సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1227వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా నెరవేర్చిన లక్ష్యాలు
2. ఆందోళనను తొలగించిన బాబా

బాబా నెరవేర్చిన లక్ష్యాలు

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రేణుక. మేము పశ్చిమగోదావరికి చెందినవాళ్ళమైనప్పటికీ మావారి ఉద్యోగరిత్యా నాగపూర్‍లో నివాసముంటున్నాము. నేను ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నేను మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని ఎంసెట్, AIEEEలలో నాకు మంచి మార్కులు వచ్చినప్పటికీ బి.టెక్ చదవడానికి ఖర్చు ఎక్కువని ఏలూరులోని ఒక సాధారణ కాలేజీలో డిగ్రీ జాయినయ్యాను. మంచి ర్యాంక్ వచ్చినా బి.టెక్ చదవలేదని మా చుట్టాలు, ఊళ్లోవాళ్లు నన్ను చాలా మాటలు అనేవారు. కానీ నేనెప్పుడూ నిరుత్సాహపడకుండా, "బాబా ఉన్నారు. ఆయన ఏం చేసినా నా మంచికోసమే చేస్తారు" అని అనుకునేదాన్ని. నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటూ ఎప్పుడూ బాబాని తలుచుకుంటూ, "నన్ను మంచి పొజిషన్‍లో ఉంచమ"ని వేడుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల చదువు పూర్తవ్వగానే ఆఫ్ క్యాంపస్ సెలక్షన్లో లక్ష నుండి 4.5 లక్షల ప్యాకేజీలతో(జీతం) 4 కంపెనీలలో ఉద్యోగాలకి నేను సెలెక్ట్ అయ్యాను. మా నాన్నగారు చాలా సంతోషించారు. నేను వచ్చిన అన్ని ఉద్యోగాలలో తక్కువ ప్యాకేజీ(1 లక్ష) అయిన TCS ఐతే మంచిదని, 2015, జూన్‍లో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. నాకు పోస్టింగ్ ఇచ్చిన వెంటనే 2016, మార్చ్ లో మా అమ్మనాన్న నాకు పెళ్ళి చేశారు. మంచిగా నా సంసారం సాగింది. కానీ నా మెట్టినింటివారు నాకు తక్కువ ప్యాకేజీ అని తరచూ అంటుండేవారు. వాళ్ల ఆరాటం నా మంచికోసమే అని తెలుసుకానీ బాబా అనుజ్ఞ లేనిదే ఏమీ జరగదని కూడా నాకు తెలుసు. 2021 వరకు 4సార్లు ప్రమోషన్స్ వచ్చినా ప్యాకేజీ ఎక్కువగా ఏం పెరగలేదు. 2021, ఆగస్టులో ప్రమోషన్ వచ్చి 5 లక్షల ప్యాకేజీ అయింది. దానికి మావాళ్లు నన్ను చాలా చులకన చేసి మాట్లాడారు. అప్పుడు మావారు, నా పుట్టింటివారు నాకు ధైర్యం చెప్పి, "ఏం కాదు, నువ్వు మంచి జాబ్ కోసం ప్రయత్నించు" అన్నారు. దాంతో నేను సెప్టెంబర్ నెల నుండి ఒక కొత్త టెక్నాలజీని కష్టపడి నేర్చుకుని చాలా కంపెనీలకి అప్లై చేశాను. బాబా దయవల్ల 2021, డిసెంబరులో 11లక్షల జీతంతో ఒక కంపెనీలో జాబ్ ఆఫర్ నాకు వచ్చింది. అయితే నేను 15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, IELTSలో మంచి స్కోర్ అనే రెండు లక్ష్యాలు పెట్టుకుని ఉన్నాను. అందువలన నేను బాబాతో, "బాబా! నాకు 2022, ఫిబ్రవరిలో IELTS పరీక్ష ఉంది. మార్చ్ లో కొత్త కంపెనీలో జాయినింగ్ ఉంది. ఏదేమైనా నా లక్ష్యాలను నెరవేర్చే బాధ్యత మీదే తండ్రి" అని చెప్పుకున్నాను. ఇకపోతే, ఇప్పుడు నా IELTS పరీక్షకి సంబంధించి బాబా అనుగ్రహం గురించి చెప్పి ఆపై నా లక్ష్యమైన 15 లక్షల ప్యాకేజీని కూడా బాబా ఎలా ప్రసాదించారో చెప్తాను.

మేము 2021, ఫిబ్రవరిలో కెనడా PR (Permenant Residency) కోసం అప్లై చేసి, అక్కడికెళ్లి కొంత సంపాదించాక మా పుట్టింటివారిని, మెట్టినింటివారిని వారివారి బరువుబాధ్యతల నుండి తప్పించాలని అనుకున్నాం. అలా అనుకున్న వెంటనే ఒక మంచి కన్సల్టెన్సీ చూసి ప్రాసెస్ మొదలుపెట్టాము. ముఖ్యంగా ఆ దేశంలో ఉండటానికి ఇంగ్లీషులో ప్రావీణ్యత కావాలి. అందుకోసం ఒక పరీక్ష ఉంటుంది. దాని పేరు 'IELTS'. మా వారికి అంతగా ఇంగ్లీషు రాని కారణంగా నేను ఒక్కదాన్నే ఆ టెస్టు వ్రాసి, మంచి స్కోర్ తెచ్చుకుంటే ఈజీగా వీసా వస్తుందన్నారు. సరేనని నేను 2021, డిసెంబరులో IELTS మొదటిసారి వ్రాసాను. చాలా కష్టపడ్డాను కానీ అనుకున్న ఫలితం రాలేదు. అందువలన ఫిబ్రవరిలో మరోసారి వ్రాద్దామని మళ్ళీ ఆ టెస్టుకు అప్లై చేశాను. తరువాత బాబాకి దణ్ణం పెట్టుకుని, "చిన్నప్పటినుండి ఏ పరీక్షా రెండోసారి రాయాల్సిన అవసరం నాకు రాకుండా చూసుకున్నారు కదా బాబా. మరి ఇప్పుడెందుకు ఇలా జరిగింది? సరే, ఇప్పుడు మళ్లీ ఆ పరీక్ష వ్రాస్తున్నాను బాబా. అందులో కనుక నాకు రావాల్సిన మార్కులు వస్తే, నేను ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత కష్టపడి చదివి పరీక్షకి హాజరయ్యాను. అయితే ఒక పేపరులో చాలా సమాధానాలు తప్పుగా పెట్టి, "ఎందుకిలా చేశావు బాబా?" అని బాబాని ప్రశ్నించాను. కానీ వారం రోజుల్లో వచ్చిన రిజల్ట్స్ లో బాబా దయవల్ల నాకు రావాల్సిన మార్కుల కంటే రెండు మార్కులు ఎక్కువ వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. నేను ఆనందంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకుని అనుభవం పంచుకోవాలని అనుకున్నాను కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

IELTS రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ నా జాబ్ మీద దృష్టి పెట్టాను. 2022, మార్చ్ 21న TCSలో నా చివరి పనిదినం కాగా మార్చ్ 19 వరకు నేను ఆశించిన మంచి జాబ్ ఆఫర్స్ ఏమీ రాలేదు. దాదాపు అన్ని చిన్న కంపెనీలలోనే వచ్చాయి. అది కూడా 13 లక్షలు ప్యాకేజీ. అప్పుడు నేను "బాబా! మంచి ప్యాకేజీతో మంచి కంపెనీలో జాబ్ వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. నేను కోరుకున్న దానికంటే బాబా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. మార్చ్ 23న నాకు ఒక పెద్ద కంపెనీలో 21.64 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. మార్చ్ 24న జాయినింగ్. బాబా నాకు ఎంతటి అదృష్టాన్ని ఇచ్చారంటే, నేను మార్చ్ 24న శిరిడీలో బాబా దర్శనం చేసుకుని, ఆయన సన్నిధిలోనే కొత్త జాబులో జాయినయ్యాను. బాబా అనుకున్నారంటే అంతే. నా సంతోషానికి అవధులు లేవు. ఇంకో విషయం, బాబా మావారికి ఏం ప్రేరణనిచ్చారో తెలీదుకానీ ఆయన కూడా నాతో శిరిడీ వచ్చారు. మార్చ్ 25న మా ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని చాలా సంతోషంగా శిరిడీలో జరుపుకున్నాం. "సాయిబాబా మహాప్రభో! నువ్వు నిజంగా చాలా మహిమాన్వితుడివి. నువ్వు నా గురుదేవునివి, దైవానివి, తండ్రివి, తల్లివి, ప్రాణానివి బాబా. ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేస్తాను తండ్రి. మీరు నా జీవితంలో జరిగిన అనుభవాల వల్ల నాకు చాలా పాఠాలు నేర్పారు. నేను మీకు మాటిచ్చినట్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. నీకు నా పరిస్థితి తెలుసు కదా బాబా. ఓ బాబా... నీకు తెలుసు నాకు ఇంకో కోరిక ఉందని. పెళ్ళై ఆరు సంవత్సరాలైనా మాకు సంతానం లేదు. దయచేసి నాకు సంతానం ప్రసాదించు బాబా. నేను నా అనుభవాన్ని ఈ బ్లాగులోనేకాక నా సోషల్ మీడియాలో కూడా పంచుకుంటాను. అలాగే కనీసం ఒక ఇద్దరుముగ్గురుని ఈ గ్రూపులో జాయిన్ చేస్తాను. నా బిడ్డని తీసుకుని కుటుంబంతో మీ దర్శనానికి శిరిడీ వస్తాను".

ఓం నమో శ్రీసాయిదేవాయ నమః!!!
శ్రీ సచ్చిదానంద సద్గురు శిరిడీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!

ఆందోళనను తొలగించిన బాబా

సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

నా పేరు శ్రీకాంత్. సాయినాథుని కృపవలన ఈమధ్య జరిగిన ఒక అనుభవం బ్లాగులో పంచుకుంటున్నాను. సాయినాథుని కృపాకటాక్షాల వలన కరోనా నుండి బయటపడ్డ నా భార్య అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతున్నప్పటికీ ఆ సాయినాథుని దయవలన ఎలాంటి ఇబ్బందిలేకుండా తిరిగి కోలుకుంటుంది. అయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళెవరైనా షుగర్ వ్యాధి వలన సన్నబడ్డ నా భార్యని చూసి, "నువ్వు చాలా బలహీనంగా అయ్యావు" అంటుంటే ఆమె చాలా ఆందోళనకు గురవుతుండేది. మాకు తెలిసిన చాలామంది, "ఎప్పుడూ చూపించుకునే డాక్టర్ దగ్గర కాకుండా హైదరాబాదు వెళ్లి అక్కడ డాక్టరుకి చూపించమ"ని సలహా ఇచ్చారు. దాంతో నేను, 'నాకు, నా కుటుంబానికి ఆ సాయినాథుని కృపాకటాక్షాలు ఉంటాయ'ని భావించి, హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకుని, వెళ్ళేముందు, "బాబా! నా భార్య రిపోర్టులన్నీ నార్మల్‍గా వస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మనసులో అనుకున్నాను. తరువాత మేము హైదరాబాద్ వెళ్లి ఒక పెద్ద డాక్టరుని సంప్రదించి అన్నిరకాల పరీక్షలు చేయించాము. డాక్టరు రిపోర్టులు చూసి, "ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నార"ని చెప్పడంతో నా భార్య ఆందోళన పూర్తిగా తొలగిపోయింది. సాయి దేవుని ఆశీర్వాదం వల్ల నా భార్యకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఆ సాయినాథుని కృపాకటాక్షాలు నా కుటుంబంపైన సదా ఉండాలని ఆ తండ్రికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ... సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

3 comments:

  1. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Nenu Sairam cheppina " I WILL ARRANGE THINGS IN YOUR FAVOUR
    YOU HAVE FAITH ON MY WORDS " e matalu vini nammi stock marketlo vintu laba nashtalatho cheppalante nashtamtho vunnanu...ika a sairam a ye rakshinchali... OM SAIRAM SRI SAIRAM JAISAIRAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo