- శ్రీసాయి కరుణాకటాక్షాలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బ్లాగ్ నిర్వాహక బృందానికి నా నమస్కారములు. నేనొక సాయి బిడ్డను. మా అమ్మాయికి మెడిసిన్ కోర్సులో సీటు బాబా మా కుటుంబానికి ప్రసాదించిన అమూల్యమైన వరం. తను విదేశాలలో మెడిసిన్(MD) చదువుతుంది. తన 5 సంవత్సరాల కోర్సులో 4వ సంవత్సరం చాలా చాలా కష్టంగా ఉంటుంది, చదవాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, తనకి ఈ సంవత్సరం ఒక పరీక్షాకాలం. అదే సమయంలో నేను, నా భర్త ఇండియాకి వచ్చి ఉంటున్నాము. మా అమ్మాయి మమ్మల్ని విడిచి ఉండటం ఇదే మొదటిసారి. ఇంటి పనులు, పార్ట్ టైం జాబ్, హాస్పిటల్లో ప్లేసెమెంట్స్‌తో టైం చాలక తను చాలా ఒత్తిడికి గురైంది. అదీకాక తనకి 2022, జూన్ నెలలో కోవిడ్ వచ్చింది. అయితే బాబా దయతో తను 5 రోజులలోనే కోలుకుంది. ఇలా ఉండగా 2022, నవంబరులో తనకి పరీక్షల సమయమనగా నేను సాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ చేసి, ‘మా అమ్మాయికి సహాయం చేయమ'ని బాబాను వేడుకున్నాను. ఆ పారాయణ పూర్తైనరోజున బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుంటే ఒక భక్తురాలు, 'తన కొడుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాడ'ని పంచుకున్నారు. అది చదివిన తరువాత నా మనసుకి కొంచెం కష్టంగా అనిపించినా బాబా మీదనే భారమేశాను. ఇక మా అమ్మాయి పరీక్షలు మొదలయ్యాయి. వ్రాత పరీక్షలు రెండు సుమారుగా వ్రాసింది. తరువాత 12 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిలో కనీస ఉత్తీర్ణత సాధించాలి. (కనీస మార్కు ఇంతని చెప్పడానికి వీలుపడదు. అది అందరు విద్యార్థులు కనబరిచే ప్రతిభను బట్టి యూనివర్సిటీవాళ్లు నిర్ణయిస్తారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా ఉంటుంది). లేకపోతే ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ చదవవలసి ఉంటుంది. మొదటి రెండు, మూడు పేపర్లు తను బాగానే వ్రాసినా తరువాత సంతృప్తికరంగా వ్రాయలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఇచ్చిన టైం లిమిట్‌లో పూర్తిచేయలేకపోవడం, తెలిసిన ప్రశ్నలకు కూడా సరిగా సమాధానం వ్రాయలేకపోవడం జరుగుతుండేది. దాంతో తన ఆత్మవిశ్వాసం ఎంతలా తగ్గిపోయిందంటే, ఇంకా చివరి 2 పరీక్షలున్నాయనగా తను నాకు ఫోన్ చేసి, 'రేపు నేను పరీక్ష వ్రాయను. మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చి తరువాత వ్రాస్తాను. ఇప్పుడు నా టైం బాగాలేదేమో, కనీస ఉత్తీర్ణత రాకపోతే ఫ్రెండ్స్ మధ్య అవమానమవుతుంది' అంటూ ఏదేదో మాటాడింది. నాకు ఏం చేయాలో, తనకి ఎలా ధైర్యం చెప్పాలో అర్థంకాక, ‘సహాయం చేయమ’ని బాబాను వేడుకున్నాను. అప్పుడు నాకు సచ్చరిత్రలోని సాయిభక్తురాలు శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ లీల జ్ఞాపకం వచ్చింది. వెంటనే సచ్చరిత్రలోని ఆ పేజీ ఫోటో తీసి మా అమ్మాయికి పంపించి, "బాబా ఏం చెప్పారో చదువు" అని చెప్పాను. అలాగే, "బాబాకి మ్రొక్కుకొని, భారం ఆయనపై వేసి పరీక్షలు వ్రాయమ"ని చెప్పాను. మా అమ్మాయి కూడా బాబాని నమ్ముతుంది. బాబా దయవల్ల తన స్ట్రెస్(ఒత్తిడి) కొంచెం తగ్గి ఎలాగో ఆ రెండు పరీక్షలు వ్రాసి, మాతో సెలవులు గడపాలని ఇండియాకి వచ్చింది. వస్తూనే, 'సాయి నవగురువార వ్రతం' చేస్తూ, ప్రతిరోజూ వీలు చూసుకొని బాబా గుడికి వెళ్తూ బాబాను వేడుకునేది. కానీ తన పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూసిన ఆ మూడు వారాలు మా అమ్మాయి మనసు మనసులా లేనేలేదు. నేను బాబాను ఒకటే అడిగాను: "బాబా! ఏదో 2, 3 పేపర్లు పోయినా పరవాలేదు, మళ్ళీ వ్రాసుకుంటుంది. కానీ 4వ సంవత్సరం మళ్ళీ చదవాల్సిన పరిస్థితి రానివ్వకండి" అని. ఫలితాలు వచ్చే ముందురోజు బ్లాగులో అనుభవాలు చదువుతుంటే ఒక భక్తురాలు 'తను డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ వ్రాశానని, బాబా దయతో పాసయ్యానని' పంచుకున్నారు. అది చదివిన నాకు 'బాబా మా మీద దయచూపిస్తార'ని సంతోషంగా అనిపించింది. రోజూ ఉదయం నిద్రలేస్తునే నా మొబైల్లో సేవ్ చేసుకున్న బాబా ఫోటోకి నమస్కారం చేశాకే నేను మంచం దిగుతాను. మా అమ్మాయి పరీక్షల ఫలితాలు వచ్చేరోజు కూడా నేను నిద్రలేస్తూనే బాబాకు నమస్కారం చేస్తూండగా నా ప్రక్కనే ఉన్న మా అమ్మాయి నా చేయి పట్టుకొని, "అమ్మా, అమ్మా.. రిజల్ట్స్" అంటూ ఏడ్చేసింది. తరువాత కొంచెం తేరుకొని తన ఇ-మెయిల్‌కి వచ్చిన రిజల్ట్స్ చూపించింది. చూస్తే, అన్ని పేపర్స్ పాసై ఉంది. అంతేకాదు, మంచి గ్రేడ్ కూడా వచ్చింది. బాబా నా మొర ఆలకించారు. సంవత్సరకాలం మా అమ్మాయి పడిన మానసిక ఒత్తిడిని తొలగించారు. మేము చాలా చాలా ఆనందించాము. తరువాత మా అమ్మాయి ఆ ముందురోజు తనకు వచ్చిన బాబా మెసేజ్ చూపించింది. అది ఇక్కడ జతపరుస్తున్నాను, చూడండి.
"బాబా! దయాసింధో, భక్తవత్సలా, నీ దయని, ప్రేమని ఎంతని చెప్పగలం? ఏమని చెప్పగలం తండ్రీ? నీ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని వేడుకుంటున్నాను బాబా".
ఒకసారి నేను, మావారు, మా అమ్మాయి పనిమీద చెన్నై వెళ్లాలనుకున్నప్పుడు తిరుగు ప్రయాణంలో తిరుమల వెళ్ళి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుందామనుకున్నాము. కానీ అది మా అమ్మాయికి నెలసరి సమయమైనందున కొండపైకి వెళ్లిన తరువాత ఇబ్బందవుతుందేమోనని వద్దనుకున్నాము. మా ప్రయాణానికి ముందురోజు మావారు చెన్నైలో ఉన్న ఒక్క విష్ణు మందిరానికి, అమ్మవారి గుడికి వెళదామన్నారు. కానీ చివరికి ఎక్కడికీ వెళ్ళకుండానే బెంగుళూరుకి తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది. ఆరోజు ఉదయం నుంచి నా మనసులో ఏదో తెలియని వెలితితో ఒకటే ఆలోచనలు... 'బాబాపై భారమేసి తిరుమలకి వెళ్ళివుంటే దర్శనం ఏ ఇబ్చందీ లేకుండా జరిగేది కదా, ప్రయత్నం చెయ్యకుండానే మానుకున్నాము' అని. అయినా 'మొక్కుబడి కాదు కదా, పరవాలేదులే' అని నా మనసుకి సర్దిచెప్పుకున్నాను. అంతలో, 'కనీసం చెన్నైలోని మందిరానికైనా వెళ్ళివుండాల్సింద'ని మరొక ఆలోచన. ఇలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూనే కారులో బయలుదేరి నా నిత్యపారాయణాలు(సచ్చరిత్ర, స్తవనమంజరి) చేయటం ప్రారంభించాను. పారాయణ చేస్తున్నానేగానీ, అవే ఆలోచనలు వస్తూ 'గుడికి వెళ్ళలేకపోయామ'ని కొరతగా అనిపిస్తుండేది. ఆలోచన వచ్చినప్పుడల్లా పారాయణ నిలిపి తలెత్తి బయటకి చూస్తే, ముందు వెళ్తున్న వాహనాల మీదనో, రోడ్డు పక్కనున్న షాపుల మీదనో బాబా ఫోటో దర్శనమిస్తుండేది. ఆ విధంగా చాలాసార్లు జరిగింది. బాబాకు మన ఆలోచనలన్నీ తెలుస్తాయి కదా! ఆయన ఏమి లీల చేశారో చూడండి. మా మరిది ఫోన్ చేసి, "మీ ప్రయాణం ఎలా జరుగుతోంది? ఎక్కడ వరకు వచ్చారు?" అని అడిగి, "మీరు వెల్లూరు మీద నుంచి వస్తున్నారు కదా! అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది. చూసి రండ"ని చెప్పారు. సరే వెళదామని అక్కడున్న శ్రీలక్ష్మినారాయణి అమ్మవారిని, అదే ప్రాంగణంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాము. అది మా ప్రణాళికలో లేనే లేదు. అలాంటిది ఉదయం నుంచి అడుగడుగునా ఫోటో రూపంలో దర్శనమిస్తూ, తిరుమలకి, గుడికి వెళ్ళలేకపోయాననే నా కొరతని తీర్చిన బాబా అనుగ్రహనికి చాలా సంతోషంగా అనిపించింది. ఆయన దయతో క్షేమంగా ఇల్లు చేరుకున్నాము. ఆ రాత్రి నా నిత్యకృత్యంలో భాగంగా బ్లాగులో అనుభవాలు చదువుదామని బ్లాగు ఓపెన్ చేస్తే, ఆరోజు 'సాయిభక్త అనుభవమాలిక’ 1367వ భాగంలో 'సాయికృప' శీర్షికతో ఒక సోదర భక్తుడు అడుగడుగునా బాబా ఫోటో రూపంలో దర్శనమిస్తూ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేయించారని పంచుకున్నారు. దాంతో ఆరోజు మాకు జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కూడా సాయికృపే అని పక్కాగా నిర్ధారణ అయింది. "ధన్యురాలిని బాబా. నా అనుభవాలను పంచుకోవటంలో చాలా ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. మీ చల్లని కరుణాకటాక్షాలు. మా అందరి మీదా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me