సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పల్లకి - మొదటి భాగం


ద్వారకామాయి ముంగిట మూడునెలలుగా చెక్కపెట్టె లోపలే వున్నదా పల్లకి. "హార్దా” గ్రామానికి చెందిన 'నాయక్ సోదరత్రయం' శ్రీసాయినాథునికి కానుకగా పంపారు దానిని. అది ఒక పల్లకీ అని తెలుసు కానీ, దానిని తీసి చూసేందుకు బాబా ఎవరికీ అనుమతినివ్వటం లేదు. అయితే సాయి సేవ చేసుకునే శుభఘడియలు ఆ పల్లకీకి రఘువీర పురందరే రూపంలో రానేవచ్చాయి.


బాబాపై ఎనలేని భక్తిప్రేమలున్న రఘువీర పురందరే ఆరోజెలాగైనా పల్లకీని పెట్టెనుండి బయటకు తీసి, బాబాను అందులో ఆసీనులను చేసి చావడికి తీసుకెళ్ళాలని సంకల్పించుకున్నాడు. “బాబా, నేనీ పల్లకిని బయటకు తీసి చక్కగా పువ్వులతో అందంగా అలంకరిస్తాను. మీరందులో కూచుని చావడికి రావాలి. ఉత్సవం అప్పుడెంతో కన్నులపండుగ్గా వుంటుంది కదూ?" అని అడిగాడు నవ్వుతూ, సాయి అంగీకారాన్ని తానే తీసేసుకుంటూ.

బాబాకు ఆడంబరాలు సుతరామూ గిట్టవు. ప్రపంచాన్నంతా తన పాదాలముందు సాగిలపడేలా చేసుకోగలిగినా ఫకీరు ధర్మాలను ఖచ్చితంగా పాటించే శ్రీసాయినాథుడు ఎప్పుడూ పాదచారిగానే సంచరించారు. ఏనాడూ ఏ వాహనాన్నీ అధిరోహించలేదు. అందుకే పల్లకీ ఎక్కడానికి తల అడ్డంగా తిప్పారు.

“బాబా, పల్లకీ ఎలాగూ వచ్చేసింది. ఇప్పుడు కుదరదు అంటే ఏం ప్రయోజనం చెప్పండి?” అన్నాడు పురందరే నచ్చచెప్పే ధోరణిలో. కానీ శ్రీసాయి నుండి సానుకూలతే లేదు. “బాబా, మీరు పల్లకీ ఎక్కవలసిందే!” అంటూ బాబా పాదాలకు నమస్కరించి లేచాడు పురందరే. బాబానెలాగైనా ఒప్పించగలంలే అనుకుంటూ పల్లకీని సమీపించి, చెక్కపెట్టెలోనుంచి దానిని బయటకు తీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. బాబా అడ్డుపడబోయారు. “దాన్ని విప్పొద్దు. ఆగు, వద్దంటున్నానా? అరె భావూ, వద్దంటే వినవేం?” సాయి వారించారు, కోప్పడ్డారు, తిట్టారు. పురందరే ఆ తిట్లన్నీ ఆశీస్సులుగా భావించుకుంటూ నింపాదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు. “చెపుతుంటే వినిపించటంలేదుట్రా, వెళ్ళిక్కడ్నుంచి” ఈసారి బాబా పురందరే మీదకి ఆగ్రహావేశాలతో సటకా పట్టుకుని వచ్చారు. చుట్టూవున్న భక్తులు బాబా కోపం చూసి భయపడి పారిపోయారు. పురందరే మాత్రం వంచిన తల ఎత్తకుండా, ఏ మాత్రం భయపడకుండా తన పని సాగిస్తూ పల్లకీని బయటకుతీసి బిగించాడు.

చల్లని మేఘం జల్లై కురుస్తుందే కానీ నిప్పులు చెరగదనీ, పచ్చని పైరు పంటలనిస్తుందే కానీ మంటై మండదనీ, సాయీశుని కోపమూ దీవెనే కానీ దండన కాదనీ నమ్మిన భక్తుడతడు. బాబా యిక చేసేది లేక ఆగిపోయారు. అవును మరి, అహంకారాన్నో, ద్వేషాన్నో దండించగలరు కానీ ప్రేమనెవరు దండించగలరు? దైవం విశ్వాధినేతయే అయినా ప్రేమసూత్రానికి బందీయే. భగవంతుడు భక్తికి కట్టుబడిపోవలసిందే కదా!

పురందరే పువ్వులు తెచ్చి, పల్లకీని అందంగా అలంకరించాడు. “బాబా, పువ్వులతో అలంకరించివున్న యీ పల్లకీ మీరు కూర్చుంటే ఇంకెంత అందంగా వుంటుందో కదా!” ముచ్చటగా వున్న పల్లకీని చూసి మురిసిపోతూ అడిగాడు పురందరే. “చేసిన నిర్వాకం చాలు. ముందిక్కడ్నుంచి వెళ్ళవతలకి!” అని గద్దించారు బాబా. “వెళుతున్నాలే బాబా. కానీ ఉత్సవంలో మాత్రం మీరీ పల్లకీ ఎక్కాలి. మేము మోయాలి! అంతే!” అంటూ పురందరే బాబా పాదాలకు నమస్కరించుకొని అప్పటికి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి చావడి ఉత్సవంలో పల్లకీ కూడా ఉండబోతుందన్న వార్త శిరిడీ అంతా ప్రాకిపోయింది. భక్తులు ఆ వేడుక చూసేందుకని రోజూకన్నా ఎక్కువ సంఖ్యలో మసీదుకు చేరిపోయారు. నానాసాహెబ్ చందోర్కర్, బూటీ, జోగ్ మొదలగు భక్తులంతా ఉత్సవానికి సమాయత్తమయ్యారు. భక్తులందరూ ఎంతో ఆనందంగానూ, బాబా పల్లకీ ఎక్కుతారో లేదోనన్న ఆతురతతోనూ ఎదురుచూస్తున్నారు. “జోగ్, నువ్వు ఈరోజేమీ తొందరచేయవద్దు. పల్లకీ లేకుండా చావడి ఉత్సవం చేసేది లేదు” అన్నాడు పురందరే. “ఈరోజు ఉదయం నీకు జరిగింది సరిపోలేదా? నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నన్ను మాత్రం ఇరుకున పెట్టవద్దు” అన్నాడు బాబా కోపం గురించి బాగా తెలిసిన జోగ్.

అంతలోనే నానాసాహెబ్ చందోర్కర్ కల్పించుకుంటూ, “బాబాకు పురందరేకు సరిపోతుంది. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనీ. నువ్వు మాత్రం ఈరోజు ఏం కల్పించుకోకు” అని జోగ్‌తో అన్నాడు. చందోర్కర్ సలహాతో మౌనంగా వుండిపోయాడు జోగ్. రఘువీర పురందరే వచ్చి బాబాను బ్రతిమాలుతూ పల్లకీ ఎక్కమన్నాడు. ససేమిరా వీల్లేదంటే వీల్లేదనేశారు సాయి. బాబా పల్లకీ ఎక్కకుంటే తాను ఉత్సవంలో పాల్గొనననీ, ఎలాగైనా పల్లకీ బాబాతోనే ముందుకు కదలాలనీ పంతం వేసుక్కూర్చున్నాడు పురందరే.

పురందరేకీ, బాబాకీ నడుమ తిరుగుతూ సర్దిచెపుతున్నారేకానీ అక్కడున్న భక్తులందరిలో కూడా బాబానెలాగైనా పల్లకీలో ఊరేగించాలనే కోరిక బలంగా ఉంది. అందరి భక్తుల కోరికను భక్తవత్సలుడైన బాబా ఎలా కాదనగలరు? అలా అని తన నియమాలనూ మార్చుకోలేరు కదా! చివరికెలాగో పల్లకీలో వూరేగించటానికి తన పాదుకలనిచ్చేందుకు అంగీకరించారు బాబా.

బాబా స్వయంగా పల్లకీ ఎక్కనందుకు అసంతృప్తిగా ఉన్నా, పాదుకలు ఇచ్చి పల్లకీ ఊరేగింపుకు అనుమతినిచ్చారు కదా అని యిక సర్దుకుపోక తప్పలేదు పురందరేకూ, మిగిలిన భక్తులకూ. “బాబా, నేనూ పల్లకీని మోయవచ్చా?” అని అడిగాడు పురందరే ఉత్సవ ప్రారంభంలో ఉత్సాహంగా. “వద్దు! 125 దివిటీలు వెలిగించి ఆ తర్వాత పల్లకీని ఎత్తండి” అన్నారు బాబా. బాబా ఆజ్ఞప్రకారం, 125 దివ్వెల వెలుగులో మహెూత్సాహంతో సాగిన ఆనాటి ఉత్సవం పల్లకీతో శోభాయమానంగా చావడి చేరింది.

సద్గురునాథుని పాదుకలు మోసిన పల్లకీ ధన్యురాలై మురిసిపోయింది. బాబానెలాగైనా ఒప్పించి తనకా భాగ్యాన్ని కలుగజేసిన పురందరేకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది.


సోర్స్ : సాయిపథం ప్రథమ సంపుటము 

 

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాధయ నమః,🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం...,🌹🙏🏻🌹

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼😀🌺🥰🌸😃🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo