సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 467వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • క్లిష్ట పరిస్థితిలో సహాయం చేసి బిడ్డకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 

మేము సౌదీలో నివాసముంటున్నాము. నా భర్త ఒక డాక్టర్. ఇటీవలే సౌదీ గవర్నమెంటు మాకు డాక్టర్ హౌసింగ్ బోర్డులో ఒక ఇంటిని ఎలాట్ చేసింది. 2020, మే 29న మేము ఆ ఇంటిలోకి మారాము. ఆ ఇంటిలో దిగిన మూడోరోజు అర్థరాత్రి ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న మా పాప నిద్రలేచి ఎత్తుకోమని బాగా ఏడ్చింది. తననెలాగో సముదాయించి నిద్రపుచ్చాను. మరుసటిరోజు రాత్రి 1:30కి లేచి ఒకటే ఏడుపు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను బాబాని తలచుకొని, పాపకి బాబా ఊదీ పెట్టి, మరికొంచెం ఊదీని నీళ్లలో కలిపి తనకు త్రాగించాను. తర్వాత తను హాయిగా నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం తను మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకలా ఏడుస్తోందా అని కాస్త పరీక్షగా చూస్తే, తన చేతులపై, మొహంపై ఎలర్జీ వలన వచ్చే దద్దుర్లు ఉన్నట్లు గుర్తించాను. 'కొత్తగా ఇల్లు మారాము కదా, బహుశా డస్ట్ ఎలర్జీ ఏమో!' అని అనుకున్నాను. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పిల్లల డాక్టరుకి ఫోన్ చేసి, పాపను తీసుకొని అతని వద్దకు వెళ్ళాము. డాక్టరు పరీక్షించి దద్దుర్ల కారణంగా తను రాత్రిళ్ళు ఏడుస్తోందని చెప్పి సిరప్, క్రీము ఇచ్చారు. వాటిని మూడురోజులు వాడినా పాప పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. దాంతో మరలా ఆ డాక్టరుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను డెర్మటాలజిస్ట్ (చర్మ వైద్యుడు)ని సంప్రదించమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం హాస్పిటల్స్ అన్నీ కరోనా పేషెంట్స్‌తో నిండి ఉన్నాయి. అటువంటి ఈ సమయంలో చిన్నపాపను తీసుకొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాలంటే నాకు చాలా భయమేసింది. పాపకి ఏమవుతుందో ఏమో అని దిగులుతో, "పాపకు ఎలర్జీ తగ్గేలా చూడమ"ని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను.

తరువాత తెలిసినవాళ్ళ ద్వారా ఒక డెర్మటాలజిస్ట్ భర్త నెంబర్ దొరికింది. వాళ్ళు మా పక్క అపార్టుమెంటులోనే ఉంటారు. అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాను. అతను తన భార్యతో మాట్లాడి చెప్తానని చెప్పారు. ఆలోగా నేను, "బాబా! హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటిలోనే పాపను చూసేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకున్నాను. తరువాత నేను మళ్ళీ ఫోన్ చేస్తే, "పాపకు ఎలర్జీ వచ్చిన ప్రదేశాన్ని ఫోటోలు తీసి పంపండి. నేను చూసి మెడిసిన్ చెబుతాను" అని అన్నారు. ఇంట్లో పాపను చూడొచ్చు కదా అని అడిగితే, "నేను కరోనా వార్డులో వర్క్ చేస్తున్నాను. అందుకే ఎవరినీ ఇంటికి రానివ్వట్లేదు" అని అన్నారు. అయితే మేము ఆ డాక్టరు చెప్పిన మందులు వాడకుండా,  దానికి సమానమైన మందులు ఇంట్లోనే ఉంటే వాటిని వాడాము. వారం రోజులు గడిచినా సమస్య  అలానే ఉంది. దాంతో మళ్ళీ డాక్టరుకి ఫోన్ చేస్తే, పాపని హాస్పిటల్‌కి తీసుకొని రమ్మన్నారు. ఆ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఉంటారని నాకు టెన్షన్ మొదలైంది.
  
మరుసటిరోజు ఉదయం అపాయింట్‌మెంట్ ఉందని హాస్పిటల్‌కి వెళ్లడానికి నా భర్త ఎనిమిది గంటల సమయంలో తయారవుతున్నారు. కానీ నా మనసంతా ఏదో ఆందోళనగా అనిపించి నా భర్తతో, "ఈ కరోనా టైములో డాక్టరు దగ్గరకు వద్దు, మరికొంత సమయం ఎదురు చూద్దామ"ని అన్నాను. అయితే మళ్ళీ వెంటనే తల్లిగా బిడ్డ పడుతున్న బాధను చూడలేక, "పాప చాలా ఇబ్బందిపడుతోంది. పాపని తీసుకొని డాక్టరు వద్దకు వెళ్ళండి" అని చెప్పాను. దాంతో నా భర్త పాపను తీసుకొని వెళ్లారు. డాక్టరు చూసి, "ఏదో పురుగు కుట్టింది. అందువల్లే ఈ సమస్య" అని చెప్పి మొదట ఫోన్లో చెప్పిన క్రీమ్, మందులు వాడమని, అదనంగా స్టెరాయిడ్ కూడా వ్రాశారు. నేను క్రీమ్ రాశాను కానీ, రెండు రోజులవరకు స్టెరాయిడ్ ఇవ్వలేదు. అప్పుడు నా భర్త, "స్టెరాయిడ్ ఎందుకు వాడట్లేదు?" అని అడిగేసరికి స్టెరాయిడ్ కూడా ఇచ్చాను. దాన్ని సిరంజీ లాంటి దానితో ఇవ్వడం వల్ల ఆ సిరప్ నేరుగా గొంతు లోపలికి వెళ్ళింది. దాంతో పాపకి వికారంగా అనిపించి వాంతి చేసుకోబోయింది. కానీ, వాంతి కాలేదు. రెండు సెకన్లలో తను స్పృహ కోల్పోతూ నా మీద వాలిపోయింది. పాపకు ఏమవుతుందో అన్న భయంతో నాకు కాళ్లుచేతులు ఆడలేదు. ఏమి చేస్తున్నానో ఏమిటో నాకే తెలియని స్థితిలో కంగారుగా బయటకు పరుగుతీశాను. మా అమ్మ, "బయట చాలా ఎండగా ఉంది. చెప్పులు వేసుకొని వెళ్ళు" అని అంటున్నా నాకు ఏమీ పట్టట్లేదు. పాపను ఎత్తుకొని పరుగుపరుగున మేము ఉంటున్న రెండవ అంతస్థు నుండి కిందకు వచ్చేసరికి పాప వాంతి చేసుకుంది. అప్పటికి తను స్పృహలో ఉండీలేనట్లు ఉంది. 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాళ్ళు కాలిపోతున్నా పాపని ఎత్తుకొని అలాగే పరుగుతీశాను. ఒక కారును ఆపి, "హెల్ప్ మి, సేవ్ ది చైల్డ్ (నాకు సహాయం చేయండి. బిడ్డని కాపాడండి)" అని అరిచాను. ఒకతను వచ్చి పాప వీపు మీద కొట్టాడు. పాప ఒక్కసారిగా ఏడ్చింది. అక్కడున్న వాళ్లంతా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళమని చెప్పి నాకు సహాయం చేశారు. ఈ సమయమంతా నేను, "బాబా! నా బిడ్డని కాపాడండి. తనకి ఏమీ కాకూడదు. మీ దయవలన నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని ఆర్తిగా వేడుకుంటూ ఉన్నాను. కొద్ది క్షణాల్లో నేను పాపను తీసుకొని హాస్పిటల్‌కి చేరుకున్నాను. అక్కడికి వెళ్ళాక మావారికి కాల్ చేస్తే వచ్చారు. డాక్టర్ పరీక్షించి, "కంగారుపడకండి. పాపకి ఏమి కాలేద"ని చెప్పిన మాటతో మనసు కుదుటపడి ఇంటికి వచ్చాము. అయితే పాపని హాస్పిటల్లో పడుకోబెట్టిన చోటే కరోనా పేషెంట్స్ ఉంటారని ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి చాలా ఆందోళనగా అనిపించి, "ఏ కష్టం రాకుండా కాపాడమ"ని బాబాకి చెప్పుకున్నాను. 

నేను మాములుగా చాలా భయస్థురాలిని. చిన్న చిన్న విషయాలకి కూడా భయపడుతూ ఆందోళన చెందుతుంటాను. అటువంటి నేను ఒంటరిగా పాపని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళానంటే నా భర్త ఆశ్చర్యపోయారు. "అంత ధైర్యం ఎక్కడిద"ని అడిగారు. అదంతా బాబా దయ. ఆయనే నాకు అంతటి శక్తినిచ్చారు. నా హృదయంలో ఆశీనులై నాకు తగిన సూచనలిస్తూ, సహాయం చేస్తూ నన్ను నడిపించారు. ఆయన కృపవలన నెలరోజులు వాడమన్న క్రీమ్‌ని కేవలం రెండు రోజులు వాడడంతోనే సమస్య సమసిపోయింది. ఇప్పుడు మా పాప ఆరోగ్యంగా ఉంది. డాక్టరు వారం తరువాత రమ్మన్నా మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. సమస్య మొదలైనప్పటినుండి చివరివరకు నేను చేసిన ప్రార్థనలకు బాబా కృప చూపించారు. అసలు డెర్మటాలజిస్ట్ ద్వారా బాబా ఫోన్లో చెప్పించిన మందులు ముందే వాడుంటే ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు. ఈ అనుభవం ద్వారా నేను తెలుసుకుంది ఏమిటంటే, బాబా మీద మనం పూర్తి విశ్వాసంతో, కాస్త సహనంగా ఉంటే అంతా బాబానే చూసుకుంటారని. అయినా బాబాని మించిన వైద్యుడెవరు? ఊదీని మించిన ఔషధం ఏది? "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉంటూ నన్ను నడిపించండి. మా కుటుంబానికి సదా మీ ఆశీస్సులు అందజేయండి బాబా!"


4 comments:

  1. 🙏🌹🙏సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం🙏🌹🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏🌹

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo