సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1221వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎవరిని, ఎప్పుడు, ఎలా అనుగ్రహిస్తారో!
2. ఎటువంటి బాధైనా బాబా కృపతో మటుమాయం
3. బాబా దయతో మంచి మార్కులు - ఆరోగ్యం

బాబా ఎవరిని, ఎప్పుడు, ఎలా అనుగ్రహిస్తారో!


అందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు అరుణాదేవి. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా అక్కయ్య తన బంగారు చెవిపోగులు దాచిపెట్టమని మాకు తెచ్చి ఇచ్చింది. నేను వాటిని మా వస్తువులతో పాటుగా దాచిపెట్టి, తరువాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఒక సంవత్సరం తరువాత మా అక్క తన చెవిపోగులు తనకివ్వమని అడిగింది. నేను రోజూ మా బంగారం తీస్తూ, పెడుతున్నప్పటికీ అక్క చెవిపోగులు చూసినట్లు అనిపించక చాలా టెన్షన్ పడ్డాను. "బాబా! అక్క చెవిపోగులు కనిపించేలా చేయండి. అవి దొరికితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని జపించుకుంటూ వెళ్ళాను. బీరువా తెరిస్తే ఎదురుగానే అవి కనిపించాయి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, ఈ సంవత్సరకాలంలో అవి నాకు ఎప్పుడూ కనపడలేదు. అవి దొరకకుండా ఉండివుంటే మేము ఆ వస్తువులను తయారుచేయించి అక్కకి ఇవ్వాల్సి వచ్చేది. అలాంటిది, బాబా దయవలన ఆ చెవిపోగులు అక్కకి ఇవ్వగలిగాను. నిజంగా ఇది బాబా మహిమ. "ధన్యవాదాలు బాబా".


మేము గత నాలుగు సంవత్సరాలుగా శిరిడీ వెళ్ళాలనుకుంటూ ఉన్నప్పటికీ, ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకుందామనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉండేవాళ్ళము. చివరికి 2022లో ఏదేమైనా సరే శిరిడీ వెళ్లాల్సిందే అని, "బాబా! శిరిడీ దర్శనానికి మాకు అనుమతి ఇవ్వండి" అని బాబాను ప్రార్థించి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. ఏప్రిల్ 27న బాబా నడయాడిన పుణ్యభూమి శిరిడీకి ప్రయాణమని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అయితే అంతలోనే మళ్ళీ ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నుంచి పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేది కాస్తా ఈ సంవత్సరం మే 30 వరకు స్కూల్ ఉందని, 27న సెలవులకు అనుమతి ఇవ్వడం కుదరదని ఖచ్చితంగా చెప్పేశారు స్కూలువాళ్ళు. దాంతో మావారు టిక్కెట్లు క్యాన్సిల్ చేయమని తన ఫ్రెండ్‍కి చెప్పేశారు. ఇంక నాకు ఏడుపు ఆగలేదు. ఆరోజు మధ్యాహ్నం బాబా దగ్గరకు వెళ్లి, "ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు? నన్ను ఎందుకు శిరిడీకి రానివ్వడం లేదు" అని బాగా ఏడ్చేశాను. మావారు కూడా చాలా బాధపడ్డారు. రాత్రి 8 గంటలకు మళ్ళీ టిక్కెట్లు బుక్ చేద్దామని చూస్తే, జూన్, జూలై నెలల్లో వెయిటింగ్ లిస్టు కూడా అందుబాటులో లేదు. అప్పుడు అనవసరంగా టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకున్నామని బాధపడి చివరికి మా పిల్లలిద్దరినీ మా తమ్ముడి వద్ద ఉంచి, జనరల్‍లో అయినా శిరిడీ వెళ్ళొద్దామని నిర్ణయించుకున్నాం. హఠాత్తుగా, 'ఎందుకైనా మంచిది, ఒకసారి టికెట్లు క్యాన్సిల్ అయిందీ, లేనిదీ కనుక్కుని చూద్దామ'ని మావారి ఫ్రెండ్‍కి కాల్ చేస్తే, "ఇంకా క్యాన్సిల్ చేయలేద"ని చెప్పారు. అది విని మాకు ప్రాణం లేచి వచ్చింది. అప్పుడు 3 టిక్కెట్లు ఉంచి, రెండు టిక్కెట్లు కాన్సిల్ చేయమని చెప్పాము. తరువాత మా అమ్మ నాకు ఫోన్ చేస్తే, "పిల్లలకి సెలవు ఇవ్వమన్నారు, కాబట్టి నేను, మావారు, అత్తగారు మాత్రమే శిరిడీ వెళ్తున్నాం" అని చెప్పాను. అప్పుడు అమ్మ, "మరి ఆ రెండు టిక్కెట్లు ఉన్నాయి కదా!" అని అనింది. నేను వాటిని, "క్యాన్సిల్ చేయమన్నాము" అని చెప్పాను. దానికి అమ్మ, "అయ్యో! అవునా?" అని నిట్టూర్పుగా అంది. నేను, "ఏమైంది? అయినా నువ్వు రావు కాదమ్మా" అని అన్నాను. అప్పుడు, "టిక్కెట్ ఉంటే వద్దామనుకున్నాను" అని అమ్మ చెప్పింది. నేను, "ముందే చెప్పొచ్చు కదా అమ్మా, క్యాన్సిల్ చేయమన్నాము. చేశారో, లేదో తెలియదు. కనుక్కుని చెబుతాను" అని అన్నాను. తరువాత విచారిస్తే, వాళ్ళు ఇంకా టిక్కెట్లు క్యాన్సిల్ చేయలేదని తెలిసింది. వెంటనే అమ్మతో, "వాళ్ళు టికెట్లు క్యాన్సిల్ చేయలేదు. కాబట్టి టికెట్ ఉంది. నువ్వు సిద్ధంగా ఉండు, శిరిడీ వెళదాం" అని చెప్పాను. తరువాత మేము ఆనందంగా శిరిడీ చేరుకున్నాము. శిరిడీలోకి ప్రవేశించినంతనే నా ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏదో తెలియని సంతోషం, ఆనందం మాటల్లో చెప్పలేను. బాబా దర్శనం చేసుకుని రూమ్‍కి వచ్చి మాట్లాడుకుంటూ మాటల్లో నేను అమ్మతో, "మేము 4 సంత్సరాల నుండి ప్రయత్నిస్తే ఇప్పటికీ మాకు అనుమతి లభించింది. అలాంటిది నువ్వు అప్పటికప్పుడు అనుకుని శిరిడీ వచ్చేసావు" అని అన్నాను. అప్పుడు అమ్మ, నేను మనసులో, "'బాబా! ఒకవేళ టికెట్లు ఏమైనా క్యాన్సిల్ అయినట్లయితే ఆ స్థానంలో నన్ను శిరిడీకి రప్పించుకోండి' అని అనుకున్నాను. సాయి నా ప్రార్థన విన్నారు" అని చెప్పింది. అది విని మేము ఆశ్చర్యపోయాము. ఎందుకంటే, మా అమ్మ చర్చికి వెళ్తుంది. నేను మొదట తనతో, "మేము శిరిడీ వెళ్తున్నాం, టిక్కెట్లు బుక్ చేసుకున్నాం" అని చెప్తే, "సరే, వెళ్లి రండి" అని అంది. అప్పటికే తనకి శిరిడీకి రావాలని ఉన్నప్పటికీ నాతో మాత్రం ఏమీ అనలేదు. కానీ, బాబాతో చెప్పుకుంది. బాబా ఆమె కోరికను మన్నించి శిరిడీకి రప్పించుకున్నారు. బాబా ఎవరిని, ఎప్పుడు, ఎలా అనుగ్రహిస్తారో ఎవ్వరికీ తెలియదు. నేను అమ్మతో బాబా నాపై చూపే ప్రతి అనుగ్రహాన్ని చెబుతూ ఉంటాను. ఆమె, "నీ సాయి ఎల్లప్పుడూ నీకు తోడు ఉండి మిమ్మల్ని కాపాడుతాడు" అని అంటూ ఉంటుంది. అంటే సాయి మీద ఆమెకు నమ్మకం నెమ్మదిగా కుదిరిందన్న మాట. ఇకపోతే, బాబా నాలుగు రోజులు చాలా దగ్గరనుండి తమను దర్శించుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా శిరిడీ ప్రయాణాన్ని పూర్తి చేయించారు. "ధన్యవాదాలు సాయీ! మీరు నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న కూడా ఒక్కోసారి మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాను. నన్ను క్షమించండి బాబా. మీ మీద భక్తి, విశ్వాసాలు తగ్గకుండా ఉండేలా చూడండి సాయి. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి సాయి". 


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఎటువంటి బాధైనా బాబా కృపతో మటుమాయం


నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాదు నివాసిని. ముందుగా మన గురువు సచ్చిదానంద సద్గురు సాయినాథునికి నా పాదాభివందనాలు. సాయి భక్తులందరికీ మరియు ప్రతిరోజూ సాయి భక్తుల అనుభవాలను ప్రచురిస్తూ బ్లాగును ఇంత చక్కగా నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేను ప్రతిరోజూ బాబా భక్తుల అనుభవాలు చదువుతాను. మన తండ్రి అయిన ఆ పావనమూర్తి సాయినాథుడు దయతో మనకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవడంలో ఎంతో అనుభూతి ఉంది. ఒకరికి కలిగిన అనుభవం మరొకరికి తమ అనుభవాన్ని గుర్తుచేసి ఎంతో మధురానుభూతినిస్తుంది. నేను కూడా ఇంతకుముందు నా అనుభవాలు చాలా పంచుకున్నాను. ఇక నా ప్రస్తుత అనుభవాల విషయానికి వస్తే...


ఈ మధ్య నేను ఒక మూడు ప్లాస్టిక్ బ్యాగులను లాగుతుంటే నా మధ్య వేలు కీలు దగ్గర పట్టుకుంది. అది కాస్త సాయంత్రానికి వాపు వచ్చి, నొప్పి పెట్టసాగింది. నేను బాబా ఊదీ వేలికి రాసుకొని, "వాపు, నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆ బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల కొంతవరకు నొప్పి తగ్గింది. కానీ పూర్తిగా తగ్గక అప్పుడప్పుడు నొప్పి అనిపిస్తుంది. అది కూడా పూర్తిగా తగ్గేలా చేయమని ఆ సాయినాథుని వేడుకుంటున్నాను.


ఒక గురువారం నాడు నా గుండె దగ్గర బాగా నొప్పి వచ్చింది. అలాగే నేను బాబా మందిరానికి వెళ్ళాను. బాబా దయవల్ల అక్కడికి వెళ్ళాక నొప్పి తగ్గిపోయింది. అలాగే ఇంకోసారి భుజం నొప్పి వస్తే బాబా ఊదీ రాసుకున్నాను. అలా వారం రోజులు చేసాక నొప్పి తగ్గిపోయింది.


2022, మార్చి 5న నాకు పంటినొప్పి బాగా ఎక్కువగా వచ్చింది. నేను ఆ నొప్పిని భరించలేక పంటిపై బాబా ఊదీ పెట్టుకున్నాను. కానీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని ఊదీ నోట్లో వేసుకొని, మరికొంత ఊదీ నీళ్ళలో కలుపుకొని త్రాగాను. బాబా దయవలన మరుసటిరోజు ఉదయానికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని ఆలస్యం చేసినందుకు క్షమాపణలు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబా దయతో మంచి మార్కులు - ఆరోగ్యం


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ నెలలో నేను నా పరీక్షలు వ్రాసాను. నేను, "పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావాల"ని ఆ సాయిని ఎంతగానో వేడుకుని, "నాకు మంచి మార్కులు వస్తే, ఈ బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఇంకా బాబా దయ నా మీద ఉందన్న నమ్మకంతో ఫలితాల కోసం ఎదురుచూసాను. నేను నమ్ముకున్నట్లే మే నెలలో వచ్చిన ఫలితాల్లో నాకు మంచి మార్కులు వచ్చాయి.


నాకు మే నెలలో ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టరు కొన్ని మందులు వ్రాశారు. ఆ మందులు వేసుకున్న కొన్ని రోజులు బాగానే ఉంది కానీ, మళ్ళీ ఆ ఆరోగ్య సమస్య వచ్చింది. దాంతో నేను మళ్ళీ ఆ టాబ్లెట్లు వేసుకుని, "బాబా! నా ఈ ఆరోగ్య సమస్య తగ్గితే, నా అనుభవం మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో ఆ ఆరోగ్య సమస్య మళ్ళీ రాలేదు. "ప్రియమైన బాబా! మీరు చేసిన మేలుకు కృతజ్ఞతతో మీ పవిత్ర పాదకమలాలపై నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తండ్రి. నా అనుభవాలను పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!!


4 comments:

  1. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరాం.. మాకు మీరు నిత్యం అందిస్తున్న దివ్యమైన గొప్ప ఆశీస్సులు మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తాము హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిరాం బాబా

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo