సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 146వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • బాబా ఇచ్చిన ఉద్యోగం, వీసా.

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు దీప్తిసింగ్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

సాయిబంధువులకు ఓం సాయిరామ్! సాధారణ సాయిభక్తురాలినైన నేను చాలా సాయి లీలలు చవిచూశాను. కఠినమైన సమయాలందు బాబా ఎంతో దయతో నాకు, నా కుటుంబానికి తోడుగా ఉండి రక్షణనిస్తున్నారు. నేను గత 12 సంవత్సరాలనుండి యు.ఎస్.ఏ. లో నివసిస్తున్నాను. నాకు 6 సంవత్సరాల బాబు ఉన్నాడు. నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. 2018 ప్రారంభంలో నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. వర్క్ వీసా మీద ఉన్నందున నా వీసా ఎక్స్‌పైర్ కాకుండా ఉండాలంటే నేను రెండునెలల్లో ఉద్యోగం సంపాదించుకోవాలి.  నాకు, నా కుటుంబానికి ఇది చాలా కష్టమైన సమయం. నేను నవగురువార వ్రతం మొదలుపెట్టి ప్రతిరోజూ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఇంటర్వ్యూ కాల్ కోసం బాబాని ప్రార్థిస్తుండేదాన్ని. ఆయన దయవల్ల నాకు కాల్స్, ఇంటర్వ్యూలు వచ్చాయి. మొదట నేను చాలా పెద్ద బ్యాంకు ఉద్యోగానికి ఎంపికయ్యాను. వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ మరుసటిరోజు పంపుతామని చెప్పారు. ఆ బ్యాంకు మా ఇంటినుండి సుమారు 1.5 గంటల ప్రయాణదూరంలో ఉంది. బాబా అంత త్వరగా ఆశీర్వదించినందుకు నేను ఆశ్చర్యపోయాను.

కొన్నిరోజులు గడిచాక ఒక గురువారంనాడు నేను బ్యాంకువాళ్లకు ఫోన్ చేస్తే, ఆ ఉద్యోగాన్ని స్తంభింపజేసినట్లు తెలిసి నిర్ఘాంతపోయాను. ఉద్యోగం సంపాదించుకోడానికి, వీసా సమస్య పరిష్కారం కావడానికి ఇంకా కేవలం మూడు వారాల వ్యవధి మాత్రమే ఉండటంతో నేను నిరాశకు లోనయ్యాను. బాబా నా ప్రార్థనలు వినట్లేదని చాలా బాధతో, "బాబా! మీపైకాక ఇంకెవరిపై నేను ఆధారపడగలను? నాపై కృపతో నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ప్రతిరోజూ సాయిని ప్రార్థిస్తూ ఇంటర్వ్యూ కాల్ వస్తుందని ఎదురుచూస్తుండేదాన్ని. ఆ సమయంలో సాయిదివ్యపూజ కూడా మొదలుపెట్టాను. దాంతో నాకు చాలా ప్రశాంతత లభించింది. మరుసటివారం ఒక ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తిచేశాను. వాళ్ళు మరుసటిరోజు ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్పారు. ఆశ్చర్యంగా ఈసారి కూడా ఆఫీసు మా ఇంటినుండి సుమారు 1.5 గంటల ప్రయాణదూరంలోనే ఉంది. నేను ఒకవైపు ఆనందపడుతూనే, మరోవైపు మునుపటిలా అవుతుందేమోనని ఆందోళనపడ్డాను. మరుసటిరోజు ఆఫర్ లెటర్ నా చేతికి రాగానే, దాన్ని పట్టుకుని బాబా మందిరానికి వెళ్లి, పూజారిగారితో ఆఫర్ లెటర్‌ని బాబా వద్ద పెట్టమని చెప్పాను. తరువాత నేను, "బాబా! నాకేదైనా సానుకూలమైన సంకేతాన్నిచ్చి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థించాను. బాబా వద్ద ఉన్న ఆఫర్ లెటర్ క్రిందకి పడిపోయింది. దాని అర్థమేమిటో తెలియక ముందు ఆందోళనపడ్డాను కానీ, తరువాత ఆవిధంగా బాబా నన్ను ఆశీర్వదించినట్లుగా భావించి సంతోషపడ్డాను. అప్పుడే మరో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఆఫీసు మా ఇంటినుండి 30 నిమిషాల ప్రయాణదూరంలో ఉంది. అందులో కూడా నేను సెలెక్ట్ కావడంతో వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు కానీ, అంతా బాబా నడిపిస్తున్నారని నాకు తెలుసు. ఇక ఏ ఉద్యోగానికి 'ఓకే' చెప్పాలో అర్థంకాని సందిగ్ధంలో ఉంటూనే దగ్గరలో ఉన్న ఉద్యోగాన్ని ఓకే చేసి, నా వీసాకి సంబంధించిన పేపర్ వర్క్ మొదలుపెట్టమని వాళ్ళని అభ్యర్థించాను. కానీ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం నాకు చాలా కష్టమైంది. అప్పుడు రెండో ఆఫర్ లెటర్ పట్టుకుని బాబా గుడికి వెళ్లి, మునుపటిలాగానే పూజారిగారితో బాబా వద్ద ఆఫర్ లెటర్ పెట్టించి బాబాను ప్రార్థించాను. ఈసారి ఆఫర్ లెటర్ బాబా వద్ద నుండి జారిపోలేదు. రెండో దాన్నే ఎంచుకోమన్నది బాబా సంకేతంగా నా మదిలో మెదిలి నా కళ్ళనుండి కన్నీళ్లు వచ్చేశాయి. వెంటనే మొదటి కంపెనీకి ఫోన్ చేసి 'నో' చెప్పేశాను.

ఇక నా వీసా సమస్య మిగిలింది. ఆఫీసు వాళ్ళు నా వీసాకి దరఖాస్తు చేశారు. కానీ వీసా రావడానికి టైం పట్టింది. ఒకవేళ వీసా తిరస్కరింపబడితే నేను ఉద్యోగాన్ని వదిలి, ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇండియా వెళ్లిపోవాలన్న ఆలోచనలతో నాకు చాలా దిగులుగా ఉండేది. కానీ బాబా మీదే భారం వేశాను. చివరికి మూడునెలల తరువాత బాబా కృపతో నా వీసా ఆమోదం పొందింది. ఈ కష్టకాలంలో విశ్వాసం, సహనం కలిగి ఉండాలని, సమస్యలు చుట్టుముట్టినప్పుడు దృఢంగా ఎలా ఉండాలన్నది బాబా నేర్పారు. ఇండియాలోని బాబా మందిరంలో ప్రతి గురువారం అన్నదానం చేయిస్తున్నాను. దానివలన నాకు అమితమైన ఆనందం కలుగుతుంది. అది ఆగిపోకుండా కొనసాగేలా బాబా నాకు ఉద్యోగాన్ని, వీసాని అనుగ్రహించి ఆర్ధిక స్థోమతను కల్పించారు. ఆయన నా ప్రార్థనలు వినట్లేదని నేను ఆందోళనపడతుంటాను, కానీ ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. ఇలా మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని కష్టకాలం నుండి కాపాడారు బాబా. "థాంక్యూ బాబా! మీ భక్తులందరినీ సంతోషంతో, దైర్యంతో ఉండేలా ఆశీర్వదించండి".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2402.html

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo