ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయ2. ఊదీతో తగ్గిన గుండెల్లో నొప్పి
బాబా దయ
నా పేరు అంజలి. పిలిస్తే పలికే దైవం నా సాయితండ్రి. "మీకు వేలవేల నమస్సులు తండ్రీ". బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఈమధ్య మా తమ్ముడు ప్రసాద్ వాళ్ళింట్లో, వాళ్ళ వదినావాళ్ళ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అవి తారాస్థాయికి చేరడంతో, ‘'ఆ గొడవలు ఎలాగైనా తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాళ్ళ సమస్య పరిష్కారమైంది. 2023, జనవరి 8న మేము, మా తమ్ముడు ప్రసాద్, తన అన్నయ్య కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాము. వెహికల్ విషయంలో నా భర్త కొంచెం నాతో వాదించారు. అప్పుడు నేను, "ఏ ఇబ్బందీ లేకుండా మేము సంతోషంగా యాదగిరిగుట్ట వెళ్ళొస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల మేమంతా సంతోషంగా యాదగిరిగుట్ట వెళ్ళొచ్చాము. మా సహోద్యోగి రాజు దర్శనం తొందరగా అయ్యేలా సహాయం చేశారు. అంతా బాబా దయ.
2023, జనవరి 14న మేము, మా తమ్ముడు ప్రసాద్ కలిసి తిరుపతి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! మేము క్షేమంగా వెళ్లి, లాభంగా వచ్చేలా చూడండి. అలాగే అక్కడ మాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శనం అయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా ప్రయాణం బాగా జరిగి మేము తిరుపతి చేరుకున్నాము. మాకు తిరుమలలో రూమ్ దొరకనందున ఆన్లైన్‌లో తిరుపతిలో శ్రీనివాసంలో రూమ్ బుక్ చేసుకున్నాము. ‘సరే, పండగ సమయం కదా, ఏదైనా బాబా దయ’ అని అనుకున్నాము. ఆరోజు రాత్రి మాకు మంగాపురంలో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అదృష్టంకొద్దీ అమ్మవారి కుంకుమ నాకు ప్రసాదంగా లభించింది. అంతా బాబా దయ. చలికాలం కదా, తిరుపతిలో చలి బాగా ఎక్కువగా ఉంటుందనుకున్నాం. కానీ, బాబా దయవల్ల ఆరోజు అస్సలు చలి లేదు. బ్లాంకెట్ కప్పుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. కానీ నా భర్తకి హఠాత్తుగా జ్వరం వచ్చింది. రెండు బ్లాంకెట్లు కప్పినా ఆయనకి చలి ఆగలేదు. అప్పుడు రాత్రి పది గంటలైంది. మాతో మా తమ్ముడు ప్రసాద్ ఉండటం వల్ల నాకు అంతగా భయమేయలేదు. తను వెళ్లి డోలో టాబ్లెట్, కాఫీ తెచ్చాడు. నేను ఆ టాబ్లెట్ వేసి మావారిని పడుకోబెట్టి, "బాబా! తెల్లారేసరికి ఆయనకి జ్వరం తగ్గి నార్మల్ అవ్వాలి" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు వేకువఝామున మేము కాణిపాకం వెళదామని అనుకున్నందున వేకువఝామున మావారికి మరో టాబ్లెట్ ఇచ్చాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి జ్వరం తగ్గింది. మేము సంతోషంగా కాణిపాకం వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాము. తరువాత అర్ధగిరి వెళ్లి ఆంజనేయస్వామి దర్శనం కూడా చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.
ఒకసారి మా పాపకు కొంచెం జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఉదయం బ్రష్ చేస్తుంటే కఫంలో కొద్దిగా రక్తం పడింది. "బాబా! కఫంలో రక్తం పడటం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు పరవాలేదు. ఇంకోరోజు పాప కంట్లో చీమ పడింది. అది కంటిగుడ్డుకు అతుక్కొని తీయాలని ప్రయత్నిస్తే ఎంతసేపటికీ రాలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! పాప కంటికి ఇబ్బందేమీ లేకుండా చూడండి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికి ఆ చీమ కంట్లో నుండి బయటకి వచ్చింది. పాప కంటికి ఇబ్బంది కాలేదు.
మా బాబు 8వ తరగతి చదువుతున్నాడు. తనకి ఎగ్జామ్స్‌లో లెవెల్ ప్రమోషన్స్ వుంటాయి. నేను, "తనకి లెవెల్ ప్రమోషన్స్ రావాల"ని బాబాను కోరుకున్నాను. బాబా దయవల్ల మా బాబు థర్డ్ లెవెల్ వరకు వెళ్ళాడు. ఇలాగే బాబా దయవల్ల తదుపరి లెవెల్ ప్రమోషన్స్ కూడా వస్తాయని నమ్ముతున్నాను. ఇకపోతే, 2023, జనవరి నెలాఖరులో స్కూలులో పిల్లలు ఆడుకుంటూ మా బాబుని వెనకనుండి తోశారు. దాంతో బాబుకి వెనకంతా పట్టేసింది. వాడు, "నన్ను స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్ళమ"ని వాళ్ల నాన్నకి స్కూలు నుంచి ఫోన్ చేసి చెప్పాడు. ఆ విషయం నాకు తెలిసి 'వాడికి ఏమైందో!' అని చాలా భయమేసి, "బాబు మామూలు అయితే, మీ అనుగ్రహాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబుకి అంత సమస్యమీ కాలేదు. పక్కటెముకల దగ్గర కొంచెం తగిలింది, అంతే. తెల్లవారేసరికి మామూలు అయ్యాడు. అంతా బాబా దయ. అదివరకు నాకు తగ్గిన మెడనొప్పి ఈమధ్య మళ్ళీ వచ్చి బాబా దయవల్ల తగ్గింది. నేను ఆ విషయం బ్లాగులో పంచుకుంటాననుకున్నాను. కానీ ఆలస్యమైంది. మరలా నొప్పి అనిపించేసరికి, 'బ్లాగులో పంచుకోమ'ని నా తండ్రి గుర్తుచేస్తున్నారని నాకు అర్థమైంది. "నన్ను క్షమించు బాబా. నా ఆరోగ్యాన్ని మీరే సరిచేయాలి. చేస్తారని నాకు మీ మీద పూర్తి నమ్మకముంది బాబా. అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
ఊదీతో తగ్గిన గుండెల్లో నొప్పి
సాయినాథ్ మహరాజ్‌కి నా శతకోటి వందనాలు. నేనొక సాయిభక్తురాలిని. 2023, జనవరి 28న మావారు తనకు గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందంటూనే కంపెనీకి వెళ్లారు. గంటసేపటి తరువాత ఫోన్ చేసి, "నొప్పి తగ్గలేదు" అని చెప్పారు. నాకు చాలా భయమేసింది. మావారి పర్సులో ఎప్పుడూ బాబా ఫోటో, ఊదీ ఉంటాయి. నేను మావారితో, “బాబా ఊదీ పెట్టుకొని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగమ”ని చెప్పాను. అలాగే, కొంచెం ఊదీని గుండెల మీద రాసుకోమని కూడా చెప్పాను. తరువాత బాబాకు నమస్కరిచుకుని, "బాబా! మావారికి నొప్పి తగ్గించండి" అని చెప్పుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరిస్తూ మధ్యాహ్నం మావారికి ఫోన్ చేస్తే, "నొప్పి తగ్గింది" అని చెప్పారు. "ప్రణామాలు బాబా. నీ బిడ్డలందర్నీ కాపాడు తండ్రీ. నాకు కొంచెం ఆరోగ్య సమస్యలున్నాయి. అవి మీకు తెలుసు తండ్రీ. మీ మీదే భారమేశాను. ఫిబ్రవరి 2వ తేదీన మా ఇంటి గృహప్రవేశం ఏ ఆటంకాలు లేకుండా జరిపించండి బాబా".
Om Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha