సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

జి.కె.రేగే



సాయిభక్తుడు జి.కె.రేగే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నివాసస్థుడు. అతను తాశీల్దారుగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936లో శ్రీ బి.వి.నరసింహస్వామిగారితో ఈ విధంగా పంచుకున్నాడు:

1912వ సంవత్సరంలో నేను తుంటినొప్పితో బాధపడుతుండేవాడిని. ఆ నొప్పికి తోడు తీవ్రమైన జ్వరం కూడా రావడం వలన నాకు సరిపడా నిద్ర ఉండేది కాదు. దాంతో నేను హార్దా సమీపంలోని గిగ్గావ్‌లో ఉన్న మా మామగారైన నారాయణరావు పరూల్కర్ దగ్గరకు వెళ్ళాను. అతను సాయిబాబాకు అంకిత భక్తుడు. అతను తన వద్ద ఉన్న సాయిబాబా ఊదీ నా నుదుటి మీద రాశాడు. అదేరోజు మధ్యాహ్నం నేను మంచం మీద పడుకొని ఉండగా, సుమారు రెండు గంటల సమయంలో కాషాయవస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, "బిడ్డా! భయపడవద్దు. నీ జబ్బు మూడురోజులలో నయమవుతుంది" అని అన్నాడు. వెంటనే నేను ‘నా ముందు ఒక సన్యాసి నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని’ మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు ఆ సన్యాసిని చూడాలని వచ్చేలోపు ఆ సన్యాసి అదృశ్యమయ్యాడు. “ఆ సన్యాసి మరెవరో కాదు, ఖచ్చితంగా సాయిబాబానే!” అని మా మామగారు అన్నారు. నేను ఆశ్చర్యపోయేలా ఆ సన్యాసి చెప్పినట్లే సరిగ్గా మూడవరోజుకి నా నొప్పి మాయమైపోయి నాకు స్వస్థత చేకూరినట్లు అనిపించింది. వారంరోజులలో పూర్తిగా కోలుకున్నాను‌. మా మామగారు నన్ను శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోమని చెప్పారు. కానీ నేను రెండు సంవత్సరాల వరకు శిరిడీ వెళ్ళలేకపోయాను.

1914లో నేను నా మూడవ కూతురి వివాహం మాండ్వాలో జరిపించడానికి సెలవుపెట్టాను. ఆ వివాహానికి ఆహ్వానిస్తూ ఒక శుభలేఖను సాయిబాబాకు పంపాము. "నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను" అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో పోస్టుమ్యాన్ సాయిబాబా వద్దనుండి వచ్చిన ఒక కవరు తీసుకొచ్చాడు. ఆ కవరులో ఊదీతోపాటు, దానిని వధూవరులకు పెట్టమన్న బాబా ఆదేశం ఉన్నాయి.

అదేరోజు ఒక ఫకీరు వచ్చి మా మామగారిని ఒక పైసా అడిగాడు. కానీ మా మామగారు ఆ ఫకీరుని నిర్లక్ష్యం చేసి, అవకాశాన్ని వినియోగించుకోలేదు. తరువాత మా మామగారు పశ్చాత్తాపం చెంది, ‘ఆ వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉండవచ్చ’ని నాతో చెప్పారు. అప్పుడు నేను మా మామగారితో, "ఆయన సాయిబాబానే అయితే మళ్ళీ రావాల"ని అన్నాను. ఆ మర్నాడు ఒక ఫకీరు నా దగ్గరకొచ్చి ఒక పైసా మాత్రమే అడిగారు. నేను సంతోషంగా వారికి పైసా సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా తీసుకొని, మా మామగారు విందారగించమని ఆహ్వానిస్తే నిరాకరించారు.

ఆ వివాహం జరిగిన తరువాత నేను శిరిడీ వెళ్ళాను. బాబా నన్ను చూస్తూనే, “ఎందుకింత ఆలస్యం?” అని అడిగారు. “నేనొక పేద గుమస్తాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత సులువుగా రాలేకపోయాన”ని బదులిచ్చాను. ఆయన నన్ను దక్షిణ అడిగారు. నేను ఐదు రూపాయలు సమర్పించాను. ఆయన మరో ఐదు రూపాయలు ఇవ్వమని పట్టుబట్టారు. ఆయనలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు కానీ, నేను మరో ఐదు రూపాయలు ఆయనకు సమర్పించాను. అప్పుడు బాబా, “ఇంతకన్నా ఎక్కువ నువ్వు నాకు బాకీపడలేదు” అన్నారు. 

నేను శిరిడీలో నాలుగురోజులు బస చేసిన తరువాత తిరిగి కాఠేగాఁవ్ లోని ఇంటికి చేరుకున్న తరువాతగానీ బాబా అదనంగా మరో ఐదు రూపాయలు ఎందుకు అడిగారో అర్థం కాలేదు. నా భార్య సంవత్సరం క్రిందట సాయిబాబాకు 5 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపింది. అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన ఆ మని ఆర్డర్ కూపన్‌లో, “ఈ మొత్తం మీ నుండి స్వయంగా తీసుకోబడుతుంది” అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా నన్ను ఐదు రూపాయలు అదనంగా అడిగారని గ్రహించాను.

ఒకసారి నాలుగు సంవత్సరాల వయస్సున్న నా చిన్నకుమార్తె ప్రేమాబాయి తీవ్రమైన జ్వరంతో బాధపడసాగింది. అది క్రమేణా ప్రమాదస్థితికి చేరుకుంది. తను బాగా కృశించిపోయి అస్థిపంజరంలా తయారైంది. వైద్యచికిత్సలు, మందులు ఏవీ పనిచేయలేదు. సాయిబాబా భక్తురాలైన నా భార్య సహాయం చేయమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. వెంటనే ఆమెకు, "నీ బిడ్డ కష్టాలన్నీ మూడవనాటికి తీసివేస్తాను" అన్న బాబా కంఠధ్వని స్పష్టంగా వినిపించింది. అయితే ఊహించని విధంగా మా బిడ్డ మూడవనాడు తల్లి ఒడిలో ప్రాణం విడిచింది. నేను మానస్‌లోని ఆఫీసులో ఉండగా, ‘వెంటనే ఇంటికి రమ్మ’ని నా భార్య ఒక వ్యక్తి ద్వారా కబురు పంపింది. నేను ఇంటికి వెళ్ల చూడగా నా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. నేను బిడ్డను నా ఒడిలోకి తీసుకుని, మేమెప్పుడూ మా పూజగదిలో ఉంచుకునే గంగాజలంతోపాటు, బాబా ఊదీని తన నోట్లో వేశాను. చిత్రంగా అవి బయటికి రాలేదు. దాంతో మరికొంత తీర్థాన్ని తన నోట్లో పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని గ్రహించాను. తరువాత మరికొంత బాబా ఊదీని, తీర్థాన్ని తనకి ఇచ్చాము. నెల రోజుల్లో తను పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడామె ఇండోర్‌లోని యల్.ఆర్.టి బోర్డింగ్ స్కూలులో సంరక్షుకురాలిగా పనిచేస్తోంది.

1924లో నా నాల్గవ కుమార్తె మీనాబాయికి వివాహం చేయదలచి సంబంధాలు వెతకనారంభించాను. కానీ సరియైన సంబంధం దొరకక చాలా కలతచెందాను. నేను అప్పటికే సెలవులో ఉన్నాను. నా భార్యను అంజన్‌గాఁవ్‌లో వున్న ఆమె సోదరుడి ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన రెండవరోజు నాకు, “జీరాపూర్ వెళ్ళు!” అని ఒక కంఠధ్వని వినిపించింది. నేను ఇండోర్ తిరిగి వచ్చి, 'జీరాపూర్ వెళ్ళమ'ని నా కొడుకుకి ఉత్తర్వులు వచ్చినట్లు తెలుసుకున్నాను. కానీ తన భార్య 9 నెలల గర్భవతిగా ఉన్నందువలన తను జీరాపూర్ వెళ్ళలేకపోయాడు. అందువల్ల పైఅధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తరువాత నన్ను నేమావర్ జిల్లాలోని కథేగాఁవ్‌కి బదిలీ చేసినట్లు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులు సంతకం కోసం రెవెన్యూ అధికారి వద్దకు వెళ్ళినప్పుడు, నా నుంచి ఎటువంటి అభ్యర్థనా లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. దాంతో నేను జీరాపూర్ వెళ్లి ఉద్యోగంలో చేరాను. విధులలో చేరిన పదిహేనురోజులలోపే నేను పర్యటిస్తూ సాయత్ అనే చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. నేను అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు తనతో బల్వంత్ అనే అందమైన, దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను అతని గురించి విచారించిన మీదట అతనే నా కుమార్తెకు సరైన వరుడిని భావించాను. తరువాత ఆ సంబంధం కుదుర్చుకుని నా కూతురి వివాహం జరిపించాను.

1926లో నా భార్య మరణించింది. ఆ తరువాత నా ఆరోగ్యం క్షీణించసాగింది. నా ఎదురుగా ఒక బాబా పటం ఉండేది. ఒకరోజు ఆ పటం నుండి, “ఇకపై ఉద్యోగం చేయవద్దు” అన్న కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా మూడురోజులు వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుగొనలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టరు పర్నేర్కర్ “ఆ కంఠధ్వని సాయిబాబాదై ఉంటుంద”ని చెప్పాడు. దాంతో నేను ఆ సంవత్సరమే ఉద్యోగ విరమణ చేసి, నెలవారీ పెన్షన్ తీసుకుంటున్నాను.

సమాప్తం.

(Source: Devotees' Experiences of Sri Sai Baba Part I, II and III by Sri.B.V.Narasimha Swamiji)

10 comments:

  1. 🙏🌹🙏ఓం సాయిరాం🙏🌹🙏
    🍎🍊🍎🍊🍎🌹🍎🍊🍎🌹🍎
    🙏🌹🙏ఓం సాయిరాం🙏🌹🙏
    🍎🍊🍎🍊🍎🌹🍎🍊🍎🌹🍎
    🙏🌹🙏ఓం సాయిరాం🙏🌹🙏
    🍎🍊🍎🍊🍎🌹🍎🍊🍎🌹🍎

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete
  4. Om srisairam om srisairam om srisairam thankyou sister.

    ReplyDelete
  5. Kothakonda SrinivasMay 15, 2021 at 7:06 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree sai Nadhaya Namaha 🕉🙏❤😊

    ReplyDelete
  7. ఓం సాయి రామ్ 🙏🏻🕉️

    ReplyDelete
  8. Jai sai naad maharaj ki🌺🌺🙏🙏

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo