ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా మహిమ - వారి అనుగ్రహం2. సాయినాథుని కృపవలన పోయిన పరీక్షల భయం
బాబా మహిమ - వారి అనుగ్రహం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు జగదీశ్వర్. నేను గతంలో బాబా నాకు ప్రసాదించిన నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని పంచుకుంటాను. అది 2018వ సంవత్సరం. నేను కరీంనగర్ బస్‌స్టేషన్‌లో కస్టమర్ రిలేషన్ మేనేజరుగా పనిచేస్తున్న రోజులు. ప్రయాణీకుల ఫిర్యాదులు ఎక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం కఠినంగా ఉంటుండేవాణ్ణి. ఆ సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి రోజున నేను ఎప్పటిలాగే అన్ని స్టాల్స్ చెక్ చేస్తుండగా ఎంక్వైరీ కౌంటర్ పక్కనున్న క్యాంటీన్‍లో అనుమతి లేని నాసిరకం వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్టు గమనించి, సెక్యూరిటీ సిబ్బందితో కలసి ఆ వాటర్ బాటిల్ బాక్సులన్నీ సీజ్ చేశాను. విషయం తెలుసుకున్న ఆ క్యాంటీన్ లైసెన్సుదారుడు చేతిలో పదివేల రూపాయలు(500 రూపాయల నోట్లు) తీసుకొచ్చి, అందరూ చూస్తుండగా నాతో, "తీసుకోండి సార్. యాభైవేల రూపాయలిమ్మన్నారు. ఇదివరకు 40 వేలు ఇచ్చాను. మిగిలిన పదివేల రూపాయలు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైతే ఇలా చేస్తారా? తీసుకోండి" అంటూ తనవాళ్ళతో వీడియో తీయించాడు. నేను నివ్వెరపోయి, "బాబా, ఇదేమిటి?" అనుకుని, వెంటనే పోలీస్‌స్టేషన్లో రిపోర్టు చేసి, పైఅధికారులకు విషయం చెప్పాను. ఆ షాపు లైసెన్సుదారుడు తాను తీయించిన వీడియోను అన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకి ఇచ్చి, ‘తనను నేను లంచం అడిగినట్లు, తాను ఇవ్వకపోతే నేను బాటిల్స్ సీజ్ చేసినట్లు’ చెప్పాడు. కానీ బాబా దయవల్ల మీడియావాళ్ళు మొత్తం విచారించి, ఆ లైసెన్సుదారుడు కావాలని కుట్రపన్ని, నన్ను లంచం కేసులో ఇరికించాలని చూస్తున్నాడని నిర్ధారించుకున్నారు. అదే విషయం V6 ఛానల్లోని తీన్మార్ వార్తల్లో, 'నేను స్త్రిక్ట్‌గా ఉండడం వల్ల ఇలా చేశార'ని వచ్చింది. తరువాత కూడా ఆ లైసెన్సుదారుడు తనవాళ్ళతో కరీంనగర్ చౌరస్తాలలో నన్ను శిక్షించాలని అర్ధనగ్న ప్రదర్శన చేసి, ఫోటోలు తీసి వాటిని ప్రింట్ మీడియా వాళ్లకి ఇచ్చాడు. బాబా దయవల్ల నా నిజాయితీ అందరికీ తెలుసు కాబట్టి, నా గురించి వాళ్ళు ప్రతికూలంగా ఏమీ వ్రాయలేదు. అతను ఎన్ని కుట్రలు చేసినా బాబా అనుక్షణం నన్ను నీడలా కాపాడారు. చివరికి ఆ లైసెన్సుదారుడు కరీంనగర్ బస్‌స్టేషన్ వదిలి వెళ్ళిపోయాడు.
నాకు 58 సంవత్సరాలు నిండాక 2020, జనవరి 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, నేను ఆ సమయంలో జగిత్యాల డిపో మేనేజరుగా పనిచేస్తున్నాను. పదవీవిరమణ చేసేముందు ఒకసారి బాబా దర్శనం చేసుకోవాలని 2019, అక్టోబర్ నెలలో శిరిడీ వెళ్లేందుకు ట్రైన్ టికెట్లు, వసతి, ఆరతి టికెట్లు అన్నీ ముందస్తుగా బుక్ చేసుకున్నాను. కానీ బాబా నిర్ణయం మరోలా ఉంది. నేను శిరిడీ వెళ్లాలనుకున్న అక్టోబర్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా TSRTC సమ్మె ప్రారంభమైంది. డిపో మేనేజర్లు తప్ప అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం సమ్మె విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. నాకు సెలవు దొరకక నా శిరిడీ యాత్ర రద్దయింది. దాదాపు 2 నెలల తర్వాత నవంబర్ నెల చివరివారంలో సమ్మె ఆగింది. నేను పదవీవిరమణ చేయడానికి ఇంకా కేవలం రెండు నెలలే ఉన్నాయి. డిసెంబర్ నెల మొదటివారంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్‌గారు నిరాశలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను చేరదీసే క్రమంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ప్రతి డిపో మేనేజరును మరియు ప్రతి డిపో నుండి 15 మంది ఉద్యోగులను ప్రగతిభవన్‌కి పిలిచి భోజనం పెట్టి, వరాల జల్లు కురిపించారు. ఆ వరాలలో, ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి 60 సంవత్సరాలకు పెంచడం ఒకటి. కానీ సమయం తక్కువ ఉంది. రెండు నెలల లోపే నోట్ ప్రాసెస్ అయి సీఎం అప్రూవల్ పొంది జీవో రావాలి. అప్పుడే 60 సంవత్సరాల వయోపరిమితి నాకు వర్తిస్తుంది. అయితే బాబా దయవలన అన్నీ చకచకా జరిగి డిసెంబర్ నెల చివరివారంలోనే జీవో వచ్చింది. ఆ విధంగా నాకు రెండు సంవత్సరాల పదవీకాలం అదనంగా లభించింది. అది బాబా మహిమ, వారి అనుగ్రహం.
2022, డిసెంబరులో నా శ్రీమతి తన బట్టలషాపు తాళం ఎక్కడో పెట్టి మర్చిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు, "బాబా! తాళం దొరికితే, మీ బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకోగానే ఇంకో గదిలో ఆ తాళం దొరికింది. ఎక్కువ ఆందోళనపడకుండా సాయి కరుణించారు. "బాబా! నేను తెలిసితెలిసి కొన్ని తప్పులు చేశాను. దయతో నాకు క్షమాభిక్ష పెట్టి నన్ను, నా కుటుంబసభ్యులందరినీ కాపాడండి. సర్వాంతర్యామీ, సర్వలోకరక్షకా, సర్వదేవతాస్వరూపా, సాయిదేవా! శరణు శరణు!".
సాయినాథుని కృపవలన పోయిన పరీక్షల భయం
సద్గురు శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. నా కూతురు హైదరాబాదులో మొదటి సంవత్సరం మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతుంది. ఆ కోర్సులో సంస్కృతం కూడా ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్టు మొట్టమొదటిసారి చదువుతుండటం వల్ల మా అమ్మాయికి పరీక్షలంటే భయం ఏర్పడి ‘పరీక్షలు వ్రాయన’ని మొండిపట్టు పట్టింది. దాంతో నేను చాలా ఆందోళనకు గురయ్యాను. చాలా భయమేసి మనసులో, "నా కూతురుకి సంస్కృతం అర్థమయ్యేలా చేసి, పరీక్షల పట్ల ఏర్పడిన భయాన్ని తొలగిస్తే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని ఆ సాయినాథుని వేడుకున్నాను. ఆ తండ్రి కృపాకటాక్షం వల్ల మా అమ్మాయి చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ తనని ప్రత్యేకంగా పిలిపించి సంస్కృతంపై అవగాహనను కల్పించారు. తరువాత 2023, ఫిబ్రవరి 2న మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, “సంస్కృతంతోపాటు అన్ని పరీక్షలు మంచిగా వ్రాస్తున్నాన"ని చెప్పింది. అది విని నాకు చాలా ఆనందమేసింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే, ఈ నెలలో జరగబోయే మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా తను బాగా వ్రాసేలా అనుగ్రహించండి సాయినాథా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha