సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1228వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇష్టాన్ని నెరవేర్చే బాబా
2. పోయిన డాక్యుమెంట్స్ తిరిగి దొరికేలా చేసిన బాబా
3. కోరుకున్నట్లే రెండు రోజుల్లో నీరసాన్ని తొలగించిన బాబా

ఇష్టాన్ని నెరవేర్చే బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నాపేరు జానూబీ. మాది హైదరాబాద్. నా పేరును బట్టి మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను నేను 'ముస్లిం' అని. నేను బాబా బాబా భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనిపించి ఇలా మీ ముందుకు వచ్చాను. కానీ ఏమని చెప్పమంటారు ఆయన లీలలు? ఎన్ని చెప్పినా వాటికి అంతమంటూ ఉండదు. ప్రతిరోజూ ఏదో ఒక లీల జరుగుతూనే ఉంటుంది. నాకు బాబా అంటే, బాబాను సేవించుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. నా ఇష్టానికి తగట్టు బాబా దాదాపు ఒక సంవత్సరం పాటు తమను సేవించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. స్వయంగా నాచేతులతో బాబాకి నాలుగు హారతులివ్వడం, స్వయంగా వంట వండి బాబాకి నైవేద్యం పెట్టడం, సదా బాబా నామం చేయడం వంటి సేవలతో ఒకటికాదు, రెండుకాదు చాలా నెలలపాటు బాబా సేవ చేసుకున్నాను. అయితే కొంతకాలం బాబా నామం, హారతులు చేయడానికి వెళ్ళలేకపోయాను. మనస్సులో మాత్రం ఎప్పుడూ బాబా సన్నిధిలో ఉంటూ నామం చేయాలి, సేవ చేయాలి అని ఒకటే ఆశగా ఉండేది. ఆ కోరికను బాబా అత్యంత అద్భుతంగా తీర్చారు. అదెలా అంటే, ప్రస్తుతం నేను పవిత్ర క్షేత్రమైన గాణుగాపురంలోని బాబా గుడిలో ఆయన నామం చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ నామం చేయడం కోసం నా కుటుంబానికి మూడునెలలు దూరంగా ఉండవలసి వచ్చింది. నేను మావారితో, పిల్లలతో "నాకు బాబా అంటే ప్రాణం. ఆయన సేవంటే, నామమంటే ఇష్టం. ఎప్పుడు పోతామో తెలియని జీవితాలు మనవి. ఉన్న ఈ కాస్త సమయంలో నేను బాబాకి సేవ, నామం చేసుకోవాలి. అప్పుడే నా ఈ జన్మ సార్ధకమౌతుంది. లేకపోతే నా జన్మ వ్యర్థమే" అని చెప్పాను. అందుకు వాళ్ళు, "అన్ని నెలలంటే ఎలా? వారం, పదిరోజులంటే పరవాలేదుగానీ" అని మొదట కొంత వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, నా ఇష్టాన్ని, నా బాధని అర్దం చేసుకుని ఒప్పుకున్నారు. అంతే, నేను బాబాపై భారమేసి నా కుటుంబాన్ని ఆయన పాదాలచెంత ఉంచి బాబా దగ్గరకు వచ్చేశాను. కానీ మొదట్లో 'మావారికి నన్ను పంపడం అంతగా ఇష్టం లేదు కదా, మధ్యలో ఫోన్ చేసి రమ్మంటారేమో, కోప్పడతారేమో' అనే ఒక భయం ఉండేది. కానీ బాబా మావాళ్ళను ఎంతలా మార్చారంటే, నేను ఫోన్ చేస్తే, "వస్తావా, కనీసం నెలకొకసారైనా వస్తానని చెప్పావుకదా వస్తున్నావా" అని కూడా అడగటం లేదు. "అక్కడ ఎలా ఉంది? బాబా ఏమంటున్నారు? మేము బాగానే ఉన్నాము. నువ్వు ఎలా ఉన్నావ"ని అడగటం తప్ప నన్ను రమ్మని అస్సలు అనడం లేదు. అలా ఇప్పటివరకు 'ఎప్పుడు వస్తావ'న్న మాటనే మావాళ్ళ నోటి నుండి రానివ్వలేదు బాబా. మావారు నన్ను ఒక్క మాట కూడా అనకుండా చేసారు బాబా. ఆ తండ్రి చేయలేనిదంటూ ఏదీలేదు.
 
ఇకపోతే బాబా నామం చేసినందుకుగాను ఇక్కడి మందిరం వాళ్ళు కొంత డబ్బు ఇస్తామని ముందే చెప్పారు. అయితే నేను ఇంతఅంత కావాలని అడగలేదు. అసలు నేను డబ్బులకోసం వెళ్ళలేదు. సరే, ఇస్తామన్నారు కాబట్టి ఆ తండ్రి తమ బిడ్డకి ఎంత ఇచ్చినా అదే నా భాగ్యం, సంతోషం అనే భావంతో వెళ్ళాను. ఒక గురువారం నాడు నేను నామం చేస్తుండగా 10.35కి అక్కడున్న పెద్దాయన నన్ను రమ్మంటున్నారని ఒక సాయి బంధువు వచ్చి చెపితే, వెళ్ళాను. ఆయన తమ చేతిలో పదిరూపాయల నోట్లు, ఐదు వందల నోటు పట్టుకుని ముందుగా నాకు రెండు రూపాయలు, తరువాత ఐదువందల నోటు, ఆపై పదిరూపాయల నోట్లు ఇచ్చారు. నేను వాటిని నా తండ్రి బాబా తమ స్వహస్తాలతో నాకు ఇచ్చినట్టుగా భావించాను. ఏమని చెప్పమంటారు? నా ఆనందానికి అవధులులేవు, ప్రపంచాన్ని ఏలినట్లుగా సంతోషపడిపోయాను. నాకు ఆ డబ్బులు ఇవ్వగానే లెక్క పెట్టుకోకుండా, "బాబా! నీ బిడ్డకి మీరు ఎంత ఇచ్చారు అనేది ప్రశ్నే కాదు. మీరు ఎంత ఇచ్చినా నాకు సంతోషమే. అవి రూపాయలే కానివ్వండి, వందలే కానివ్వండి. ఈరోజు మీరు ఇచ్చిన దానికి భవిష్యత్తులో ఎన్నోరెట్లు అధికంగా ఇస్తారనే నమ్మకంతో ఉంటానుగానీ తక్కువ ఇచ్చారని బాధపడను తండ్రి" అని చెపుకుని నామం అయిపోయాక డబ్బులు లెక్కపెట్టుకున్నాను. అవి 1+1=2, 500, 10×4=40 రూపాయలుగా ఉన్నాయి. ఇలా ఇవ్వడంలో బాబా ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే, నా మనస్సుకి మొదటి రెండు రూపాయలు శ్రద్ధ, సబూరీలకు, తరువాత ఇచ్చిన 540 (5+4+0 = 9) నవవిద భక్తికి సంకేతంగా అనిపించింది. బాబా తమ భక్తుల మనస్సులో మెదిలే ప్రతి ఆలోచనను, బాధను, కోరికను తెలుసుకుని నెరవేరుస్తూ ఉంటారు. ఆయన దయవల్ల నేను వారి సన్నిధిలో ప్రశాంతంగా నామం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాను. ఆయన ప్రతిక్షణం నా ప్రతి అవసరం తీరుస్తూ నీకు నేనున్నానని తెలియజేస్తున్నారు. బాబా లేకపోతే ఈరోజు నేను, నా కుటుంబం ఉండేదేకాదు. నాదృష్టిలో అల్లానే బాబా. బాబానే అల్లా. నా ప్రాణమున్నంత వరకు ఆ తండ్రిని నా చెంతనే ఉండమని వేడుకుంటున్నాను.

ధన్యోస్మి సాయిప్రభో!!!

పోయిన డాక్యుమెంట్స్ తిరిగి దొరికేలా చేసిన బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నకి, బృందానికి కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. మేము బెంగుళూరులో ఉంటాము. నేను ఇప్పుడు మీ అందరితో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం పంచుకోవాలనుకుంటున్నాను. నా భర్త హైదరాబాదులో రెండు ఇండ్లు కొన్నారు. వాటి డాక్యుమెంట్స్ అన్నీ మా మామయ్యగారి దగ్గరే ఉండేవి. ఒక ఇంట్లో మా అత్తయ్య, మామయ్య ఉండేవాళ్ళు. ఇంకో ఇల్లు అద్దెకి ఇచ్చాము. ఆ ఇంటి వ్యవహారాలన్నీ మామయ్య చూసుకునేవారు. ఇక మామయ్య లేకపోవడంతో అద్దెకిచ్చిన ఇల్లు చూసుకోవడం కష్టమని అమ్మేద్దామని అనుకున్నాం. ఆ ఇంట్లో అద్దెకి ఉంటున్న వాళ్లే ఆ ఇంటిని కొనుక్కుంటామంటే మేము సరేనని ఒప్పుకున్నాము. వాళ్ళు కొంచం కొంచంగా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. మేము వాళ్లతో రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇవ్వండని చెప్పినప్పటికీ వాళ్ళు పర్వాలేదని ఆన్లైన్‍లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తూండేవాళ్లు. తీరా మేము హైదరాబాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ చేద్దామనుకునేసరికి ఆ ఇంటి డాక్యుమెంట్స్ కనపడలేదు. మా మామయ్యగారు వాటిని ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియక చాలా వెతికాము కానీ, అవి దొరకలేదు. బాబా ఎలాగైనా వాటిని దొరికేలా చేస్తారని నాకు ఆయనపై పూర్తి నమ్మకం ఉండేది. ఆ ఇంటిని తీసుకుంటామన్న వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. వాళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చేసారు, మనం ఒరిజినల్స్ ఇవ్వలేక పోతున్నామని నాకు ఎలాగో ఉండేది. "బాబా! ఎలాగైనా డాక్యుమెంట్లు కనిపించేలా చూడు స్వామి" అని బాబాని వేడుకున్నాను. వాళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. మేము డాక్యుమెంట్లు వెతుకుతున్నాము, దొరికితే తప్పక ఇస్తామని చెప్పాము. వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకుని సరే అన్నారు. 2022, జూన్ 9 గురువారం పూజ పూర్తయ్యాక కొన్ని వస్తువులను బయటికి తీశాను. వాటిని వేరే చోట పెడదామని ఒక అలమరా నీటుగా సర్డుతుంటే హఠాత్తుగా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు కనిపించాయి. వెంటనే పూజా మందిరంకి వెళ్ళి బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. అలాగే బాబాకి మాటిచ్చిన ప్రకారం ఈ అనుభవం మీతో పంచుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా".

కోరుకున్నట్లే రెండు రోజుల్లో నీరసాన్ని తొలగించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు యశోద. మాది అనంతపురం. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన నాలుగు అనుభవాలు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవం పంచుకోవాలని మరోసారి మీ ముందుకు వచ్చాను. 2022, మే నెల చివరి వారంలో నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళ్ళితే, "బ్లడ్‍లో ఆరు ఉండాల్సిన ఇన్ఫెక్షన్ 52 వరకు ఉంద"ని చెప్పి చాలా పవర్‍ఫుల్ మెడిసిన్స్ ఇచ్చినా కంట్రోల్ కాలేదు. నేను చాలా భయపడి బాబా మీద భారం వేసి బెంగుళూరుకు వెళ్లి, మొత్తం బాడీ చెకప్ చేయించుకుంటే లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. నేను వెంటనే పల్మనాలజిస్ట్ దగ్గరకి వెళ్లాను. ఆయన కూడా ఇన్ఫెక్షన్ చాలా ఉందని చెప్పి మందులు ఇచ్చారు. ఆరోగ్యం చేకూరిందికానీ నేను చాలా బలహీనంగా అయ్యాను. ఆకలి తగ్గిపోయింది, జీర్ణం అయ్యేది లేదు. మా అమ్మాయి వచ్చి నన్ను హైదరాబాదుకు తీసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కూడా నేను కోలుకోలేదు. ఇలా ఉండగా ఒక గురువారం నాడు నేను, మా అమ్మాయి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళాము. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయతో నేను రెండు రోజుల్లో కోలుకుంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా రెండు రోజుల్లో నీరసాన్ని తొలగించి నాకు శక్తిని ప్రసాదించారు. ఇప్పుడు నేను బాగా తింటూ బాబా దయవలన కోలుకుంటున్నాను. బాబాకు చెప్పుకున్న విధంగా నా అనుభవం మీతో పంచుకున్నాను. కానీ కొద్దిగా ఆలస్యమైనందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. బాబా నాకు ఇంకా చాలా అనుభవాలు ప్రసాదించారు. ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను అని మాట ఇస్తున్నాను. చివరిగా ఈ అవకాశాన్నిస్తున్న బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు.

ఓం శ్రీసాయినాథాయ నమః!!!

4 comments:

  1. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo