ్మా, నువ్వు క్రిందికి రా! నువ్వు రోజంతా బాధపడుతూ ఉన్నావు. కాసేపు అలా తిరిగి వద్దాం" అన్నాడు. సరేనని నేను తనతో వెళ్ళాను. తను నన్ను ఒక రామమందిరం వద్దకు తీసుకుని వెళ్ళాడు. అక్కడున్న మందిరాలన్నీ మూసి ఉన్నాయి. కానీ, ఒక అబ్బాయి దేవతామూర్తులకు వేసే వస్త్రాలు పెట్టుకొని ఒక ప్రక్కగా కూర్చొని ఉన్నాడు. అది చూసి లక్ష్మి, సరస్వతి అమ్మవార్లకు వస్త్రాలు తీసుకుందామని అతని దగ్గరకు వెళ్లి ఆ వస్త్రాల గురించి అడిగాను. ఆ అబ్బాయి 'అవి బాబా వస్త్రాల'ని చెప్పాడు. అవి కూడా కేవలం రెండు వస్త్రాలు, ఒక కిరీటం మాత్రమే ఉన్నాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. ధర కూడా చాలా తక్కువే. సుమారు 200 రూపాయలు విలువ చేసే ఒక్కో వస్త్రాన్ని కేవలం 40 రూపాయలకే ఇస్తున్నాడు. ఆ రెండు వస్త్రాలలో ఒకటి నీలం రంగుది. నీలం రంగు వస్త్రం కోసం నేను ఎంతోకాలంగా వెతుకుతున్నాను. ఎప్పుడూ ఆకుపచ్చ, ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలు దొరికేవి గానీ, నీలం రంగు దొరికేది కాదు. అలాంటిది నీలం రంగు వస్త్రం కనిపించేసరికి నా మనసు ఆగలేదు. అందువలన 'బాబాకు పూజ చెయ్యను, క్రొత్త వస్త్రాలు కట్టను' అనుకున్న నా సంకల్పాన్ని విడిచి ఆ వస్త్రాలను తీసుకున్నాను. తరువాత బాబా గుడికి వెళ్లి, కోవిడ్ కారణంగా గుడిలోకి వెళ్ళే వీలులేక బయటనుంచే బాబాకు నమస్కరించుకొని ఇంటికి తిరిగి వచ్చాను. క్రొత్త వస్త్రాలు తీసుకెళ్లి బాబా ముందుపెట్టి, "క్రొత్త వస్త్రాలైతే కొన్నాను కానీ, మీకు కట్టను" అని బాబాతో చెప్పాను. 

మరుసటిరోజు విజయదశమి. మనసులో ఆ నీలం రంగు వస్త్రాన్ని బాబాకు కట్టాలనిపించి, 'ఈ క్రొత్త వస్త్రాన్ని మీకు కడతానుగానీ, పూజ మాత్రం చెయ్యను' అనుకుని బాబాకు ఆ నీలం రంగు వస్త్రాన్ని కట్టాను. ఆ నీలం రంగు వస్త్రాల్లో బాబా చాలా చాలా అందంగా ఉన్నారు. అయినా, "మీరు ఇంత అందంగా కనిపిస్తూ నన్ను మభ్యపెట్టినా నేను మాత్రం మీకు పూజ చేయను" అని అనుకొని అమ్మవారి పూజ పూర్తి చేశాను. సరిగ్గా ఆ సమయంలోనే ఎవరో ఫోనులో, "సాయి సచ్చరిత్రలోని 10, 11 అధ్యాయాలు మీరు చదవండి" అని మెసేజ్ పెట్టారు. విషయం ఏమిటంటే, వాళ్ళు నాకు చెప్పకుండానే విజయదశమి పారాయణ అంటూ నా ఫోన్ నెంబర్ని గ్రూపులో చేర్చుకున్నారు. 'పోనీలే' అని ఆ రెండు అధ్యాయాలు చదివాను. ఆ తరువాత మరో ఆవిడ, "నాకు ఒక సమస్య వచ్చింది, నా కోసం మీరు సచ్చరిత్రలోని 43, 44, 45 అధ్యాయాలు చదవండి మేడమ్" అని మెసేజ్ పెట్టింది. 'పాపం కష్టంలో ఉన్నారు కదా' అని ఆ అధ్యాయాలు కూడా చదివాను. ఇక నాకు కోపం వచ్చి, "బాబా! నువ్వు నా చేత అన్నీ చదివించు" అని కూర్చుని ఏకధాటిగా సాయి సచ్చరిత్ర మొత్తం చదివేశాను. 'అసలు బాబాకు ఏమీ చేయను' అనుకుంటే, ఆయన నాతో క్రొత్త వస్త్రం కట్టించుకోవటం మొదలుకొని సాయి సచ్చరిత్ర పారాయణ వరకు అన్నీ చేయించారు. చివరికి బాబాకు పంచారతి కూడా ఇచ్చాను. ఇది 'బాబా మీద ప్రేమా? లేక కోపమా?' నాకేమీ అర్థం కాలేదు. అంతలోనే నాకు అనిపించింది, "నేను ఎవరిని చేసేదానికి? బాబానే చేయించుకున్నారు" అని. దాంతో చాలా సంతోషపడ్డాను. బాబా చర్యలు అగాధాలు. మనకి అర్థం కానే కావు.


బాబా సర్వవ్యాపకత్వానికి, ప్రేమకు నిదర్శనం

యు.ఎస్.ఏ లోని సన్జోస్ సిటీలో నివాసముంటున్న సాయిభక్తుడు సుబ్రహ్మణ్యంగారు ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

విజయదశమిరోజు నా కూతురు, అల్లుడు బాబా దర్శనానికని బయలుదేరారు. ముందుగా వెళ్ళే దారిలో టీ త్రాగి, తరువాత బాబా దర్శనానికి వెళదామని అనుకున్నారు. కానీ ఆ తరువాత వాళ్ళు టీ త్రాగే విషయం ప్రక్కన పెట్టి నేరుగా బాబా దర్శనానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆశ్చర్యంగా వాళ్ళు బాబా మందిరం చేరుకోగానే అక్కడున్న పూజారి వాళ్ళిద్దరికీ వేడివేడి టీ అందించారు. ఆ మందిరంలో ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. అలనాడు నానాసాహెబ్ చందోర్కర్ పద్మాలయ అడవుల్లోని గణపతి మందిరానికి వెళ్తూ దారిలో, "బాబా! మందిరం రాత్రి తొమ్మిది గంటలకల్లా మూసేస్తారు. నేను అక్కడికి చేరుకునేసరికి రాత్రి పదకొండు గంటలవుతుంది. ఆ సమయంలో నాకు ఒక కప్పు టీ కావాలి" అని ప్రార్థిస్తే, చందోర్కర్ మందిరం చేరుకునేసరికి ఆ మందిరం పూజారి అతనికి కప్పు టీ అందించేలా బాబా అనుగ్రహించారు. ఈనాడు ఏమీ అడగకుండానే నా కూతురు, అల్లుడు కోసం వేడివేడి టీ సిద్ధంగా ఉంచారు బాబా. ఇది బాబా సర్వవ్యాపకత్వానికి, ప్రేమకు నిదర్శనం. బాబా చూపిన కరుణకు నా కూతురు, అల్లుడు, ఆ విషయం తెలిసి నేను కూడా ఎంతో ఆనందానుభూతికి లోనయ్యాము. బాబా ఎంతో ప్రేమమూర్తి. వారు తమ బిడ్డలపై అమితమైన ప్రేమను కురిపిస్తారు. 

సేకరణ: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.



6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo