సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 133వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. ఇలా ప్రార్థించానో లేదో... అలా బాబా నెరవేర్చారు.
  2. దృష్టిని అటు ఇటు మరల్చకుండా నాయందే నిలుపు
  3. లైవ్ లో ఆరతి పునఃప్రసారం.

నా పేరు ద్వారకసాయి. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని ఇటీవల జరిగిన అనుభవాలను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

ఇలా ప్రార్థించానో లేదో... అలా బాబా నెరవేర్చారు.

బాబా కృపవలన నాకొక మంచి స్నేహితుడున్నాడు. నేను దాదాపు ఐదేళ్ల క్రితం ఉద్యోగప్రయత్నం చేయడానికి దారి తెలియక చాలా ఆందోళనపడుతున్న సమయంలో ఆ స్నేహితుడు తన పాత ఆండ్రాయిడ్ మొబైల్‌ను నేను వద్దంటున్నా వినకుండా ఇంటర్వ్యూలకు ఉపయోగపడుతుందని బలవంతంగా నా చేతిలో పెట్టాడు. తనే నాచేత ఆన్లైన్‌లో నా రెజ్యుమ్ కూడా పెట్టించి నన్ను ప్రోత్సహించాడు. అలా తన ప్రోద్బలంతో కొద్దిరోజుల్లోనే నాకు ఉద్యోగం వచ్చింది. తన మేలు నేను ఎప్పటికీ మరువలేనిది. ఆ ఉద్యోగంలో మూడు, నాలుగేళ్లు గడిచాక ఒకానొక సందర్భంలో ఉద్యోగం చేస్తున్న చోట నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నా స్నేహితుడితో చెప్పుకున్నాను. తనది చాలా మంచి మనసు కాబట్టి నాకు మళ్ళీ సహాయం చేయాలని వేరొక స్నేహితుడిని తీసుకుని నా ఆఫీస్ ఉండే ప్రాంతానికి వచ్చాడు. అక్కడనుండి నాకు ఫోన్ చేసి తమని కలవడానికి రమ్మని చెప్పాడు. అయితే ఆ సమయంలో నాకు వెళ్ళడానికి వీలుకాక ఏదో ఒక సమాధానం చెప్పాను. నాకోసం అంతదూరం వస్తే, నేనేదో సాకు చెప్పడం తన మనస్సుకి కష్టంగా అనిపించింది. దానితో తను నాతో మాట్లాడటం మానేశాడు. నాకు కూడా బాధగా ఉండేది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అలా చాలా రోజులు గడిచిపోయాయి. చివరికి 2019, జూన్ 28 మధ్యాహ్నం నేను నా మనసులో, "బాబా! నా స్నేహితుడి మనసులో ఉన్న అవరోధాన్ని తొలగించి, తనే నాకు ఫోన్ చేసేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. అంతే కొద్దిక్షణాల్లో నా ఫోన్ మ్రోగింది. చూస్తే, నా ఫ్రెండ్! ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. ఇలా ప్రార్థించానో లేదో, అలా బాబా నెరవేర్చారు. పిలిస్తే పలికే దైవం ఆయన. ఇంతకంటే గొప్ప దైవం వేరెవరున్నారు? "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

దృష్టిని అటు ఇటు మరల్చకుండా నాయందే నిలుపు

2019, జులై 11 గురువారంనాడు నేను బస్సులో ఆఫీసుకు వెళ్తూ నా మొబైల్‌లో శిరిడీ లైవ్ యాప్ ఓపెన్ చేసి మధ్యాహ్న ఆరతి వింటూ వున్నాను. ఆరతి వింటుండగా నా మనసులో ఆలోచనలు ఆఫీసు విషయాల వైపు మళ్ళాయి. మరుక్షణంలో దానంతట అదే ఆరతి సౌండ్ ఎక్కువైంది. దానితో నా మనసు ఆరతి మీద పెట్టాను. మనసు స్థిరంగా ఉండదు, ఏవో ఒక ఆలోచనలను చేస్తూనే ఉంటుంది. అది దాని నైజం కనుక కాసేపటికి నా మనసు మళ్లీ వేరే ఆలోచనలలో పడింది. మళ్ళీ మునుపటిలాగానే దానంతటదే సౌండ్ పెరిగింది. నేను, "ఇదేమిటిలా సౌండ్ పెరుగుతోంది? బహుశా ప్రత్యక్ష ప్రసారంలో ఏదైనా లోపమేమో" అనుకుని ఆరతిపై నా మనసు నిలిపాను. కాసేపటికి నా మనసు మళ్ళీ ఆలోచనలలో పడింది. మళ్ళీ సౌండు పెరిగింది. అలా నా మనసు ఆలోచనలలో పడటం, మరుక్షణంలో సౌండ్ పెరగడం, ఇలా ఐదారుసార్లు జరిగింది. నాకంతా వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆలోచిస్తే... నా మనసు వేరే ఆలోచనల వైపు మళ్ళిన ప్రతిసారీ నా దృష్టిని తమ వైపు మరల్చేందుకే బాబా అలా సౌండ్ పెరిగేలా చేస్తున్నారని నాకు అర్దమైంది. చూసారా! బాబా తన భక్తుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో! అనవసరమైన ఆలోచనలలోపడి కాలయాపన చేసుకోకుండా తమపై దృష్టి నిలిపి భక్తులు ఉద్ధరింపబడాలని ఆయనకెంత ఆరాటమో! ఈ అనుభవం ద్వారా దృష్టిని అటు ఇటు మరల్చకుండా తమ మీదే నిలుపమని బాబా నాకు తెలియజేశారు. "అద్భుతమైన అనుభవాన్నిచ్చినందుకు ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ ఇలాగే మార్గనిర్దేశం చేస్తూ మీ బిడ్డలందరినీ సన్మార్గంలో నడపండి".

లైవ్ లో ఆరతి పునఃప్రసారం.

2019, జులై 22 సోమవారంనాడు నేను మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆఫీసుకి వెళ్తూ మొబైల్‌లో లైవ్ దర్శన్ యాప్ ఓపెన్ చేశాను. ఆ సమయంలో మధ్యాహ్న ఆరతి జరుగుతోంది. అయితే నేను ఆటోలు, బస్సులు మారుతుండటంలో నాకు తెలియకుండానే ఆరతి పూర్తయిపోయింది. అది గుర్తించిన నేను ఆరతి మిస్ అయిపోయానని బాధపడ్డాను. నేను అలా బాధపడ్డానో లేదో వెంటనే బాబా మిరాకిల్ చూపించారు. మరుక్షణంలో నా మొబైల్‌లో మళ్లీ ఆరతి వస్తోంది. అది చూసి నేను ఆనందంలో మునిగిపోయాను. కానీ, "ప్రత్యక్షప్రసారం వచ్చే యాప్ లో మళ్ళీ ఆరతి రావడమేమిటి?" అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే నా ఫ్రెండ్ సాయిసురేష్ కి ఫోన్ చేసి, "శిరిడీ లైవ్ దర్శన్ యాప్ ఓపెన్ చేయి" అన్నాను. తను, "ఎందుకు?" అని అడిగాడు. నేను, "ముందు ఓపెన్ చేసి, ఏమి వస్తుందో చెప్పు" అన్నాను. తను ఓపెన్ చేసి, "ఆరతి అయిపోయి దర్శనాలు అవుతున్నాయి. కానీ ఏమిటి విషయం?" అన్నాడు. నేను, "నా మొబైల్‌లో ఆరతి వస్తోంది" అన్నాను. తనకి నమ్మకం కుదరక, "అదెలా సాధ్యం? ప్రత్యక్షప్రసారమంటే అందరికీ ఒకేలా వస్తుంది కదా" అన్నాడు. "అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ నాకు మాత్రం ఆరతి వస్తోంద"ని నేను చెప్పాను. అయినప్పటికీ తనకి నమ్మకం కుదరలేదు. ఆ విషయమై మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా, 'నేను చెప్తుంది అబద్దం కాదు, నిజమ'ని తనకి తెలియజేసే మరొక లీల బాబా చేశారు. తాను నాతో మాట్లాడుతూనే తన ఎదురుగా ఉన్న కంప్యూటర్‌లో లైవ్ దర్శన్ పెడితే, ఆశ్చర్యం! కంప్యూటర్‌లో ఆరతి వస్తోంది. అదే సమయంలో తన మొబైల్‌లో మాత్రం ఆరతి రావడం లేదు. దానితో తను కూడా ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాడు. ఆరతి మిస్ అయ్యానని బాధపడినందుకు ఆయన ఇంతటి అద్భుతాన్ని మా ఇద్దరికీ చూపించారు. "మీ భక్తులకు ఆనందాన్నివ్వడం కోసం ఎన్ని అద్భుతాలు చూపిస్తారు బాబా!! మీ లీలలు అపారము, అతర్క్యము. మనసా వాచా మీకు మా ప్రణామాలు బాబా!"

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo