ఈ భాగంలో అనుభవాలు:
1. సాయినాథుని మహిమ అద్భుతం!2. కడుపులోని బిడ్డకి ఊపిరి పోయడానికే బాబా ఆశీర్వదించారేమో!
సాయినాథుని మహిమ అద్భుతం!
నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు అలేఖ్య. నాకు తెలిసిన ఒక ఆంటీ కూడా సాయి భక్తురాలు. నేను, ఆమె ఎప్పుడూ బాబా గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. నా పరీక్షల సమయంలో ఆమె ప్రతిరోజు ఉదయం నన్ను నిద్రలేపేది. ఆమెతో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఒకసారి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆంటీ వయసు 75 సంవత్సరాలు. తనకి ఏమైందో ఏమోనని నాకు చాలా భయమేసి మళ్లీమళ్లీ ఫోన్ చేస్తుంటే చివరికి ఆమె కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి, "ఆంటీ కింద పడిపోయారు. హాస్పిటల్లో జాయిన్ చేసాము" అని చెప్పింది. నేను వెంటనే హాస్పిటల్‍కి వెళ్లాను. ఆంటీ స్పృహలో లేరు. ఆమెకి బ్రెయిన్ సమస్య అని ఐసియులో ఉంచారు. నేను అంటీకి బాబా ఊదీ పెట్టి, ఇంటికి వచ్చి ఆ రాత్రంతా కన్నీళ్ళతో, "బాబా! ఆంటీకి ఏమీ కాకూడదు" అని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నా రోజువారీ అలవాటు ప్రకారం 'సాయి మారాజ్ సన్నిధి' బ్లాగు చూస్తే, అక్కడ 33వ అధ్యాయంలోని బాబా తాయత్తు గురించిన వివరణ ఉంది. అది ఆంటీ విషయంలో బాబా నాకిచ్చిన పరిష్కారం అనిపించింది. బాబాకి మనస్ఫూర్తిగా పూజచేసి ఊదీ, అక్షింతలు, పూలరెక్కలు అన్ని కలిపి ఒక యంత్రంలా చేసి బాబాకి మ్రొక్కుకొని హాస్పిటల్‍కి వెళ్లి ఆంటీ దిండు కింద ఆ యంత్రం పెట్టి ఇంటికి వచ్చాను. సాయినాథుని మహిమ అద్భుతం! ఆ రాత్రి ఆంటీలో కదలిక మొదలై ఉదయానికి కళ్ళు తెరిచారు. రెండు రోజుల్లో నార్మల్ వార్డుకి మార్చారు. ఆంటీ ఇప్పుడు మాములుగా బాబా పూజ చేస్తూ, మునుపటిలా రోజూ నాతో మాట్లాడుతున్నారు. అంతా బాబా దయ. ఇకపోతే మా నాన్నగారు చెకప్‍కి వెళ్ళినప్పుడు నార్మల్ రిపోర్ట్స్ రావాలని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల అలానే వచ్చాయి. ఇంకా మా బాబుకి ఏ కాస్త జ్వరం, దగ్గు ఉన్నా 'ఆయన మహిమలు పంచుకుంటాన'ని సాయిని వేడుకుంటే అన్ని ఆయనే చూసుకుంటున్నారు. మా కుటుంబ భారం సాయిదే. ఆయనే మా కుటుంబ యజమాని. కర్త, కర్మ, క్రియ అన్ని బాబానే. "సాయినాథా! నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే. మీ దయ, కరుణ, ఆశీర్వాదాలు వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నాము. మీకు అనంతవేల కృతఙ్ఞతలు బాబా".
కడుపులోని బిడ్డకి ఊపిరి పోయడానికే బాబా ఆశీర్వదించారేమో!
నా తండ్రి సాయినాథునికి నమస్కారం. నా పేరు దీపిక. మాది హనుమాన్ జంక్షన్. నేను గత 26 సంవత్సరాల నుండి సాయినాథుని నమ్ముకుంటున్నాను. మా అమ్మ సచ్చరిత్ర పారాయణ చేయడం నాకు అలవాటు చేసింది. నేను రోజూ ఆ పుస్తకం తీసి 'సాయి నాకు ఈరోజు ఏమి మెసేజ్ ఇస్తున్నార'ని చూసుకుంటూ ఉంటాను. అలా చేయడం వల్ల సాయి నాతో మాట్లాడుతూ సలహాలు ఇస్తున్నట్లు ఉంటుంది. నాకు మొదటి పాప పుట్టింది. నాలుగేళ్ళ తర్వాత బాబు పుట్టాడు. తను పుట్టడం మా జీవితంలో ఒక అద్భుతం. బాబు పుట్టక ముందు మేము హైదరాబాద్‍లోని మా బ్రదర్ నిశ్చితార్థానికి హాజరై, అక్కడినుండి శిరిడీ వెళ్లాలని అనుకున్నాము. మా ప్రయాణానికి మూడు రోజుల ముందు నాకు నెలసరి వచ్చింది. సరే వచ్చేసింది, ఇబ్బంది లేదులే అనుకున్నాను. కానీ బ్లీడింగ్ అవ్వడం తగ్గలేదు. అయినప్పటికీ నిశ్చితార్థానికి హాజరై శిరిడీకి ప్రయాణమయ్యే సమయానికి ఐదు రోజులు అయిపోవడంతో 'వెళ్ళొచ్చులే' అని వెళ్ళాము. అయితే బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, దుర్వాసన రావటం జరుగుతుండేది. అయినా అదేదీ పట్టించుకోక సంతోషంగా సాయి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు పూజారి తమ చేయితో సాయి పాదాల తాకి, ఆ చేయిని నాపై, మా పాప తలపై పెట్టి ఆశీర్వదించారు. నాకు ఏదో తెలియాని ఆనందానుభూతి కలిగింది. అంతకుముందు ఎన్నోసార్లు శిరిడీ వెళ్ళాము కానీ, అలా ఆశీర్వాదం లభించడం అదే మొదటిసారి. మాములుగా పూజారులు మనల్ని అలా ఆశీర్వదించారు కదా! కాబట్టి ఆ పూజారి రూపంలో సాయే మమ్మల్ని ఆశీర్వదించారని అనుకున్నాను. తరువాత బస్సులో హైదరాబాద్‍కి తిరుగు ప్రయాణమయ్యాము. రాత్రి మధ్యలో డిన్నర్ కోసం ఓ చోట బస్సు ఆపితే నా భర్త పాపని తీసుకొని కిందకి దిగారు. నేను వాళ్లతో వెళ్లకుండా నీరసంగా ఉందని కళ్ళు మూసుకున్నాను. అప్పుడొక కల వచ్చింది. ఆ కలలో నా భర్త ఒక చిన్న సాయిబాబా విగ్రహం నాకు కానుకగా ఇస్తున్నట్లు కనిపించింది. ఇంటికి వచ్చిన తరువాత కూడా బ్లీడింగ్ అవ్వడం, దుర్వాసన రావడం, నీరసంగా ఉండటం వల్ల సుమారు వారం తరువాత హాస్పిటల్‌కి వెళితే, "ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయ్యిందేమో! ఒకసారి హార్ట్ బీట్ స్కాన్ చేయించండి" అని అన్నారు. స్కాన్ చేయిస్తే హర్ట్ బీట్ వినిపిస్తుంది. అంటే కడుపులో బేబీ ఉంది. రెండో నెల అన్నారు. మేము అది అస్సలు ఊహించలేదు. అప్పుడు నాకు అనిపించింది, 'నా కడుపులోని బిడ్డకి ఊపిరి పోయడానికే శిరిడీలో బాబా ఆశీర్వదించారేమో!' అని. ఎందుకంటే, డాక్టర్ కనిపించిన లక్షణాల బట్టి నాకు అబార్షన్ అయుంటుందనే అన్నారు. ఇప్పుడు మా బాబుకి 13 ఏళ్ళు. ఇదంతా బాబా దయ. ఆయన అనుగ్రహం లేనిదే నా దినచర్య గడవదు.
🙏 Sai na anubavam ni publish chesinanduku dhanyavadalu jai Shree Ram Jai Sai Ram 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me