సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1489వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిబాబా దయతో దేనినైనా అధిగమించవచ్చు
2. నమ్మకాన్ని నిలబెట్టిన బాబా

సాయిబాబా దయతో దేనినైనా అధిగమించవచ్చు

ముందుగా సాయి కుటుంబీకులకు నా నమస్కారాలు. బాబా ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశం కల్పిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు కిషోర్. నేను ఇదివరకు 'సాయిభక్తుల అనుభవమాలిక 1275వ భాగం'లో బాబా నన్ను అసిస్టెంట్ నుంచి అసోసియేటర్ ప్రొఫెసర్‌గా ఎలా ప్రమోట్ చేశారో పంచుకున్నాను. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీవాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్‌కు పెట్టే టార్గెట్‍ను పూర్తి చేయడంలో బాబా ఎలా సహాయం చేసిందీ పంచుకుంటాను. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందినవారు ప్రమోషన్ పొందిన రోజు నుండి ఆరు నెలల లోపు ఒక ప్రాజెక్టు ప్రపోజల్ ఏదో ఒక ప్రభుత్వ ఏజెన్సీకి పంపవలసి ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఆర్టికల్ కూడా ప్రచురింపబడాలి. లేనియెడల జీతం నిలిపివేయబడుతుంది. పరిస్థితి ఇలా ఉండగా ఒకరోజు సాయిబాబా నా స్నేహితుని ద్వారా ఒక ప్రభుత్వ సంస్థవారు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారని తెలియజేశారు. అయితే ప్రపోజల్ పంపడానికి అదే ఆఖరిరోజు అని తెలిసి నేను కుమిలిపోయాను. "ఆఖరి తేదీ పొడిగించమ"ని బాబాని ఆర్తిగా వేడుకున్నాను. మర్నాడు ఉదయం నిద్రలేచి వెబ్సైట్ చూస్తే, ప్రభుత్వం పదిరోజులు పొడిగించినట్లు ఉంది. అది చూసి నా ఆనందానికి అవధులు లేవు. బాబాకు ధన్యవాదాలు తెలుపుకొని నా పని ముగించాను.

ఇక నా రీసెర్చ్ ఆర్టికల్ ప్రచురణ విషయానికి వస్తే.. నేను ఇదివరకు 'అనుభవమాలిక 1029వ భాగం'లో రీసెర్చ్ ఆర్టికల్ ప్రచురణలో బాబా నాకు ఎలా సాయం చేశారో వివరించాను. అలాంటి అనుభవమే బాబా నాకు మళ్ళీ ప్రసాదించారు. నా కేడర్‌లో ఉన్నవాళ్ళు సంవత్సరంలో కనీసం మూడు, ఆరు నెలల్లో కనీసం ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయాలి. సాయిబాబా దయవల్ల గత ఏడాది నావి నాలుగు ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అయితే నాలుగవది అదే సంవత్సరంలో ఆన్లైన్‍లోకి రావడం వల్ల నాకు ఉపయోగం లేకుండా పోతుంది. అదే మరుసటి సంవత్సరం, అంటే 2023లో అది ఆన్లైన్‍లోకి వస్తే నాకు కొంత శ్రమ తగ్గుతుంది. అందుకని నేను బాబాను, "నాలుగవ ఆర్టికల్ 2023లో ఆన్లైన్లోకి వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకొని రోజూ బాబా నామస్మరణ చేస్తుండేవాడిని. బాబా నా మొర ఆలకించారు. నా 4వ ఆర్టికల్ 2023లో ఆన్లైన్లోకి వచ్చేలా అనుగ్రహించారు. ఈ విధంగా యూనివర్సిటీవారు నాకు పెట్టిన టార్గెట్‍లను నేను సాయిబాబా దయతో పూర్తిచేశాను. "వేల కృతజ్ఞతలు బాబా".

ఈమధ్యకాలంలో తీవ్రమైన శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిడి వల్ల నా ఆరోగ్యం బాగా క్షీణించి నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దానికి తోడు, నా క్రింద మాస్టర్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళు మాస్టర్ డిగ్రీ పొందాలంటే కెమికల్ లేబరేటరీలో జాగ్రత్తగా పనిచేసి, ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయవలసి ఉంటుంది. నేనున్న అనారోగ్య పరిస్థితుల్లో అవన్నీ ఆలోచిస్తే తీవ్రమైన డిప్రెషన్కి గురయ్యేవాడిని. దానినుంచి బయటపడడానికి సాయిబాబా నామం చేయడం, ప్రతి గురువారం దగ్గర్లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి పల్లకి సేవ చేయడం, సాయి దివ్యపూజ చేయడం వంటివి చేస్తుండేవాడిని. బాబా దయవల్ల సుమారు నెల రోజుల తర్వాత నేను ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డాను. ప్రస్తుతం నా ఆరోగ్యం, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం, మాస్టర్ స్టూడెంట్స్ రీసెర్చ్ అంతా సజావుగా సాగుతున్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ప్రతి ఒక్కరి కష్టం తీర్చండి. కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని అందరికీ ప్రసాదించండి సాయినాథా".

నమ్మకాన్ని నిలబెట్టిన బాబా

ఓం నమో సాయినాథాయ!!! నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు నా తీర్థయాత్రలోని సాయి అనుగ్రహాన్ని పంచుకోబోతున్నాను. నేను ఈమధ్య అనుకోకుండా వరుసగా కొన్ని టూర్‌లకి వెళ్ళవలసి వచ్చింది. ముందుగా 2023, జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో మా కుటుంబం, మా తమ్ముళ్ళ కుటుంబాలు కేరళ టూర్ ప్లాన్ చేసుకున్నాము. అది నిర్ధారణ అయిన తరువాత మావారి స్నేహితులు 2023, ఫిబ్రవరి 20న 10 రోజుల కాశీ టూర్ ప్లాన్ చేసి, 'వస్తారా?' అని అడిగారు. మేము ఎప్పుడూ సౌత్ ఇండియాలోని గుళ్లకే తప్ప నార్త్ ఇండియా వెళ్ళలేదు. కాబట్టి 'మనకి ఎలాగూ అవన్నీ తెలియదు. అందరితోపాటు వెళ్తే అన్నీ చూసి రావచ్చు' అని వాళ్లతో సరేనని చెప్పాము. ఈ రెండు టూర్లు కాక, మధ్యలో 2023, ఫిబ్రవరి 12 నుండి 16 వరకు మా ఫ్రెండ్‌తో మంత్రాలయం వెళ్లాల్సి వచ్చింది. ఈ టూర్‌లన్నీ ఒక 2 నెలల ముందుగానే ప్లాన్ అయ్యాయి. అయితే నెలసరి సమస్య వల్ల ఆడవాళ్ళు ఏదైనా గుడికి వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ నాకు ఈమధ్య ఒక 5, 6 రోజులు ముందుగానే నెలసరి వస్తుంది. కానీ బాబా దయవల్ల నాకు ఎప్పుడూ ఏ కార్యక్రమానికీ నెలసరి అడ్డు రాదు. ఈసారి కూడా అదే ధైర్యంతో ముందడుగు వేశాను. ఆయన దయవల్ల జనవరిలో మా టూర్ అయిపోయి ఇంటికి వచ్చాక 20వ తేదీన నాకు నెలసరి వచ్చింది. మరుసటి నెల సరిగ్గా 20వ తేదీనే మేము కాశీకి ప్రయాణమయ్యేది. అదివరకు జరుగుతున్నట్లు నెలసరి ముందుగా వస్తే మంత్రాలయం వెళ్ళడానికి, కరెక్ట్‌గా వస్తే కాశీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. పోనీ టాబ్లెట్లు వేద్దామంటే అన్ని(ఎక్కువ) రోజులు వేయలేను. అయినా నేను పెద్దగా టెన్షన్ పడకుండా ఎప్పట్లాగే సాయికి చెప్పుకొని ధైర్యంగా మంత్రాలయం వెళ్ళాను. సాయి దయతో అక్కడ అంతా చాలా బాగా జరిగింది. అక్కడినుండి తిరుగు ప్రయాణమైనప్పటి నుండి నెలసరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. అయితే ఒక 2 రోజుల వరకు రాకపోయేసరికి కొంచెం టెన్షన్‌గా అనిపించి బాబాను ప్రార్థించాను. అంతే, నాకు నెలసరి వచ్చింది. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా రెండు ప్రయాణాలకు మధ్యలో నెలసరి రావడంతో మా కాశీయాత్ర ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా సాగింది. గీత గీసినట్టుగా రెండు యాత్రలకు ఇబ్బంది కలగకుండా ఉండడం ఖచ్చితంగా బాబా అనుగ్రహమేగానీ కాకతాళీయం కాదని నేను చెప్పగలను. ఎందుకంటే, అది నా మనసుకు తెలుస్తుంది. గొప్ప చెప్పుకోడం కాదుగానీ, బాబాపై నాకున్న నమ్మకానికి నేను కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను. 'ఇటువంటి అనుభవాలు కూడా రాయాలా?' అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదే కదా! "ధన్యవాదాలు బాబా".

3 comments:

  1. సాయి నన్ను నా భర్తని కలుపు సాయి నేను తనకి దూరంగా ఉండలేను సాయి

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo