సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రుమాల్ వాలా బాబా


మధ్యప్రదేశ్‌లో ఇండోర్ అనే పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణంనందు రాజా విక్రమాదిత్యుని ఆరాధ్య దేవత హరసిద్ధి(ఉజ్జయిని మహాకాళి, 9వ శక్తిపీఠం) యొక్క పెద్ద ఆలయం ఉంది. 1915వ సంవత్సరంలో ఆ ఆలయ సమీపంలో రుమాల్ వాలా బాబా అనే ఒక ఫకీరు నివసించేవారు. అతన్ని మస్త్ ఫకీరు అని కూడా పిలిచేవారు. అతనెప్పుడూ భిక్షకి వెళ్ళేవాడు కాదు. 24 గంటలూ సాయిబాబా ధ్యానంలో ఉంటుండేవాడు. బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళవలసిన అవసరం అతనికి లేకపోయినప్పటికీ బాబా ప్రేమలో లీనమయ్యేందుకు చాలాసార్లు శిరిడీ వెళ్ళాడు. 1915, మే నెలలో ఒక శుక్రవారంనాడు అతడు సాయిబాబా దర్శనం కోసం శిరిడీ సందర్శించాడు. ద్వారకామాయిలో అతను ధ్యానంలో ఉండగా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి బాబా ఫోటో తీసి బయటకు పారిపోయాడు. అతని చర్యకు బాబా కోపంతో తిట్ల వర్షం కురిపించారు. మూడవరోజు ఆదివారంనాడు ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోను తీసుకొచ్చి రుమాల్ వాలా బాబా సమక్షంలో సాయిబాబాకు బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో శ్రీ బాపుసాహెబ్ బూటీ అల్లుడైన ప్రొఫెసర్ శ్రీ గణపత్ రావు నార్కే తన ఉద్యోగం గురించి బాబాతో మాట్లాడేందుకు అక్కడ కూర్చొని ఉన్నాడు. బాబా ఆ ఫోటోను అతనికిచ్చి, “ఇది తీసుకో! ఈ ఫోటోను కలిగి ఉన్న వ్యక్తి విపత్తులు మాయమవుతాయి(బేడా పార్ హో జాయేగా)" అని అన్నారు. "అంతటి సాటిలేని ఫోటోను బాబా నాకు ఇస్తే ఎంత బాగుంటుంద"ని రుమాల్ వాలా బాబా తన మనసులో అనుకున్నాడు. తరువాత భక్తులు మధ్యాహ్న ఆరతి మొదలుపెట్టారు. ఆరతి ముగిసాక బాబా అందరికీ ఊదీ ఇచ్చి, "ప్రతి ఒక్కరూ వెళ్లి భోజనం చేయండ"ని ఆదేశించారు.

ఒక పక్షి రెక్కలు లేకుండా, మణి లేకుండా పాము, తొండం లేకుండా ఏనుగు సంతోషంగా ఉండలేనట్లు రుమాల్ వాలా బాబా సాయిబాబా ఫోటో లభించక సంతోషంగా ఉండలేకపోయాడు. అతను భోజనానికి బాలాభావు నివాసానికి వెళ్ళాడు కాని, ఒక్క ముద్ద కూడా తినలేకపోయాడు. ఏదో ఒకవిధంగా భోజనాన్ని ముగించి, బాలాభావుకు ఎనిమిది అణాలు ఇవ్వడానికి జేబులో చేయిపెట్టాడు. ఆశ్చర్యం! డబ్బులతోపాటు తన జేబునుండి బాబా ఫోటో కూడా బయటకు వచ్చింది. అది చూసి అతను పట్టలేని ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో అతడు గెంతుతూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు. అందరితో, “చూడండి... బాబా యొక్క అపూర్వమైన ఫోటో నాకు లభించింది. ఈ ఫోటో ఎవరైతే భద్రపరుస్తారో వారి విపత్తులు అంతరించిపోతాయని బాబా చెప్పారు. అదే ఫొటో నాకు లభించింది" అని చెప్పాడు. ఆ ఫోటోను పొందడం ద్వారా అతని ఆనందానికి అవధులు లేవు. అమితమైన ఉత్సాహంతో అతని కళ్ళ నుండి కన్నీళ్లు పొంగిపొర్లాయి. పదేపదే ఆ ఫోటోను తన గుండెలకు హత్తుకుంటూ ఉండేవాడు. కొన్నిరోజుల తరువాత అతడు తిరిగి ఇండోర్ చేరుకుని ఆ ఫోటోను గోడకున్న ఒక గూడులో పెట్టాడు.

కొన్ని సంవత్సరాల తరువాత శ్రీ పథక్ జీ అనే భక్తుడు రుమాల్ వాలా బాబాను సందర్శించడం ప్రారంభించాడు. ఒకరోజు అతను బాబా ఫోటోను తన చేతిలోకి తీసుకున్నాడు. అది చూసిన రుమాల్ వాలా బాబా చాలా కోపం తెచ్చుకుని, “నీవు నీ చేతుల్లోకి ఆ ఫోటోను తీసుకోవడం ద్వారా నాకు చాలా కోపం తెప్పించావు. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఉంచవద్దు. ఆ ఫోటోను నీ వద్ద ఉంచుకో. ఎవరు ఈ ఫోటోని తమ వద్ద ఉంచుకుని దానిని సంరక్షిస్తూ, దూప, దీపాలతో పూజిస్తారో వారి విపత్తులు మాయమవుతాయి" అని అన్నారు. ఆ విధంగా బాబా యొక్క అపూర్వమైన ఫోటో రుమాల్ వాలా బాబా వద్దనుండి శ్రీ.పథక్ జీ వద్దకు చేరింది.

గాంధీనగర్ లో గజనాన్ రావు కృష్ణారావు నీరాఖే అనే సాయిబాబా భక్తుడు ఉండేవాడు. ప్రజలు అతన్ని బాపుసాహెబ్ అని పిలిచేవారు. అతడు తన సేవలను అందించడానికి తరచు శిరిడీ సందర్శిస్తుండేవాడు. శ్రీ. పథక్ జీ బాబా ఫోటోను పొందిన తరువాత శిరిడీ సందర్శించేందుకు బాపుసాహెబ్ బృందంలో చేరాడు. బాపుసాహెబ్ కు సాయిబాబా పట్ల ఉన్న అత్యంత భక్తిని చూసిన శ్రీ.పథక్ జీ ఆ ఫోటోను సాయిబాబా యొక్క మరొక భక్తుడు శ్రీ ఉపసాని ద్వారా బాపుసాహెబ్ కు పంపారు. ఆ ఫోటోను అందుకున్న బాపుసాహెబ్ ఆనందంతో చిందులు వేసాడు. అతను ఫోటోకు ఫ్రేమ్ చేయించి తన మెడలో వేసుకున్నాడు. తరువాత ఇండోర్ భక్తులు సాయిబాబా కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని బాపుసాహెబ్ స్థాపించారు.

1987 సంవత్సరం, అక్టోబర్ 10, 11 తేదీలలో బరోడాలోని శ్రేయాస్ పాఠశాలలోని పెద్ద హాలులో అఖిల భారత సాయి సమ్మేళనం జరిగింది. ఆ సభలో 'సాయి సరోవర్' పుస్తక రచయిత దివంగత శ్రీమగన్‌లాల్ జర్మన్‌వాలాను సత్కరించారు. ఆ సభకు బాపుసాహెబ్ కూడా హాజరయ్యారు. తన మెడలో ఉన్న అపూర్వమైన సాయిబాబా ఫోటోను సాయి సరోవర్‌ సంస్థకు అందజేసేలా బాబా అతనిని ప్రేరేపించారు.

(మూలం: గుజరాతీ పుస్తకం "సాయి సరోవర్" నుండి ఇంగ్లీషులోకి అనువదించబడి www.shirdisaitrust.org లో ప్రచురించబడిన ఆర్టికల్)

4 comments:

  1. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo