సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 609వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా సంరక్షణ
  2. బాబా రాకతో ఉద్యోగప్రాప్తి

బాబా సంరక్షణ

సాయిభక్తురాలు శ్రీమతి భారతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు భారతి. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మళ్లీ మరికొన్ని అనుభవాలతో మీ ముందుకు వచ్చాను. 

మొదటి అనుభవం: 

ఆగస్టు నెలలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒకరోజు మా అమ్మావాళ్ళ ప్రక్కింటి అబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చింది. మా అమ్మావాళ్ళ ఇంట్లో ప్రక్క పోర్షన్ ఖాళీగా ఉందని ప్రక్కింటివాళ్లు ఆ అబ్బాయిని పదిహేను రోజుల పాటు అక్కడ సెల్ఫ్ క్వారంటైన్ కోసం ఉంచారు. మా అమ్మగారికి అసలే రోగనిరోధకశక్తి చాలా తక్కువ. అందువల్ల తను భయపడుతూనే ఉన్నది. మూడు రోజుల తర్వాత మా అమ్మగారికి బాగా జ్వరం వచ్చింది. నాకు చాలా భయం వేసింది. అది కరోనా కాకూడదని బాబాను ఎంతగానో ప్రార్థించాము. తరువాత మా నాన్నగారికి కూడా దగ్గు, జలుబు వచ్చాయి. అమ్మానాన్నలిద్దరూ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. బాబా మా ప్రార్ధన విన్నారు. వాళ్లిద్దరికీ కోవిడ్ నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. ఏ మందులూ వాడకుండానే బాబా వాళ్ళకు తోడుగా ఉండి జ్వరం తగ్గిపోయేలా చేశారు. “థాంక్యూ సో మచ్ బాబా!” 

తరువాత కొన్నిరోజులకి, అంటే సెప్టెంబరు నెలలో మా పాపకి స్కూల్ (బేబీ కేర్) తెరిచారు. నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగాలకు వెళుతుండటం వలన పాపను బేబీ కేర్కి పంపాల్సి వచ్చింది. స్కూలుకు వెళ్ళిన 2వ వారంలో ఒకరోజు పాపకు బాగా దగ్గు, జలుబు, జ్వరం వచ్చాయి. ఆ రాత్రంతా పాప నిద్ర పోలేదు, జ్వరంతో మూలుగుతూనే ఉంది. పాప ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించి బాబా ఊదీని పాప నుదుటిపై రాశాను. అసలే కరోనా రోజులు కావడం వల్ల నేను చాలా భయపడ్డాను. కానీ మన బాబా అండగా ఉండగా మనకు భయం ఎందుకు? బాబా అనుగ్రహంతో రెండు రోజుల తర్వాత పాప ఆరోగ్యం కుదుటపడింది. ఇలానే బాబా  ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ మనసారా ఉండాలని కోరుకుంటున్నాను. 

రెండవ అనుభవం:

ఆగస్టు నెలలో నా భర్తకు అరిచేతులలో, అరికాళ్ళలో ఒక రకమైన ఎలర్జీ చాలా ఎక్కువగా వచ్చింది. తను చేతులతో ఏ పనీ చేసుకోలేకపోయేవారు. చర్మం పొరలు పొరలుగా వస్తూ ఉండేది. క్రీం రాసుకుని, ఎప్పుడూ కాళ్లు, చేతులు కప్పుకుని ఉండాల్సి వచ్చేది. తనను అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలిగేది. తనకు త్వరగా నయం చేయమని బాబాను ఆర్తిగా  ప్రార్థించాను. బాబా దయవలన నెలరోజుల్లో తన ఎలర్జీ పూర్తిగా తగ్గిపోయింది. అప్పటినుంచి నా భర్త ఆహారం (ఆరోగ్యం) విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇదంతా బాబా అనుగ్రహమే

మూడవ అనుభవం:

నేను నా ఉద్యోగరీత్యా వేరొక సిటీకి మారాల్సి వచ్చింది. ఇప్పుడున్న ఈ కరోనా సమయంలో మళ్లీ క్రొత్త ఇల్లు అద్దెకు దొరకాలంటే కష్టం. అలాగే మా పాపకి బేబీ కేర్ దొరకడం, అది కూడా మా ఆఫీసుకి దగ్గరలో దొరకడం చాలా కష్టం. కానీ నా బాబా నాపై ప్రేమతో ఇల్లు, బేబీ కేర్ కూడా మా ఆఫీసుకు పది-పదిహేను నిమిషాలు నడక దూరంలోనే ఉండేలా సమకూర్చారు. “థాంక్యూ సో మచ్ బాబా! ఇలానే మీరు ఎప్పుడూ మాకు తోడుగా, అండగా ఉండాలని కోరుకుంటున్నాను”.

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా రాకతో ఉద్యోగప్రాప్తి

సాయిభక్తురాలు శ్రీమతి ఉమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమ. ఇటీవల బాబా మాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. నేను, మావారు ఇండియాలో నివసిస్తున్నాము. మా పెద్దబ్బాయి తన కుటుంబంతో కెనడాలోని వాంకోవర్ సిటీలో నివసిస్తున్నాడు. మా చిన్నబ్బాయి కూడా తన కుటుంబంతో అదే దేశంలో టొరంటో సిటీలో నివసిస్తున్నాడు. మా చిన్నకోడలు గత సంవత్సరం డిసెంబరులో MS పూర్తిచేసింది. ఈ సంవత్సరం జనవరి నుండి తను ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించింది. ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ ఉంది. కానీ తను ఏ ఉద్యోగంలోనూ సెలెక్ట్ కాలేకపోయేది. దాంతో మా చిన్నబ్బాయి ఎంతో నిరాశకు గురయ్యాడు.  ‘ఎంత ప్రయత్నించినా తన భార్యకు ఇంకా ఉద్యోగం రావట్లేద’ని దిగులుపడుతుంటే, నేను తనతో, “బాబా దయవల్ల కోడలికి మంచి ఉద్యోగం వస్తుంది. మీరిద్దరూ ఆందోళనపడవద్దు” అని చెప్తూ ఉండేదాన్ని.

ఇలా ఉండగా నేను మా పిల్లలతో కొద్దిరోజులు గడపాలనుకుని, ముందుగా వాంకోవర్లోని మా పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళాను. కొద్దిరోజుల తరువాత నేను మా పెద్దబ్బాయి దగ్గరనుండి మా చిన్నబ్బాయి ఇంటికి వెళ్ళాను. మా చిన్నబ్బాయి దేవుడికి మ్రొక్కడు. అందువల్ల వాళ్ళు తమ ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోలేదు. అప్పుడు నేను నా మనసులో, “మేరే బాబా! ప్రస్తుతం మీ ఫోటో ఇక్కడ లేదు. ఇక్కడ ఎవరైనా నాకు మీ ఫోటో ఇస్తే బాగుండు” అని అనుకున్నాను. మరుసటిరోజు మా అబ్బాయి స్నేహితుడు ఫోన్ చేసి, నేను అక్కడికి వచ్చిన సందర్భంగా వాళ్ళింటికి డిన్నర్కి రమ్మని ఆహ్వానించాడు. అందుకు మేము, ‘డిన్నర్కి వద్దు, జస్ట్ కలవడానికి వస్తామ’ని చెప్పాము. తను సరేనన్నాడు. మేము ఆ సాయంత్రం కారులో వాళ్ళింటికి వెళ్ళాము. నేను నా మనసులో, “వీళ్ళ దగ్గర అదనంగా ఒక బాబా విగ్రహం ఉండి దానిని నాకు ఇస్తే బాగుండు” అని అనుకుంటూ వాళ్ళింట్లో అడుగుపెట్టాను. ఎదురుగా మన బాబా పెద్ద విగ్రహం నాకు కనిపించింది. ఎంతో ఆనందంతో, “మీరు ఉండే ఇంటికే వచ్చాను బాబా!” అని మనసులోనే అనుకుని బాబాకు నమస్కరించుకున్నాను. ఆ తరువాత అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాము. మాటల మధ్యలో, ‘బాబా చాలా బాగున్నార’ని చెబుతూ, ‘మా చిన్నబ్బాయి వాళ్ళింట్లో బాబా విగ్రహం లేద’ని వాళ్ళతో చెప్పాను. అప్పుడు వాళ్ళు, “దిగులుపడకండి ఆంటీ, మా దగ్గర చిన్న బాబా విగ్రహం ఉంది, దానిని మీకు ఇస్తాము” అన్నారు. ఆ మాట వినగానే నేను కోరుకున్నది బాబా నెరవేర్చారనే ఆనందంతో నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తరువాత మేము ఇంటికి తిరిగి వచ్చాము. రెండు రోజుల తరువాత వాళ్ళు మళ్ళీ మమ్మల్ని డిన్నర్కి ఆహ్వానించారు. మేమంతా వాళ్ళింటికి వెళ్ళాము. డిన్నర్ అయ్యాక మేము ఇంటికి బయలుదేరుతుంటే, ‘ఆంటీ, ఒక్క నిమిషం!’ అని చెప్పి, వాళ్ళ దగ్గరున్న చిన్న బాబా విగ్రహాన్ని నా చేతిలో పెట్టారు. నేను ఆ క్షణంలో చాలా చాలా పాజిటివ్గా అనుభూతిచెందాను.

ఇంటికి వచ్చిన తరువాత బాబాను ఆసనంపై ఉంచి, దీపం పెట్టి, “బాబా! ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, నా కోడలి ఉద్యోగం విషయం మీరే చూసుకోవాలి” అని మ్రొక్కుకున్నాను. తనకు ఉద్యోగం వస్తే ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. నేను మా చిన్నబ్బాయి ఇంట్లో 3 వారాలు ఉండి మావారి దగ్గరకు వచ్చాను. 29-10-2020, గురువారంనాడు మా చిన్నబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను బాబా పుస్తకం చదువుతున్నాను. అప్పుడు వాళ్ళకు కెనడాలో అర్థరాత్రి సమయం. ఈ అర్థరాత్రి సమయంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారా అని అనుకుని ఫోన్ తీయగానే, మా చిన్నకోడలికి అక్కడి కెనడా గవర్నమెంట్ ఉద్యోగం లభించిందని ఎంతో ఆనందంగా చెప్పారు వాళ్ళు. బాబా చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందిస్తూ బాబాకు నమస్కరించుకుని, “బాబా! మేరే బాబా! థాంక్యూ బాబా!” అని బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.



నివృత్తి పాటిల్



సాయిభక్తుడు నివృత్తి పాటిల్ శిరిడీలోనే పుట్టి పెరిగాడు. చిన్ననాటినుండి బాబాతో అనుబంధాన్ని కలిగివున్న అదృష్టవంతుడతడు. బాబా మహాసమాధి చెందిన చాలాకాలానికి, అంటే 1983లో అతను మరణించాడు. తన మరణానికి కొన్ని సంవత్సరాల ముందు పంటలు నూర్చే నూర్పిడి యంత్రం అవసరమై దాన్ని కొనేందుకు కోపర్‌గాఁవ్‌లోని డీలర్ షోరూమ్‌కి వెళ్లాడు నివృత్తి పాటిల్. ఆ షాపులోని సేల్స్ ఏజెంట్ ముందుగా నివృత్తి పాటిల్ పేరు, చిరునామా నమోదు చేసుకొని, అతని వంతు వచ్చేవరకు వేచి ఉండాల్సి ఉంటుందని చెప్పి, ఆ యంత్రానికి సంబంధించిన వివరాలిచ్చి, దాని ధర 1,100 రూపాయలు అని చెప్పాడు. కానీ నివృత్తి పాటిల్‌కి ఆ యంత్రం అత్యవసరంగా కావలసివుండటంతో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకొని నేరుగా కిర్లోస్కర్‌వాడి వెళ్లి శ్రీశంకరరావు కిర్లోస్కర్‌ను కలిశాడు. అతనితో తన గురించి, తన అవసరం గురించి వివరంగా చెప్పాడు. అయితే ఆ సమయంలో యంత్రాల స్టాక్ లేకపోవడంపై కిర్లోస్కర్ తన విచారాన్ని వ్యక్తం చేస్తూ అతనిని తరువాత రమ్మని చెప్పాడు. అంతలో స్టాక్ అండ్ సప్లై విభాగానికి చెందిన కులకర్ణి అక్కడికి వచ్చాడు. అతను అదివరకు ఒకసారి శిరిడీ వెళ్ళినపుడు నివృత్తి పాటిల్‌ను అక్కడ చూసినందువల్ల వెంటనే గుర్తుపట్టాడు. పాటిల్ కులకర్ణితో, “నేను బాబా ముందు చీటీలు వేశాను. యంత్రం దొరుకుతుందని సమాధానం వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా యంత్రం లభిస్తుందని అనుకున్నాను” అని ఒక అబద్ధం చెప్పాడు. అప్పుడు కులకర్ణి తన యజమానితో, “అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకొని మనము ఇతనికి యంత్రాన్ని సరఫరా చేద్దాం” అని చెప్పాడు. సరఫరా విభాగానికి బాధ్యత వహిస్తున్నది కులకర్ణే కాబట్టి, “సరే అలాగే చేయమ”ని కిర్లోస్కర్ బదులిచ్చాడు. వాళ్ళ సంభాషణ జరుగుతుండగానే హైదరాబాద్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ సారాంశమేమిటంటే, తాము అదివరకు ఇచ్చిన 63 యంత్రాల ఆర్డర్‌కు బదులుగా ప్రస్తుతం తమకు 61 యంత్రాలు చాలు అని. దాంతో నివృత్తి పాటిల్ రెండు యంత్రాలను కొనుక్కున్నాడు. అంతేకాదు, ఒక్కో యంత్రంపై 500 రూపాయల భారీ డిస్కౌంట్‌ను కూడా పొందాడు. ఎంతో ఆనందంగా రెండు యంత్రాలతో తిరిగి శిరిడీ చేరుకొని అందరితో, “నేను అబద్ధం చెప్పినా బాబా నాకు సహాయం చేశారు” అని చెప్పాడు.

కానీ, అసత్యం పలకడాన్ని బాబా ఎంతగానో ఖండించారు. బాబా ఒకసారి బాపూరావు చందోర్కర్‌తో, “నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు” అని చెప్పారు. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ దీక్షిత్, న్యాయవాది అయిన తాను తన క్లయింట్‌లను కాపాడటానికి సత్యాన్ని వక్రీకరించాల్సి వస్తుందని బాబాతో చెప్పినప్పుడు, బాబా పదేపదే అతనితో “నిజం మాత్రమే మాట్లాడమ”ని చెప్పారు. అంతటితో దీక్షిత్ న్యాయవాదిగా తాను మనుగడ సాగించలేనని తన న్యాయవాది వృత్తిని వదులుకున్నాడు. అలాగే బాబా పురంధరేతో, “నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో!” అని చెప్పారు.

మరి అబద్ధం చెప్పిన నివృత్తి పాటిల్‌కి బాబా ఎందుకు సహాయం చేసారంటే, అతను ఒక రైతు. అతను పండించే పంట ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తుంది. అతనికి ఆ యంత్రం లభించకపోతే పంట సమయానికి అందక చాలామంది ఆకలితో అలమటించాల్సి వస్తుంది. అందువల్ల ప్రజల ప్రయోజనం దృష్ట్యా బాబా అతని కోరిక నెరవేర్చడంలో అతనికి సహాయం చేసి ఉండవచ్చు.

సమాప్తం.... 

రిఫరెన్స్అంబ్రోసియా ఇన్ శిరిడీ బై రామలింగస్వామి
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి

సాయిభక్తుల అనుభవమాలిక 608వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న  బాబా
  2. పసరు మొత్తాన్ని పాము చేత తీయించి ఆరోగ్యవంతురాలిని చేసిన బాబా

నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న  బాబా

సాయిభక్తురాలు నిఖిత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. నా పేరు నిఖిత. నా జీవితంలో బాబా ఎన్నో విషయాలలో నాకు చాలా సహాయం చేశారు. వాటిలోనుండి నాలుగు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

మొదటి అనుభవం: 

నేను ఎం.బి.ఎ. పరీక్షలు వ్రాసే సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి చాలాదూరం ప్రయాణించాల్సి వచ్చేది. అంతదూరం వెళ్ళాలంటే నాకు చాలా భయమేసేది. ప్రతిరోజూ నేను బాబా నామం స్మరించుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్ళేదాన్ని. బాబా నామస్మరణతో నాకు భయం పోయేది. బాబా అనుగ్రహంతో పరీక్షలు బాగా వ్రాశాను, క్లాస్ ఫస్ట్ కూడా వచ్చాను.

రెండవ అనుభవం: 

ఒకసారి మా అమ్మకి ఛాతీ దగ్గర బాగా నొప్పి వస్తోందని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాము. అమ్మను పరీక్షించిన డాక్టర్లు అమ్మకు ఛాతీలో గడ్డ వుందని చెప్పారు. తరువాత అమ్మకు ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించారు. ఆ తరువాత ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అవునో, కాదో నిర్ధారించుకోవడానికి దానిని బయాప్సీకి పంపించారు. అప్పుడు మా నాన్న బాబాను ప్రార్థించి, “ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా మామూలు గడ్డ అయ్యేలా అనుగ్రహించమని, అది క్యాన్సర్ గడ్డ కాకపోతే 5 గురువారాల పాటు సాయిబాబా మందిరానికి కూరగాయలు పంపిస్తాన”ని మ్రొక్కుకున్నారు. నేనేమో బాబాకు నమస్కరించుకుని, “ఇకపై నేనసలు టీ త్రాగను” అని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ గడ్డ మామూలు గడ్డ అని రిపోర్టులు వచ్చాయి. ఇదంతా బాబా మాపై చూపిన దయే. మేము ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

మూడవ అనుభవం: 

నేను కరోనా గురించి ఆలోచించి భయపడుతున్నప్పుడల్లా బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, “నువ్వు భయపడకు, మీ కుటుంబం నా బాధ్యత” అని చెప్పేవారు. బాబా ఇచ్చిన అభయంతో నిశ్చింతగా ఉండేదాన్ని.

ఒకసారి నాకు బాగా జలుబు చేసింది. దాంతో విపరీతంగా తుమ్ములు రాసాగాయి. దానివల్ల ఒకరోజు నాకు బాగా తలనొప్పి వచ్చింది. నేను వేడినీళ్ళలో బాబా ఊదీ వేసుకుని త్రాగాను. తలనొప్పి వల్ల ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. “బాబా! నాకు చాలా తలనొప్పిగా ఉంది, నిద్రపోలేకపోతున్నాను. వెంటనే నా తలనొప్పి తగ్గించు” అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో నా తలనొప్పి తగ్గిపోయింది. రెండు రోజుల్లో నా జలుబు కూడా తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు వస్తోంది, అంతే. ఇదంతా కేవలం బాబా దయ. 

ఒక్కమాటలో చెప్పాలంటే సాయిబాబా లేకపోతే నేను లేను. నన్ను, నా కుటుంబాన్ని బాబా ప్రతి నిమిషం వెంటవుండి కాపాడుతూ వస్తున్నారు.


పసరు మొత్తాన్ని పాము చేత తీయించి ఆరోగ్యవంతురాలిని చేసిన బాబా
 
సాయిభక్తురాలు శాంతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శాంతి. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవంతో మీ ముందుకు వచ్చాను. 

నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ మరో నెలరోజుల్లో ఉంటాయనగా, దోమల వల్లనో లేదా వాతావరణంలోని మార్పుల వల్లనో తెలియదుగానీ హాస్టల్లో ఉన్న ఎక్కువ శాతం మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. వారిలో నేను కూడా ఉన్నాను. అనారోగ్యం పాలైన మా అందరినీ ఒక పదిరోజులు విశ్రాంతి తీసుకొని, మందులు వాడి, పూర్తిగా తగ్గిన తర్వాత రమ్మని హాస్టల్ యాజమాన్యం మమ్మల్ని ఇళ్లకు పంపించివేశారు. నేను ఇంటికి వెళ్ళిన తరువాత మా నాన్నగారు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకువెళ్లి చూపించారు. ఆయన నా కళ్ళు చూస్తూ నాకు జాండీస్ అని అనుమానంగా ఉందని నాన్నతో అన్నారు. అయినా ఒకరోజు వేచి చూద్దామని చెప్పి మందులిచ్చి ఇంటికి పంపించారు. ఇక నాకు దిగులు పట్టుకుంది, నెలరోజుల్లో పరీక్షలున్నాయి, 'నేను పరీక్షలు సరిగా రాయగలనో లేదో' అని. ఆ దిగులుతో ఆరోజు పడుకునేముందు మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఏంటి నాకు ఇలా జరుగుతోంది? నాకు జాండీస్ అయితే నేను ఇంటి దగ్గరే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. పత్యాలు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లోవాళ్ళు కూడా నన్ను ఇప్పుడిప్పుడే హాస్టల్కి పంపించేటట్లు లేరు. మరి నేను ఎప్పుడు చదువుకోవాలి? ఇలాగే ఉంటే నేను ఎగ్జామ్స్ బాగా రాయగలనో, లేదో! నాకు మంచి మార్కులు వస్తాయో, రావో” అని బాబాకు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయాను. నిద్రపట్టిన కాసేపటికి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా మంచం చివరన కూర్చుని ఉన్నారు. నేను బాబాను చూసి ఎంతో సంతోషపడుతున్నాను. ఆ సమయంలో బాబా బాగా నల్లగా పొడవుగా ఉన్న ఒక త్రాచుపామును చూపించి ఆ పాముని నా కాళ్ల దగ్గర పెట్టబోతున్నారు. అది చూసి నేను, ‘నన్ను ఏమీ చెయ్యొద్దు, ఏమీ చేయొద్దు’ అంటూ కేకలు వేస్తున్నాను. అప్పుడు బాబా, “సరే, ఈ పాము నిన్ను ఏమీ చేయదు” అని నాకు అభయమిచ్చారు. నేను బాబా చేతుల వైపు చూశాను, బాబా చేతుల్లో పాము లేదు. అప్పుడు నేను ‘బాబా నాకు తోడు ఉన్నారు’ అని నిద్రకు ఉపక్రమించాను (కలలోనే). నేను నిద్రపోయిన తర్వాత బాబా మరలా పామును బయటకు తీసి నా కాళ్ల దగ్గర ఉంచారు. నేను అప్పుడు (కలలో) నిద్రలోనే ఉన్నాను. అప్పుడు ఆ పాము నా కాళ్ళనుండి ఏదో రసాన్ని పీల్చివేస్తున్నట్లు నాకు అనిపించింది. తరువాత నాకు మెలకువ వచ్చి చూస్తే బాబా నా దగ్గర లేరు. నేను మరలా నిద్రలోకి వెళ్లిపోయా. తెల్లవారి నిద్రలేచేసరికి నాలో ఏదో కొత్త ఉత్సాహం. గత కొన్ని రోజులుగా ఉన్న నీరసం, అనారోగ్య సమస్యలు ఏవీ లేనట్లు అనిపించింది. అదేరోజు ఫ్యామిలీ డాక్టర్ మా ఇంటికి వచ్చి నాకు జాండీస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో నాకు జాండీస్ లేదని తెలిసింది. నాకు వచ్చింది మామూలు జ్వరమేనని చెప్పి, మందులు ఇచ్చి, నాలుగు రోజులు వాడితే సరిపోతుందని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత హాస్టల్కి కూడా వెళ్ళవచ్చని నాతో చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పుడు నాకు అనిపించింది, రాత్రి బాబా నా కలలోకి వచ్చి నాలో ఉన్న పసరు మొత్తాన్ని పాము చేత తీయించి వేసి నన్ను ఆరోగ్యవంతురాలిగా చేశారు అని. మా నాన్నగారితో నాకు రాత్రి వచ్చిన కల గురించి, బాబా చేసిన సహాయం గురించి అంతా చెప్పాను. అప్పుడు మా నాన్నగారు, “నీకు బాబా ఎప్పుడూ తోడుగా ఉన్నారు, నిన్ను ఎప్పుడూ బాబానే రక్షిస్తున్నారు” అన్నారు. ఆ మాట వినగానే నా కళ్ళవెంట ఆనందభాష్పాలు జాలువారాయి. “బాబా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? నన్ను ఇంతగా రక్షిస్తున్నారా? ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను బాబా?” అని అనుకున్నాను. ఆ తర్వాత డాక్టరిచ్చిన మందులు వేసుకోవటంతో నాలుగు రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. నేను హాస్టల్కి వెళ్లి, బాగా చదువుకొని, ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయ్యాను. ఇదంతా బాబా దయకాక మరేమిటి? “బాబా! ఇలాగే ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి నన్ను సరైన మార్గంలో నడిపించండి”.


హరిభావు మోరేశ్వర్ ఫన్సే



హరిభావు మోరేశ్వర్ ఫన్సే అలియాస్ జనార్ధన్ ఎమ్. ఫన్సే సాయిబాబా భక్తుడు. 1913లో తన మిత్రుడు నాచ్నే శిరిడీ ప్రయాణమవుతుంటే అతనిని కలిసి, ఆఫీసు డబ్బు దుర్వినియోగపరచిన నేరంపై తనను దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, ప్రస్తుతం జామీనుపై తనని విడుదల చేశారని చెప్పాడు. అంతేకాదు, తాను కోర్టులో అప్పీలు చేసుకున్నానని, అది ఒకటి రెండు రోజుల్లో విచారణకొస్తుందని చెప్పి, తాను నిర్దోషినని, ఇబ్బందుల్లో ఉన్న తనకు సహాయం చేయమని తన తరపున బాబాను ప్రార్థించమని చెప్పాడు. మరుసటిరోజు తెల్లవారుఝామున నాచ్నే శిరిడీ చేరుకునేసరికి చావడిలో బాబాకు కాకడ ఆరతి జరుగుతోంది. ఆ సమయంలో బాబా చాలా కోపంగా ఉన్నారు. అయినప్పటికీ నాచ్నేను చూస్తూనే బాబా, “ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అతనితో చెప్పు. అతను అప్పీలు మీద నిర్దోషిగా ప్రకటించబడతాడు” అని చెప్పారు. అదే జరిగింది. నాచ్నే శిరిడీ నుండి తిరిగి వెళ్లి ఫన్సేతో ఆ విషయం చెప్పేసరికే అతను అప్పీలు మీద నిర్దోషిగా విడుదలై ఉన్నాడు. అంటే, బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరిందన్న మాట.

ఒకప్పుడు ఫన్సే అంతంతమాత్రమే వచ్చే ఆదాయంతో కుటుంబభారాన్ని మోయలేక, కన్నతల్లి బాగోగులు చూసుకోలేక ఎంతో మనస్తాపం చెందాడు. చివరికి తన కష్టాలు ఎప్పటికీ తీరవని భావించి అన్నీ విడిచిపెట్టి ఇల్లు వదిలి రామేశ్వరం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. దారిలో శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుందామని కూడా అనుకున్నాడు. అతను తన నిర్ణయాన్ని తల్లితో చెప్పి, ఆమె వారిస్తున్నా వినకుండా రామేశ్వరం ప్రయాణమయ్యాడు. అనుకున్నట్లే అతను దారిలో శిరిడీ వెళ్ళాడు. ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబాను దర్శిస్తూనే ఎంతో ఆనందాన్ని పొందాడు. బాబా అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, “ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం పస్తుంది. నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది. నీ తల్లి నీకోసం పరితపిస్తూ ఉపవాసముండి శుష్కించిపోయింది. ఆలసించక వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు” అని ఆదేశించారు. అతను బాబా వద్ద సెలవు తీసుకొని బయలుదేరుతుంటే, ఆయన అతనికి ఊదీ ఇచ్చి ఆశీర్వదించారు. అతడు ఇంటికి చేరేసరికి అతని తల్లి నిజంగానే నిరాహారియై, “బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి” అని రోజూ బాబాను ప్రార్థిస్తున్నదని తెలిసింది. అతడు తల్లికి బాబా చెప్పినదంతా వివరంగా చెప్పాడు. అంతటితో ఆమెకు బాబా దైవశక్తి మీద పూర్తి విశ్వాసం కుదిరింది.

ఒకసారి ఫన్సే ఆ గ్రామంలో కలరా వ్యాధితో బాధపడుతున్న ఒకతనికి బాబా ఊదీని ఇచ్చాడు. బాబా కృపవల్ల అతని వ్యాధి నయమయింది. నాటినుండి ఫన్సే గొప్ప వైద్యుడని తలచి ఆ వ్యాధికి గురైన వారంతా వైద్యం కోసం అతని దగ్గరకు రావడం ప్రారంభించారు. అతను వాళ్ళకి ఊదీ ఇస్తూ ఉండేవాడు. అందరూ ఆ వ్యాధి నుండి విముక్తులయ్యారు. తొందరలోనే అతని దగ్గరున్న ఊదీ అంతా అయిపోయింది. ఇప్పుడేమి చేయాలా అని అతడు కంగారుపడుతుంటే నాటితో ఆ ఊళ్ళోనే కలరా వ్యాధి లేకుండా పోయింది. కొన్నాళ్ళకు ఫన్సే ప్రక్క గ్రామానికి చెందిన ఒక మార్వాడీ మిత్రుడిని చూడటానికి వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బుచేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గడం లేదు. ఆ మిత్రుడు ఫన్సేతో, “నా తమ్ముడు రోగంతో మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని రకాల చికిత్సలు చేసినా ఫలితం కనపడలేదు. నువ్వు సాయిభక్తుడివి. నువ్వు నా తమ్ముణ్ణి చూడాలి. సాయిబాబా మహాత్ములైతే నీ ద్వారా నా తమ్ముడి జబ్బు నయం చేస్తారు” అని అన్నాడు. ఫన్సే రోగిని చూసి, పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం వలన భయపడి తప్పించుకోజూశాడుగానీ అప్పటికే చీకటిపడినందువల్ల వెంటనే బయలుదేరలేకపోయాడు. అతని అలవాటు ప్రకారం నాటిరాత్రి బాబా పూజకి స్వయంగా రోగియే అన్ని ఏర్పాట్లు చేశాడు. అది చూసి కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయారు. పూజ, భజన జరుగుతున్నంతసేపూ రోగి బాబా ఫోటోనే ప్రేమతో తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. అది చూసిన మార్వాడీ ఎంతో సంతోషించి ఫన్సేతో, “జబ్బుతో బాధపడుతున్న నా తమ్ముని భారమంతా నీదే. వాడి జబ్బు నువ్వే నయం చేయాలి. వాడు బ్రతికినా, మరణించినా నీ దగ్గర తప్ప మరెవ్వరి దగ్గరా మందు పుచ్చుకోడు” అని అన్నాడు. ఆ మాట వింటూనే ఫన్సే ఉలిక్కిపడ్డాడు. ధైర్యం చాలక ఎలాగైనా తప్పించుకోవాలని ఎంతో ఎక్కువ ఫీజు (రెండు వందల రూపాయలు) అడిగాడు. ఆ రోజుల్లో అంత పెద్ద మొత్తాన్ని పెద్ద పెద్ద సివిల్ సర్జన్లు కూడా తీసుకొనేవారు కాదు. అంత పెద్ద మొత్తాన్ని మార్వాడీ ఎలాగూ ఇవ్వలేడని అతని ఉద్దేశ్యం. కానీ ఆ మార్వాడీ ఫన్సే చెప్పిన ఫీజు ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. దాంతో ఫన్సే ఏమి చేయాలో తోచని అయోమయంలో పడ్డాడు. అయితే, కరుణాసముద్రుడైన బాబా నాటిరాత్రి అతనికి స్వప్నదర్శనమిచ్చి, రోగికొచ్చిన జబ్బును, దాని తత్వాన్ని, దాని నివారణకు ఇవ్వవలసిన మందునూ తెలియజేశారు. అతను బాబా చెప్పినట్లే చేయడంతో రోగి పూర్తిగా కోలుకొన్నాడు. మార్వాడీ ఎంతో సంతోషించి అన్నమాట ప్రకారం ఫన్సేకి రెండువందల రూపాయలు ఇవ్వబోయాడు. కానీ ఫీజు తీసుకోవడానికి ఫన్సే అంగీకరించక. “ఇదంతా నా గురువు దయవల్లనే జరిగింది. ఇందులో నేను చేసినదేమీ లేదు. నాకెటువంటి ఫీజూ వద్దు” అని అన్నాడు. మార్వాడీ ఎంతో నిరాశ చెంది, తానివ్వదలచిన డబ్బుతో ఒక శాలువా కొని ఫన్సే ఇంటిలో లేని సమయం చూసి అతని ఇంటిలో ఇచ్చి వెళ్ళిపోయాడు.

ఆ విషయం తెలిసి ఫన్సే ఎలాగైనా ఆ శాలువాను బాబాకే ఇచ్చేద్దామనుకొన్నాడు. కానీ అతను పంపేలోపే బాబా మహాసమాధి చెందారు. ఆ శాలువాను ఏమి చేయాలో తోచక, కర్తవ్యాన్ని ఉపదేశించమని అతను కన్నీళ్లతో బాబాను ప్రార్థించాడు. ఆ రాత్రి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి, “ఈ ప్రాంతమంతా కరువు వల్ల పేదజనం అల్లాడుతున్నారు. ఆ శాలువా అమ్మి, వచ్చిన డబ్బుతో బియ్యం కొని, పేదజనానికి తక్కువ ధరకు అమ్ము. ఆ డబ్బంతా అయిపోయాక బియ్యం వ్యాపారం చేసుకో, దానితో నీ జీవితం సుఖంగా సాగుతుంది” అని చెప్పారు. అతడు బాబా చెప్పినట్లే చేసి ఎంతో అభివృద్ధిలోకి వచ్చాడు. తన తల్లిని చక్కగా చూసుకున్నాడు.

సమాప్తం .....

సోర్స్: అంబ్రోసియా ఇన్ శిరిడీ.

సాయిభక్తుల అనుభవమాలిక 607వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. శ్రీసాయి లీల - ఊదీ మహిమతో తగ్గిన వేలినొప్పి
  2. సాయిబాబా ఊదీ మహిమ

శ్రీసాయి లీల - ఊదీ మహిమతో తగ్గిన వేలినొప్పి

సాయిభక్తురాలు జ్యోతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నమస్కారములు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి. నా పేరు జ్యోతి. బాబా నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. బాబా అనుగ్రహంతో మరలా ఇంకొక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 

2020, మే నెలలో ఒకరోజు నా కుడిచేతి బొటనవేలు నొప్పిపెట్టసాగింది. ఆ వేలు నిటారుగా తయారైంది. ఆ వేలిని నేను వంచలేకపోయేదాన్ని. దాంతో నేను ఏ పనీ చేయలేకపోయేదాన్ని. లైటర్ వెలిగించలేని, కూరలు తరగలేని పరిస్థితి. చాలా పనులకి ఆ వేలు మీదే ఒత్తిడి పడుతుంది. వేలినొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టరుకి చూపించుకున్నాను. ఆయన వేలిని పరీక్షించి చూసి, “ఒక నెలరోజులు వేచి చూడండి, దానంతటదే తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే చిన్న ఆపరేషన్ చెయ్యాల్సి వుంటుంది” అన్నారు. నాకసలే ఆపరేషన్ అంటే భయం. నొప్పి తగ్గకపోతే ఆపరేషన్ చేయించుకోవాలేమోనన్న ఆందోళనతో, “బాబా! నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. నువ్వే ఎలాగైనా నా వేలి నొప్పి తగ్గించు” అని బాబాను వేడుకున్నాను. రెండు మూడు నెలలు గడిచినా నొప్పి తగ్గలేదు. ఇంట్లోవాళ్ళందరూ నన్ను ఆపరేషన్ చేయించుకోమని అనేవారు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నేను మాత్రం ఆపరేషన్ చేయించుకోను. నువ్వే ఈ నొప్పిని తగ్గించాలి. నీ ఇష్టం, నువ్వు ఈ నొప్పిని తగ్గించకపోయినా నేను ఇలాగే ఉంటాను కానీ, ఆపరేషన్ మాత్రం చేయించుకోను” అని బాబాకి చెప్పుకుని, ఇంక ఆ నొప్పి విషయాన్ని బాబాకే వదిలేశాను.

ఇటీవల నేను మా ఇంట్లోకిగానీ, మాలో ఎవరికీగానీ కరోనా రాకూడదని ప్రతిరోజూ బాబా ఊదీని ఇంటి గుమ్మం దగ్గర, గేటు దగ్గర ఒక గీతలాగా వేయటం ప్రారంభించాను. కొన్ని రోజుల తరువాత చేతికి అంటిన ఆ ఊదీని నొప్పి ఉన్న వేలికి రాసుకోవటం మొదలుపెట్టాను. అలా ప్రతిరోజూ ఊదీ రాసుకునేదాన్ని. బాబా దయవల్ల నెమ్మదిగా వేలి నొప్పి తగ్గడం మొదలుపెట్టింది. ఒకరోజు అనుకోకుండా లైటర్ను కుడిచేత్తో (ఆ నొప్పి ఉన్న వేలితోనే) వెలిగించాను. ఆశ్చర్యం! నాకు నొప్పి అనిపించలేదు. అంతకుముందు ఆ వేలుతో లైటర్ను నొక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు అన్ని పనులూ చేసుకోగలుగుతున్నాను. దాదాపు 90 శాతం నొప్పి తగ్గిపోయింది. ఇంకా 10 శాతం మాత్రమే నొప్పి ఉంది. బాబా ఊదీ మహిమతో ఆపరేషన్ అవసరం లేకుండానే నా వేలినొప్పి తగ్గిపోయింది.

శ్రద్ధ, సబూరి కలిగి ఉండాలే గానీ ఏ సమస్యనైనా బాబా ఇట్టే తొలగిస్తారు. ఇలాంటి బాబా మహిమల్ని ఎన్నని వర్ణించను? సర్వస్య శరణాగతి చేస్తూ, శ్రద్ధ, సబూరిలతో బాబాకి మన జీవితాన్ని అర్పించడమే బాబాకి మనమిచ్చే దక్షిణ.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబాబా ఊదీ మహిమ

నా పేరు సుమంత్ కుమార్. నేను హోమియో వైద్యుడిని. 2020, సెప్టెంబరు నెలలో బాబా ఊదీ మహిమ వల్ల మేము పొందిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సెప్టెంబరు నెల మొదటివారంలో మా ఆరు సంవత్సరాల పాప జ్వరం, కాళ్ళనొప్పులు, తలనొప్పి, నీరసంతో బాధపడసాగింది. తను మాతో, “నేను బాబా ఊదీనే వేసుకుంటాను, నాకు హోమియో మందు ఏమీ వద్దు” అని అన్నది. మేము మాత్రం, “బాబా ఊదీతో పాటు మా తృప్తి కోసం హోమియో మందు కూడా వేసుకో”మని నచ్చజెప్పి తనకు బాబా ఊదీని నోట్లో వేసిన తర్వాత హోమియో మందు కూడా వేశాము. బాబా అనుగ్రహం వల్ల కేవలం రెండు గంటల్లో మా పాపకు జ్వరం, కాళ్ళనొప్పులు, తలనొప్పి, నీరసం అన్నీ పూర్తిగా తగ్గిపోయి తను చాలా చురుకుగా అయ్యింది. నేను తనకు వేసిన మందు పనిచేయటానికి కనీసం పన్నెండు గంటలు పడుతుంది. ఆ తర్వాతగానీ ఆ మందు పనితనం తెలియదు. తనకు కేవలం బాబా ఊదీ వల్లనే పూర్తిగా తగ్గిపోయింది. మా పాప, “బాబా ఊదీనే వేసుకుంటాను, హోమియో మందు వేసుకోను” అని అనటం, అది కూడా కరోనా సమయంలో తను అలా అనటం నిజంగా బాబా అనుగ్రహం. బాబా అనుగ్రహం ఎప్పుడూ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటూ బాబాకు మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.



శ్రీరావుసాహెబ్ యశ్వంత్ జనార్ధన్ గల్వంకర్



శ్రీసాయిబాబా భక్తులలో ఒకరైన శ్రీరావుసాహెబ్ యశ్వంత్ జనార్ధన్ గల్వంకర్ శ్రీసాయి సచ్చరిత్ర రచయిత శ్రీదభోల్కర్ (హేమాడ్‌పంత్) గారి అల్లుడు. ఇతను బొంబాయి సచివాలయంలో హోంశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేశాడు. కొంతకాలం శిరిడీ సంస్థాన్ మండలి సభ్యులుగా, సాయిలీల పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. బాబాతో దభోల్కర్‌కి ఉన్న అనుబంధం సహజంగానే గల్వంకర్‌ని బాబా వైపు ఆకర్షించేలా చేసింది. బాబా గొప్ప మహాత్ములని విన్నప్పటికీ ఏ విధమైన ప్రాపంచిక, పారమార్థిక ప్రయోజనాన్ని ఆశించక అతను మొదటిసారి 1911లో తన మామగారు, మరికొందరు బంధువులతో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. బాబా దర్శనానికి వాడా నుండి మశీదుకు వెళ్తుండగా, బాబా దక్షిణ అడుగుతారనే విషయం అతనికి దారిలో గుర్తొచ్చి, తిరిగి వాడాకెళ్ళి రెండు రూపాయలు తీసుకొని మశీదుకు వెళ్ళాడు. బాబాను దర్శించినప్పుడు వారు అతనిని దక్షిణ అడిగారు. అతడు బాబాకు రెండు రూపాయలు సమర్పించాడు. అతనివ్వదలిచిన ఆ రెండు రూపాయలు మాత్రమే తీసుకొని బాబా ఇంక అతనిని దక్షిణ అడగలేదు. వారి అంతర్యామిత్వానికి అతడు ముగ్ధుడయ్యాడు. కానీ బాబాపట్ల పూర్తిగా ఆకర్షితుడు కాలేదు. నాలుగైదుసార్లు బాబాను దర్శించాక అతనికి బాబాపట్ల ఆసక్తి పెరిగింది.

ఒకసారి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి రెండు రూపాయలు దక్షిణ అడిగారు. మరుసటిరోజు అతను వాటిని మానియార్డరు ద్వారా శిరిడీ పంపాడు. ఆ కలలో బాబా కేవలం దక్షిణ అడగటమే కాక అతనిని నీతి, నిజాయితీలతో మెలగమని; సచ్ఛీలత, ఇంద్రియనిగ్రహము కలిగి ఉండమని రెండు విలువైన ఆదేశాలు ఇచ్చారు. అతడు ఆ ఆదేశాలను శ్రద్ధ, పట్టుదలతో ఆచరించాడు.

బహుశా 1917లో గల్వంకర్ మరలా బాబాను దర్శించినప్పుడు బాబా తమ వరదహస్తాన్ని అతని తలపై ఉంచారు. బాబా హస్తస్పర్శ అతనిపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. అతను తనను, పరిసరాలను మరచి ఆనందపరవశ్యంలో మునిగిపోయాడు. అప్పుడక్కడున్న భక్తులతో బాబా అతని పూర్వజన్మ వృత్తాంతాల గురించి వివరిస్తూ, ‘పూర్వజన్మలో అతను నీతి, నిజాయితీ గల సచ్ఛీలుడని, ఆ జన్మలో అతను పొందిన స్థితులు, రూపాలననుసరించి తామే ప్రస్తుత జన్మలో అతనిని అతని తల్లి గర్భంలో ప్రవేశపెట్టామని, ఈ జన్మలో కూడా అతను నీతి, నిజాయితీలను నిలబెట్టుకుంటున్నాడ’ని చెప్పారు. అంటే, బాబా తమ భక్తుల పుట్టుకలు, జన్మల గురించి శ్రద్ధ వహిస్తారన్న మాట! 

బాబా దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటినుండి గల్వంకర్ దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లింది. భగవద్గీతను, భాగవతంలోని ఏకాదశ స్కంధమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యపారాయణ చేయసాగాడు. ఆ గ్రంథాలను పారాయణ చేయమని దీక్షిత్, జోగ్‌లను ఆదేశించినట్లు బాబా అతనిని ఆదేశించలేదు. కానీ శ్రీసాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే తాను పారాయణ చేస్తున్నానని అతని నమ్మకం. క్రిస్మస్ మరియు ఇతర సెలవులప్పుడు అతను భక్తివిశ్వాసాలతో బాబా దర్శనానికి శిరిడీ వెళ్తుండేవాడు. బాబా ఎప్పుడూ అతనిని సెలవులకి మించి ఎక్కువ రోజులు శిరిడీలో ఉంచేవారు కాదు. బాబా అతనికెప్పుడూ అద్వైతము, ఆత్మసాక్షాత్కారము మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి శిరిడీ వెళ్ళినప్పుడు, “నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాదు. నేను అంతటా ఉన్నాను. ప్రతిచోటా నన్ను దర్శించవచ్చు” అని బాబా చెప్పడం అతను విన్నాడు. చిన్నవయసు, ఉద్యోగం మరియు ఇతర విషయాలపట్ల ఆసక్తి కారణంగా బాబా మహాసమాధి చెందక ముందు అతడు వారితో సన్నిహిత బంధాన్ని ఏర్పరుచుకోలేకపోయాడు. అందుకతడు బాబా సమాధి చెందాక ఎంతో బాధపడేవాడు.

1921లో గల్వంకర్ తన కుటుంబంతో కాశీ ప్రయాగ యాత్రలకు వెళ్ళాడు. ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ దర్శించి భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు, “మాకు ఎవరైనా సత్పురుషుల దర్శనం లభించేటట్లు అనుగ్రహించమ”ని అతను బాబాను ప్రార్థించాడు. తరువాత అతను ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న గైడుతో, “ఇక్కడ మహాత్ములైవరైనా ఉంటే వారి దర్శనానికి తీసుకెళ్లమ”ని చెప్పాడు. వాళ్ళు భరద్వాజాశ్రమం విడిచిన నాలుగైదు నిమిషాలకు గైడు ఒకచోట టాంగాను ఆపించి అక్కడున్న ఒక మహాత్ముని చూపించి, “వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తూ ఉంటారు. వారు ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరి వద్దనుండి డబ్బు పుచ్చుకోరు” అని చెప్పాడు. అయితే, బాబాను ప్రార్థించిన కొద్దినిమిషాలకే ఆ మహాత్ముడు కనపడటంతో గల్వంకర్ హృదయం ఆనందంతో ఉప్పొంగి, గైడు వెళ్లవద్దని వారిస్తున్నా లెక్కచేయక ఆ మహాత్ముడిని సమీపించి నమస్కరించాడు. వారు అతనిని కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి, “రా, బిడ్డా” అంటూ ఆహ్వానించారు. అంతలో గైడు వారిస్తున్నా వినకుండా గల్వంకర్ భార్య, తల్లి, మిగిలినవారంతా కూడా వెళ్లి ఆ మహాత్మునికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి గల్వంకర్ వద్ద పూలు, పండ్లు వంటివేవీ లేనందువల్ల తన దగ్గరున్న మూడణాలు వారికి దక్షిణగా సమర్పించాడు. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ అతనిచ్చిన నాణాలను ఎంతో ప్రసన్నంగా స్వీకరించి జేబులో వేసుకున్నారు ఆ మహాత్ముడు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ మహాత్ముని రూపంలో బాబానే తమను ఆదరించి దక్షిణ స్వీకరించారని గల్వంకర్ భావించాడు.

1932లో ఒకరోజు గల్వంకర్‌కు బాబా స్వప్నదర్శనమిచ్చి, “నీకు ఏం కావాలి?” అని అడిగారు. అతడు, “నాకు ప్రేమ కావాలి. మీ ప్రేమ తప్ప నాకు మరేదీ వద్దు” అని చెప్పాడు. అప్పుడు బాబా, “నీకు ప్రేమ లభిస్తుంది” అని అభయమిచ్చి అదృశ్యమయ్యారు. అప్పటినుంచి అతను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమవాహిని అతనిలో పరవళ్లు త్రొక్కేది. అంతటి భాగ్యశాలి గల్వంకర్! బాబా ప్రసాదించిన దానితో అతడు సంతృప్తికరమైన జీవితాన్ని సాగించాడు.

సోర్స్: http://saiamrithadhara.com/mahabhakthas/rao_sahib_yashwant.html

సాయిభక్తుల అనుభవమాలిక 606వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. అద్భుత రీతిన బాబా ప్రసాదించిన ఉద్యోగం
  2. వర్షాన్ని ఆపి క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా


అద్భుత రీతిన బాబా ప్రసాదించిన ఉద్యోగం

నా పేరు ధనలక్ష్మి. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నని చెప్పను? చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వాటిలో నుండి కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఈ సంవత్సరం జూన్ నెలలో మేము ఒక ఊరినుండి ఇంకో ఊరికి మారాము. కరోనా సమయంలో మేము ఊరు మారాల్సి వచ్చినా బాబా మీద భారం వేసి భయపడకుండా, మరేమీ ఆలోచించకుండా మారాము. ఊరు మారే సమయంలో ఏ ఇబ్బందిగానీ, శ్రమగానీ బాబా మాకు తెలియనివ్వలేదు. ఊరు మారిన తరువాత బాబా మమ్మల్ని అడుగడుగునా ఒక తండ్రిలా కాపాడుతూ అన్ని పనులూ ఒకదాని తర్వాత ఒకటి మాకు అనుకూలంగా నిర్వహించారు. ఊరు మారాక బాబా మాకు ఎన్నో అద్భుతాలు ప్రసాదించారు. ముఖ్యంగా నా ఉద్యోగం విషయంలో బాబా అద్భుతాన్ని సృష్టించారు. అదెలా అంటే, 9వ తారీఖున నేను సాయి సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. 11వ తారీఖున నేను ఎంతోకాలం క్రితం ఉద్యోగం చేసిన కంపెనీ నుండి నాకు ఫోన్ వచ్చింది, ‘మా కంపెనీలో జాయిన్ అవుతావా?’ అని. నేను అది ఊహించనిది. ఎందుకంటే, నేను ఆ కంపెనీలో ఉద్యోగం మానేసి దాదాపు 9 సంవత్సరాలు అవుతోంది. మళ్ళీ అదే కంపెనీలో నన్ను ఉద్యోగంలో చేరమని అడుగుతారని నేను అస్సలు అనుకోలేదు. ఇది నా సాయి అద్భుతం. సచ్చరిత్ర పారాయణ పూర్తవకముందే, కేవలం పారాయణ ప్రారంభించిన ఒక వారంరోజులలోపే ఆ ఫోన్ వచ్చింది. ఇలా బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. 

అలాగే మరోసారి నేను బాబాకు ఒక విషయం గురించి మనసులోనే చెప్పుకుని, “బాబా! ఈ విషయంలో నాకు మంచి జరిగేట్టయితే ఈరోజు మీరు తెల్లని దుస్తుల్లో నాకు దర్శనమివ్వండి” అని ప్రార్థించాను. నా ప్రార్థన విన్న బాబా నేను మందిరానికి వెళ్ళినప్పుడు నాకు తెల్లని దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


వర్షాన్ని ఆపి క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను నా కుటుంబంతో గుంటూరులో నివసిస్తున్నాను. నా తండ్రి బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల కలిగిన మరో చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

17.10.2020వ తేదీన నేను, నా భార్య పద్మావతి కలసి మా స్వగ్రామమైన బలిజేపల్లి వెళ్లి వద్దామని బయలుదేరాము. అప్పటికి మేము మా స్వగ్రామం వెళ్లి దాదాపు 10 నెలలు అయింది. మేము తిరిగి సాయంత్రం పెందలాడే 4 లేదా 5 గంటలకు బయలుదేరి ఇంటికి తిరిగి వద్దామని అనుకున్నాము. కానీ, మా బంధువులతో సరదాగా గడుపుతుండటంతో బయలుదేరటం ఆలస్యమైంది. అప్పటిదాకా బాగా ఎండగా కూడా ఉంది. సాయంత్రం 5 గంటల తరువాత మేము బయలుదేరే సమయానికి బాగా మబ్బులు పట్టాయి. 5.30-6 గంటల మధ్యలో బయలుదేరుదామని అనుకుని, తెనాలిలో ఉన్న నా మిత్రుడికి ఫోన్ చేసి, “అక్కడ వర్షం పడుతోందా, లేదా?” అని అడిగాను. అతను, “తెనాలిలో బాగా వర్షం పడుతోంది, మీరు బయలుదేరవద్ద”ని చెప్పాడు. కానీ, ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే చీకటిపడుతుందని భావించి, మేము బాబా మీద భారం వేసి బైక్ మీద బయలుదేరాము. మేము యడవూరు అడ్డరోడ్డు దాటిన తరువాత పెద్ద వర్షం వచ్చింది. వెంటనే మేము బాబాను స్మరించుకుని, వర్షాన్ని ఆపమని, మేము ఇంటికి చేరుకునేవరకు వర్షం పడకుండా చూడమని బాబాను వేడుకున్నాము. మీరు నమ్మండి, నమ్మకపొండి, మేము బాబాను వేడుకున్న మరుక్షణం అంత పెద్ద వర్షం పూర్తిగా ఆగిపోయింది. మేము ఇంటికి వచ్చేవరకు వర్షం కురవకుండా, మాకు ఎటువంటి అవాంతరాలు ఎదురవకుండా, ఏ ఇబ్బందీ లేకుండా బాబానే మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు. పెద్ద విచిత్రం ఏమిటంటే, మేము తెనాలి దాటిన తరువాత దాదాపు 30, 40 నిమిషాలపాటు కుండపోతగా వర్షం కురిసిందని నా మిత్రుడు పద్మారావు ఫోన్ చేసి చెప్పాడు. మరి, మేము ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా ఇంటికి చేరేలా మమ్మల్ని కాపాడింది బాబా కాక మరెవరు? పిలిచిన వెంటనే పలికే దేవుడు, కాపాడే దేవుడు బాబా కాక మరెవరు? “మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ మాకు తోడుగా ఉండే బాబా! మీకు శతకోటి పాదాభివందనాలు”.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పిపోకుండా బాబా ఇచ్చిన ‘మచ్చ’



కొల్హాపూర్ నివాసస్థుడైన భాయ్ (దురదృష్టవశాత్తు ఇతని పూర్తి పేరు, ఏ సంవత్సరంలో బాబాను దర్శించిందీ తెలియలేదు) అనే భక్తుడు ఒకసారి ముంబాయిలో నివాసముంటున్న తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని మేనకోడలు అతని నుదుటిపై ఉన్న పెద్ద మచ్చ గురించి అడిగింది. అందుకతను, “ఈ మచ్చ బాబా నాకు ప్రసాదించిన గొప్ప బహుమతి” అని చెప్పి ఆనందభరితుడయ్యాడు. తరువాత ఇంకా ఇలా చెప్పాడు: “నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులతో కలిసి శిరిడీ వెళ్ళాను. నేను అప్పటికే ‘బాబా తమ పాదాలకు గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తారని, తరచూ భక్తుల వద్దనుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారని, పెద్దపెద్దగా భక్తులపై అరుస్తార’ని విని ఉన్నందువలన ‘బాబాలో ఏదైనా దైవత్వం ఉందా? లేక ఆయనొక డాంబికుడా?’ అని తెలుసుకొని, వారిని గేలి చేయాలన్నది నా ఉద్దేశ్యం. 

శ్రమతో కూడుకున్న సుదూర ప్రయాణం తరువాత మేము శిరిడీ చేరుకుని ద్వారకామాయికి వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ చాలామంది భక్తులు భక్తిగీతాలు పాడుతుండగా, మరికొందరు సంగీత వాయిద్యాలు వాయిస్తున్నారు. బాబా తమ చేతులతో చిరతలు వాయిస్తూ ఉల్లాసంగా నృత్యం చేస్తున్నారు. మేము వెళ్లి కూర్చున్నంతనే బాబా, “వీళ్ళు ఇక్కడికి నన్ను ఎగతాళి చేయాలని వచ్చారు” అని అంటూ తమ చేతిలో ఉన్న చిరతలను నాపై విసిరారు. అవి నా నుదుటికి తాకి గాయమై బాగా రక్తం కారసాగింది. అయినా బాబా నన్ను పట్టించుకోకుండా తమ నృత్యాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి తరువాత భక్తులు నన్ను పిలిచి, రక్తస్రావాన్ని ఆపడానికి గాయమైనచోట ఊదీ రాశారు. ఆశ్చర్యంగా మరుక్షణమే రక్తస్రావం ఆగిపోయింది. 

అప్పుడు బాబా మా జేబులు ఖాళీ చేసి తమ ముందు పెట్టమన్నారు. మా వద్ద ఉన్న డబ్బు, పర్సులు అన్నీ తీసుకున్న తరువాత, “మీరు దేనినైతే చూడాలని ఇక్కడికి వచ్చారో అదంతా చూసినట్లయితే మీరు ఇప్పుడే బయలుదేరవచ్చు” అని అన్నారు బాబా. అయితే అప్పటికే చీకటిపడింది, మేమంతా ఆకలితో బాధపడుతూ అలసిపోయి ఉన్నాము. పైగా మా దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ బాబా మమ్మల్ని వెళ్ళమన్నాక మాకు ఇంకో దారి లేదు. అందువలన మేము కోపర్‌గాఁవ్ వైపు అడుగులు వేశాము. బాగా చీకటిపడింది, కనీసం వీధిదీపాలు కుడా లేవు. ఆ చీకటిలోనే అతికష్టం మీద మా నడక సాగించాము. కొంతదూరం పోయాక మేము దారి తప్పినట్టు గుర్తించి విశ్వాసంతో బాబాపై భారం వేసి ముందుకుసాగాము. కొద్దిదూరంలో ఒక రాయిపై కూర్చొని చిలుం త్రాగుతున్న వ్యక్తిని చూసి నేను పరిగెత్తుకుంటూ వెళ్లి, “బాబా! మేము దారితప్పాము. దయతో స్టేషన్‌కి మాకు దారి చూపిస్తారా? మేము మీకు ఋణపడివుంటాము” అని అన్నాను. అప్పుడు బాబా నా చేయి పట్టుకున్నారు. ఆయన చేయి చాలా చల్లగా వుంది, ఆ స్పర్శకు నేను వణికిపోసాగాను. తరువాత బాబాతో కలిసి మేము అయిదడుగులు వేశాము. అంతే, మా ముందు స్టేషన్ వుంది. అప్పుడు బాబా, “ఇక నేను వెళతాను. ఇకపై ఈ విధంగా దారి తప్పకండి” అని చెప్పి అదృశ్యమయ్యారు. 

ఆ క్షణాన నా అజ్ఞానం, అహంకారం అంతరించిపోయాయి. నా అజ్ఞానం పూర్తిగా నశించి బాబా మాటలలోని ఆంతర్యం అవగతమైంది. అంతలోనే మా తిరుగు ప్రయాణ టికెట్లు, ఆహారానికి సంబంధించిన ప్రశ్న తలెత్తింది. మరుక్షణం నా స్నేహితుడొకడు, “నీ జేబు ఎత్తుగా ఎందుకుంది? అందులో ఏమున్నాయో నన్ను చూడనీ” అంటూ నా జేబులో వెతికాడు. ఆశ్చర్యం! మా పర్సులు, డబ్బులు అన్నీ ఆ జేబులో వున్నాయి. అంతటితో మేమంతా తృప్తిగా భోజనం చేసి మా ఇళ్లకు చేరుకున్నాము. నా జీవితాంతం ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పిపోకుండా బాబా నాకు ఈ మచ్చని ప్రసాదించారు”.

ఈ మిథ్యాప్రపంచంలో దారి తప్పినప్పుడు గురువు మన చేయి పట్టుకొని వాస్తవికత వైపు నడిపిస్తారు.

 సమాప్తం .....

రిఫరెన్స్: సాయి ప్రసాద్ పత్రిక, 1995 దీపావళి సంచిక.
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ.

సాయిభక్తుల అనుభవమాలిక 605వ భాగం.....



ఈ భాగంలో అనుభవం:
  • పెద్ద పట్టా పుచ్చుకున్న డాక్టర్ ఉండగా ఎందుకు భయపడాలి?

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అందరికీ సాయిరామ్! నేను బాబా కూతుళ్ళలో ఒకరిని. నేను ఆయన కుమార్తెనని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. బాబానే నాకన్నీ. గతనెల కోవిడ్ బారినపడ్డ నా తమ్ముడి చికిత్స సమయంలో ఎదురైన పరిస్థితులు, అంతిమదశకు చేరుకున్న తనను బాబా ఎలా రక్షించారో ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

2020, అక్టోబరు నెల మా కుటుంబ సభ్యులందరికీ చాలా చెడ్డ కాలం. కానీ నాకు మాత్రం బాబాకు నన్ను మరింత దగ్గర చేసిన కాలం. ప్రస్తుతం కోవిడ్ యుద్ధాన్ని వైద్యులు ఎలా ఎదుర్కొంటున్నారో మనకి తెలుసు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, వైద్యుడైన నా తమ్ముడు గత నెలలో కోవిడ్ బారినపడ్డాడు. మొదట్లో జ్వరం కారణంగా తను మూడుసార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే, ప్రతిసారీ నెగిటివ్ అనే వచ్చింది. అంతేకాక, అన్ని రకాల టెస్టుల ఫలితాలు సాధారణంగా రావడంతో అందరమూ తనకు వచ్చింది సాధారణ జ్వరమేనని అనుకున్నాము. కానీ రోజురోజుకు అతని పరిస్థితి మరింత దిగజారిపోసాగింది. దాంతో తమ్ముడు తాను పనిచేసే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అందరూ తన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్లాస్మా థెరపీ, రిమిడ్వర్ ఇంజెక్షన్లు మొదలైన అన్ని చికిత్సలూ చేశారు. చికిత్స చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ తను శ్వాస తీసుకోవడంలో సమస్య చిన్నగా మొదలైంది. అందువల్ల తనకి ఆక్సిజన్ అందించడం మొదలుపెట్టారు. కానీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. దాంతో నా తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. నేను విదేశాలలో ఉంటున్నందున కష్టకాలంలో వారికి అండగా ఉండలేక, ఇంకా వాళ్ళకు తోడుగా ఎవరూ లేనందున చాలా బాధపడ్డాను. కానీ నేను నా తరపున నా బాబాను పంపించాను. నేను నా మరదలితో, “తమ్ముడి తలగడ క్రింద సచ్చరిత్ర ఉంచమ”ని చెప్పాను. కానీ మా తమ్ముడు ఏమైనా అంటాడని తను భయపడింది. కారణం, నా కుటుంబంలో నేను తప్ప ఎవరూ బాబాకు అంతగా కనెక్ట్ కాలేదు. “నేను తనతో చెప్తాను, తను నా మాట వింటాడు. కాబట్టి నువ్వు భయపడకుండా నేను చెప్పినట్టు చేయి” అని మరదలితో చెప్పాను. అలా నా బాబాను అక్కడికి చేర్చి, నా భారాన్ని ఆయనకు అప్పగించి, నేను సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక బాబా తన మహిమను చూపించడం ప్రారంభించారు.

గురువారం ఉదయం నేను వైద్యులతో మాట్లాడాను. వాళ్ళు, “మేము అన్నిరకాల చికిత్సలు చేసినప్పటికీ తను క్లిష్ట పరిస్థితిలోనే ఉన్నాడు, మీరు కావాలంటే మీకు నచ్చిన వేరే ఆసుపత్రికి తనను మార్చవచ్చ”ని చెప్పారు. అది వింటూనే నా తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. భయంతో ఒకటే ఏడుపు మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఇక్కడ (యు.ఎస్.ఏ) రాత్రి సమయం. ఆ సమయంలో ఒకవైపు నా తల్లిదండ్రులను ఓదారుస్తూ, మరోవైపు వైద్యులతో మాట్లాడుతూ, మా తమ్ముడి విషయంలో తుది నిర్ణయం తీసుకోలేక నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. అకస్మాత్తుగా నాకేమి అనిపించిందో తెలియదుగానీ, మా తమ్ముడిని వేరే హాస్పిటల్‌కి మార్చాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఆ స్థితిలో నా ఆలోచన సరైనది కాదు. కానీ ఆరోజు గురువారం కావడంతో నేను భయపడలేదు.

నా నిర్ణయం ప్రకారం మావాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి, తమ్ముడిని అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి బయలుదేరారు. అమ్మ ఏడుస్తూ నాతో మాట్లాడుతున్నప్పుడు, “తమ్ముడి కారు వెనుక భాగంలో పెద్ద బాబా ఫోటో చూశాన”ని చెప్పింది. దాంతో నేను, “బాబా మీతో వస్తున్నారు, ఇంక మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?” అని అన్నాను. నా విశ్వాసాన్ని అనుసరించి అది నిజం. కొన్ని సినిమాలలో దెయ్యం పీడిస్తుంటే, దైవం వచ్చి పోరాడి రక్షణ కల్పించడాన్ని మనం చూస్తుంటాం. అది కేవలం సినిమా అని అనుకుంటాం. దాన్ని వాస్తవంగా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.

తమ్ముడిని అంబులెన్సులో వైజాగ్ అపోలోకి తరలిస్తుంటే, తనతో పనిచేసిన వైద్యులు ఒక కారులోనూ, మావాళ్ళు ఒక కారులోనూ వెనుక అనుసరించారు. ఇంతలో వైజాగ్ పొలిమేరల్లో ట్రాఫిక్ కారణంగా మావాళ్ల కారు ఆగాల్సి వచ్చింది. అంబులెన్స్, డాక్టర్ల కారు వెళ్లిపోయాయి. అంతలో వెనుకనుండి ఒక పెద్ద లారీ వచ్చి మావాళ్ళ కారును ఢీ కొట్టింది. కారు ఒకవిధంగా నుజ్జయినందున చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా కారులో ఉన్న అందరూ చనిపోయి ఉంటారని అనుకున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళెక్కడ ఉన్నారో తెలుసుకుందామని నేను మా మరదలికి ఫోన్ చేశాను. తామంతా పెద్ద ప్రమాదానికి గురయ్యామని చెప్పింది తను. జరిగిన విషయం విన్న నేను ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ప్రమాదానికి గురైన కారు ఫోటో తీసి నాకు పంపింది మా మరదలు. బాబా చేసిన అద్భుతం! అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ మా మరదలి తండ్రికి చిన్నగా గీరుకుపోవడం తప్ప ఇంకెవరికీ ఏమీ కాలేదు. అంతా బాబా కృప. మా మరదలు కూడా డాక్టర్ అయినందున తన తండ్రికి ప్రథమ చికిత్స చేసింది. 

ఇంత డ్రామా జరిగిన తరువాత చివరికి వాళ్ళు హాస్పిటల్‌కి చేరుకున్నారు. అక్కడి డాక్టర్లు, “పరిస్థితి చాలా విషమంగా ఉంది. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం” అని చెప్పారు. అందువలన మావాళ్ళందరూ భయపడ్డారు. కానీ తన బెడ్ నెంబర్ 9 తో బాబా తన ఉనికిని మరోసారి చూపించారు. నా బాబా నా మాట వింటున్నారని నేను చాలా సంతోషించాను. సాయి ఉనికిని అనుభూతి చెందుతున్నందున నేను చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉన్నాను. నేను నా పారాయణ కొనసాగిస్తూ, “బాబా తనతో ఉన్నారు, కాబట్టి మీరు ఆందోళన చెందవద్ద”ని మావాళ్ళకు చెప్తుండేదాన్ని. కానీ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో మా తమ్ముడు కూడా తనకు ఏమవుతుందోనని భయపడసాగాడు. నేను రాత్రిపగలు వాళ్లతో నిరంతరాయంగా మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను తన పరిస్థితి తెలుసుకోవడానికి అర్థరాత్రి వేళల్లో కూడా ఆసుపత్రి 24 గంటల సర్వీసుకు కాల్ చేస్తూ ఉండేదాన్ని.

బాబా దయతో కొన్నిరోజుల తరువాత మా తమ్ముడు కోలుకోవడం ప్రారంభించాడు. రెండు వారాల తరువాత తను ఐ.సి.యు నుండి సాధారణ గదికి మార్చబడ్డాడు. తరువాత తను నాకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అది విని నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. తను ఏమి చెప్పాడంటే, “అక్కా! మొన్న ఎవరో ఒక వ్యక్తి నా మంచం ప్రక్కన నిలబడ్డారు. నేను ఆయన ముఖాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఆయన వృద్ధుడిలా ఉన్నారు. ఆయన నాతో, “చింతించకు! నేను దెయ్యాన్ని నాతో తీసుకుపోతున్నాను. నువ్వు సంతోషంగా నిద్రపో!” అని చెప్పారు. నేను ఆయన మాటలను చాలా స్పష్టంగా విన్నాను. ఎవరో ఐ.సి.యు లోపలికి వచ్చారని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఎవరూ లేరు” అని చెప్పాడు. తను బాబాను అంతగా ఇష్టపడడని నేను మీకు ముందే చెప్పాను కదా! కానీ ఆ సంఘటన మంగళవారం జరిగితే తను నాకు గురువారంనాడు చెప్పాడు. నేను ప్రతి గంటకు ఒకసారి తనతో మాట్లాడుతున్నప్పటికీ తను అప్పటివరకు నాకు ఆ విషయం చెప్పలేదు. సరిగ్గా గురువారంనాడే ఆ విషయం తను నాకు చెప్పడంతో నేను మళ్ళీ బాబా ఉనికిని అనుభూతి చెందాను. ఆ వృద్ధుని రూపంలో వచ్చిన రక్షకుడు ఎవరో ఇప్పుడు మనందరికీ తెలుసు. అందుకే పెద్ద పట్టా పుచ్చుకున్న డాక్టర్ నాతో ఉండగా నేను ఎందుకు భయపడాలి?

నేను ఈ కష్టకాలాన్ని ఎలా దాటానో నాకే తెలియదు. క్షమించండి, నా బాబా నన్ను దాటించారు. “బాబా! మీకు వాగ్దానం చేసినట్లు నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా లెక్కలోకి రాదు. అందుకు మరో జన్మ కావాలి. ఆ జన్మ కూడా సరిపోదు. మీ దయవల్ల నా తల్లిదండ్రులు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మేము ప్రతిరోజూ అనుభవిస్తున్న ఆనందాలన్నీ మీ భిక్షే సాయీ. దయచేసి నా కుటుంబాన్ని, మీ మనవళ్లను ఆశీర్వదించండి. మేము దూరంగా ఉన్నందున మీరు మాత్రమే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నా బాధ్యత మీదే, వేరెవరిదీ కాదు. లవ్ యు సాయీ. దయచేసి త్వరలో మీరు ప్రసాదించిన మరో అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకునేలా నన్ను ఆశీర్వదించండి. అందరిలా నేను మీకు పూజలు చేయనప్పటికీ మీరు ఎల్లప్పుడూ నా చిన్న అవసరాలకు కూడా ప్రతిస్పందిస్తూ నాపై కురిపించే ప్రేమను అందరితో పంచుకోవాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. బాబా! ఈసారి నిజంగా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే, ఇదివరకు ఎప్పుడైనా నాకు సమస్య వస్తే, ‘నాకెందుకు ఈ సమస్య వచ్చిందని మీతో అనేదాన్ని. కానీ ఇప్పుడు నాకు సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించడానికి బదులు నమ్మకంగా మీ పాదాలు పట్టుకుంటాను బాబా. ఈ విధమైన నమ్మకంతో మిమ్మల్ని ప్రేమించేలా దయచేసి నన్ను సదా ఆశీర్వదించండి బాబా!”



కాశీరాంషింపీ



సాయిభక్తుడు శ్రీకాశీరాంషింపీ దయార్ద్రహృదయుడు, సున్నితమనస్కుడు, ఆధ్యాత్మిక భావాలు మెండుగా కలిగినవాడు. మహల్సాపతి, అప్పాజోగ్లే కూడా అటువంటి మనస్తత్వమే కలిగివుండేవారు. కాబట్టి ముగ్గురూ మంచి స్నేహితులుగా మెలుగుతూ, గ్రామంలోకి వచ్చే సాధువులకు, సత్పురుషులకు, బైరాగులకు, ఫకీరులకు తమ శక్త్యానుసారం సేవ చేసి వారి అవసరాలు తీరుస్తూ వారి సంక్షేమాన్ని చూస్తుండేవారు. ఖండోబా ఆలయం వద్ద ‘సాయీ’ అంటూ శ్రీసాయిబాబాను స్వాగతించిన మహల్సాపతి ఆయనను గ్రామంలోకి తీసుకువచ్చి తన మిత్రులైన కాశీరాంషింపీ, అప్పాజోగ్లేలకు పరిచయం చేశాడు. ఈ ముగ్గురూ బాబాపట్ల అంకితభావంతో వారి కొద్దిపాటి అవసరాలను చూసుకుంటుండేవారు. గ్రామస్తులు కాశీరాంని “షింపీ” అని పిలిచేవారు. బాబా కూడా అతనిని అలాగే పిలిచేవారు. ‘షింపీ’ అనే మరాఠీ పదానికి అర్థం ‘దర్జీ’ అని. అది అతని కులానికి సంకేతం. దాన్నే ఇంటిపేరుగా వ్యవహరించేవారు. అయితే ప్రస్తుతం అతని వారసులు “మిరానే” అనే పదాన్ని కూడా చేర్చి, “మిరానే షింపీ”ని తమ ఇంటిపేరుగా వ్యవహరిస్తున్నారు.

కాశీరాంషింపీ వస్త్రవ్యాపారి. అతను తనకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులతో స్థిరమైన జీవితాన్ని సాగిస్తుండేవాడు. అతను బాబాను ఎంతగానో ప్రేమిస్తూ తను, మన, ధన, ప్రాణాలతో వారి సేవను అత్యుత్తమంగా చేశాడు. బాబా కఫ్నీ తొలినాళ్లలో కాషాయం లేదా తెల్లని రంగులో ఉండేది. ఒకసారి కాశీరాం ప్రేమతో బాబా కోసం ఒక ఆకుపచ్చని కఫ్నీ, అదే రంగు తలపాగాను కుట్టి వారికి బహూకరించాడు. బాబా కొన్నిరోజులు దాన్ని ధరించిన తరువాత మునుపటివలె తెల్లని కఫ్నీ ధరించసాగారు. కానీ, అతనిచ్చిన ఆ ఆకుపచ్చని కఫ్నీని తాము సమాధి చెందేవరకు ఒక మూటలో జాగ్రత్తగా దాచుకున్నారు. బాబా ఆ మూటను ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. బాబా సమాధి చెందాక భక్తులు ఆ మూటను కూడా వారి సమాధిలో భద్రపరిచారు.

బాబా చిలిం కోసం పొగాకును, ధుని కోసం కట్టెలను సమకూర్చేవాడు కాశీరాంషింపీ. ప్రతి ఉదయం అతను బాబా దర్శనం చేసుకొని వారి పాదాల వద్ద రెండు పైసలు ఉంచేవాడు. నిజానికి బాబా తొలిరోజుల్లో భక్తుల వద్దనుండి ధనం స్వీకరించేవారు కాదు. కానీ కాశీరాంషింపీ వద్ద ఒక పైసానో, రెండు పైసలో తరచూ తీసుకొనేవారు. ఎందుకంటే, తన దగ్గరనుండి బాబా దక్షిణ తీసుకోవాలని కాశీరాంకు తీవ్రమైన కోరిక ఉండేది. ఎప్పుడైనా బాబా దక్షిణ తీసుకోకపోతే అతనికి చాలా బాధ కలిగి కళ్లనుండి నీరు కారేది. ఇది అతనికి బాబాపట్ల ఉన్న ప్రేమకు, భక్తికి నిదర్శనం. అయితే, ఇలా బాధపడటం కూడా పరమార్థంలో మంచిది కాదు. కారణం, అందులో ‘నాకు ఇచ్చే శక్తి ఉంది’ అన్న అహంభావం ప్రవేశిస్తుంది. అందువల్ల భక్తుని పరమార్థ ప్రగతికి ఘాతుకమైన విషయాన్ని పెరికిపారవేయటం గురువు యొక్క నిత్య సంకల్పం. కాశీరాం విషయంలో అదే జరిగింది.

తరువాతి రోజుల్లో కాశీరాంషింపీ తాను ప్రతిరోజూ సంపాదించే నగదు మొత్తాన్ని తీసుకొచ్చి బాబా పాదాల చెంత ఉంచి, వారికి ఇష్టమొచ్చినంత తీసుకోమని అని అర్థించేవాడు. బాబా తమకు తోచినంత ఉంచుకొని, మిగిలిన మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చేవారు. ఇలా చాలారోజులు నడిచింది. క్రమంగా అతని మనసులో ‘నా గురువైన బాబాకు దక్షిణ ఇవ్వగల సామర్థ్యం నాకుంది, నేను ఆయన అవసరాలు తీరుస్తున్నాను’ అన్న అహంకార బీజం నాటుకుంది. బాబాకు తమ భక్తులపై అమితమైన ప్రేమ. వారు సర్వజ్ఞులు. భక్తుల మనస్సు, వారి ఆలోచన సర్వమూ బాబాకి తెలుసు. అందువల్ల కాశీరాంని అనేకమార్లు దక్షిణ అడగటం ప్రారంభించారు బాబా. కొంతకాలానికి అతనికి డబ్బుకు సంబంధించిన కష్టం ఏర్పడి బాబాకు కొద్దిపాటి దక్షిణ కూడా సమర్పించలేని స్థితికి చేరుకున్నాడు. తన వద్ద డబ్బు లేదని ఎంతో బాధగా విన్నవించుకునేవాడు. అయినా బాబా, “వ్యాపారి వద్ద అప్పుగా తెచ్చి తమకివ్వమ”ని చెప్పేవారు. కొన్నిరోజులు అతను అలాగే చేశాడు. రోజురోజుకీ అప్పు పెరిగిపోయింది. దాంతో వ్యాపారులు అతనికి డబ్బివ్వడం మానేశారు. చివరికి అతనిని తమ ఇంటిగుమ్మం ముందు నిలబడటానికి కూడా గ్రామస్తులు అనుమతించేవారు కాదు. ఇదంతా బాబా లీల. ఈ లీలంతా అతని అహంభావాన్ని తొలగించటానికే, వారి అవసరాలు తీర్చే శక్తి అతనికి లేదని తెలియజేయడానికే. ఎప్పుడైతే ఆ సత్యాన్ని అతను గ్రహించాడో ఆ క్షణం నుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. మునవటిపలే అతను సుఖంగా ఉండసాగాడు. బాబా రోజూ తన వద్దనుండి దక్షిణ తీసుకోవాలి అనే అతని తపన కూడా తొలగిపోయింది.

వ్యాపారరీత్యా కాశీరాంషింపీ వివిధ గ్రామాలు తిరుగుతూ ఆయా గ్రామాల్లో సంత జరిగే రోజున అంగడి పెట్టుకొని వస్త్రవ్యాపారం చేస్తుండేవాడు. ఒకసారి నావూర్ సంతనుండి అతను గుర్రపుస్వారీ చేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దోపిడీ దొంగల ముఠా ఒకటి తటస్థపడింది. మొదట ఆ దొంగలముఠా అతనిపై దాడి చేయలేదు. అతని వెనుక ఉన్నవారిని దోచుకున్న తరువాత వారి దృష్టి కాశీరాంషింపీపై పడింది. వెంటనే ఆ ముఠా అతనిపై దాడిచేయనారంభించారు. కాశీరాం వారిని అడ్డగించలేదు. తరువాత ఆ దొంగల దృష్టి అతని వద్దనున్న ఒక చిన్న మూటపై పడింది. అందులో ధనమో లేదా విలువైనదేమైనా ఉండవచ్చనే అనుమానంతో వాళ్ళు దానిని దోచుకునే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి అందులో ఉన్నది కేవలం పంచదార పొడి. జానకీదాస్ అనే పేరుగల ఒక సత్పురుషుడు, ‘చీమలకు పంచదార వేయాల’ని బోధించినప్పటినుండి కాశీరాం పంచదారను తన దగ్గరుంచుకునేవాడు. ఆ చిన్నమూట అతనికి అత్యంత ప్రియమైనది, తన ప్రాణం కంటే విలువైనది. ఏమైనాగానీ ఆ మూటను మాత్రం ఇవ్వకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. ఆ మూటకోసం దొంగలు అతనిని తీవ్రంగా గాయపరిచారు. అంతలో సమీపంలో పడివున్న కత్తి ఒకటి కాశీరాం కంటపడింది. వెంటనే అతను ఆ కత్తిని అందుకొని ఎదురుదాడి చేసి ఇద్దరు దొంగలను హతమార్చాడు. ఇంతలో మూడవ దొంగ వెనుకనుంచి వచ్చి గొడ్డలితో కాశీరాం తలపై కొట్టాడు. దాంతో తీవ్రంగా రక్తస్రావమై కాశీరాం స్పృహతప్పి పడిపోయాడు. మిగిలిన దొంగలు అతను చనిపోయాడని తలచి అక్కడినుండి వెళ్ళిపోయారు. కానీ నిజానికి అతనికి ప్రాణం పోలేదు. కొంతసేపటికి అతనికి తెలివి వచ్చింది. బాబాపట్ల అమితమైన భక్తిశ్రద్ధలు ఉన్న అతను తనకు సహాయం చేయడానికి వచ్చినవారితో, తాను ఆసుపత్రికి పోననీ, తనను శిరిడీకి తీసుకెళ్ళమనీ కోరాడు. అట్లే, వాళ్ళు అతనిని శిరిడీకి తీసుకొని వచ్చారు. బాబా అతనికి ఔషధోపచారాలు చేయమని మాధవరావు దేశ్‌పాండేతో చెప్పారు. కొద్దిరోజుల్లో బాబా కృపతో కాశీరాం ఆరోగ్యం బాగుపడింది. 

నిజానికి కాశీరాంపై చాలామంది దోపిడీ దొంగలు ఆయుధాలతో దాడి చేశారు. అయినప్పటికీ, ఎదురుదాడి చేసి వారిని నివారించి, అతను సజీవంగా బయటపడ్డాడంటే అది కేవలం శ్రీసాయి కృపే. ముఖ్యమైన విషయమేమిటంటే, సరిగ్గా అతనక్కడ దొంగలపై ఎదురుదాడి చేస్తున్న సమయంలో ఇక్కడ శిరిడీ ద్వారకామాయిలో కూర్చొని ఉన్న బాబా ఉన్నట్టుండి ఆగ్రహావేశాలతో సట్కా ఝుళిపిస్తూ ఒకటే కేకలు, బొబ్బలు, తిట్లు, శాపాలు వగైరాలతో గొడవ చేశారు. బాబా చర్యలను గమనిస్తున్న భక్తులు, “ఎవరో ప్రియమైన భక్తునిపై పెద్ద కష్టమొచ్చి పడివుండవచ్చు. ఆ భక్తుని రక్షించటానికే బాబా ఇలా చేస్తున్నారు” అనుకున్నారు. వారు ఊహించినట్లే దొంగల దాడినుండి బాబా తమ భక్తుణ్ణి రక్షించారు. అతని వీరకృత్యానికి బొంబాయి ప్రభుత్వం కాశీరాంకు ఒక కరవాలాన్ని బహూకరించింది.

పై ఘటన తరువాత కాశీరాం మరికొన్నేళ్ళు జీవించి, శ.సం॥1830 (1908) చైత్రశుద్ధ ఏకాదశి రోజున మరణించాడు. అతని వారసులు ఇప్పటికీ అదే ఇంట్లో నివసిస్తున్నారు. వారంతా బాబాకు అంకితభక్తులుగా ఉంటూ వారసత్వంగా బాబా సేవను కొనసాగిస్తున్నారు.

కాశీరాంషింపీ మునిమనుమడైన శాంతారాం రంగనాథ్ మిరానే షింపీ 1999 నుండి 2004 వరకు శ్రీసాయిబాబా సంస్థాన్ ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించారు. సామూహిక శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ అనే పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించటంలో అతను ప్రముఖ పాత్ర వహించారు. సామూహిక పారాయణ అనంతరం కీర్తనలు నిర్వహించే పద్ధతిని కూడా అతను తిరిగి ప్రవేశపెట్టాడు. అంతేకాదు, ‘గురుపథ్ భజన్’ (1903లో శ్రీదాసగణు మహరాజ్ స్వరపరిచిన 25 అభంగాల కీర్తన) అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాడు. అది పూర్తవుతూనే భక్తులు తమ జీవితంలో జరిగిన అనుభవాలు మరియు అద్భుతాల గురించి మాట్లాడుతారు.

సమాప్తం..... 

రిఫరెన్స్: సాయి ప్రసాద్ పత్రిక, 1995 దీపావళి సంచిక.
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ.

సాయిభక్తుల అనుభవమాలిక 604వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. అమ్మ ఆరోగ్య విషయంలో బాబా కృప
  2. నా పెళ్ళికి బాబా, మారుతిల ఆశీస్సులు

అమ్మ ఆరోగ్య విషయంలో బాబా కృప

హైదరాబాదు నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన ఇటీవలి అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. మన సద్గురు సాయినాథునికి శతకోటి నమస్కారాలు. సెప్టెంబరు నెలలో ఒకరోజు మేము మా అమ్మావాళ్ళింటికి వెళ్ళాము. అమ్మావాళ్ళింటి పక్కింట్లో ఉన్న ఆమెకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో అమ్మ, అన్నయ్య కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అన్నయ్యకి నెగిటివ్ వచ్చిందిగానీ, అమ్మకి పాజిటివ్ వచ్చింది. దాంతో నేను, మావారు, మా అమ్మాయి కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాము. బాబా దయవలన మా అందరికీ నెగిటివ్ వచ్చింది. అమ్మకి షుగర్ ఉన్నందువల్ల కోవిడ్ ప్రభావం తనపై ఎక్కువగా ఉంటుందేమోనని మాకు చాలా భయమేసింది. మేము ఎంతగానో ఆందోళన చెంది, "అమ్మ త్వరగా కోలుకునేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకొని ఊదీని నీళ్లలో కలిపి ఆమె చేత త్రాగిస్తూ రోజూ బాబాని ప్రార్థిస్తుండేవాళ్ళం. బాబా దయవల్ల ఇరవైరోజుల్లో అమ్మకి నెగిటివ్ వచ్చింది. ఎంతో ఉపశమనంగా అనిపించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. కానీ రెండురోజుల తర్వాత అమ్మకి విపరీతంగా ఒళ్ళునొప్పులు వచ్చాయి. టాబ్లెట్ వేసుకుంటే నొప్పులు ఉపశమించేవి, టాబ్లెట్ పవర్ తగ్గుతూనే మళ్ళీ మొదలయ్యేవి. మాకు భయమేసి తెలిసిన డాక్టరు వద్దకి వెళ్తే స్కానింగ్ చేయించమని చెప్పారు. స్కానింగ్ చేయించాక రిపోర్టు చూసిన డాక్టర్, 'కిడ్నీలో కొంచెం సమస్య ఉందని, అది మొదటిదశలో ఉంద'ని చెప్పారు. మాకు ఆందోళనగా అనిపించి రెండవ అభిప్రాయం కోసం ఆ రిపోర్టును తీసుకొని వేరే డాక్టర్ని సంప్రదించాము. ఆ డాక్టరు, "మళ్ళీ టెస్టులు చేయిద్దాం, రేపు రండి" అని చెప్పారు. ఆ రోజంతా బాబా ఊదీ కలిపిన నీళ్లు అమ్మ చేత త్రాగిస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ ఉన్నాము. మరుసటిరోజు అమ్మకి టెస్టులు చేశారు. టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా రావాలని మేము 'ఓం శ్రీసాయి జయనే నమః' అనే మంత్రజపం చేశాము. బాబా అద్భుతం చేసి చూపించారు. మరుసటిరోజు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో వెళ్లి డాక్టరుని కలిశాము. ఆయన రిపోర్టులు మాకు చూపించి, "అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. సమస్యేమీ లేదు. కేవలం ఇన్సులిన్ తగ్గింది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంట్లోనే ఇన్సులిన్ తీసుకోండి. మళ్ళీ ఒక నెల తరువాత చెకప్‌కి రండి" అని చెప్పారు. "సాయినాథా! శతకోటి ధన్యవాదాలు తండ్రీ! అమ్మకి రక్షణగా ఉంటూ ఆమెకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మా తప్పులు ఏవైనా ఉంటే మన్నించి మా కుటుంబానికి తోడుగా ఉండండి సాయీ! మీ భక్తులందరినీ సంరక్షించండి తండ్రీ!"


నా పెళ్ళికి బాబా, మారుతిల ఆశీస్సులు

సాయిభక్తురాలు అనూష తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

బాబా ఆశీస్సులతో 2020, అక్టోబరు 28న నా వివాహం జరిగింది. ఎవరైనా ప్రేమతో పిలిస్తే బాబా వస్తారని నేను చాలామంది భక్తుల అనుభవాల్లో చదివాను. పెళ్ళికి రెండురోజుల ముందు నేను నా మనసులో, "మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా" అని బాబాను ప్రార్థించాను. పెళ్లి రేపనగా ముందురోజు నా స్నేహితుని భార్య నాకు ఫోన్ చేసి, "నువ్వు ఏ దేవుడిని పూజిస్తావు?" అని అడిగింది. నేను తనతో 'బాబా' అని చెప్పాను. తరువాత తను నా పెళ్లికానుకగా నాకు గాజులు బహూకరించాలని అనుకుంటున్నట్లు మెసేజ్ పెట్టారు. కానీ ఆశ్చర్యంగా వెండి విగ్రహం రూపంలో బాబా మా పెళ్ళికి వచ్చారు. బాబాతో పాటు ఆంజనేయస్వామి అంటే కూడా నాకు ఇష్టం. ఆయన్ని కూడా "మా పెళ్ళికి రండి స్వామీ" అని పెళ్లికి ముందురోజు ప్రార్థించాను. మేము భోజనాలు చేస్తున్న సమయంలో ఆంజనేయస్వామి మారుతి (కోతి) రూపంలో వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్లారు. నేను కోరుకున్నట్లే బాబా, ఆంజనేయస్వామి మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. వారిరువురికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పించుకున్నాను.



సాయిభక్తుల అనుభవమాలిక 603వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నిజంగా బాబా మాతో ఉన్నారు, తమ ఉనికిని మాకు చూపించారు
  2. క్షణాల్లోనే అనుగ్రహాన్ని చూపిన బాబా

నిజంగా బాబా మాతో ఉన్నారు, తమ ఉనికిని మాకు చూపించారు

హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు సుధారాణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! బాబా మాకు చిన్నవి, పెద్దవి ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. చాలాకాలం క్రితం మేము ఎన్నో అద్భుతాల ద్వారా బాబా ఆశీస్సులను పొందాము. వాటిలో ఒక అనుభవాన్ని ఇదివరకు నేను మీతో పంచుకున్నాను. ఇటీవల నా పని ఒకటి పూర్తయితే ఆ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. బాబా అనుగ్రహించిన ఆ అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. "ఓం సాయిరామ్! దయచేసి సదా మా జీవితమంతా ఆశీర్వదించండి బాబా!"

మా కుటుంబంలో నేను, మావారు, మా అమ్మాయి మొత్తం ముగ్గురు సభ్యులం. వాస్తవానికి మేము మహారాష్ట్రీయులం. నా భర్త ఉద్యోగరీత్యా బదిలీ మీద ముంబాయి నుండి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చాము. ఇటీవల మా అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకుంది. అయితే ప్రస్తుత చిరునామాకు సంబంధించి ఏ గుర్తింపు కార్డులు మాకు లేవు. ఆధార్, పాస్‌పోర్ట్ మొదలైన అన్ని ఐడెంటిటీ కార్డులు మహారాష్ట్రకి చెందినవే. అద్దె ఇంటిలో ఉన్నందువలన విద్యుత్తు బిల్లు కూడా మా పేరు మీద లేదు. ఏమి చేయాలో అర్థం కాకపోయినప్పటికీ విద్యుత్తు బిల్లు ఆధారంగా ఇంటి యజమాని చిరునామాతో ముందైతే లెర్నర్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశాము. కానీ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు శాశ్వత లైసెన్స్‌కు వెళ్ళేటపుడు మాత్రం ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అది కూడా స్థానిక చిరునామాతో ఉండటం తప్పనిసరి అని చెప్పారు. దాంతో మేము ఆధార్ అప్‌గ్రేడ్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌లో చిరునామా మార్పు చేయించాము. వారం రోజులు గడిచిన తరువాత కూడా మాకు UDAI (ప్రభుత్వ ఆధార్) వెబ్‌సైట్ నుండి ఎటువంటి సందేశమూ రాలేదు. అప్పుడు నేను ఆధార్ అప్‌గ్రేడ్ కేంద్రానికి వెళ్లి, "మాకు ఏ సందేశమూ రాలేదు. ఏమి జరిగింది?" అని విచారించాను. అప్పుడు వాళ్ళు వెబ్‌సైట్ చెక్ చేసి, ఏవో కొన్ని సమస్యల కారణంగా ఆధార్ అప్‌గ్రేడ్ కాలేదని, మళ్ళీ వచ్చి అప్‌గ్రేడ్ చేయించుకోమన్నారు. దాంతో నేను, మా అమ్మాయి మళ్ళీ వెళ్లి అన్ని వివరాలూ ఇచ్చి అప్‌లోడ్ చేయించాము. తరువాత కూడా రోజులు గడుస్తున్నా మాకెంటువంటి సందేశమూ రాలేదు. అందువలన మేము చాలా ఆందోళనచెందాము. కారణం, ఆధార్ కార్డు చూపించకుండా మేము పాన్‌ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవేవీ చేయించుకోలేము. నేను నిరంతరం బాబా స్మరణ చేస్తూ ఏదో ఒక మార్గం చూపించమని బాబాని ప్రార్థించసాగాను. ఒక ఉదయం బాబా ఆశీస్సులతో వారి ప్రేరణ వల్ల నాకు 'UDAI హెల్ప్‌లైన్ నెంబరుకి కాల్ చేయాల'న్న ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు 'మీ ఆధార్ ప్రాసెస్‌లో ఉంది. ప్రాసెస్ పూర్తి కావడానికి కనీసం 90 రోజుల సమయం పడుతుంద'ని చెప్పారు. నేను ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాను. ఇక చేసేదిలేక సమస్యను బాబాకే వదిలివేశాము. అయితే బాబా అద్భుతం చేశారు. 10 రోజుల తరువాత మా ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా మాకు చేరింది. అది చూసి మేము ఆశ్చర్యపోయాము. బాబా ఆశీర్వాదంగా భావించి మేము చాలా సంతోషించాము.

రెండవ అనుభవం: 

ఆధార్ కార్డు రావడంతో మా అమ్మాయి ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్సుతోపాటు పాన్ కార్డుకి కూడా దరఖాస్తు చేశాము. బాబా కృపవలన పాన్ కార్డు కేవలం 10 రోజుల్లో వచ్చింది. తరువాత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మా అమ్మాయి కార్ డ్రైవింగ్ పరీక్షకు హాజరైంది. బాబా దయవల్ల తను తన పరీక్ష విజయవంతంగా పూర్తిచేసింది. తరువాత తను RTO విండో కౌంటర్ వద్దకు వెళ్లి ఆ పరీక్షకు సంబంధించిన రశీదు తీసుకుని వచ్చి, "నేను పాస్ అయ్యాను" అని సంతోషంగా రశీదు నాకు చూపించింది. మరుక్షణంలో ఆఫీసు ప్రాంగణంలోకి వస్తున్న ఒక కారుపై ఉన్న బాబా ఫోటోను మా అమ్మాయి నాకు చూపించింది. నిజంగా బాబా మాతో ఉన్నారు. ఆయన తన ఉనికిని మాకు చూపించారు. నేను చాలా సంతోషించాను. మా అమ్మాయి కూడా చాలా సంతోషించింది. బాబా మా అమ్మాయికి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రవేశం కూడా కల్పించారు. తనని ఎప్పుడూ ఇదేవిధంగా ఆశీర్వదించాలని బాబాను కోరుకుంటున్నాను.

చివరిగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా కృతజ్ఞతలు. వారు బాబా ఆశీస్సులు పొందినవారు. బాబా ఈవిధమైన భాగ్యాన్ని వారికి ప్రసాదించారు. ఖచ్చితంగా వాళ్ళకి, వాళ్ల కుటుంబానికి బాబా ఆశీస్సులు లభిస్తాయి. నా అనుభవాన్ని ఇక్కడ పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. "ఓం సాయిరామ్! కోటి కోటి ధన్యవాదాలు బాబా! నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా మీరు నాకు ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. మీ ఆశీస్సులతో రాబోయే మరో ఫలితం కోసం నేను ఎదురుచూస్తున్నాను. అది మీ చేతిలో ఉంది బాబా. దయచేసి మీ అనుగ్రహాన్ని కురిపించండి బాబా".


క్షణాల్లోనే అనుగ్రహాన్ని చూపిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

విజయవంతంగా నడుస్తున్న ఈ బ్లాగ్ వెనుకనున్న నిర్వాహకులకు నా ప్రణామాలు. నా అనుభవానికి వస్తే..  మా అబ్బాయి బెంగళూరులోని ఒక ఎమ్.ఎన్.సి సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా కంపెనీవాళ్ళు ఇంటినుండి పనిచేసే అవకాశం కల్పించడంతో మార్చి నెల నుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉంటూ పనిచేస్తున్నాడు. కానీ కంపెనీ నియమాలు చాలా కఠినమైనవి, పని విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాయి. మా అబ్బాయి కూడా అంతే నిబద్ధతగలవాడు. తను రోజూ ఎక్కువ గంటలు పనిచేస్తుండేవాడు. అయితే ఈమధ్యకాలంలో తన సిస్టమ్ వలన, ఇంటర్నెట్ వలన తరచూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో తన సమయం వృథా అవడమేకాక, పని పూర్తయ్యేది కాదు. ఒకరోజు నేను బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించి, "బాబా! బాబుకి ఎదురవుతున్న సమస్యను పరిష్కరించండి. ఇంకెటువంటి సమస్యలు లేకుండా తను తన రోజువారీ ఆఫీసు పని పూర్తి చేసుకునేలా అనుగ్రహించండి. అలా జరిగితే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అభ్యర్థించాను. అలా ప్రార్థించిన కొన్ని క్షణాల్లోనే సమస్యంతా దానంతటదే సెట్ అయ్యింది. మా అబ్బాయి తన పని సజావుగా చేసుకోగలిగాడు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

సాయిరామ్!



సాయిభక్తుల అనుభవమాలిక 602వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మీద ప్రేమా? లేక కోపమా?
  2. బాబా సర్వవ్యాపకత్వానికి, ప్రేమకు నిదర్శనం

బాబా మీద ప్రేమా? లేక కోపమా?

సాయిరామ్! నా పేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. నేను ఇదివరకు చాలా అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు విజయదశమి ముందురోజు జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను.

సుమారు రెండేళ్ళుగా మావారి ఆరోగ్యం బాగోలేదు, పైగా ఇతరత్రా సమస్యలతో నేను పడుతున్న బాధ వర్ణనాతీతం. నా కష్టాన్ని తీర్చాల్సిన బాబా చూస్తూ ఉన్నారే తప్ప నాకీ బాధల నుండి ఉపశమనాన్ని ప్రసాదించడం లేదు. అలాగని బాబాని వదిలేద్దామనుకున్నా వదలలేను. అట్లాగని నా కష్టాలూ పోవు. బాబా అలా చేస్తున్నారు. ఇక నా అనుభవానికి వస్తే... నా కష్టాలు బాబా తీర్చటం లేదని, ఈసారి విజయదశమిరోజున ఆయనకి ఏమీ చెయ్యకూడదని అనుకున్నాను. కానీ బాబా ఒక్కటీ వదలకుండా అన్నీ నా చేత ఎలా చేయించుకున్నారో చూడండి.

విజయదశమి ముందురోజు సాయంత్రం నేను లలితాసహస్రనామం చదువుతున్నాను. మా చిన్నబ్బాయి ఇంటి క్రింద నుంచి ఫోన్ చేసి, "అమ్మా, నువ్వు క్రిందికి రా! నువ్వు రోజంతా బాధపడుతూ ఉన్నావు. కాసేపు అలా తిరిగి వద్దాం" అన్నాడు. సరేనని నేను తనతో వెళ్ళాను. తను నన్ను ఒక రామమందిరం వద్దకు తీసుకుని వెళ్ళాడు. అక్కడున్న మందిరాలన్నీ మూసి ఉన్నాయి. కానీ, ఒక అబ్బాయి దేవతామూర్తులకు వేసే వస్త్రాలు పెట్టుకొని ఒక ప్రక్కగా కూర్చొని ఉన్నాడు. అది చూసి లక్ష్మి, సరస్వతి అమ్మవార్లకు వస్త్రాలు తీసుకుందామని అతని దగ్గరకు వెళ్లి ఆ వస్త్రాల గురించి అడిగాను. ఆ అబ్బాయి 'అవి బాబా వస్త్రాల'ని చెప్పాడు. అవి కూడా కేవలం రెండు వస్త్రాలు, ఒక కిరీటం మాత్రమే ఉన్నాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. ధర కూడా చాలా తక్కువే. సుమారు 200 రూపాయలు విలువ చేసే ఒక్కో వస్త్రాన్ని కేవలం 40 రూపాయలకే ఇస్తున్నాడు. ఆ రెండు వస్త్రాలలో ఒకటి నీలం రంగుది. నీలం రంగు వస్త్రం కోసం నేను ఎంతోకాలంగా వెతుకుతున్నాను. ఎప్పుడూ ఆకుపచ్చ, ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలు దొరికేవి గానీ, నీలం రంగు దొరికేది కాదు. అలాంటిది నీలం రంగు వస్త్రం కనిపించేసరికి నా మనసు ఆగలేదు. అందువలన 'బాబాకు పూజ చెయ్యను, క్రొత్త వస్త్రాలు కట్టను' అనుకున్న నా సంకల్పాన్ని విడిచి ఆ వస్త్రాలను తీసుకున్నాను. తరువాత బాబా గుడికి వెళ్లి, కోవిడ్ కారణంగా గుడిలోకి వెళ్ళే వీలులేక బయటనుంచే బాబాకు నమస్కరించుకొని ఇంటికి తిరిగి వచ్చాను. క్రొత్త వస్త్రాలు తీసుకెళ్లి బాబా ముందుపెట్టి, "క్రొత్త వస్త్రాలైతే కొన్నాను కానీ, మీకు కట్టను" అని బాబాతో చెప్పాను. 

మరుసటిరోజు విజయదశమి. మనసులో ఆ నీలం రంగు వస్త్రాన్ని బాబాకు కట్టాలనిపించి, 'ఈ క్రొత్త వస్త్రాన్ని మీకు కడతానుగానీ, పూజ మాత్రం చెయ్యను' అనుకుని బాబాకు ఆ నీలం రంగు వస్త్రాన్ని కట్టాను. ఆ నీలం రంగు వస్త్రాల్లో బాబా చాలా చాలా అందంగా ఉన్నారు. అయినా, "మీరు ఇంత అందంగా కనిపిస్తూ నన్ను మభ్యపెట్టినా నేను మాత్రం మీకు పూజ చేయను" అని అనుకొని అమ్మవారి పూజ పూర్తి చేశాను. సరిగ్గా ఆ సమయంలోనే ఎవరో ఫోనులో, "సాయి సచ్చరిత్రలోని 10, 11 అధ్యాయాలు మీరు చదవండి" అని మెసేజ్ పెట్టారు. విషయం ఏమిటంటే, వాళ్ళు నాకు చెప్పకుండానే విజయదశమి పారాయణ అంటూ నా ఫోన్ నెంబర్ని గ్రూపులో చేర్చుకున్నారు. 'పోనీలే' అని ఆ రెండు అధ్యాయాలు చదివాను. ఆ తరువాత మరో ఆవిడ, "నాకు ఒక సమస్య వచ్చింది, నా కోసం మీరు సచ్చరిత్రలోని 43, 44, 45 అధ్యాయాలు చదవండి మేడమ్" అని మెసేజ్ పెట్టింది. 'పాపం కష్టంలో ఉన్నారు కదా' అని ఆ అధ్యాయాలు కూడా చదివాను. ఇక నాకు కోపం వచ్చి, "బాబా! నువ్వు నా చేత అన్నీ చదివించు" అని కూర్చుని ఏకధాటిగా సాయి సచ్చరిత్ర మొత్తం చదివేశాను. 'అసలు బాబాకు ఏమీ చేయను' అనుకుంటే, ఆయన నాతో క్రొత్త వస్త్రం కట్టించుకోవటం మొదలుకొని సాయి సచ్చరిత్ర పారాయణ వరకు అన్నీ చేయించారు. చివరికి బాబాకు పంచారతి కూడా ఇచ్చాను. ఇది 'బాబా మీద ప్రేమా? లేక కోపమా?' నాకేమీ అర్థం కాలేదు. అంతలోనే నాకు అనిపించింది, "నేను ఎవరిని చేసేదానికి? బాబానే చేయించుకున్నారు" అని. దాంతో చాలా సంతోషపడ్డాను. బాబా చర్యలు అగాధాలు. మనకి అర్థం కానే కావు.


బాబా సర్వవ్యాపకత్వానికి, ప్రేమకు నిదర్శనం

యు.ఎస్.ఏ లోని సన్జోస్ సిటీలో నివాసముంటున్న సాయిభక్తుడు సుబ్రహ్మణ్యంగారు ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

విజయదశమిరోజు నా కూతురు, అల్లుడు బాబా దర్శనానికని బయలుదేరారు. ముందుగా వెళ్ళే దారిలో టీ త్రాగి, తరువాత బాబా దర్శనానికి వెళదామని అనుకున్నారు. కానీ ఆ తరువాత వాళ్ళు టీ త్రాగే విషయం ప్రక్కన పెట్టి నేరుగా బాబా దర్శనానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆశ్చర్యంగా వాళ్ళు బాబా మందిరం చేరుకోగానే అక్కడున్న పూజారి వాళ్ళిద్దరికీ వేడివేడి టీ అందించారు. ఆ మందిరంలో ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. అలనాడు నానాసాహెబ్ చందోర్కర్ పద్మాలయ అడవుల్లోని గణపతి మందిరానికి వెళ్తూ దారిలో, "బాబా! మందిరం రాత్రి తొమ్మిది గంటలకల్లా మూసేస్తారు. నేను అక్కడికి చేరుకునేసరికి రాత్రి పదకొండు గంటలవుతుంది. ఆ సమయంలో నాకు ఒక కప్పు టీ కావాలి" అని ప్రార్థిస్తే, చందోర్కర్ మందిరం చేరుకునేసరికి ఆ మందిరం పూజారి అతనికి కప్పు టీ అందించేలా బాబా అనుగ్రహించారు. ఈనాడు ఏమీ అడగకుండానే నా కూతురు, అల్లుడు కోసం వేడివేడి టీ సిద్ధంగా ఉంచారు బాబా. ఇది బాబా సర్వవ్యాపకత్వానికి, ప్రేమకు నిదర్శనం. బాబా చూపిన కరుణకు నా కూతురు, అల్లుడు, ఆ విషయం తెలిసి నేను కూడా ఎంతో ఆనందానుభూతికి లోనయ్యాము. బాబా ఎంతో ప్రేమమూర్తి. వారు తమ బిడ్డలపై అమితమైన ప్రేమను కురిపిస్తారు. 

సేకరణ: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo