సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1243వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీరామనవమి సమయంలో బాబా అనుగ్రహం
2. బాబా కరుణ
3. బాబా అనుగ్రహంతో బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్మెంట్

శ్రీరామనవమి సమయంలో బాబా అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః:!!!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


'సాయి మహారాజ్ సన్నిధి' బాగు నిర్వహిస్తున్న సాయికి, మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సంధ్య. శ్రీ సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలు పంచుకోబోతున్నాను. ముందుగా నా అనుభవాలను పంచుకోవడం ఆలస్యమైనందుకు సాయీశుడిని క్షమాపణలు వేడుతున్నాను. 2022, శ్రీరామనవమి రోజున మావారు బాబా దర్శనం చేసుకుని వద్దామంటే, సరేనని వెళ్ళాము. దర్శనమయ్యేసరికి మధ్యాహ్న హారతి సమయం కావడంతో నేను, "బాబా! మధ్యాహ్న ఆరతికి నేను, నాభర్త మందిరంలోనే ఉండేలా చూడు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. ఇంతలో ప్రక్కనే ఉన్న ఒక సాయి భక్తురాలు శ్రీసీతారాములను చక్కగా అలంకరిస్తూ, "బాబాకి ఆరతి  పూర్తికాగానే  శ్రీసీతారాముల కళ్యాణం జరుగుతుంది" అని చెప్పింది. నేను మళ్ళీ, "సాయీ! నేను, నా భర్త శ్రీసీతారాముల కళ్యాణం చూడాలి. ఇంటికి వెళదామని మావారు తొందర పెట్టకుండా ఉండేలా చూడు తండ్రి" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. బాబా దయవలన మేము ఆరతిలో పాల్గొని, శ్రీసీతారాముల కళ్యాణం కనులారా వీక్షించాము. కళ్యాణం జరుగుతున్నప్పుడు ఒక భక్తురాలు నాతో, "కళ్యాణం తరువాత ముత్యాల తలంబ్రాలు ఇస్తార"ని అన్నారు. మళ్ళీ అంతలోనే, "అందరికీ ఇస్తారో, లేదో తెలీదు, తెలిసినవాళ్ళకైతే ఇస్తారు" అన్నారు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మేము మొదటిసారి మీ దయవలన శ్రీసీతారాముల కళ్యాణం చూసాము. దయతో ముత్యాల తలంబ్రాలు నాకు కూడా అందేలా మీ ప్రేమను చూపండి సాయి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల నాకు ఐదు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఇంకా శ్రీసీతారాముల కళ్యాణం సమాప్తం కాగానే అన్నప్రసాదం ఉంటుందని అనౌన్స్ చేసారు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! కరోనా వల్ల లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి నేను మీ మందిరంలో ప్రసాదం తినలేదు(మేము శిరిడీ వెళ్లినప్పటికీ అక్కడ అన్న ప్రసాదాలయం ఓపెన్ చేసి లేదు). ఈరోజు మీ దయవలన నేను, నాభర్త అన్నప్రసాదం తినాలి. ఆ అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. నా భర్త ఇప్పుడే నన్ను ఇంటికి తీసుకెళ్లొద్దు. మీ ప్రసాదం తిన్నాకే మేము ఇంటికి పోవాలి" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా అనుగ్రహించారు. మధ్యాహ్న ఆరతి, శ్రీసీతారాముల కళ్యాణం, తలంబ్రాలు, అన్నప్రసాదం ఇలా నా మనసులోని కోరికలన్నీ తీర్చి సంతోషంగా మమ్మల్ని ఇంటికి పంపారు. నిజానికి మేము శ్రీరామనవమికి శిరిడీలో ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాము. అలా అనుకున్న మమ్మల్ని బాబా తమ మందిరానికి రప్పించుకుని అన్న ప్రసాదం పెట్టి ఎంత గొప్పగా అనుగ్రహించారో అని మేము ఇంటికి వచ్చాక చాలా ఆనందించాము. బాబా మన ప్రతి మాటను వింటారు - ప్రతికోరికను తీరుస్తారు. "శ్రీరామనవమి రోజున మీ సన్నిధిలో చాలా సమయం గడిపేలా అనుగ్రహించిన సాయితండ్రి, మీకు కోటి కోటి ప్రణామాలు,ధన్యవాదాలు".


నేను శ్రీరామనవమి సమయంలో శ్రీసాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయాలనుకున్నాను. కాని కొంచెం ఆలస్యమై బాబా దయవల్ల శ్రీరామనవమి పోయిన 4వ రోజు పారాయణ పూర్తి చేసాను. నిజానికి ఆ సమయంలో నాకున్న పనుల ఒత్తిడివల్ల ఏడురోజుల్లో పారాయణ పూర్తి చేయలేను అనుకుని బాబాను, "ఏడురోజుల్లో పారాయణ పూర్తిచేసే శక్తినివ్వమ"ని అడిగాను. ఆయన అనుగ్రహం వల్లే నేను పారాయణ పూర్తి చేయగలిగాను. ఇకపోతే, పారాయణ పూర్తవుతూనే తమను దత్త రూపంలో దర్శించే భాగ్యాన్ని బాబా నాకు ప్రసాదించారు. ఆరోజు మావారు శ్రీక్షేత్ర గాణుగాపురం వెళదామన్నారు. నేను సరేనని, "బాబా! తోడుగా ఉండి గాణుగాపురంలో దత్త దర్శనం జయప్రదమయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్ధించాను. ఆ పై 2022, ఏప్రిల్ 25, గురువారం ఉదయం మేము బయలుదేరి ఆరోజు సాయంత్రం 4 గంటలకి గాణుగాపురం చేరుకుని రూమ్ తీసుకుని సంగమనేరు వెళ్లి అక్కడున్న భీమా నదిలో స్నానమాచరించి, ప్రదక్షణలు చేసి, దత్తావతారాల దర్శనం చేసుకున్నాము. తరువాత దత్త నిర్గుణ పాదుక దర్శనం చేసుకుని, కల్లేశ్వరుని, శనీశ్వరుని కూడా దర్శించుకున్నాము. అప్పటికీ సాయంత్రం 7 గంటలవుతుంది. మరోసారి దత్త నిర్గుణ పాదుకా దర్శనం చేసుకుందామని వెళ్లి, ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాము. ఒక భక్తుడు రాత్రి 8 గంటలకి ఆరతి ఉంటుందని చెప్పారు. సరేనని వేచి ఉండగా మేము ఊహించని విధంగా ఆరతితోపాటు పల్లకి సేవను కూడా కనులారా తిలకించే భాగ్యం మాకు దక్కింది. పల్లకి సేవ అనంతరం రూమ్‍కి వెళ్ళాము. మరుసటిరోజు శుక్రవారం మళ్ళీ పాదుకలు దర్శించుకుని ఇంటికి బయలుదేరేముందు నేను మావారితో, "ఒకసారి 'సాయి మహారాజ్ సన్నిధి' ఓపెన్ చేయండి" అని అన్నాను. ఆయన ఓపెన్ చేయగానే అందులో, "నేను నీకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. నీవు నాకోసం తినడానికి ఏమైనా తీసుకొచ్చావా?" అన్న సాయి సందేశం ఉంది. అది చూసి ఆనందంతో కోవా తీసుకుని వెళ్లి, సాయి దత్తునికి నివేదించి అందరికీ ప్రసాదం పంచాము. ఇక్కడొక విషయం చెప్పాలి, ముందురోజు మేము దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డూలు తీసుకెళ్ళి స్వామికి నివేదించి బయటకు వస్తుంటే ఒక అతను, "ప్రసాదం ఇవ్వు" అని అడిగి మరీ తీసుకున్నాడు. అ రూపంలో బాబానే ప్రసాదం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించారని మేము భావించాము. ఆ విధంగా నేను కోరుకున్నట్లే తోడుగా ఉండి గాణుగాపురంలోని దత్త దర్శనాన్ని జయప్రదం చేసారు నా సాయితండ్రి.


చివరిగా ఇంకో విషయం, నేను 2022, ఫిబ్రవరి నుండి శ్రీ గురుచరిత్ర ఒకసారి పారాయణ చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని. కాని "సాయి భక్తులకు సాయిచరిత్రే గురుచరిత్ర" అని శ్రీబాబూజీ చెప్పిన మాటను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో చదివాను. దాంతో శ్రీగురుచరిత్రకి బదులు సాయి చరిత్రనే శ్రీరామనవమి సందర్భంగా చదవాలనుకున్నాను. తరువాత ఒకరోజు రాత్రి నేను బాబా అపార ప్రేమను మననం చేసుకుంటూ నిద్రపోయాను. నిద్రలో 'దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా' అనే దత్త మంత్రం మృదువైన స్వరంలో వినిపించింది. శ్రీగురుచరిత్ర పారాయణ సంకల్పం రావడం, కలలో బాబా దత్తమంత్రం ఉపదేశించడం, శ్రీరామనవమికి సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయించడం, అంతలోనే శ్రీదత్త క్షేత్రమైన గాణుగాపురం దర్శించే భాగ్యం కల్పించడం బాబా ప్రేమకు నిదర్శనం. "బాబా! మీ అపార ప్రేమకు నేను దాసురాలిని తండ్రి. మీ పాదాలకు శరణం సాయీ!".


సద్గురు చరణం భవభయ హరణం శ్రీసాయినాథ శరణం.

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా కరుణ


నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ముందుగా సాయినాథునికి నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి  కృతజ్ఞతలు. 2022, జూన్ మొదటివారంలో మా అబ్బాయివాళ్ళు విజయవాడ వెళ్లొచ్చారు. తరువాత మా మనవరాలికి జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా టెస్టు చేయించాము. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఇంక మనవరాలిని గృహ నిర్బంధంలో ఉంచి మందులు వాడాము. తనకి బదులు నేను బాబా ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు త్రాగుతూ ఉండేదాన్ని. పాపకి దగ్గు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాకు చాలా భయమేసేది. అప్పుడు కూడా నేను బాబాను స్మరించుకుంటూ ఉండేదాన్ని. వారం రోజులు తరువాత టెస్టు చేయిస్తే బాబా దయవల్ల తనకి నెగిటివ్ వచ్చింది. అయితే పాపకి ఇంకా దగ్గు ఉంది. అది కూడా బాబా దయవల్ల త్వరలో తగ్గిపోతుందని నేను నమ్ముతున్నాను. ఇంకొక  చిన్న అనుభవం, 2022, జూన్ 27, ఉదయం ఫోన్ ఛార్జింగ్ పెడితే, ఛార్జ్ కాలేదు. చాలాసేపు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు గుర్తొచ్చి బాబా ఊదీ ఛార్జర్‍కి, ఫోన్‍కి పెట్టి ఆన్ చేస్తే మొబైల్ ఆన్ అయింది. తలచినంతనే పలుకుతారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీ కరుణ మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి".


శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కు జై!!!


బాబా అనుగ్రహంతో బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్మెంట్


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. చిన్నతనం నుండి విషయం చిన్నదైనా, పెద్దదైనా నేను బాబా మీద ఆధారపడతాను. నేను పోయిన ఎడాది ఎల్.ఎల్.బి పూర్తి చేసాను. నా తోటి వాళ్ళందరూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీలో ఎన్ రోల్మెంట్ చేసుకున్నా, కొన్ని ఇబ్బందుల వల్ల నేను చేసుకోలేకపోయాను. తరువాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు క్లోజ్ చేసారు. నాకు ఏమి చెయ్యాలో తోచక బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చింది. అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుని నమోదు చేసుకోడానికి బయలుదేరాను. కానీ మనసులో అక్కడ వాళ్ళు ఇంకేమైనా పత్రాలు అడుగుతారేమోనని కొంచం భయపడి,."బాబా! ఎన్ రోల్మెంట్ కి ఏ ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకోగలిగితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. బాబా అనుగ్రహం వల్ల చాలా సులభంగా దరఖాస్తు చేసుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నా కాండక్ట్ సర్టిఫికెట్ లో ఎవరైనా ఇద్దరు సీనియర్ లాయర్లు సంతకాలు చేయాల్సి ఉండగా నాకు అక్కడ ఎవరూ పరిచయం లేదు, మరెలా అనుకుంటుంటే, సరిగా అప్పుడే వయసుపైబడిన ఒక సీనియర్ లాయర్ అక్కడికి వచ్చి, "ఎవరికైనా సంతకాలు కావాలంటే నేను చేస్తాను. ఫలానా చోటుకి రండి" అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆయన నా అప్లికేషన్ లో అన్నీ వెరిఫై చేసి, సంతకం చేసి, ఇంకో లాయర్ చేత కూడా చేయించారు. ఇదంతా బాబా అనుగ్రహం కాక మరేమిటి!!

  

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!




6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sai ram. Today's your Leela's are very nice.once we went to Bhadra chalam there we performed Sree Sita Rama chandra marriage there.Return back home.

    ReplyDelete
  5. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo