సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1231వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిని ప్రార్థిస్తే ఇట్టే తొలగిపోవును సమస్యలు
2. భక్తుల బాధలు తొలగించే సాయి
3. శ్రీసాయినాథుని దయ

సాయిని ప్రార్థిస్తే ఇట్టే తొలగిపోవును సమస్యలు

'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వీణ. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. ఇక్కడ మాకు ఒక అపార్ట్ మెంట్ ఉండేది. దాన్ని 8 నెలల కిందట అమ్మకానికి పెట్టాము. ఎవరెవరో వస్తుండేవారు, చూస్తుండేవారు, వెళ్తుండేవారు కానీ ఎవరూ ఏమీ చెప్పేవాళ్లు కాదు. మేము చాలా ఓపికతో 8 నెలలు చూసాము. చివరికి ఒక గురువారం నేను సాయి సచ్చరిత్ర చదివి, "బాబా! మేము అనుకున్న ధరకి ఆ అపార్ట్ మెంట్ అమ్ముడైతే, వచ్చిన డబ్బులో కొంత శిరిడీలో అన్నదానానికి కట్టిస్తాను. అలాగే ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని దణ్ణం పెట్టుకున్నాను. ఆ మరుసటిరోజే ఒకరు మావారికి ఫోన్ చేసి, "మీ అపార్ట్ మెంట్ తీసుకుంటాము" అని చెప్పారు. బాబా దయవల్ల ఒక నెలలో అందుకు సంబంధించి అన్ని పనులు పూర్తి అయిపోయాయి. "ధన్యావాదాలు బాబా".  
 
నేను నా ఫ్రెండ్‍కి కొంత డబ్బు వడ్డీకి అప్పుగా ఇచ్చాను. తను 6 నెలలు వరకు వడ్డీ బాగానే ఇచ్చింది. కాని ఆ తరువాత ఇవ్వలేదు. నేను అడిగితే, "ఇస్తాను, ఇస్తాను" అంటుండేది కాని, ఇచ్చేది కాదు. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక అప్పుడు నేను, "బాబా! నాకు వడ్డీ ఇవ్వకున్నా అసలు డబ్బులు ఇచ్చినా చాలు. అలా ఇస్తే, నా అనుభవం బ్లాగులో తెలియపరుస్తాను" అని బాబాతో చెప్పుకుని దణ్ణం పెట్టుకున్నాను. 15 రోజుల తరువాత ఆమె అసలు మొత్తంలో కొంత తగ్గించి ఇచ్చింది. నేను బాబా దయవల్ల ఆ డబ్బులైనా వచ్చాయని సంతోషించి ఊరుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
 
2022, జూన్ మొదటివారం ఆరంభంలో మా అమ్మకి వాంతులు, విరోచనాలు అవుతుంటే ఇంట్లో ఉన్న టాబ్లెట్లు వేసాము. కాని రెండురోజులైనా అమ్మకి తగ్గలేదు. దాంతో అమ్మని డాక్టరు దగ్గరకి తీసుకుని వెళితే, టాబ్లెట్లు వ్రాసిచ్చారు. ఆ టాబ్లెట్లు వేసాక కూడా అమ్మకి తగ్గలేదు. అప్పుడు మళ్ళీ హాస్పిటల్‌కి వెళితే, డాక్టరు అమ్మని చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అమ్మకి బీపీ డౌన్ అవుతుంటే, బీపీ పెరగడానికి ఇంజక్షన్స్ ఇచ్చారు. కాని బీపీ నార్మల్‍కి రాలేదు. నేను వెంటనే ఇంటికి పోయి బాబా ఊదీ తీసుకెళ్లి అమ్మకి పెట్టి, "బాబా! అమ్మకి బీపీ నార్మల్‌ అయితే, ఈ అనుభవం బ్లాగులో తెలియపరుస్తాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల గంట తరువాత అమ్మ బీపీ నార్మల్‌కి వచ్చింది. "ధన్యవాదాలు బాబా".

భక్తుల బాధలు తొలగించే సాయి 

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు సుభాషిణి. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం మన బాబా. అయన నాకు చేసిన మేలును జన్మజన్మలకు మరిచిపోలేనిది. ఇటీవల కాలంలో మా తమ్ముడి గేదెలు ఎటో వెళ్లిపోయి ఎన్ని రోజులు వెతికినా కనిపించలేదు. తను నాకు ఫోన్ చేసి, "గేదెలు ఎటు వెళ్ళిపోయాయో ఎంత వెతికినా కనిపించలేదు" అని చెప్పి బాధపడ్డాడు. నేను బాబాను, "కనిపించకుండా పోయిన గేదెలు కనిపించేలా చేయండి బాబా" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. రెండో రోజే గేదెలు కనిపించాయి.

ఈమధ్య నా చేతికి ఆపరేషన్ జరిగి చేయి చాలా నొప్పిగా ఉండేది. కానీ నేను టాబ్లెట్ వేసుకోకుండా మనసులోనే బాబాను తలుచుకుని, "బాబా! మీరే నా నొప్పి తగ్గించాలి తండ్రి" అని ప్రార్థించాను. రెండురోజుల్లో నొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం మా పెద్దపాప ఆరునెలల గర్భవతిగా ఉంది. ఇటీవల తనకి స్కానింగ్ చేసి అంతా బాగుందని చెప్పారు. అది బాబా దయ. వైద్యుని రూపంలో బాబానే మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. "తండ్రిలా రక్షిస్తున్నారు బాబా. ఇట్లాగే మిగిలిన మూడు మాసాలు పెద్దపాపను కాపాడు తండ్రి. అలాగే చిన్నపాపను కాపాడు తండ్రి. మీరు మా బాధలెన్నో తీర్చారు. .మిగిలిన బాధలను త్వరగా తొలగించి నాకు మనఃశాంతిని చేకూర్చు నాయన బాబా".

సర్వేజనా సుఖినోభవంతు!!!

శ్రీసాయినాథుని దయ

సాయి బంధువులందరికీ నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు ప్రమీల. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. నేను చాలారోజుల నుంచి నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా దయవలన ఇన్నాళ్ళకు నా అనుభవాలు మీతో పంచుకోగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్నపాపకి కంటిగుల్ల తరచుగా వస్తూ ఉంటే డాక్టరుకి చూపించి మందులు వాడాము. కానీ తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! మీ కృపతో పాపకి కంటిగుల్ల రాకుండా ఉంటే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతటితో బాబా ఆ సమస్యను తీసివేసారు. "ధన్యవాదాలు బాబా".

మా తమ్ముడికి ఎన్నో సంబంధాలు వచ్చినప్పటికీ ఏ సంబంధమూ కుదరక మేము చాలా ఇబ్బందిపడ్డాము. అప్పుడు నేను బాబాకి మ్రొక్కుకుంటే ఆయన దయవల్ల తమ్మునికి మంచి సంబంధం కుదిరింది. అలాగే బాబా దయవల్ల ఈమధ్య పరీక్షలు వ్రాసిన మా పెద్దపాపకి మంచి మార్కులు వచ్చాయి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీ పాదాల దగ్గర నాకు స్థానమిచ్చినందుకు చాలా కృతజ్ఞురాలిని తండ్రి. ఎప్పుడూ ఇలాగే మా మీద మీ కృప చూపించు సాయినాథా!".

ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo