సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 138వ భాగం


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. అడగటమే ఆలస్యం - అనుగ్రహించే సాయి.
  2. శిరిడీ దర్శనంతో బాబా నాకు శస్త్రచికిత్స అవసరం లేకుండా చేశారు.

అడగటమే ఆలస్యం - అనుగ్రహించే సాయి

యు.కే. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తుడిని. ఇప్పటివరకు బాబా నాకు చేసిన సహాయాలకి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియడంలేదు. సిల్లీ సిల్లీ విషయాలలో కూడా నాకు ఆయన సహాయం అందుతూ ఉండేది. కొన్నిసార్లు ఆయన చేసిన సహాయాన్ని మేము గుర్తించలేకపోయేవాళ్ళం కూడా. మాకు తెలియనప్పటికీ ఆయన ప్రతిక్షణం మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూ అవసరంలో సహాయాన్ని అందిస్తున్నారు. నా భార్యకు ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. ఆ అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను.

నేను కొన్ని నెలలుగా సోనీ టీవీలో వస్తున్న 'మేరే సాయి' సీరియల్ చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ప్రతిరోజూ సాయిబాబా పాటలు వింటూ ఎక్కువగా ఆయన ధ్యాసలోనే ఉండేవాడిని. నా గదిలో ఉన్న బాబాను ప్రతిరోజూ పూజిస్తూ ఉండేవాడిని. అలా ఉండగా నాకు 2018 జూలైలో వివాహమైంది. పెళ్లయిన తర్వాత నా భార్య ఇంటిలోనే ఉండాలని నిశ్చయించుకుంది. నేను రోజులో ఎక్కువభాగం ఉద్యోగవిధుల్లో ఉండటంతో తనొక్కతే ఇంట్లో ఉంటుండేది. అందువలన తను బోర్ ఫీలై మూడునెలల తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఇంటర్వ్యూకి కాల్స్ వస్తుండేవి, కానీ ఇంటర్వ్యూలో తన ఎంపిక కాలేకపోయేది. ఇంట్లో ఉండేది మేము ఇద్దరమే. ఇద్దరమూ ఆఫీసుకి వెళ్లిపోతే ఇంటిపని, వంటపని చూసుకోడానికి వేరెవరూ లేరు. ఆ విషయం మమ్మల్ని చాలా కలవరపెడుతుండేది. 'దానికి పరిష్కారం ఏమిటి?' అని ఆలోచిస్తూ ఉండేవాళ్లం. ఒకరోజు నేను, "సాయీ! దయచేసి మాకు సరైన మార్గం చూపించండి. మాకు ఏం చేయాలో తెలియట్లేదు. నా భార్య ఎంతగానో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది, కానీ తనకి అవకాశం దక్కట్లేదు" అని చెప్పుకున్నాను. తర్వాత ఒకరోజు నా భార్యకు ఒక ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ గురువారంనాడు జరిగింది. ఆరోజు నేను, "బాబా! నా భార్య మనసుకు నచ్చే విధంగా సహాయం చేయండి" అని ప్రార్థించాను. బాబా కృపవలన తను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యింది. బాబా చూపిన కృపకు నాకు కన్నీళ్ళు వచ్చేశాయి. ఎందుకంటే, ఆ ఆఫీసు మా ఇంటికి అతిసమీపంలో ఉండటమే కాకుండా పనిచేసే వేళలు చాలా అనుకూలంగా ఇచ్చారు. మేము ఏ విషయంలో అయితే దిగులుపడుతున్నామో దాన్ని బాబా చాలా తేలికగా పరిష్కరించేసారు. "బాబా! లవ్ యు బాబా!"

రెండవ భాగం:

నేను రోజులో ఎక్కువగా పండ్లు తీసుకుంటూ ఉంటాను. ఉదయం టిఫిన్ చేశాక పండ్లుగాని, స్నాక్స్‌గాని తింటాను. ఒకరోజు నేను యాపిల్ తింటూ ఉంటే ఒక ముక్క నా గొంతులో ఇరుక్కుపోయింది. అది అటు కడుపులోకి వెళ్లక, ఇటు బయటకు రాక  ఇబ్బందిపడ్డాను. నీళ్లు త్రాగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నా భార్యను వెనకనుండి వీపుపై తట్టమని చెప్పాను. అలా చేస్తే దగ్గు వచ్చి అది కూడా బయటపడుతుందని అనుకున్నాను. కానీ అలా చేసినా కూడా యాపిల్ ముక్క బయటకు రాలేదు. బాబా గుర్తుకు వచ్చి 'సాయిరామ్' అని అనుకున్నాను. అంతే! మరుక్షణంలో సమస్య పరిష్కారమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2396.html

శిరిడీ దర్శనంతో బాబా నాకు శస్త్రచికిత్స అవసరం లేకుండా చేశారు

సాయిభక్తురాలు అనూషా భువనేశ్వరన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

నేను చిన్ననాటినుండి సాయిబాబాకు గొప్ప భక్తురాలిని. ఆయన లేనిదే నా జీవితంలో ఏమీ లేదని నా నమ్మకం. ఆయన నాకు మంచి విద్య, మంచి భర్త, మంచి ఉద్యోగం ఇలా అన్నీ ఇచ్చారు. నేను కలిగివున్నదంతా ఆయన ఆశీస్సుల ఫలితమే. అయితే నాకున్న సమస్యంతా ఒక్కటే - సంతానం. మాకున్న ఆర్థిక సమస్యల కారణంగా మేము ఆ విషయంలో చికిత్సను ప్రారంభించలేకపోయాము. ఒకరోజు నేను, "సాయీ! నాకు సంతానాన్ని ప్రసాదించండి" అని ప్రార్థించి, "ఈ విషయమై మిమ్మల్ని ప్రార్థించడానికి నేను శిరిడీ వస్తాను" అని బాబాకు ప్రమాణం చేశాను. తరువాత 2018, అక్టోబరులో మొదటిసారిగా మేము శిరిడీ వెళ్ళాము. బాబా చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. బాబాని చూస్తూనే నేను కన్నీళ్ల పర్యంతమయ్యాను. మాటల్లో చెప్పలేని అద్భుత అనుభవమది.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిజానికి మేము అదివరకు డాక్టరుని సంప్రదించినప్పుడు, నా అండాశయంలో తిత్తి ఏర్పడిందని, దాన్ని చిన్న శస్త్రచికిత్స చేసి తొలగించాలని, అప్పుడు మాత్రమే గర్భం దాల్చడానికి అవసరమైన మందులు ఇస్తానని డాక్టరు చెప్పారు. శిరిడీనుండి వచ్చాక చికిత్స కోసం మేము ఆసుపత్రికి వెళ్ళాము. అప్పుడు డాక్టరు మరుసటినెలలో శస్త్రచికిత్సకు సిద్ధంగా ఉండమని చెప్పారు. మరుసటినెల మేము శస్త్రచికిత్సకు సిద్ధపడి ఆసుపత్రికి వెళ్ళాము. డాక్టరు ప్రక్రియ మొదలుపెట్టేముందు ఒకసారి స్కాన్ చేశారు. ఆ రిపోర్టులో కొన్ని మార్పులు చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె నన్ను మళ్ళీ పరీక్షించి, "తిత్తి పరిమాణం చాలావరకు తగ్గిపోయింది. దాన్నిప్పుడు అంతగా పరిగణించాల్సిన పనిలేదు. కాబట్టి శస్త్రచికిత్స అవసరం లేదు" అని చెప్పారు. తరువాత గర్భం దాల్చడానికి అవసరమైన మందులు వ్రాసి వాటిని వాడటం మొదలుపెట్టమని చెప్పారు. ఇదంతా నా సాయి ఆశీస్సులు లేకుండా సాధ్యమయ్యేది కాదు. నా భావాలను ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎలా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఆయన ఒక్కరే మన నొప్పిని, బాధని అర్థంచేసుకోగలరు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని మన తల్లిదండ్రుల్లా చూసుకుంటారు. కాదు, అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటారు. ఆయన ఆశీస్సులతో నా చికిత్స మొదలైంది. ఖచ్చితంగా త్వరలోనే సాయి నాకు సంతానాన్ని అనుగ్రహిస్తారు.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2395.html

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo