1. ఏదడిగినా ప్రసాదిస్తుంటారు బాబా2. బాబా చల్లని చూపు
ఏదడిగినా ప్రసాదిస్తుంటారు బాబా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు అమర్నాథ్. ముందుగా నన్ను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతున్న సాయితండ్రికి శతకోటి వందనాలు. నేను కేరళలోని మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను. కేరళలో ఏ పని చేయాలన్నా చాలా ఆటంకాలు వస్తుంటాయి. స్థానికులు ఏ పనిని సాఫీగా జరగనివ్వరు. నేను కేరళకి వచ్చేటప్పుడు, "బాబా! నాకు ఏ ఇబ్బంది కలిగినా, కష్టం వచ్చినా ఎల్లప్పుడూ నాతోనే ఉండి నా ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగేలా ఆశీర్వదించండి" అని బాబాను వేడుకున్నాను. కేరళలో అన్ని అనుమతులు తీసుకొని ఒక గ్రామ పరిసర ప్రాంతంలో కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్, HM ప్లాంట్, WMM ప్లాంట్, పకోన ప్లాంట్ల నిర్మాణం చేసాము. అంతా చాలా సవ్యంగా జరిగి సాయి ఆశీస్సులతో అన్ని ప్లాంట్స్ వర్కింగ్‍లోకి వచ్చాయి. అయితే ఒక నెల తర్వాత స్థానిక వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా ఆడవాళ్లు ముందుండి పగలూరాత్రీ కంపెనీలోకి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. మా మేనేజ్మెంట్ మాత్రం పని ఆపవద్దు, అన్ని ప్లాంట్స్ రన్ చేయండి అని అంటుండేవారు. అలా చేస్తే స్థానిక ప్రజలు కొడతారు. ఆ పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపమని బాబాను వేడుకున్నాను. ఎమ్మెల్యే, ఎంపీలు కూడా చేయలేని పనిని ఆ గ్రామ పెద్ద ఎంతో చాకచక్యంగా అందర్ని ఒప్పించి, అన్ని ఆటంకాలు తొలగించి మరల ప్లాంట్స్ స్టార్ట్ చేసుకునేలా చేశారు. బాబాని వేడుకున్న తర్వాతనే సమస్య ఆ విధంగా పరిష్కారమైంది. ఇప్పుడు చాలా చక్కగా పని జరుగుతుంది. ఇంకో విషయం ప్రాజెక్టు సైట్లో కొత్తగా వచ్చిన ఒక సూపర్వైజర్ నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటే, నేను బాబాను వేడుకున్నాను. అంతే, ఆ మరుసటిరోజు నుండి అతను చాలా సౌమ్యంగా నాతో మాట్లాడుతున్నారు.
తరువాత మా అమ్మాయికి మార్చి 5న నీట్ పీజీ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండగా బాబాని, 'పాపకి ఆ ఎగ్జామ్‍లో మంచి ర్యాంకు ప్రసాదించమని, కుటుంబసమేతంగా శిరిడీ వచ్చి త్వరలో మీ దర్శనం చేసుకుంటామమ'ని వేడుకున్నాను. బాబా దయవల్ల పాప పరీక్ష చాలా బాగా వ్రాసింది. నిజానికి పరీక్షకి ఐదు రోజుల ముందు నుండి పాప జ్వరం, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‍తో చాలా బాధపడింది. ఆ విషయం నాకు తెలీదు. నేను మూమూలుగానే రోజూ బాబాని, "మా పాపకి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని నమస్కరించుకుంటూ ఉంటాను. ఆ తండ్రి దయతో పరీక్ష ముందురోజు పాపకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగించి పరీక్ష బాగా వ్రాసేలా అనుగ్రహించారు. ఎల్లప్పుడూ బాబా మనం ఏదడిగినా ప్రసాదిస్తుంటారనడానికి ఇంతకంటే ఋజువు ఏం కావాలి? "బాబా! మీకు శతకోటి ప్రణామాలు. పాపకు మంచి ర్యాంకు ప్రసాదించి, మంచి యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసే అవకాశం కల్పించు బాబా. ఎల్లుప్పుడూ నాతోనే ఉండి నన్ను నడిపించు బాబా".
బాబా చల్లని చూపు
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు జగదీశ్వర్. నేను నా గత అనుభవం(అనుభవమాలిక 1418వ భాగం)లో శిరిడీ వెళ్ళేటప్పుడు మా మనవరాలికి జ్వరం వచ్చిందని, బాబాకి మొక్కుకున్న తర్వాత తగ్గిందని పంచుకున్నాను. అయితే రెండు నెలల పూర్తికాకముందే మా అమ్మాయి, మనవరాలు కరీంనగర్‌లోని మా ఇంట్లో ఉంటుండగా 2023, జనవరి 25న మనవరాలికి మళ్ళీ హై ఫీవర్ వచ్చింది. దాంతోపాటు వణుకు ఉండేసరికి పాపకి బాబా ఊదీ పెట్టి ఆ రాత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. డాక్టరు ఇచ్చిన మందులు వేస్తూ, తడి గుడ్డతో తుడిస్తే జ్వరం తగ్గినట్లే తగ్గి, మళ్ళీ వస్తుండేది. అలా దాదాపు వారం రోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి డాక్టర్ బ్లడ్ టెస్టు చేసి 'బాక్టీరియా ఇన్ఫెక్ట్ అయింద'ని హాస్పిటల్‍లో అడ్మిట్ అవ్వమన్నారు. సరేనని పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే రెండు రోజులు ఇంట్రా వెయిన్ ద్వారా అంటిబయోటిక్ ఇంజక్షన్లు ఇచ్చి మూడోరోజు డిశ్చార్జ్ చేసారు. కానీ మరో రెండు రోజులు ఉదయం, రాత్రి పాపని హాస్పిటల్‍కి తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించుకోమన్నారు. మేము అలాగే చేసాము. దాంతోపాటు ప్రతిరోజూ బాబా ఊదీ పెట్టడం కూడా మేము మరువలేదు. అలా దాదాపు పది రోజుల ఇంజెక్షన్ల కోర్స్ అయ్యాక మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే నార్మల్ వచ్చింది. కానీ రెండు రోజుల తర్వాత పాపకి మళ్లీ జ్వరం వచ్చింది. దాంతో మేము టెన్షన్ పడి మాకు తెలిసిన వేరే డాక్టరుకి పాపని చూపించాము. ఆ డాక్టర్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. బ్లడ్ టెస్ట్ కోసం కొద్ది దూరంలో ఉన్న ల్యాబ్‍కని వెళ్ళి కారు దిగి రోడ్డు క్రాస్ చేస్తుంటే, మధ్యలో ఉన్న ఎత్తుపల్లం కనిపించక మా మనవరాలిని ఎత్తుకొని ఉన్న నా భార్య పాపతో సహా రోడ్డు మీద బొక్క బోర్లా పడిపోయింది. అది చూసిన వారు అరవడంతో నేను ఏమైందని వెనక్కు తిరిగి చూస్తే, నా భార్య, మనవరాలు రోడ్డు మీద పడి ఉన్నారు. బాబా చల్లని చూపు వల్ల నా భార్యకి మోకాలు వద్ద కొద్దిగా గీరుకు పోవడం తప్ప ఇద్దరికీ ఏమి కాలేదు. బాబాకి మనసులో దణ్ణం పెట్టుకొని బ్లడ్ టెస్ట్ సెంటర్‍కి వెళ్లి పాపకి బ్లడ్ టెస్టు చేయించాం. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు రిపోర్ట్ రావడంతో డాక్టర్ మళ్ళీ ఐదు రోజులకి ఓరల్ సిరప్, అంటిబయోటిక్స్ వ్రాసిచ్చారు. అవి వాడిన తర్వాత మా మనవరాలికి పూర్తిగా జ్వరం తగ్గింది. ఇప్పటికీ(ఈ అనుభవం వ్రాసే సమయానికి) 15 రోజులు అవుతుంది. మా మనవరాలు పూర్తి ఆరోగ్యంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల మా మనవరాలు పూర్తిగా కోలుకుంది. మాపై దయ ఉంచండి బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me