సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ - ఐదవ భాగం


జన్మరాహిత్యం

నూల్కర్ ఆరోగ్యపరిస్థితి క్రమేణా క్షీణించసాగింది బాబా దయవలన ఇతను తప్పక కోలుకుంటాడని  భక్తులందరూ భావించారు. కానీ బాబా సంకల్పము మరోలా వుంది. అతనిని జననమరణచక్రం నుండి విముక్తుణ్ణి చేసి అతని ఆత్మను తమలో ఐక్యం చేసుకోదలచారు. ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో నూల్కర్ తన కొడుకులనిద్దరిని పిలిపించుకొని భజన చేయమన్నారు. నూల్కర్ అంత్యకాలం ఆసన్నమైందని భక్తులందరూ భావించారు. అప్పుడు అతని చెంత అతని భార్య, బావమరిది, కాకాసాహెబ్ దీక్షిత్, సహస్రబుద్దే మొదలైన వారున్నారు. కొడుకులిద్దరు చిరుతలు, తాళాలు తీసికొని రెండుగంటల సేపు భజన చేశారు. చివరగా నూల్కర్ “ప్రభూ, నాముందు నిలిచి, నీ కోసం ప్రతీక్షించే నాకు నీ దివ్యమంగళరూపం దర్శించుకోనీ!?” అనే చరణంతో మొదలయ్యే ప్రఖ్యాత భజనగీతం ఆలపించమన్నాడు. ఆ పాట వింటున్నప్పుడు నూల్కర్ ముఖంలో దేవుడే తన ముందు నిలుచుని తనను అనుగ్రహిస్తున్న భావం స్పష్టంగా గోచరించింది. సుమారు 5 గంటల ప్రాంతంలో భజన ఆపమని నూల్కర్ సంజ్ఞ చేశాడు. రాధాకృష్ణ ఆయీ ఇంటికెళ్ళి ఊదీ, బాబా పాదతీర్థం తెచ్చాడు విశ్వనాధ్. ఊదీని నూల్కర్ నొసటిపై పెట్టి తీర్థం స్పూనుతో పోసారు. మూడవ స్పూను పోసిన వెంటనే నూల్కర్ చివరి శ్వాస వదిలాడు. అంతకు రెండు నిముషాలముందు మశీదులో బాబా "మన మసీదు వెనుక ఒక పెద్ద నక్షత్రం రాలిపోయింది!” అని చెప్పి మశీదు ముంగిటకొచ్చి పెద్దగా అరుస్తూ తమ నోటిని చేతితో లబలబకొట్టుకొన్నారు. ప్రియమైన భక్తులు మరణించినప్పుడు బాబా ఇలాగే ప్రవర్తించేవారు. అంతేగాక బాబా ఆ రోజంతా శోకముద్రలో గడిపారు. వారి దినచర్య అంతా ఆలస్యంగా నడిచింది. వారు దుఃఖిస్తూ, “అయ్యో నా తాత్యాబా వెళ్లిపోయాడు. నేనేమి చేసేది? ఈ శిరిడీ మసీదులో ఏముంది? నేనూ వెళ్లిపోతాను. తాత్యాబా ఎంతో మంచివాడు. నేను చెప్పినట్లు విన్నాడు. అతనికి జీవితగమ్యం చేరుకోవడానికి నేను సాయపడ్డాను. అతనికిక జన్మలేదు!” అన్నారు. 

భక్తులందరూ వాడాలో గుమిగూడారు. వరుసగా వెళ్ళి తాత్యా పాదాలకు నమస్కరించి నివాళులర్పించారు. తర్వాత వారి దేహాన్ని దారిగుండా స్మశానానికి తీసుకెళ్ళి చితిపై పరుండబెట్టారు. లెండీతోటకు వెళ్ళే మసీదుదారి చిమ్ముతున్న రాధాకృష్ణ ఆయీ చేతిలో చీపురుతోనే స్మశానానికి పరుగు తీసి “నా తల్లి ప్రియపుత్రుడు వెళ్ళిపోయాడు!” అని దుఃఖిస్తూ తాత్యా పాదాలు ముద్దుపెట్టుకొని వెళ్ళిపోయింది.

నూల్కర్ మరణించిన మూడవరోజున బాబా కనిపించలేదు. భక్తులు, గ్రామస్తులు ఆందోళనతో వారి కోసం వెదకడం ప్రారంభించారు. చివరకు నీంగాంలో వున్నట్లు తెలిసికొని, అందరూ అక్కడికి వెళ్ళి మేళతాళాలతో భజన చేసుకుంటూ ఉత్సవంగా తీసుకువచ్చారు. అప్పుడే నూల్కర్  చితాభస్మం కోపర్గాం సమీపంలోనున్న గోదావరిలో నిమజ్జనం చేయడాని తీసుకెళుతున్న బండి దారిలో ఎదురుపడింది. బండి వద్ద కాసేపాగి తమ చేతులతో ఏవో సంజ్ఞలు చేసి, తిరిగివచ్చి ఉత్సవంలో కలిసారు.

లాకెట్ ఉదంతం:

తాత్యాసాహెబ్ మనుమడు శ్రీరఘునాధ్ విశ్వనాథ్ నూల్కర్ తన తాతగారిని బాబా ఎంతగా ప్రేమించేవారో తెలిపే ఉదంతమొకటి వివరించారు. తన తండ్రి  విశ్వనాధ్ గారు వారి తల్లి కోరికమేరకు ఒక బంగారు లాకెట్ తయారుచేయించి శిరిడీకి రిజిస్టర్ పోస్టులో  పంపారట. ఆ లాకెట్లో ఒక ప్రక్క బాబా ఫోటో మరోప్రక్క నూల్కర్ ఫోటో వుందట. బాబా తమ స్పర్శతో దానిని పునీతం చేసి తిరిగి పంపుతారనే ఉద్దేశ్యంతో దానిని పంపివుండొచ్చునని కూడా తెలిపాడు. పార్శిలు శిరిడీ చేరిన తర్వాత మశీదులో ఏం జరిగినది తెలుపుతూ శ్రీషామగారు తన తండ్రికి ఒక ఉత్తరం వ్రాశారట. (ఆ ఉత్తరం ఫోటో నకలు ఇక్కడ క్రింద  చూడవచ్చు.)

షిరిడి 
తేది 20.12. 1912 
ప్రణామములు. మీరు పంపిన లాకెట్ పార్శీలు నిన్ను అంటే 19 వ తేదిన ఆరతి సమయానికి ముందు పోస్ట్ బంట్రోతు సాయిమహరాజ్ కు  అందజేశాడు.దానిని తమ ముఖం దగ్గరకు తీసుకెళ్ళి ముద్దుపెట్టుకున్నారు. తర్వాత  నాతో "ఇందులో ఇద్దరు వ్యక్తులున్నారు" అని చెప్పి దానిని నా చేతికిచ్చారు. దాన్ని విప్పి చూస్తే  అందులో ఫోటోల తోటి లాకెట్ మీ తల్లిగారి ఉత్తరం  కన్పించాయి. ఆ ఉత్తరాన్ని సాయిమహరాజ్ కి చదివి వినిపించి,లోకెట్టును వారి చేతికిచ్చేసాను.వారు లాకెట్ ను 15 , 20 , నిముషాలు చేతిలోనే అంటిపెట్టుకున్నారు.తర్వాత తాత్యా ఫోటోను ఆరతికి వచ్చిన ప్రతి భక్తునికి చూపించి "ఈ వ్యక్తి నన్ను తనతో కూడా తీసుకెళ్లాడు" అని చెప్పారు. వారి నోటిగుండా వెలువడిన మాటలు యధాతదంగా నీకు తెలియపరుస్తున్నాను.తర్వాత లాకెట్ ను భద్రపర్చామని నా చేతికిచ్చారు.మీ తల్లి గారికి ప్రణామములు.

సాయి దాసుడు, 
మాధవరావు దేశ్ పాండే 

ఇది విశ్వనాధ్ నూల్కర్ కు శ్రీషామా వ్రాసిన మరాటీ లేఖకు తెలుగు అనువాదం. దీనినిబట్టి నూల్కర్ ను బాబా ఎంతగా ప్రేమించేవారోమనకుతెలుస్తుంది. “ఈ లాకెట్టులో ఇద్దరు వ్యక్తులున్నారు!” అని చెప్పడంలో తాత్యాను తమతో సమపరచుకొనడమేగాక తాత్యాయొక్క అత్యున్నత ఆధ్యాత్మిక ప్రగతిని ధృవపరిచారు. “ఈతడు నన్ను తనతోటే తీసుకెళ్ళాడు” అని చెప్పడంలో నూల్కర్ ఆత్మ వారిలో ఐక్యమైనట్లుగా అందరికీ తెలియపరిచారు. 

ఆర్. సురేంద్రబాబు

సమాప్తం.

సోర్స్: సాయిపథం ప్రధమ సంపుటము

 


ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.


2 comments:

  1. Om Sri Sai Nathaya Namah 🌹🙇🙏🙏🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo