1. నమ్మినవారికి సాయినాథుని అనురాగం పుష్కలంగా లభిస్తుంది
2. నొప్పి తగ్గేలా అనుగ్రహించిన బాబా
నమ్మినవారికి సాయినాథుని అనురాగం పుష్కలంగా లభిస్తుంది
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు గిరి. నేను సాయిభక్తుడిని. నా జీవితంలో జరిగిన నమ్మలేనటువంటి ఒక అపురూప సంఘటన గురించి నా సహచర సాయిబంధువులతో పంచుకుంటున్నాను. 2001లో నా భార్యకొక సెలవుదినంనాడు నేను పనిమీద వేరే వూరు వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనకి ఊసుపోలేదు. ఒంటరితనం భరించలేక ఇంటిని శుభ్రం చేయాలనుకుంది. ఒక చిన్న స్టూలు పైకెక్కి ఇంటి పైకప్పు/సీలింగ్‌ను శుభ్రం చేస్తుండగా తను అదుపు తప్పి స్టూలు పైనుంచి జారి క్రిందపడింది. ఎడమచేయి బాగా వాచి విపరీతమైన నొప్పిపెట్టసాగింది. ఆ రోజుల్లో మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉంది, మొబైల్ ఫోన్ లేదు. అందువల్ల వేరే ఊరిలో ఉన్న నాకు సకాలంలో సమాచారం అందలేదు. మా ఇరుగుపొరుగువాళ్ళు సహాయం చేసి నా భార్యను హాస్పిటల్లో చేర్చారు. కొంతసేపటికి నేను వచ్చి, విషయం తెలుసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాను. నా భార్య మోచేతి వద్ద ఒక ఎముక విరిగిందని, మరొకటి పక్కకి జరిగిందని, తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. నా స్నేహితులందరి నోటా ఒకటే మాట, "సాయిబాబా భక్తుడవైన నీకు ఎందుకు ఇలా జరిగింది?" అని. నేను ఇదంతా కేవలం మా దురదృష్టమని అనుకున్నాను.
సరే, ఆపరేషన్ చేయించే ముందు మరొక డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం మంచిదని మరో డాక్టరుని సంప్రదించాను. ఆ డాక్టర్ కూడా ఆపరేషన్ తప్పనిసరని తేల్చేశారు. కొంతమంది మిత్రులు, "చేయించే ఆపరేషన్ ఏదో ఈ ఊరిలో ఎందుకు? హైదరాబాద్ వెళ్ళండి. అక్కడైతే సీనియర్ డాక్టర్లు ఉంటారు కదా!" అని సలహా ఇచ్చారు. మిత్రుల సలహామేరకు అదేరోజు రాత్రి మేము హైదరాబాదుకు ప్రయాణమయ్యాము. నేను ప్రయాణంలో ప్రతి నిమిషం సాయి నామస్మరణ చేస్తూ, "బాబా! ప్లీజ్ బాబా, ఆపరేషన్ లేకుండా నా భార్య చేతిని బాగుచేయలేవా?" అని కొన్ని వందలసార్లు బాబాను నా మనసులో అడిగాను. హైదరాబాద్ చేరుకున్నాక ఒక సీనియర్ డాక్టర్ వద్దకు వెళ్ళాము. ఆ డాక్టర్ టేబుల్ మీద చిరునవ్వు చిందిస్తూ బాబా దర్శనమిచ్చారు. బాబా ఫోటోను చూడగానే సాయిసచ్చరిత్రలోని, “నీవు నీ గమ్యం చేరుకోవడానికి ముందే నేను అక్కడికి చేరుకుంటాను” అన్న అద్భుతమైన బాబా వాక్యం నాకు గుర్తుకొచ్చింది. బాబా దర్శనంతో నా మనస్సులోని బాధనుండి ఎంతో ఊరట లభించింది. 'అన్నిటికీ బాబానే రక్షకుడు' అని అనుకున్నాను. ఆ సమయంలో అంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు.
డాక్టర్ పరీక్షలు చేసి, "రేపు ఉదయం ఆపరేషన్ చేస్తాము" అని చెప్పి, నొప్పి నివారణకు కొన్ని మందులు ఇచ్చారు. ఆ రాత్రంతా మాకు శివరాత్రే. కుటుంబమంతా నిద్రలేకుండానే గడిపాము. మరుసటిరోజు ఉదయం అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాత నా భార్యను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకుని వెళ్ళారు. ‘ఆపరేషన్‌కు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంద’ని సంబంధిత వైద్యులు చెప్పారు. కానీ ఒక అరగంట తరువాత ఆపరేషన్ థియేటర్ లోపలి నుండి వైద్యులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. విషయమేంటో తెలియక నాకు, మా బంధువులకు కంగారు ఎక్కువైంది. డాక్టర్ నా వద్దకు వచ్చి ఆప్యాయంగా నా భుజంపై చేయివేసి, "కంగారుపడకండి. ఆపరేషన్ ప్రారంభించేముందు పేషేంట్‌కి సెడేషన్(మత్తు) ఇచ్చాము. అయితే ఆపరేషన్ లేకుండా సరిచేయగలనేమో చూద్దామనిపించి పేషెంట్ చేతిని సరైన సైంటిఫిక్ పద్దతిలో తిప్పి చూశాను. ఫలితంగా ఆ రెండు ఎముకలు రీసెట్ అయ్యాయి. ఈరోజు సాయంత్రం పేషంట్‌ను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయించండి" అని చెప్పారు. ఒక్కసారిగా 'ఇది కలా? నిజమా?' అనిపించి మళ్ళీ మళ్ళీ డాక్టర్లను అడిగాను. వాళ్ళనుంచి చిరునవ్వు మాత్రమే వచ్చింది. నాకు ఆ నవ్వులో కేవలం నా బాబానే కనిపించారు. మొదట బాబాకి, తదుపరి సంబంధిత వైద్యులకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. 'నీవు తప్ప మరో మార్గం లేదు, నీవు మాత్రమే రక్షకుడవ'ని నమ్మినవారికి సాయినాథుని అనురాగం పుష్కలంగా లభిస్తుంది. ఇందుకు ఈ సంఘటనే ఉదాహరణ.
నొప్పి తగ్గేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. 2023, జనవరి నెల మూడోవారం మధ్యనుండి 15 రోజులపాటు నా పక్కటెముకల్లో ఒకవైపు చాలా నొప్పి వస్తుండేది. నేను బాబాకి నమస్కరించుకొని, "బాబా! నాకు నొప్పి తగ్గేలా చూడు తండ్రీ. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకొని రెండు రోజులు బాబా ఊదీని నీళ్ళల్లో కలుపుకొని త్రాగాను. కానీ నొప్పి తగ్గలేదు. దాంతో ఏమవుతుందోనని నాకు భయం ఎక్కువైంది. ఒకరోజు సాయంత్రం బాబాని తలచుకుంటూ ఫేస్‌బుక్ ఓపెన్ చేశాను. అప్పుడొక సాయి గ్రూపులో, "నొప్పి ఉన్న చోట ఊదీ రాసుకో, 8 రోజులలో నొప్పి తగ్గుతుంది తల్లీ" అని వ్రాసి ఉంది. అది బాబా నాకే చెప్తున్నట్లు అనిపించి వెంటనే ఊదీని నొప్పి ఉన్న చోట రాసుకొని, దాంతోపాటు ఒక రెండు రోజులు టాబ్లెట్లు వేసుకున్నాను. బాబా దయతో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "కృతజ్ఞతలు బాబా. నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడు తండ్రీ".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
రోజూ సాయి లీలలు చదువుటుంటే చాలా ఆనందంగా ఉంది.సాయి అందరిని కాపాడుతూ వుంటే చాలా ఆనందంగా ఉంది.అందరం సాయి ప్రేమను పొందిన వాళ్ళం.ఓం సాయి రామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me