సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1479వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు - భయము అవసరం లేదు
2. ఏ సమస్య వచ్చినా సాయితండ్రి తీరుస్తారు

బాబా ఉన్నారు - భయము అవసరం లేదు

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి భక్తులందరికీ నమస్కారాలు. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి వేల కృతజ్ఞతలు. నిజానికి ఈ బ్లాగు నడిపించేది మనందరి సాయేనని నా ప్రగాఢ విశ్వాసము. నా పేరు ఉమ. మాది నిజమాబాద్ జిల్లా. నేను ఒక సాయి భక్తురాలిని. ఏ చిన్న సమస్య వచ్చినా 'మనకు సాయి ఉన్నార'నే ధైర్యం సాయి భక్తులందరినీ ముందుకు నడిపిస్తుంది. ఆయన ఈమధ్య నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. మా అక్కవాళ్ళ అబ్బాయికి 17 సంవత్సరాల వయస్సు. 2022, నవంబర్ నెలలో తన గొంతు దగ్గర గడ్డల్లా కనిపించాయి. డాక్టరు దగ్గరకి వెళితే, 'థైరాయిడ్' అని చెప్పి మందులిచ్చారు. ఒక నెల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు డాక్టరు, "ఈ గడ్డలు చూస్తుంటే అనుమానంగా ఉంది. వేరే డాక్టర్ దగ్గర చూపించండి" అని అన్నారు. దాంతో ఇంకో డాక్టరు దగ్గర చూపిస్తే, వాళ్ళు స్కానింగ్, టెస్టులు అంటూ చాలా చేసారు. ఆ రిపోర్ట్స్ చాలారోజుల వరకు రాలేదు. మా అక్క భయపడుతూ ఉంటే, "అక్కా! బాబా ఉన్నారు. భయము అవసరం లేదు. బాబాకి మనస్ఫూర్తిగా ఏదైనా వేడుకో. అంతా బాబా చూసుకుంటారు" అని చెప్పాను. తను 'సాయి దివ్యపూజ' చేస్తాననుకొని చేసింది. బాబా దయవల్ల రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చి, సమస్య  థైరాయిడ్ అని తేలింది. అప్పుడు అందరం ఊపిరి పీల్చుకొని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

2022, డిసెంబరులో మా బావగారికి హఠాత్తుగా ఛాతిలో నొప్పి వస్తే హైదరాబాదులోని హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్స్ పరీశిలించి యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి, చేశారు. రిపోర్ట్ ఏమొస్తుందో అని భయపడుతూ నేను, మావారు, మా అక్క హైదరాబాద్‌కి  బస్సులో బయలుదేరాము. నేను దారిలో, "బాబా! బావగారి రిపోర్ట్స్ నార్మల్ వస్తే, నేను మీ గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తాన"ని బాబాకి మొక్కుకున్నాను. అప్పటికే మా కుటుంబసభ్యులు 12 మందిమి 2023, జనవరి 9న శిరిడీ వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము. అందులో మా బావగారు కూడా ఉన్నారు. ఒకవేళ రిపోర్టులో ఏమైనా వస్తే, మా శిరిడీ ప్రయాణం రద్దు అయిపోతుంది. ఆ విషయం గురించి కూడా నేను ఒకటే టెన్షన్ పడుతూ, "అలా ఏమీ జరగకుండా చూడమ"ని బాబాను వేడుకున్నాను. తరువాత మేము దిగాల్సిన చోటు రాగానే బస్సు దిగాము. బస్సు దిగుతూనే మా అక్క, నా చెవి చూసి, "చెవికమ్మ ఏమైంది?" అని అడిగింది. అప్పుడు నేను నా చెవి తడుముకొని, "అయ్యో అక్కా! బస్సులో పడిపోయినట్లుంది, నేను చూసుకోలేదు" అని బాధపడ్డాను. అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. మావారు, "బస్సు టికెట్ తీయి, అందులో ఉన్న హెల్ప్ లైన్‌కి ఫోన్ చేద్దామ"ని అన్నారు. నేను టికెట్ చూసి, దాని మీద ఉన్న హెల్ప్ లైన్ నెంబరుకి కాల్ చేశాను. వాళ్ళు ఆ బస్సు డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. నేను ఆ నెంబరుకి ఒకటే కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు. చివరికి ఒక గంట తర్వాత లిఫ్ట్ చేసినా రాంగ్ నెంబర్ అన్నారు. నేను నిరాశ చెందకుండా మనసులో 'బాబా ఉన్నారు. ప్రతి ప్రాణిలో ఉన్నది తామే అన్నారు కదా! అదే నిజమైతే బాబా నా చెవికమ్మ నాకు దొరికేలా అనుగ్రహిస్తారు' అని అనుకొని మళ్ళీ హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసి, "ఆ నెంబర్ రాంగ్ నెంబర్ అంటున్నారు" అని చెప్తే, మరో నెంబర్ ఇచ్చారు. మావారు ఆ నెంబరుకి కాల్ చేసి, జరిగింది చెప్పి, నా సీటు నెంబర్ కూడా చెప్పారు. ఆ డ్రైవర్ వెంటనే బస్సు పక్కకు తీసి ఆపి, ఆ సీటు దగ్గర చూసి, చెవికమ్మ దొరికిందని చెప్పారు. సాయికి కృతజ్ఞతలు చెప్పి, వెళ్లి ఆ చెవికమ్మను తీసుకున్నాము. మేము ఆ బస్సు దిగి గంటపైనే అయింది. మేము దిగిన తరువాత ఆ బస్సు బస్టాండ్‌కి వెళ్లి, ప్రయాణికులను ఎక్కుంచుకోని తిరిగి నిర్మల్ వెళ్తుంది. ఆయినా నా కమ్మ ఎవరి కంటా పడకుండా అక్కడే ఉందంటే ఆ సాయినాథుని దయే కదా! ఒకవేళ అది దొరికినా కూడా ఆ డ్రైవర్ మాకు ఇవ్వాలని లేదు, 'దొరకలేద'ని చెప్పొచ్చు. కానీ అలా జరగలేదు. మన సాయి ఎక్కడో లేరు. అలాంటి మంచి మనుషుల రూపంలోనే ఉన్నారు నా బాబా.

ఇకపోతే, నా సాయి దయవల్ల మా బావగారి రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. మేమంతా చాలా సంతోషించి శిరిడీ వెళ్లి అనంతకోటి బ్రహ్మాండనాయకుడైన సాయి మహరాజ్‌ని కనులారా దర్శించుకొని తిరిగి క్షేమముగా మా ఇంటికి చేరుకున్నాము.

శ్రీసాయినాథార్పణమస్తు!!!

ఏ సమస్య వచ్చినా సాయితండ్రి తీరుస్తారు

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నా పేరు మహేశ్వరి. నేను ఈ మధ్యకాలంలోనే 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపులో చేరాను. 2023, జనవరి నుండి ఒక నెల రోజులు మా పది నెలల మనవరాలికి విపరీతమైన జ్వరం వస్తుండేది. హాస్పటల్లో చూపిస్తుంటే తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుండేది. ఇలా ఉండగా మా అక్కకొడుకు పెళ్లి వచ్చింది. సొంత అక్క కొడుకు పెళ్లి అయినందున వెళ్లక తప్ప లేదు. వెళ్లేటప్పుడు మనవరాలికి ఏమీ లేదు, బాగానే ఉంది. కానీ విడిది ఇంటి దగ్గరకి వెళ్లేసరికి హఠాత్తుగా పాప ఒక పక్క ముక్కు నుంచి బ్లడ్ వచ్చింది. మరుసటిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే బ్లడ్ వచ్చింది. మేము చాలా కంగారుపడ్డాం కానీ, తర్వాత రోజు నుంచి బ్లడ్ రాలేదు. జ్వరం మాత్రం విపరీతంగా వచ్చి రాత్రుళ్ళు నిద్రపోకుండా పాప ఏడుస్తూనే ఉండేది. ఎంత సముదాయించిన ఒకటే ఏడుపు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే టెంపరేచర్ 104 డిగ్రీలు ఉంది. డాక్టరు రక్తపరీక్షలు చేయాలని చెప్పారు. నేనప్పుడు, "బాబా! బ్లడ్ రిపోర్టులో ఏ సమస్య లేకుండా అంతా నార్మల్ అని ఉంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి భక్తులందరితో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా పాపకి ఏ ప్రాబ్లం లేకుండా చూసి నార్మల్ ఫీవర్ అనేలా చేసారు. ఆ రాత్రి నేను బాబాను, "చిన్న పాప బాబా. తనకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి" అని బాగా వేడుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజు ఫిబ్రవరి 19, ఆదివారం సాయంత్రం నుండి పాపకి జ్వరం రాలేదు, చక్కగా ఆడుకుంది. నాకు ఏ సమస్య వచ్చినా నా సాయితండ్రి ఇలానే తీరుస్తారు. "ధన్యవాదాలు సాయిబాబా".

3 comments:

  1. Sai please bless my children and hubby with long life and health aaush. Be with us om sai ram🙏🙏🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo