ఈ భాగంలో అనుభవాలు:
1. దయతో సమస్యలను పరిష్కరిస్తున్న బాబా2. లాప్టాప్‌కి, ఫోన్‌కి చిన్న గీత కూడా పడకుండా కాపాడిన బాబా
దయతో సమస్యలను పరిష్కరిస్తున్న బాబా
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథునికి, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీకి అనేక పాదాభివందనాలు. ఈ బ్లాగ్ ద్వారా మా అనుభవాలను గురుబంధువులందరితో పంచుకునే అవకాశం కల్పించిన సాయికి కృతజ్ఞతలు. నా పేరు కనకవల్లి. మాది ఏలూరు. నేను నా గత అనుభవంలో "బాబా! మనశ్శాంతి లేకుండా నన్ను మనోవేదనతో క్రుంగదీస్తూ, మీ స్మరణకి దూరం చేస్తున్న రెండు సమస్యల గురించి మీకు తెలుసు. ఆ సమస్యలు పరిష్కారమైతే నా ఆనందాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను. మీ బిడ్డల్ని మీరు కాకపోతే ఎవరు కాపాడతారు తండ్రీ?" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో అందులో ఒకటి పరిష్కారమైంది. ఆ ఆనందాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.
బాబా ఆశీస్సులతో మా అమ్మాయి మోనికాదేవి వివాహం మా మేనల్లుడు(దూరపు చుట్టరికం)తో 2018లో జరిగింది. ఆ అబ్బాయివాళ్ళు మా అమ్మాయిని అడిగినప్పుడు మా అమ్మాయి బి.టెక్ చివరి సంవత్సరం చదువుతుండేది. ఆ సంబంధం చేయాలా, వద్దా అన్న విషయంలో బాబా నిర్ణయం కోసం నేను గాణ్గాపురం వెళ్లి శ్రీగురుచరిత్ర పారాయణ మొదలుపెట్టి, "బాబా! ఈ సంబంధం విషయంలో మీ నుండి మాకు సమాధానం కావాలి. సంబంధం మంచిదైతే ముందుకు నడిపించండి తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. ఆఖరిరోజు రాత్రి 7 గంటల సమయంలో నేను పారాయణ చేస్తుండగా ఒకతను నా వద్దకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. నేను తలెత్తి చూడకుండా, కనీసం ఆ పుస్తకం ఏమిటని కూడా చూడకుండా నా పారాయణ పూర్తిచేసి శ్రీగురుచరిత్ర పుస్తకం క్రిందపెట్టి అప్పుడు చూస్తే ఆ పుస్తకం 'శ్రీపాద వల్లభ లీల వైభవం' అన్న చాలా పెద్ద పుస్తకం. నేను రెండు పేజీలు చదివి ఆ పుస్తకాన్ని తిరిగి దాన్ని ఇచ్చిన అతనికి ఇద్దామని చూశాను. అతను ఆ పుస్తకాన్ని నన్నే వుంచుకోమని సైగ చేశాడు. నేను 'ఖరీదు ఎంత?' అని సైగ చేశాను. అతను ఒకర్ని చూపి, అతనే ఆ పుస్తకాన్ని నాకు ఇవ్వమన్నారని సైగ చేశాడు. ఆ వ్యక్తికి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కాషాయవస్త్రాలు ధరించి ధ్యానంలో వున్నారు. నా ఆనందం ఏమని చెప్పను? కన్నీళ్ళతో ఆయనకి అభివాదం చేశాను. ఆయన కళ్ళు తెరవలేదు. అక్కడున్న ఎవరికీ ఇవ్వకుండా నాకు మాత్రమే ఆ పుస్తకం ఇచ్చారు. నేను దాన్ని బాబా ఆశీర్వాదంగా భావించి పారాయణ చేశాను. పెళ్లి మాటలు, పెళ్లి పనులు చకచకా సాగి 2018, మార్చిలో మా అమ్మాయి వివాహం జరిగింది.
ఇకపోతే, ప్రతిదానికీ నేను 'బాబా, బాబా' అనుకుంటుంటే మావాళ్ళు కొంతమంది నన్ను హేళన చేసేవారు. దానికి తగ్గట్టు వివాహమై నాలుగేళ్లు అయినా మా అమ్మాయికి సంతానం కలగలేదు. ఆ విషయంలో తన అత్తింటివాళ్ళు ఏ ఇబ్బందీ పెట్టకపోయినప్పటికీ, మావాళ్లు అంటున్న మాటలు వినడం నా వల్ల కాలేదు. నాలుగేళ్లు శ్రద్ధ-సబూరీతో ఎదురుచూసిన నేను సాయి దివ్యపూజ 11 వారాలు చేసి, 2022, అక్టోబరులో శిరిడీ వెళ్లి ముడుపు చెల్లించుకొని, పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్‌బాబుగారి సాయిపథంలో ఉత్తరం వ్రాసి పెట్టి, "నేను ఎంత ధైర్యంతో వున్నా నా వల్ల కావడం లేదు గురువుగారూ. కనికరించండి" అని గురువుగారిని కన్నీళ్లతో వేడుకున్నాను. శిరిడీ నుండి వచ్చాక అదేనెలలో మా అమ్మాయి నెలతప్పింది. ఇప్పుడు తనకి 5వ నెల. "బాబా, గురువుగారూ! కన్నీళ్ళతో మీ పాదాలు కడగడం తప్ప మీకు నేను ఏమి ఇవ్వగలను? మీ అనుగ్రహంతో మా అమ్మాయికి తేలికగా డెలివరీ అయి, ఆరోగ్యవంతమైన పండంటి బిడ్డ పుడతాడని నాకు నమ్మకం వుంది. పాప డెలివరీ అయిన తర్వాత ఆ విషయం మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను".
12 సంవత్సరాల క్రితం మా అక్క నాతో శిరిడీ వచ్చినప్పుడు తన కూతురి వివాహం నిశ్చయమైంది. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్న అక్కావాళ్ళ అబ్బాయి సాయిప్రకాష్‌కి 40 సంవత్సరాలు వచ్చినా వివాహం కాలేదు. 2022, అక్టోబరులో మేము శిరిడీ వెళ్ళినప్పుడు మా అక్క కూడా మాతో శిరిడీ వచ్చి శిరిడీలో బాబాని, గురువుగారిని వేడుకుని లెటర్ వ్రాసుకుంది. అంతే, బాబా ఆశీస్సులతో దత్తజయంతినాడు ఆ అబ్బాయికి సంబంధం కుదిరింది. అమ్మాయి ఢిల్లీ పార్లమెంటులో ఉద్యోగం చేస్తోంది. 2023, ఫిబ్రవరి 11న వాళ్ళ పెళ్లి జరిగింది. ఈవిధంగా బాబా, గురువుగారు నన్ను, మా అక్కని అనుగ్రహించారు.
లాప్టాప్‌కి, ఫోన్‌కి చిన్న గీత కూడా పడకుండా కాపాడిన బాబా
నా పేరు పద్మ. మాది హైదరాబాద్. నేను గత 2 సంవత్సరాలుగా సాయి సచ్చరిత్ర చదువుతున్నాను. ఈ 2 సంవత్సరాలలో సాయిబాబా అద్భుతాలను ఎన్నో అనుభవించాను. అందులో నుండి ఒకటి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 2022, జూన్ నెలలో ఒకరోజు నేను మా అక్కకూతురిని హాస్టల్ నుండి మా ఇంటికి తీసుకొని రావాలని అనుకున్నాను. ఆరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లకుండా నేరుగా తనుండే హాస్టల్‌కి వెళ్ళాను. అందువల్ల నా దగ్గర కంపెనీ లాప్టాప్, మొబైల్ ఉన్న బ్యాగ్ ఉంది. మా అక్కకూతురు హాస్టల్ నుండి మా ఇంటికి వస్తున్నందున తన లగేజీ కూడా చాలా ఉంది. మేము అంత లగేజీతో చాలా దూరం జాగ్రత్తగా వెళ్ళాము. కానీ ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే సమయంలో నా బ్యాగ్ స్కూటీ నుండి జారి కింద పడిపోయింది. అంతే, ఆ బ్యాగ్ మీద నుండి వెనుకనే వస్తున్న బస్సు తాలూకు 2 టైర్స్ వెళ్లిపోయాయి. ఆ బ్యాగులో నా కంపెనీ లాప్టాప్, మొబైల్ ఫోన్‌లతోపాటు బంగారం మరియు చాలా విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఇంక నా పని అయిపోయింది, కంపెనీవాళ్ళు ఏమంటారోనని ఒకటే టెన్షన్, భయం. నిజానికి అప్పటి నా ఫీలింగ్స్‌ని నేను మాటల్లో చెప్పలేను. అంత భయపడిపోయాను. అయితే నా భయమంతా కంపెనీకి సంబంధించినవాటి గురించే, నా వస్తువుల గురించి కాదు. 'బాబా, బాబా' అంటూ భయంభయంగా బ్యాగ్ దగ్గరకి వెళ్ళి, బ్యాగును చేతిలోకి తీసుకొని ఓపెన్ చేశాను. చూస్తే, కంపెనీకి సంబంధించిన వస్తువులు కాకుండా మిగిలిన వస్తువులన్నీ పాడైపోయాయి. బంగారం వంకరపోయింది. కానీ, ల్యాప్టాప్‌కి, ఫోన్‌కి మాత్రం ఏమీ కాలేదు, చిన్న గీత కూడా పడలేదు. ‘నేను చూసేది నిజమేనా?’ అని నన్ను నేను నమ్మలేకపోయాను. అంతా బాబా దయ. ఇలాంటి అనుభవాలను నేను ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాను. బాబా నాకు ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. "ధన్యవాదాలు సాయీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me