సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1247వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తమ భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ అవసరమైనది చేస్తుంటారు
2. బాబా చేసిన అద్భుతంతో బి.ఇ.డి సీట్

బాబా తమ భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ అవసరమైనది చేస్తుంటారు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నాపేరు మహేష్. నేను సిద్ధిపేట జిల్లా వాసిని. నాకు ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు అంటే చాలా చాలా చాలా ఇష్టం. మన ఈ బ్లాగు ద్వారా నేను శ్రీసాయిబాబాకు చాలా దగ్గర అవుతున్నాను. ఇందులో పంచుకుంటానని మ్రొక్కుకుంటే నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇదివరకు నేను చాలా అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. చివరిగా పంచుకున్న అనుభవంలో బాబా దయవలన జరిగిన శ్రీశైలం, తిరుపతి యాత్రల గురించి పంచుకున్నాను. అందులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వలన నాకు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కాలేదని, నేను చాలా ఏడ్చానని చెప్పాను. ఆ తరువాత నా మనసుకి, 'ఇక్కడ నాకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కనందుకు స్వప్నంలోనైనా వారి దర్శనం లభించాలి' అని అనుకున్నాను. అందుకోసం శ్రీవేంకటాచల మహత్మ్యం చదవాలని నాకు అనిపించింది. కాని ఆ రాత్రి నేను ఆ బుక్ తీసుకుందామని వెళ్లేసరికి టీటీడి వారి బుక్ స్టాల్ మూసేసి ఉంది. అందువల్ల నాకు ఆ బుక్ లభ్యం కాలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక కనీసం శ్రీవేంకటాచల మహత్మ్యం శ్రవణం(వినటం) చేద్దామని శ్రీచాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన శ్రీవేంకటాచల మహత్మ్యం రోజుకి రెండు గంటలు చొప్పున 4 రోజులు విన్నాను. సోమవారంనాడు చివరిరోజు శ్రవణం పూర్తయింది. నేను శ్రీవారి దర్శనం గురించి మర్చిపోయాను. ఐదు రోజుల తరువాత 2022, జూన్ 18, శనివారం రోజున నేను మామూలుగానే పూజ చేసుకుని, రోజూ మాదిరిగానే శ్రీసాయిబాబాను స్మరించుకుని రాత్రి నిద్రపోయాను. తెల్లవారుఝామున 3 గంటలకు నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనమైంది. శ్రీవారి నిలువెత్తు మూల విరాట్ యొక్క ముఖం చాలా చక్కగా కనిపించింది. నేను గోవింద నామస్మరణ పెద్దగా చేస్తున్నాను. తోటి భక్తులు కూడా నాకు కోరస్‍గా గోవింద నామస్మరణ చేస్తున్నారు. అర్చకులు స్వామికి హారతి ఇచ్చి, ఆ హారతి మాకు చూపించిగా మేము గోవింద నామస్మరణ చేస్తూ హారతికి దండం పెట్టుకున్నాము. ఆలయ ప్రాంగణం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. త్రోపులాట జరిగి నేను ఒక్కసారిగా స్వామివారి గర్భగుడి గడప దగ్గరకి తోసివేయబడ్డాను. వెంటనే నేను ఆ గడపకి చేతులు ఆనించి నమస్కారం చేసుకున్నాను. వెంటనే నేను వెనక్కు లాగబడ్డాను. అంత దగ్గరగా స్వామిని దర్శించాక నాకు ఒక లాకెట్ కనిపించింది. ఆ లాకెట్‍లో సగం వరకు శ్రీసాయిబాబా, మరో సగం శ్రీవేంకటేశ్వరస్వామి ఉన్నారు. అంతటితో నాకు మెలకువ వచ్చింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. శ్రీసాయిబాబా దయవలననే నాకు శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం అయ్యిందని నా నమ్మకం. ఆ వెంకటేశ్వరుడు మన సాయి ఒక్కరే.


ఈమధ్య మా పొలం దగ్గర జెసిబి వర్క్ ఉండి పని ప్రారంభించాము. కొద్దిసేపటికి వర్షం కురవడంతో పని మధ్యలో ఆగిపోయింది. మరుసటిరోజు జెసిబి అతన్ని రమ్మని ఫోన్ చేస్తే, వస్తానన్నాడు కాని రాలేదు. ఆ మరుసటిరోజు అలాగే చెప్పి రాలేదు. మళ్ళీ ఇంకోరోజు రమ్మంటే, "డీజిల్ లేదు, రాను. ముందే డబ్బులిస్తే వస్తాన"ని చెప్పి ఫోన్ కట్ చేసాడు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు కూడా. మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను అప్పుడు, "బాబా! జేసీబీ అతన్ని రప్పించి పని మొత్తం పూర్తి చేయించినట్లైతే నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తెల్లవారితే గురువారం(2022, జూన్ 23). ఈరోజు ఖచ్చితంగా బాబా పని పూర్తి చేయిస్తారని నమ్మకంతో ఉన్నాను. కొద్దిసేపు తరువాత ఆ జేసీబీ అతనికి ఫోన్ చేస్తే, వచ్చి పని పూర్తి చేశాడు. కాదు కాదు బాబానే పని పూర్తి చేయించారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా".


మా అన్నయ్య మా గ్రామంలోని ఒక వ్యక్తి దగ్గర నెల నెల చీటీలు వేస్తున్నాడు. అతను అన్నయ్యకి ఇవ్వవలసిన చిట్టీ డబ్బులు 'ఇస్తా, ఇస్తా' అంటూ జనవరి నుండి మే వరకు  వాయిదా వేస్తూ వచ్చాడు. జూన్‍లో ఒకరోజు అడిగితే, "రేపు ఇస్తాను" అన్నాడు. సరేనని, మరుసటిరోజు ఫోన్ చేస్తే, ఆ టైమ్‍కి ఇస్తా, ఈ టైమ్‍కి ఇస్తా అంటూ ఫోన్ కట్ చేస్తూ వచ్చాడు. దాంతో అన్నయ్య, నేను చాలా బాధపడ్డాము. అప్పటివరకు నేను బాబాతో చెప్పుకోలేదు. ఇంకా అప్పుడు అన్నయ్యతో, "సాయిబాబాకి మ్రొక్కుకో" అని చెప్పాను. నేను కూడా, "చిట్టీ డబ్బులు వస్తే, ఈ అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత నేను, "అన్నయ్యా! రేపు గురువారం కదా, రేపే డబ్బులు వస్తాయి కావొచ్చు" అని అన్నయ్యతో చెప్పాను. మరుసటిరోజు 2022, జూన్ 23, గురువారం సాయంత్రం ఆ చిట్టీ వ్యాపారి అన్నయ్యకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు. బాబానే అతను డబ్బులు ఇచ్చేలా చేశారు. అన్నయ్య నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పగానే నేను చాలా ఆనందించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.


నేను ఈమధ్య ఒకరోజు మా అమ్మ పొలం దగ్గరకి వెళ్లి చీకటిపడ్డాక ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్నాను. నా దగ్గర మొబైల్ ఉంది, కాని టార్చ్ లైట్ ఆన్ చెయ్యలేదు. కొద్ది దూరం వచ్చాక నా పాదం వెనుక భాగంలో ఏదో తాకినట్టు అనిపించింది. నేను అది కప్ప కావొచ్చు అనుకుని, 'అయ్యో పాపం చూసుకోకుండా కప్పను తొక్కేసినట్లున్నాను' అనుకున్నాను. ఇంకా దానికి ఏమైందోనని మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే, అది కప్ప కాదు, పెద్ద నల్ల తేలు. నేను ఒక్కసారిగా చాలా భయపడిపోయాను. అది నన్ను కరిచిందేమో అని ఆందోళన చెందాను. ఎందుకంటే, తేలు దగ్గరకి వెళ్ళగానే అది కరుస్తుంది, అది దాని సహజ స్వభావం. అయితే ఆ తేలు నా పాదానికి తగిలినప్పటికీ అది నన్ను కరువలేదు. ఇంకో విషయం, ఆ తేలు నా పాదానికి తాకిన సమయంలో నేను బాబా పాటలు వింటూ, వారి గురించే ఆలోచిస్తూ నడుస్తున్నాను. బాబానే ఆ తేలు నన్ను కరవకుండా కాపాడారు. నేను ఇంటికి వచ్చిన వెంటనే వాట్సాప్‍లో మన 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపు ఓపెన్ చేస్తే ఈ క్రింది మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను.


ఈవిధంగా నా సాయినాథుడు సమస్య వస్తే, వెంటనే పరిష్కరించి మనల్ని రక్షిస్తున్నారు. ఆయన తమ భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటారనడానికి నిదర్శనమే ఈ అనుభవం. మనం ఒక్కసారి బాబా పాదాలను ఆశ్రయిస్తే, మన పనులన్నీ సూత్రధారియై బాబానే నడిపిస్తారు. మనం బాబా చెప్పిన విధంగా శ్రద్ద, సబూరీలతో వారి నామస్మరణ చేస్తుంటే, ఆయన మన జీవిత నౌకను గమ్యానికి చేర్చి, మనల్ని తమ ఒడిలోకి చేర్చుకుంటారు. అంతా సాయిమయం.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబా చేసిన అద్భుతంతో బి.ఇ.డి సీట్


నా పేరు ఇందిర. నేను హైదరాబాద్ నివాసిని. నేను 1994లో బి.ఇ.డి కౌన్సిలింగ్‍కి వెళ్ళాను. కానీ సీట్లన్నీ నిండిపోయిన కారణంగా నాకు సీటు రాలేదు. తరువాత నేను అనుకోకుండా దిల్‌షుఖ్‌నగర్‌లోని బాబా గుడికి వెళ్లి, బాబాను దర్శించి, "నాకు తెలీదు బాబా, ఎలాగైనా నాకు బి.ఇ.డి సీటు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. అద్భుతం! వారం రోజుల తర్వాత నాకు బి.ఇ.డి కౌన్సిలింగ్‍కి మళ్ళీ కాల్ లెటర్ వచ్చింది. విషయమేమిటంటే, అన్ని కళాశాలల్లో బి.ఇ.డి సీట్లు పెంచారు. ఇదెలా  సాధ్యమని నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. బాబా దయతో నాకు సీటు వచ్చింది. బి.ఇ.డి శిక్షణ పూర్తయిన తర్వాత డి.ఎస్.సి నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ పరీక్ష వ్రాసాను. 1997లో బాబా కరుణ వల్ల నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ నేను ఆ ఉద్యోగం సంతోషంగా చేసుకుంటున్నాను. బాబా దయవల్ల నా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ నా వ్యక్తిగత జీవితంలో కొన్ని పరిస్థితులు బాగా లేకుండా పోయాయి. ఆ సమయంలో నేను మాయ వల్ల బాబాకి దూరమయ్యాను. తరువాత నేను నా తప్పులు తెలుసుకుని మళ్ళీ బాబాను ఆశ్రయించాను. "క్షమించండి బాబా. ఇక మీదట నేను ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టను. నాకు కొన్ని ఆశలు ఉన్నాయి బాబా. దయచేసి వాటిని నెరవేర్చండి బాబా".


5 comments:

  1. Om Sai Ram 🙏🏼🙏🏼🙏🏼

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo