సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ - రెండవ భాగం


నూల్కర్ పై కురిసిన బాబా అనుగ్రహవర్షం

తమను పూజించేందుకు బాబా ఎవరినీ అనుమతించేవారు కాదు. భక్తులెవరైన పూల మాలవేయబోయినా నిరాకరించేవారు. ఒక గురుపూర్ణిమ రోజున మొట్టమొదట బాబాకు పూజ నిర్వహించే భాగ్యం తాత్యాసాహెబ్‌‌కు దక్కింది. ఒకరోజు ఉదయం తాత్యాసాహెబ్ మసీదుకు వెళ్ళి నమస్కరించగానే, బాబా అతనికి మసీదు ప్రక్కన స్తంభం కేసి చూపుతు  "రేపు ఆ స్తంభాన్ని పూజించు!" అన్నారు. బాబా అలా ఎందుకన్నారో నూల్కర్‌‌కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తరువాత బాబా ఆదేశాన్ని షామాకు చెప్పి, అలా ఆదేశించడంలో బాబా ఉద్దేశ్యమేమై వుంటుందని అడిగాడు. షామాకు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే బాబాను అడుగుదామని మసీదుకెళ్ళాడు. బాబా అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత తాత్యాకోతేపాటిల్ తోనూ, దాదాకేల్కర్ తోనూ బాబా అవే మాటలన్నారు. మరుసటిరోజు శనివారం. ఉదయం నిద్ర మేల్కొన్న నూల్కర్‌‌కు ఆరోజు గురుపూర్ణిమ అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు షామా తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం, కేలండర్ తెప్పించి చూచారు. నిజమే! ఆ రోజు గురుపూర్ణిమ! ఆ ముందురోజు బాబా తమతో 'రేపు ఆ స్తంభాన్ని పూజించమ'ని ఆదేశించడంలోని పరమార్థం వారికప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయింది.

వెంటనే అందరు మసీదుకు వెళ్ళి, 'గురుపూజ' చేసుకోవడానికి అనుమతించమని బాబాను వేడుకొన్నారు. బాబా ముందురోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజచేసుకొమ్మన్నారు. “దేవా, ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే  పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా వుంటే, స్తంభాన్ని పూజించవలసిన పనేముంది?" అని షామా వాదించాడు. తమను పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు పట్టువిడువలేదు. చివరకు, భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. “సరే మీ ఇష్టం!” అన్నారు. భక్తుల ఆనందానికిక పట్టపగ్గాలు లేవు.

వెంటనే గురుపూజకు సన్నాహాలు మొదలుపెట్టారు. బాబా భిక్షకు వెళ్ళివచ్చిన తర్వాత పూజ నిర్వహించాలని తలచి వారికీ విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారికన్నీ ఉపచారాలు (పూజావిధులు) చేయడానికి కూడ అనుమతించారు. బాబా రాధాకృష్ణఆయీకి, దాదాకేల్కర్‌‌కు కబురు పంపారు. రాధాకృష్ణఆయీ పూజాద్రవ్యాలు పంపింది. దాదాకేల్కర్ పూజావస్తువులతో మశీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చివేశారు. పూజ అయినతర్వాత ఆరతిచ్చారు. అలా, ఆ సంవత్సరంనుంచీ ప్రతిఏటా శిరిడీలో గురుపూర్ణిమ ఎంతో వైభవంగా జరగటం ప్రారంభమయింది. 

తాత్యాసాహెబ్ నూల్కర్‌‌కు, బాబాకు ఆ ఆరతి రోజూ ఉంటే ఎంతో కన్నులపండుగగా ఉంటుంది కదా అనిపించింది. శిరిడీలో సాయిసన్నిధిలో ఏ పూజ అన్నా, ఉత్సవమన్నా ఎంతో ఉత్సాహం చూపే రాధాకృష్ణఆయీకి కూడా ఆ ఆలోచనే కలిగింది. ఆ విధంగా ఆనాడు వారి మనసుల్లో పుట్టిన ఆ సత్సంకల్పమే బాబా మందిరాలలో శిరిడీ ఆరతి సంప్రదాయమనే మహావృక్షానికి బీజమైంది. ప్రేరణ రాధాకృష్ణఆయిదే అయినా ప్రయత్నమూ, కార్యాచరణ నూల్కర్ పరమయ్యాయి.

ప్రతిరోజూ బాబాకు ఆరతి నూల్కరే నిర్వహించేవాడు. బాబా శరీరధారిగా ఉన్నపుడు మధ్యాహ్న ఆరతి మాత్రమే మసీదులో జరిగేది. శేజ్ ఆరతి, కాకడ ఆరతులు చావడిలో మాత్రమే జరిగేవి. నూల్కర్ చివరిరోజులలో అనారోగ్యం వలన మసీదుకి, చావడికీ నడిచి రాలేని పరిస్థితి కలిగేంతవరకు బాబాకు ఆరతి అతని చేతులమీదుగానే జరిగింది. ఆ తర్వాత ఆ భాగ్యం మేఘునికి దక్కింది. 1912లో మేఘుడు చనిపోయిన తర్వాత బాపూసాహెబ్ జోగ్, బాబా మహాసమాధి వరకు ఆరతి నిర్వహించే అదృష్టం పొందాడు.

బాబా తాత్యాసాహెబ్ ల  పరస్పర ప్రేమ వర్ణించనలవికానిది. బాబా తాత్యాను 'తాత్యాబా' అని కానీ 'మ్హాతర' (ముసలీ) అనీ ప్రేమతో పిలిచేవారు. పూజకు ముందు భక్తులందరూ వివిధ భక్ష్యాలను నైవేద్యంగా బాబా ముందుంచేవారు. బాబా ఒక్కొక్కసారి, “ఈరోజు నాకు తాత్యాబా పోళీయే కావాలి!” అంటూ భక్తులు తెచ్చి రాశిగా పోసిన పోళీలనుండి సరిగ్గా నూల్కర్ సమర్పించిన పోళీనే తీసుకొని ప్రీతితో తినేవారు. ఎవరూ యేమీ చెప్పకుండా ఏ పోళీ ఎవరు సమర్పించారో చెప్పే బాబా మహిమకు భక్తులు ఆశ్చర్యపోయేవారు.

నూల్కర్‍‍కు తను నిత్యం జపించేందుకు బాబా నోటి నుండి ఏవైనా ప్రత్యేకపదాలు వస్తే బాగుండునని చాలాకాలంగా ఓ కోరిక. తాత్యా మనసెరిగి బాబా ఏవో ప్రత్యేకపదాలు పలికారు. తాత్యా వాటినే మహామంత్రంగా భావించి జీవితాంతం అనుష్ఠించాడు. ఇంకా తను నిత్యం పూజించుకునేందుకు బాబా తనకేదన్నా ఒక వస్తువు యిస్తే బాగుండును కదా అని తలచిన నూల్కర్‍‍కు బాబా ఆ కోరిక తీర్చారు. ఒక దత్తజయంతినాటి రాత్రి తొమ్మిదిగంటలప్పుడు బాబా నూల్కర్‍‍ను మసీదుకు రమ్మని కబురుచేసారు. ఆరోజు నూల్కర్ కోసం ఆయన ఎంతగా ఎదురుచూసారంటే కబురు తీసుకెళ్ళిన మనిషి వాడా చేరి నూల్కర్‍‍కు బాబా ఆదేశం తెలియచేసేలోపలే వెంట వెంటనే మరో యిద్దరు మనుషుల్ని పంపించారు. ఆ కబుర్లందుకుని హడావుడిగా మసీదు చేరిన నూల్కర్ చేయిపట్టుకు లాక్కెళ్ళి, అక్కడున్న కఫ్నీలదొంతరనుంచి ఒక కఫ్నీ తీసి అతనిపై కప్పి, “తాత్యాబా, దీన్ని నీ దగ్గర ఉంచుకో, ఇది చలినుండీ, గాలినుండీ నిన్ను కాపాడగలదు” అన్నారు ఆప్యాయంగా బాబా. ఆ కరుణామయుని అవ్యాజమైన ప్రేమకూ, తనపై చూపుతున్న అపార దయకూ కదిలిపోయిన నూల్కర్ భాష్పాంజలితో ఆయన పాదాలపై తన శిరస్సునుంచాడు. ఒకరకంగా అది బాబా తనకిచ్చిన సన్యాసదీక్షగా కూడా భావించాడతను. నూల్కర్ పై బాబా అనుగ్రహాశీస్సులు ఆ విధంగా వుండేవి.

సోర్స్: సాయిపథం ప్రధమ సంపుటము


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.


 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

5 comments:

  1. ఓం నమో సాయినాథ్మహరాజ్ కీ జై

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  4. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo