సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 144వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నా జీవితంలో శ్రీసాయి
  2. ఊదీతో అమ్మకు పునర్జన్మనిచ్చిన అసాధారణ లీల

నా జీవితంలో శ్రీసాయి

యు.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

కొన్నేళ్ల క్రిందట నా తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. నేను పుట్టి, పెరిగింది అంతా అమెరికాలోనే. మాది సాంప్రదాయ హిందూ కుటుంబం. మా ఇంట్లో ప్రధానంగా హిందూ దేవతలను పూజిస్తుండేవాళ్లు. నాకు గాని, నా తల్లిదండ్రులకు గాని శిరిడీ సాయిబాబా గురించి తెలియదు. అలాంటి నా జీవితంలోకి 2000వ సంవత్సరంలో సాయిబాబా ప్రవేశించారు. ఆ సంవత్సరం ఒకసారి కలలో సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తి కనిపించారు. ఆయనను చూస్తూనే ఏదో తెలియని ఆనందం, ఆత్మీయత వంటి భావనలు చాలా దృఢంగా, గాఢంగా నాలో కలిగాయి. ఆ భావాలను మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఈరోజుకీ ఆ కల నాకు స్పష్టంగా గుర్తు ఉంది. అటువంటి స్వప్నానుభూతి మళ్ళీ ఎప్పుడూ కలగలేదు. 2003 ప్రారంభంలో మా కజిన్ నిశ్చితార్థ వేడుకకు మమ్మల్ని న్యూయార్క్/న్యూజెర్సీ ప్రాంతానికి ఆహ్వానించారు. ఆ వేడుక శిరిడీ సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేశారు. నేను మందిరంలోకి అడుగుపెట్టి సాయిబాబా మూర్తిని చూస్తూనే కొన్ని సంవత్సరాల క్రితం నా కలలో కనిపించిన రూపంగా గుర్తించాను. కానీ నేను ఆ సంఘటనపై అంత శ్రద్ధ చూపలేదు. తరువాత 2004లో నేను ఆఫీసులో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు డోర్ వైపు చూసాను. ఆ డోర్ పైన చిన్న సాయిబాబా ఫోటో ఉంది. బాబాను చూస్తూనే గతంలో వచ్చిన కల, న్యూయార్క్‌లో ఆయన దర్శనం గుర్తుకు వచ్చాయి. ఆయన తనని గుర్తించమని సూచిస్తున్నారని అనిపించింది. కానీ అది ఎలా అన్నది నాకు స్పష్టంగా అర్థం కాలేదు. 2005-06 వచ్చేసరికి మళ్ళీ ఆయనను మరచిపోయి ఆయన కృప, మార్గదర్శకత్వం లేకుండానే జీవితం గడిచిపోసాగింది.

నిజం చెప్పాలంటే బాబా ప్రణాళికలు పక్కాగా ఉంటాయి. 2007లో హఠాత్తుగా సాయిబాబాను నమ్మడం మొదలుపెట్టాను. అప్పటికి మా ప్రాంతంలో మొట్టమొదటి సాయిమందిరం వెలిసి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఒకరోజు నేను సెలవు పెట్టి మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. ఆ మొదటి దర్శనాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. బాబాకి నమస్కరించుకుంటూ ఉంటే ఏదో తెలియని బలమైన శక్తి నాలోనుండి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆ భావాన్ని పదాలలో పెట్టడం కష్టంగా ఉంది. శారీరకంగా నాలోనుండి పెద్ద బరువు తొలగించబడినట్లు అనిపించింది. తరువాత కొన్నిరోజులపాటు కూడా ఆ అనుభూతి అలానే ఉంది. ఆ క్షణం నుండి బాబా నాకు పెద్ద అండగా నిలిచి అనేక విధాలుగా నాలో పరివర్తన తీసుకుని రావడం మొదలుపెట్టారు. అప్పటినుండి రోజూ ఉదయం 11 సార్లు 'ఓం సాయిరాం' అని స్మరిస్తూ బాబాను ప్రార్థించడం, అప్పుడప్పుడు బాబా మందిరానికి వెళ్ళటం చేస్తూ ఉన్నాను.

ఊదీతో అమ్మకు పునర్జన్మనిచ్చిన అసాధారణ లీల

నా జీవితంలో ఒక అసాధారణ సాయి లీల జరిగింది. మా అమ్మగారు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో అనారోగ్యం పాలయ్యారు. దేశంలోనే అత్యుత్తమమైన ఆసుపత్రికి తీసుకుని వెళితే అమ్మను ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకోవడానికి డాక్టర్లకి కొంతకాలం పట్టింది. ఈలోగా అమ్మ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో తనని లైఫ్ సపోర్ట్ సిస్టంలో పెట్టారు. తన సమస్యకి సరైన చికిత్స ఏమిటో స్పెషలిస్టులకి సైతం అర్థం కాలేదు. చివరికి డాక్టర్లు, "పరిస్థితి దారుణంగా ఉంది, ఇకపై ఎటువంటి ఆశా లేదు, ఏ క్షణాన ఏ వార్త వచ్చినా మీరు సిద్ధంగా ఉండండి" అని చెప్పేశారు. ఆ స్థితిలో, 'నేను ఒకటి తేవడానికి వెళ్తున్నాను' అని మా కుటుంబసభ్యులతో చెప్పి ఆసుపత్రి నుండి బయటకు వచ్చేశాను. నేరుగా మా ప్రాంతంలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళాను. శిరస్సు వంచి బాబాకు నమస్కరించి, "బాబా! అమ్మకి సహాయం చేయండి. తనకి జీవితాన్ని తిరిగి ప్రసాదించండి" అని త్రికరణశుద్ధిగా బాబాను ప్రార్థించాను. తరువాత అక్కడి పూజారితో, "నాకు కొంత ఊదీ ఇవ్వండి" అని అడిగాను. ఊదీని పట్టుకుని తిరిగి ఆసుపత్రికి వచ్చి, అమ్మకి ఊదీ పెట్టేందుకు డాక్టర్లని అనుమతి అడిగాను. ఊదీ సరైన చికిత్స చేసి అమ్మని తిరిగి మాకు దక్కిస్తుందన్న ఆశతో అమ్మకు ఊదీ పెట్టాను. అద్భుతం! నేను ఊదీ పెడుతూనే తన పరిస్థితిలో మార్పు మొదలైంది. అమ్మ నిదానంగా కోలుకుంటూ స్పృహలోకి వచ్చింది. కొన్ని వారాలకు అమ్మ ఇంటికి వచ్చింది. తను కోలుకోవడం వెంటనే జరగలేదు, నిదానంగా జరిగింది. ఇంటికి వచ్చాక కూడా తను పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. అమ్మ కోలుకోవడాన్ని మెడికల్ ప్రొఫెషనల్స్ 'మిరకిల్ రికవర్' గా పరిగణించారు. నాకు ఊదీ గురించి సరైన అవగాహన లేకుండానే నేను అమ్మకు ఊదీ పెట్టాను. కానీ చాలా ప్రత్యేకమైన అద్భుతాన్ని బాబా అనుగ్రహించారు. ఆయన అనుగ్రహాన్ని మేమెప్పుడూ మర్చిపోము. తరచూ గుర్తుచేసుకుంటూనే ఉంటాం. అమ్మ పూర్తిగా కోలుకున్నప్పటినుండి మా కుటుంబమంతా మా ప్రాంతంలోని బాబా మందిరాన్ని తరచూ దర్శిస్తున్నాము. "థాంక్యూ సో మచ్ బాబా! అమ్మకు పునర్జన్మనిచ్చారు".

ఈ భక్తురాలి మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో....

source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2402.html

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo