సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1470వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి సమస్యనైనా పోగొట్టగల సమర్థులు బాబా
2.  స్మరణ, కీర్తనలు వినడం ద్వారా సమస్యను తొలగించిన బాబా
3. ఊదీతో వెంటనే తగ్గిన జ్వరం 

ఎటువంటి సమస్యనైనా పోగొట్టగల సమర్థులు బాబా

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను బాబా భక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు, వాటిలో ఈ చిన్న అనుభవాన్ని పంచుకోవడం మర్చిపోయాను. "నన్ను క్షమించండి బాబా". ఇక అసలు విషయానికి వస్తే.. నేను సీఏ విద్యార్థినిని. హాస్టల్లో ఉంటే నా ఆరోగ్యం బాగోదని ఇంట్లోనే ఉంటూ చదువుకునేదాన్ని. అలా చాలాకాలం గడిచింది. కానీ నా సీఏ పూర్తికాలేదు. అందువల్ల కొన్నేళ్ల ముందు హైదరాబాదులో ఉన్న మా బంధువుల ఇంట్లో ఉంటూ ఉద్యోగం వెతుక్కుందామని వెళ్లాను. వాళ్ళింట్లో ఉన్నప్పుడు నా జుట్టు విపరీతంగా ఊడిపోతుండేది. జుట్టు ఊడిపోతుందన్న భయం మరియు మరికొన్ని ఇతర కారణాల వల్ల నేను హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చేసి మునుపటిలా ఇంట్లోనే చదువుకోసాగాను. ఇలా ఉండగా, ఎనిమిది నెలల క్రిందట డిప్రెషన్ వల్ల ఇంట్లో ఉండలేక మళ్ళీ హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చూసుకుందామని అనుకున్నాను. కానీ సిఏ చదువు వల్ల మరియు హోమియో డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల రియాక్షన్ వచ్చి నా జుట్టు చాలా పలుచగా అయిపోయింది. ఆ విషయంగా నేను, "బాబా! నేను హైదరాబాద్ వెళ్లాలని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళటం వల్ల నా జుట్టు మరింత ఊడకుండా చూడండి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల జుట్టు ఊడకపోగా కొంచెం ఒత్తుగా పెరిగింది. ఈ అనుభవం చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ, నాకింకా పెళ్లి కాలేదు. "బాబా! ఎటువంటి సమస్యనైనా పోగొట్టగల సమర్థులు మీరు. మీకు చాలా ధన్యవాదాలు బాబా".

ఈమధ్య ఒకరోజు పగలూరాత్రీ తేడా లేకుండా మా నాన్న విపరీతమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. ఆ కారణంగా ఆయనకి బాగా ఒళ్ళు నొప్పులు, నీరసం వచ్చాయి. ఆయన పరిస్థితి చూసి మాకు చాలా భయమేసింది. నేను బాబా ఊదీ వేసిన నీళ్లు నాన్న చేత త్రాగించి, "నాన్న ఇబ్బందిని తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. ఒకరోజు రాత్రంతా భరించలేనంతగా దగ్గిన నాన్నకి రెండవ రోజు దగ్గు అస్సలు రాలేదు. వారం రోజుల్లో ఆయన మాములు మనిషి అయ్యారు. ఇది బాబా చూపిన అద్భుత మహిమ. నిజానికి నాన్న పరిస్థితి చూసిన మేము ఒక్కరోజులో దగ్గు తగ్గుతుందని అసలు అనుకోలేదు. ధూమపానం చేసే మా నాన్నకు దగ్గు తగ్గిందంటే సాక్షాత్తూ ఆ సాయినాథుని కరుణే కారణం. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

స్మరణ, కీర్తనలు వినడం ద్వారా సమస్యను తొలగించిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సత్యసాయి. 2022, డిసెంబరులో మా అమ్మ కంటికి రెటీనా ఆపరేషన్ చేశారు. బాబా దయవలన ఆ ఆపరేషన్ బాగా జరిగింది. ఒక నెల తర్వాత డాక్టరు వద్దకు వెళ్ళినప్పుడు, "కన్ను బాగానే ఉంది. కళ్లద్దాలు వాడుతూ ఐ-డ్రాప్స్ వేసుకుంటుంటే చాలు. నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోండి" అని చెప్పారు. బాబా దయవలన అంతా మంచే జరుగుతుందనుకున్న సమయంలో 2023, ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం నుంచి అమ్మకి కన్ను నొప్పి ఎక్కువగా వుండి, ఆ కన్ను అస్సలు తెరవలేకపోయింది. డాక్టర్ చెప్పిన పెయిన్ కిల్లర్ వేసినా ఉపయోగం లేకపోయింది. నేను, నాన్న చాలా ఆందోళన చెంది, "ఎలాగైనా నొప్పి తగ్గాల"ని బాబా, హనుమంతులకి మొక్కుకున్నాము. అమ్మ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమ:' అని స్మరిస్తూ పడుకుంది. కొద్దిసేపటి తర్వాత అమ్మ లేచింది. అప్పటికి నొప్పి కొద్దిగా ఉన్నా కన్ను తెరవలేకపోయింది. బాబా, హనుమంతుని మంత్రాలు యూట్యూబ్‌లో వింటూ ఒంటికన్నుతో పనులు చేయడం ప్రారంభించింది. నేను, నాన్న మా పనులు చూసుకొని మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు చూస్తే, అమ్మ మాములుగా ఉంది. ఉదయం నుంచి నొప్పితో బాధపడుతున్నట్లు అస్సలు లేదు. భగవంతుని స్మరణ, కీర్తనలు వింటుంటే అమ్మకి తెలియకుండానే తన కంటినొప్పి తగ్గిపోయి, మామూలుగానే తన కన్ను తెరుచుకుందని మాకు చాలా ఆశ్చర్యమేసింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా".

ఊదీతో వెంటనే తగ్గిన జ్వరం 

నా పేరు సుబ్బారావు. సాయిబాబా ఆశీస్సులతోనే నేను జీవనం సాగిస్తున్నాను. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు అనుభవాలు పంచుకుంటున్న సాయి భక్తులందరికీ నా కృతజ్ఞతలు. ఒకసారి హఠాత్తుగా నా స్నేహితుని కొడుకుకి విపరీతమైన జ్వరమొచ్చి మంచం మీద కుప్పకూలిపోయాడు. ఆ ప్రాంతంలో మంచి ఆసుపత్రి సౌకర్యం లేనందున సలహా ఇవ్వడానికి, సహాయం చేయడానికి ఎవరూ లేరు. అంటే బాబా తప్ప మరెవరూ జాగ్రత్త తీసుకొనే పరిస్థితి లేదు. అందువల్ల మేము, "ఆ అబ్బాయికి వెంటనే నయం చేయండి" అని బాబాను ప్రార్థించి, అబ్బాయి నుదుటన ఊదీ పెట్టాము. వెంటనే జ్వరం తగ్గి మరుసటిరోజు ఉదయానికి అబ్బాయి సాధారణ స్థితికి వచ్చాడు. "ధన్యవాదాలు బాబా".

2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om |||||Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo