సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1462వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బిడ్డ ఆరోగ్య విషయంలో బాబా అనుగ్రహం
2. ఏడు రోజుల వ్రతంతో లభించిన బాబా అనుగ్రహం

బిడ్డ ఆరోగ్య విషయంలో బాబా అనుగ్రహం
 
నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2023, మూడవ వారం నుంచి నా ఇద్దరు పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతుండేవారు. చిన్నబాబుకి రెండున్నర సంవత్సరాలు. తనకి తీవ్రమైన జ్వరమొచ్చి ఏమీ తినలేకపోయాడు. హాస్పిటల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి బాబు నీళ్లు కూడా త్రాగలేకపోతుంటే ఏమైందని పరిశీలించి చూస్తే నోటిలో చిన్న చిన్న పొక్కులు కనిపించాయి. బహుశా అవి గొంతు దగ్గర, కడుపులో కూడా ఉన్నాయేమో నీళ్లు త్రాగితే కడుపు పట్టుకొని ఏడ్చేవాడు. సాయంత్రం మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టర్ చూసి, ‘అల్సర్ అయినట్టు ఉంద’ని చెప్పి, వేరే మందులు రాసిచ్చారు. ఇదంతా గురువారం జరిగింది. శుక్రవారం కూడా బాబు పరిస్థితి అలానే ఉంది. తిండి లేక బాబు చాలా నీరసించిపోయాడు. నాకు చాలా భయమేసి, "బాబా! నీ ఊదీ పెట్టి, ఊదీ నీళ్లు త్రాగిస్తున్నా కూడా బాబుకి నయం కాకపోవడం ఏంటి?" అని బాబాతో అనుకొని ఏడ్చేశాను. 'నా మీద, పిల్లల మీద దయ లేదా?' అని బాబాపై కోపడ్డాను కూడా. ఆ ముందురోజు గురువారమే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులు చిన్న చిన్న అనుభవాలు పంచుకునేందుకు 'సాయి మహరాజ్ బ్లెస్సింగ్స్' అనే వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. నిజంగా ఇది నాకోసమే బాబా ఓపెన్ చేయించారని నా మనసులో అనుకున్నాను. ఎందుకంటే, కొద్దిరోజుల ముందు బ్లాగ్ నిర్వాహకులు, "కొంతమంది భక్తులు 'సమస్య తీరితే, బ్లాగులో పంచుకుంటామని బాబాకు మ్రొక్కుకున్నాము, సమస్య తీరింది' అని చాలా చాలా క్లుప్తంగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అలా మ్రొక్కుకోవద్దని చెప్పడం మా ఉద్దేశ్యం కాదుగానీ, అనుభవాలను వివరంగా, బాబా ప్రేమను ఆస్వాదించగలిగే విధంగా పంచుకోవాల"ని చెప్పారు. అప్పటినుండి నేను మనసులో కోరిన ప్రతి చిన్న కోరిక నేరవేరగానే బ్లాగులో పంచుకుంటే ఏమనుకుంటారో అని, పెద్దపెద్ద అనుభవాలు మాత్రమే పంచుకోవాలని అనుకున్నాను. అందుకే చిన్న చిన్న విషయాలలో బాబాను కేవలం ప్రార్థించేదాన్నే తప్ప, బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకునేదాన్ని కాదు. అయితే కొన్నిరోజులకే బాబా నా మనసులో ఉన్న వెలితిని తీసేశారు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులు చిన్నచిన్న అనుభవాలను పంచుకోవడానికి 'సాయి మహరాజ్ బ్లెస్సింగ్స్' అనే గ్రూపుని క్రియేట్ చేయడం, నేను అందులో జాయిన్ అవడం జరిగింది. వెంటనే బాబాకి, "బాబా! మా చిన్నబాబుకి గొంతునొప్పి తగ్గి, తను మంచిగా తినగలిగితే సోమవారం నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ బ్లెస్సింగ్స్' గ్రూపులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అయితే శనివారానికి కూడా మా బాబుకి ఏమాత్రమూ నయం కాలేదు. దాంతో నేను, 'బాబా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకిలా ఆయనపై నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నారు?' అని చాలా నిరాశకు గురయ్యాను. మరుసటిరోజు ఆదివారం ఉదయం కూడా బాబు చాలా బాధతో ఏడుస్తూ తిన్నాడు. అయితే అప్పటివరకు బాబా నన్ను పరీక్షించినప్పటికీ ఆ రాత్రి బాబు మంచిగానే తిన్నాడు. నాకు చాలా సంతోషమేసింది. బాబా దయతో సోమవారం ఇంకా మంచిగా, అంటే కడుపునిండా తిన్నాడు. ఇప్పుడు తనే ఆకలి అని తింటున్నాడు. "బాబా! నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బాబుకి ఆదివారానికల్లా తగ్గిపోతే సోమవారంనాడు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు మ్రొక్కుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల సోమవారం నా అనుభవాన్ని వ్రాయలేకపోయాను. దయచేసి నన్ను క్షమించు తండ్రీ. నా ఆఫీసులో జరుగుతున్న పరిణామలు నన్ను చాలా ఇబ్బందులకు, ఒత్తిడికి గురిచేస్తున్నాయి బాబా. 'న్యాయబద్ధంగా ఏది అడిగినా వెంటనే తీరుస్తాను’ అంటావు కదా బాబా. మరి నేను న్యాయబద్దంగానే ఆడుగుతున్నా కూడా నా ఆఫీస్ విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? నాకు ఇంతలా అన్యాయం జరుగుతున్నా, నేను బాధపడుతున్నా ఎందుకు మౌనంగా చూస్తున్నావు? నా పరిస్థితి అడవిలో ఒంటరిగా వదిలేసినట్లు ఉంది బాబా. ప్లీజ్ బాబా! నన్ను ఈ మెంటల్ టెన్సన్స్ నుండి కాపాడు, నాకు అన్యాయం జరగకుండా చూడు. నా పనితనం చూసి మా ఆఫీసర్ మనసు మార్చుకోవాలి బాబా. దయచేసి ఈ విషయంలో శికాయత్(ఫిర్యాదు) చేసే పరిస్థితి మళ్ళీ కల్పించకు తండ్రీ".

ఏడు రోజుల వ్రతంతో లభించిన బాబా అనుగ్రహం 

నా పేరు మౌనిక. మాది చెన్నై. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయిబాబా కుటుంబంతో పంచుకోవాలని నేను ఇలా మీ ముందుకు వచ్చాను. 2022, మే లేదా జూన్ ప్రాంతంలో నా భర్త సేల్స్&మార్కెటింగ్‌ ఫీల్డ్‌లో చేరాలన్న కోరికతో తను అప్పటివరకు చేస్తున్న సివిల్ సైడ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఆ ఉద్యోగం మానేసిన తర్వాత ఆయన సేల్స్&మార్కెటింగ్‌ ఫీల్డ్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తనకి సేల్స్&మార్కెటింగ్‌ ఫీల్డ్‌లో అనుభవం లేనందున అన్నిచోట్లా తిరస్కారమే ఎదురైంది. అప్పుడు మా అమ్మ నాతో, "సాయిబాబా మీద నమ్మకం ఉంచమ"ని చెప్పింది. దాంతో నేను రోజూ బాబాని ప్రార్థించడం మొదలుపెట్టాను. అయినప్పటికీ నా భర్తకి ఉద్యోగం రాలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మా ఆంటీ, "బాబాకి అష్టోత్తరం చేయమ"ని చెప్తే, చేశాను. యుఎస్ఏ నుండి వచ్చిన మరో ఆంటీ ‘సుందరకాండ వ్రాయమ’ని చెప్తే, అది కూడా చేశాను. చివరికి ఇంకో ఆంటీ, 'ఏడు రోజులు బాబా వ్రతం’ చేయమని చెప్పింది. 7 రోజుల వ్రతం అంటే, రోజూ బాబా ముందు దీపం పెట్టి, బాబా అష్టోత్తరం చదువుతూ అక్షింతలు వేసి, అష్టోత్తరం చదవడం పూర్తయ్యాక, బాబా దగ్గర వేసిన అక్షింతలు తలపై వేసుకోవాలి. అప్పటివరకు ఏమీ తినకుండా ఉండి చిన్న గ్లాసుతో పాలు, అటుకులు బాబాకు నైవేద్యం పెట్టి, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా నేను ఆ వ్రతాన్ని గురువారంరోజున మొదలుపెట్టి బుధవారంనాటికి పూర్తిచేసి, మరుసటిరోజు గురువారంనాడు బాబాకి స్వీట్ నివేదించాను. బాబా దయతో నా వ్రతానికి ఫలితం దక్కింది. నా భర్తకి ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది. మేమంతా చాలా సంతోషించాము. నిజంగా బాబా మహిమ అమూల్యమైనది, వెలకట్టలేనిది. ఇప్పుడు బాబా నాకు అత్యంత ఆప్తమిత్రుడని నా గొప్ప నమ్మకం. ఆయన ఎప్పుడూ నా హృదయంలో ఉంటూ నాతోనే ఉంటారు. ఆయన యందు నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కుదిర్చిన నా కుటుంబసభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sairammm 🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  4. Sri samardha sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo