సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1476వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కాన్సర్ నుండి కాపాడి బ్రతుకునిచ్చిన బాబా
2. బాబా దయ ఉంటే ఎలాంటి కష్ట పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు 

కాన్సర్ నుండి కాపాడి బ్రతుకునిచ్చిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయిబందువులందరికీ నమస్కారం. నా పేరు విరూపాక్ష. మాది కర్ణాటక. నాకు తెలుగు సరిగా రాదు. నా అనుభవాన్ని సరిగా వివరించలేకపోతే నన్ను క్షమించండి. 25 సంవత్సరాల నుండి గుట్కా సేవించే అలవాటున్న నాకు 2020, నవంబర్ నుంచి నా నోరు తెరవడానికి ఇబ్బంది అయింది. నోటి లోపల ఒక చిన్న వైట్ ప్యాచ్(తెల్ల మచ్చ) వచ్చింది, ఎడమ దవడకు బయట పక్క ఒక చిన్న గడ్డ కూడా ఏర్పడింది. నేను నోటి కాన్సర్ ఏమోనన్న అనుమానంతో ఒక డెంటిస్ట్‌కి చూపించుకున్నాను. అతను నాతో ఏమీ సరిగా చెప్పలేదు. దాంతో నేను అది మౌత్ కాన్సరే అయుండచ్చని రాత్రీపగలూ బాత్రూమ్‍కి పోయి అద్దంలో చూసుకొని విపరీతమైన భయాందోళనలకు గురవుతూ ఆదుర్ద పడుతుండేవాడిని. నా భార్య, కూతురు(ఆ సమయంలో తను MBBS పూర్తిచేసి నీట్ పీజీ పరీక్షకి ప్రిపేర్ అవుతుంది) 'ఎందుకలా ఉన్నార'ని ఎంత అడిగినా నా బాధని మనస్సులో బాబాకి తప్ప ఎవరికీ చెప్పలేదు. ఇలా ఉండగా 2021, మార్చిలో కరోనా వల్ల లాక్డౌన్ మొదలైంది. ఆ సమయంలో నాకు జ్వరం వచ్చింది. దాంతో నాకు ఏమి చేయాలో తెలియక మాటల్లో చెప్పలేనంతగా మరింత భయాందోళనలకు గురయ్యాను. ఒకరోజు మాకు బాగా కావలసిన ఒక ENT డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. కానీ అతనెక్కడ కాన్సర్ అని చెప్తాడో అన్న భయంతో అసలు సమస్య గురించి చెప్పకుండా కేవలం జ్వరమని చూపించుకొని వచ్చాను. నా భార్య మళ్ళీ, "ఇన్నిరోజులుగా ఎందుకిలా ఉంటున్నార"ని అడిగింది. అయినా నేను తనకి ఏమీ చెప్పలేదు. చివరికి తను మా అమ్మాయిని తోడుగా పెట్టి నన్ను డాక్టరు దగ్గరకి పంపింది. అప్పుడు కూడా నేను భయంతో డాక్టరుకి అసలు విషయం చెప్పలెదు. అప్పుడు నా కూతురు డాక్టరుతో, "కొన్నిరోజులుగా నాన్న సరిగా భోజనం చెయ్యట్లేదు. నోట్లో అల్సర్ ఉన్నట్లుంది. ఒకసారి చెక్ చేయండి" అని చెప్పింది. డాక్టరు చెక్ చేసి, "ఇన్ని రోజులూ ఎందుకు చెప్పులేద"ని నన్ను తిట్టి, "కాన్సర్ అయుండొచ్చు, ఒకసారి ధార్వాడ్‍కి వెళ్లి బయాప్సీ టెస్టు చేయించమ"ని చెప్పారు. దాంతో నాలుగు నెలలుగా ఉన్న భయం మరింత ఎక్కువై నరకం అనుభవిస్తూ ప్రతిక్షణం బాబాతో నా బాధ, భయం చెప్పుకుంటూ ఉండేవాడిని. ఒకసారి బాబా పుస్తకంలో "రోగ విముక్తి కలుగును. ఆందోళన చెందకు. 6 సంవత్సరాల నుండి వున్న చింత దూరమవుతుంది. రోగ విముక్తి కలుగుతుంది. మీరు అదృష్టవంతులు. కృతజ్ఞతగా చిలుము, పొగాకు సాయి ముందుంచు" అని వచ్చింది. ఆ సమయంలో నాకు 'బాబా ప్రతిక్షణం నాతో ఉన్నారు' అనిపించింది. తరువాత నా భార్య, కూతరు బయాప్సీ చేయించడానికి నన్ను ధార్వాడ్ SDM హాస్పిటల్‍కి తీసుకెళ్లారు. అక్కడ భయంతో నాకు హై-బిపి వచ్చింది. దాంతో వాళ్ళు టెస్టు చేయమన్నారు. తరువాత బాబా దయవల్ల బిపి తగ్గాక బయాప్సీ చేసి పదిరోజుల్లో రిపోర్టు వస్తుందని అన్నారు. అలాగే  పదిరోజుల తరువాత రిపోర్టు వచ్చింది. అందులో కాన్సర్ సెకండ్ స్టేజ్‍లో ఉందని ఉంది. ఆ భయానక పరిస్థితిలో నేను బాబాను ప్రార్థించి, "ఏ హాస్పిటల్‍కి వెళ్లాలో దారి చూపమ"ని అడిగాను. బాబా పారాయణ పుస్తకంలో "మీ కంటే ముందు నేను అక్కడ ఉంటాను" అని వచ్చింది. తరువాత మేము బయాప్సీ రిపోర్టుని మాకు బాగా పరిచయమున్న ఒక డాక్టరుకి వాట్సాప్‍లో పంపాము. ఆ డాక్టరు రిపోర్టు చూసి మా ఇంటికే వచ్చి దైర్యం చెప్పారు. మేము అతనిని, "ఏ హాస్పిటల్లో చూపించుకోవాలో తెలియజేయమ"ని అతని సలహా అడిగాము. అతను, "బెంగళూరులోని HCG హాస్పిటల్లో చూపించుకోమ"ని చెప్పారు. బాబానే అతన్ని పంపి మాకు మంచి హాస్పిటల్ని, డాక్టరుని చూపించారని మా నమ్మకం.

అంతవరకు దూరంగా ఉన్న నా తమ్ముళ్లు, బావమరుదులు వచ్చి నన్ను బెంగళూరు HCG హాస్పిటల్‍కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్‍లోని హెడ్ అండ్ నెక్ HOD గది తలుపులు తెరవగానే ఎదురుగా నిలువెత్తు ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. బాబాని చూడగానే, "మీ కంటే ముందు ఉంటాను" అన్న బాబా మాట గుర్తుకొచ్చి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ డాక్టరు ఆపరేషన్ గురించి అంతా వివరంగా చెప్పి మాకు ధైర్యం కలుగజేసి, "అంతా బాబా చూసుకుంటారు. మీరు చింతించకండి" అని చెప్పారు. బాబా దయవల్ల ఆపరేషన్ విజయవంతమైంది. ఆరు వారాల తరువాత రేడియో థెరఫీ కూడా చేయించుకున్నాను. నా తమ్ముళ్లు ఆర్థికపరంగా మరియు ఇతరత్రా నాకు చాలా సహాయం చేసారు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆ బాబా దయవల్లనే. ఇంకా లిప్ సర్జరీ, మౌత్ ఓపెనింగ్, టీత్ ఇంప్లాంటేషన్ జరగాల్సి వుంది. అవన్నీ అయిన తరువాత మళ్ళీ బాబా అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

బాబా దయ ఉంటే ఎలాంటి కష్ట పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీకీ జై!!!

ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బంధువులకు, మీ నిస్వార్థమైన సేవకు మా నమస్సుమాంజలి. నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రోహిణి. మాది విజయనగరం. మా బాబు పేరు చరణ్ శ్రీసాయి. తను హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. 2023, సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాబు సెలవలు ముగించుకొని తిరిగి హాస్టల్‌కు వెళ్లాల్సిన సమయంలో తన కాలిపై వేడినీళ్లు పడి పాదం దగ్గరంతా గాయం అయ్యింది. అప్పటికే స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న తనకి అలా అయ్యేసరికి మేము బాబుని హాస్టల్‌కి పంపలేదు. కానీ రెండురోజుల తరువాత ఒక ముఖ్యమైన పరీక్ష వుండటం వలన గాయం మానకుండానే బాబాపై భారమేసి బాబుని హాస్టల్‌కి పంపించి, "బాబుకి ఏ ఇబ్బందీ కలగకుండా గాయం మరియు ఎలర్జీ నయమైతే గనుక మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. బాబా దయ వుంటే ఎలాంటి కష్ట పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు అనేది అక్షర సత్యం. మా బాబు గాయం మరియు ఎలర్జీ ఎటువంటి ఇబ్బందీ లేకుండానే నయమయ్యాయి. ఆ సాయినాథుని కృపకు నా శతకోటి నమస్కారాలు.

శ్రీసాయినాథాయ నమః!!!
సర్వేజనా సుఖినోభవంతు!!!

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo