సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 596వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:

  1. తగిన సమయంలో బాబా సహాయం తప్పక లభిస్తుంది 

  2. 24 గంటల్లోనే సంబంధం కుదరకుండా చేశారు బాబా


తగిన సమయంలో బాబా సహాయం తప్పక లభిస్తుంది

సాయిభక్తురాలు సౌజన్య ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నేను ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును ఏ విధంగా చూశానో తెలియదుగానీ, ఈ పేజీని చదువుతూ నా మనసులో, “ఈ బ్లాగ్‌కి టెలిగ్రామ్ యాప్ ఉంటే బాగుండు, రోజూ చూడవచ్చు” అనుకున్నాను. వెంటనే ఈ బ్లాగ్ కి సంబంధించిన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ లింక్స్ కనిపించాయి. వెంటనే ఆ రెండింటిలో చేరాను. అప్పటినుండి ప్రతిరోజూ ఈ బ్లాగ్‌ని ఫాలో అవుతున్నాను.

ఇక నా అనుభవానికి వస్తే... నేను సాయిభక్తురాలిని కాను. ఎందుకంటే, సాయిభక్తులకు ఉండవలసిన అర్హతల్లో ఒక్కటి కూడా నాకు లేదు. నా కోరిక తీరితే ‘సాయిబాబా, థాంక్యూ’ అని చెప్పుకుని బాబాకు కృతజ్ఞతగా ఉంటాను. మళ్ళా ఇంకొక కోరిక తీరకపోతే సాయిబాబాను తిడుతూ ఉంటాను. కానీ, నేను ఇలా ఉన్నప్పటికీ, బాబాపై నా భక్తి ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ బాబా మాత్రం నన్ను కాపాడుతూనే ఉన్నారు. బాబా నాకు ఎన్నో ఇచ్చారు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. అవన్నీ ఒక్కొక్కటిగా మీతో తర్వాత పంచుకుంటాను. ఈమధ్యే జరిగిన ఒక అనుభవాన్ని ముందుగా పంచుకుంటాను. నేను ఒక కోరిక నిమిత్తమై సాయి దివ్యపూజ 5 వారాలు చేస్తానని బాబాకు మ్రొక్కుకుని దివ్యపూజ పూర్తి చేశాను. 5వ వారం పూర్తయిన మరుసటిరోజు శుక్రవారం నిద్రలేవగానే నాకు చాలా నీరసంగా అనిపించింది. తర్వాత క్రమక్రమంగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. ఆ తరువాత రుచి, వాసన కోల్పోయాను. అసలేం జరుగుతోందో నాకేమీ అర్థం కాలేదు. ‘దివ్యపూజలో ఏమైనా లోపం చేశానేమో?’ అనిపించింది. మా ఇంట్లో మా అమ్మ డయాబెటిక్ పేషెంట్. మా నాన్నగారికి ఈమధ్యనే ఏప్రిల్ నెలలో స్టెంట్ వేశారు. ఆ గండం నుండి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అనుకుంటుండగా నాకు ఇలా ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది. వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలనుకున్నాను. నేను కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళేముందు యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుండగా, “నీ కర్మ తీవ్రతలు మరికొద్ది కాలములో తగ్గును. నీ కష్టములు తొందరలో ముగియును” అనే బాబా సందేశం కనిపించింది. అది చూశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ కాసేపటికి, “నా ఊదీని నీతోనే, నీ వద్దనే ఉంచుకొనుము” అనే బాబా సందేశం వచ్చింది. ఆ సందేశాలు చూసి, “నాకు కోవిడ్ ఉండదు, బాబా నన్ను బాధపెట్టరు” అని అనుకుని, బాబా ఊదీ ప్యాకెట్టుని పర్సులో పెట్టుకొని, ఆసుపత్రికి వెళ్ళి కోవిడ్ పరీక్ష చేయించుకున్నాను. రిపోర్టు వచ్చేలోపు నాకు అలసట, తలనొప్పి, జ్వరంగా ఉన్నప్పటికీ ఒక గదిలో విడిగా ఉండిపోయి బాబానే తలచుకుంటూ, బాబా ఊదీని తలక్రింద పెట్టుకుని పడుకునేదాన్ని. నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నల గురించి నాకు భయం వేసింది. “నాకు కోవిడ్ పాజిటివ్ రానివ్వద్దు బాబా. మా అమ్మానాన్నలు ముసలివాళ్ళు. ఈ పరిస్థితుల్లో నన్ను తీసుకుని హాస్పిటల్ చుట్టూ తిరగలేరు. నా వల్ల వాళ్ళకు గానీ కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టైతే నా కుటుంబం తేరుకోలేదు. రక్షించండి బాబా!” అని ఎంతగానో ఏడ్చేదాన్ని. కానీ దురదృష్టవశాత్తూ మూడు రోజుల తర్వాత నాకు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. అది చూడగానే మళ్ళీ బాబా నా మొర ఆలకించలేదని కోపం వచ్చి, “ఎందుకు నా మాట పట్టించుకోవు?” అని బాబాను తిట్టడం మొదలుపెట్టాను. మళ్ళీ అంతలోనే బాబా మీద ప్రేమ వచ్చేది. ఇంట్లోనే గదిలో ఒంటరిగా ఉండి బాబా సచ్చరిత్ర చదవడం, బాబా ఆరతులు, సాయిచాలీసా వినడం చేస్తూ బాబాకు ఇంకా దగ్గరయ్యాను. “ఎందుకు బాబా నాకు ఈ కోవిడ్ పాజిటివ్ ఇచ్చావు?” అని ఏడ్చేదాన్ని. తరువాత మళ్ళీ ఒకరోజు యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తూ ఉంటుంటే, “నీ చావు చీటీ తీసివేసితిని” అనే బాబా సందేశం కనిపించింది. దాంతో మళ్ళీ ధైర్యం వచ్చింది. “సరే బాబా, నాకు కోవిడ్ పాజిటివ్ ఇస్తే ఇచ్చావు. కానీ అమ్మకి, నాన్నగారికి మాత్రం రాకూడదు, ప్లీజ్ బాబా!” అని ప్రతిరోజూ బాబాను ఆర్తిగా వేడుకునేదాన్ని. బాబా దయవల్ల నాకు జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోయింది. శ్వాస సమస్య కూడా పెద్దగా లేదు. అలసట, నీరసం, తలనొప్పి మాత్రం ఉండేవి. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొంచెం ఊపిరి ఆడనట్టు అనిపించినప్పుడు ఇంటినుండి బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ, “బాబా, రక్షించు. నాకు ఏమైనా కర్మ ఉంటే అది ఇంకో 15 సంవత్సరాల తరువాతో లేదా వచ్చే జన్మకో వాయిదా వెయ్యి. అంతేగానీ, ఇప్పుడు వద్దు బాబా. నా కారణంగా మా అమ్మానాన్నలను ఇబ్బందిపెట్టవద్దు బాబా” అని బాబాను వేడుకుంటూ ఏడ్చేదాన్ని. అలా కాసేపు స్వచ్ఛమైన వాతావరణంలో బాబాను తలచుకున్న తరువాత శ్వాస సమస్య తగ్గేది.

అప్పుడే నేను ఈ బ్లాగుని చూడటం. బ్లాగులో బాబా ఊదీ మహిమను గూర్చి చదవడం జరిగింది. అప్పటినుంచి నేను ప్రతిరోజూ బాబా ఊదీని నీటిలో కలుపుకుని త్రాగటం, ఊదీని నుదుటన బొట్టులా పెట్టుకోవడం చేసేదాన్ని. ఇలా 28 రోజుల తర్వాత నాకు అలసట, నీరసం తగ్గింది. ఇప్పటికీ కొద్దిగా తలనొప్పిగా ఉన్నా ఊదీనీళ్ళు త్రాగుతూ ఉన్నాను. బాబా దయవల్ల నాతోనే కరోనా ఆగిపోయింది. మా అమ్మానాన్నలకు సోకలేదు. బాబా నా మొర విన్నారనిపించింది. నేను ఈ బ్లాగును ఉదయం నిద్రలేవగానే ఫేస్‌బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ లలో చదువుతున్నాను. క్రమక్రమంగా నాకు ఎన్నో విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. నేను బాబా పట్ల ఇంకా ఎంత ప్రేమగా ప్రవర్తించాలో, శ్రద్ధ, సబూరి అంటే ఏమిటో అన్నీ తెలిశాయి. బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలనుండి ఎన్నో నేర్చుకున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది, బాబా మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు అని. తగిన సమయం వచ్చినప్పుడు బాబా తప్పకుండా తమ సహాయాన్ని అందిస్తారు. సమయం రావాలి, అంతే. కానీ ఆ సమయంలో మనం, ‘మనల్ని బాబా పట్టించుకోవట్లేదు, మన మొర వినట్లేదు’ అని ఎంతగానో బాధపడతాం. కానీ తప్పనిసరిగా తగిన సమయంలో బాబా మనకు సహాయం చేసితీరుతారు. ఇది మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను.

చివరిగా, ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు నిర్వహించేవారికి నా నమస్కారాలు. మీరు ఇలానే మంచి పనులు ఎన్నో చేసేలా బాబా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను మిగతా అనుభవాలను త్వరలోనే మీతో తప్పక పంచుకుంటాను. “బాబా! అందరినీ ఈ కోవిడ్ బారినుండి రక్షించు! మాపై నీ దయ చూపు తండ్రీ!” ఓం సాయిరాం!


24 గంటల్లోనే సంబంధం కుదరకుండా చేశారు బాబా

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ప్రియమైన సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను ఏదైనా కోరుకోగానే నా కోరిక తీర్చే సాయిబాబాకు నా కృతజ్ఞతలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాల నుండి ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి నాకు ఒక పెళ్ళిసంబంధం వచ్చింది. నాకు ఆ సంబంధం నచ్చలేదు. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతంగా ఆ సంబంధమే చేద్దామని ఇంట్లో అందరూ నిర్ణయించుకున్నారు. నేను బాబాకు నమస్కరించి, “బాబా! నాకు ఈ సంబంధం నచ్చలేదు. మీరే ఎలాగైనా ఈ సంబంధం కుదరకుండా చేయండి. నాకు ఇష్టమైన వ్యక్తితోనే నా వివాహం జరిగేలా ఆశీర్వదించండి” అని బాబాను వేడుకున్నాను. "నా కోరిక తీరిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. కోరుకున్న 24 గంటల్లోనే బాబా ఆ సంబంధం కుదరకుండా ఉండేలా చేశారు. నా కోరిక తీర్చినందుకు ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఓం సాయిరాం!



5 comments:

  1. Om sai ram sada mamalini kapadu thandri

    ReplyDelete
  2. ” ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo