సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 141వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. చిన్న చిన్న కోరికలు తీర్చారు బాబా
  2. పిలిచినంతనే బాబా నా బిడ్డ ఇబ్బందిని తొలగించారు

చిన్న చిన్న కోరికలు తీర్చారు బాబా

యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. బ్లాగు ద్వారా బాబాపట్ల నా విశ్వాసం రోజురోజుకీ వృద్ధి చెందుతోంది. బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. సాధారణంగా నేను ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర చదువుతూ, ప్రతి గురువారం బ్లాగులో అనుభవాలు చదువుతుంటాను. ఒక బుధవారంనాడు నా స్నేహితురాలి నుండి ఒక మెసేజ్ కోసం ఎదురుచూస్తూ, "బాబా! దయచేసి ఈరోజు ముగిసేలోగా నా స్నేహితురాలి నుండి మెసేజ్ వచ్చేలా అనుగ్రహిస్తే నేను ఈరోజు బ్లాగులోని అనుభవాలు చదువుతాను" అని బాబాని ప్రార్థించాను. రాత్రి పది దాటేసరికి నేను మెసేజ్ వస్తుందన్న ఆశ దాదాపుగా కోల్పోయాను. సరిగ్గా రోజు ముగియడానికి ఇంకొక గంట ఉందనగా నా స్నేహితురాలి నుండి మెసేజ్ వచ్చింది. ఆశ్చర్యంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మరోసారి నాకు కొత్త ఫోన్ వచ్చింది. పాత ఫోన్‌లోని డేటా కంప్యూటరులో భద్రపరచుకుని, ఫోన్ తీసుకెళ్లి అమ్మేశాను. ఇంటికొచ్చి ఆ డేటాను కొత్త ఫోనులో వేసుకోవడానికి ప్రయత్నిస్తే అది పాస్‌వర్డ్ అడుగుతోంది. అసలు నేనెప్పుడూ పాస్‌వర్డ్ పెట్టుకోలేదు. ఎంతగా ఆలోచించినా పాస్‌వర్డ్ పెట్టుకున్నట్టు గుర్తురాలేదు. పదేళ్లనాటి మధురమైన జ్ఞాపకాలు, కాంటాక్ట్స్ అందులో ఉన్నాయి. వాటిని తిరిగి ఎలా పొందాలో తెలియలేదు. దాదాపు 50 పాస్‌వర్డ్స్ ఇచ్చి ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేదు. కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు పాస్‌వర్డ్ లేదా పాత ఫోన్ ఉంటేనే ఏదైనా చేయగలమని చెప్పారు. నా దగ్గర ఆ రెండూ లేవు. చివరిగా నేను బాబాను ప్రార్థించి ఒక పాస్‌వర్డ్ ప్రయత్నించాను. నిజానికి ఆ పాస్‌వర్డ్ ఇంతకుముందు కూడా ప్రయత్నించాను. కానీ అప్పుడు పని చేయలేదు, కానీ ఈసారి పని చేసింది. నేను ఆశ్చర్యానందాలలో మునిగిపోయాను. "బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటూ ప్రతి చిన్న కోరికను నెరవేరుస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు!"

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2400.html

పిలిచినంతనే బాబా నా బిడ్డ ఇబ్బందిని తొలగించారు

యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 11 సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. సాయి నా జీవితంలోకి వచ్చాక చాలా మంచి జీవితాన్ని నేను పొందాను. బాబా గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నకొద్దీ రోజురోజుకీ ఆయనకు ఇంకా ఇంకా దగ్గరవుతున్న అనుభూతి పొందుతున్నాను. నాకు ఒక సంవత్సరం వయస్సున్న పాప ఉంది. తను పుట్టిన తరువాత నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించమని బాబాను ప్రార్థిస్తున్నాను. ఇక నా అనుభవానికి వస్తే...     

ఒకసారి మా పాపకు వాక్సినేషన్ చేయించాము. అందువలన తను ఇబ్బందిపడుతూ చాలా చికాకు చికాకుగా ఉంది. నిజానికి తను ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టదు. అలాంటి తను ఆరోజు మధ్యరాత్రిలో లేచి గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. నేను తనని ఎత్తుకుని ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నించినా తన ఏడుపు ఆపలేదు. ఎప్పుడూ అంతలా తను ఏడవటం చూడని నేను చాలా భయపడిపోయాను. ఏమి చేయాలో అర్థంకాక వేరే బెడ్రూమ్‌లో పడుకుని ఉన్న నా భర్త వద్దకు పాపను తీసుకుని వెళ్ళాను.  నిద్రమత్తులో ఉన్న ఆయన నన్ను పాపని తీసుకుని బయటకు వెళ్ళమని అన్నారు. నాకు నోటమాట రాలేదు. ఒక తల్లిగా మొదటిసారి సహాయం చేయడానికి ఎవరూ లేక నిస్సహాయస్థితిలో ఉండిపోయాను. వెంటనే నా దేవుడిని తలచుకున్నాను. బాబా ఎందరికో నిద్రపుచ్చడంలో సహాయం చేశారు. మరి నా బిడ్డ విషయంలో ఎందుకు సహాయం చేయరు? ఈ తల్లి వేదనను ఎందుకు తీర్చలేరు? ఆయన తప్ప నాకు ఇంకెవరూ లేరు. విదేశీ నేలపై నా బిడ్డ రక్షణ కోసం ఎక్కడికి పోను? కనీసం ఊదీ కూడా అందుబాటులో లేదు. అది పూజగదిలో ఉంది. నా బిడ్డని ఎత్తుకుని అక్కడి వరకు వెళ్ళలేను. కాబట్టి ఉన్నచోటునుండే ఆయనను పిలిచాను. వెంటనే ఆయన మిరాకిల్ చూపించారు. నేను ప్రార్థించిన పది నిమిషాల్లో నా బిడ్డ నిద్రలోకి జారుకుంది. బాబా తన ఇబ్బందిని తొలగించేశారు. నేను పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "బాబా! నా బిడ్డ వంగడంలో ఇబ్బంది పడుతోంది. తనకి సహాయం చేయండి. మా జీవితంలో ఉన్న ఇతర సమస్యలను కూడా తొలగించి మమ్మల్ని కాపాడండి. మీరు మాత్రమే మా సంరక్షకులు".
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2396.html

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo