బాబా సశరీరులుగా ఉన్నప్పుడు దర్శించిన వారిలో శ్రీశంకరరావు బాలాజీకోతే ఒకరు. వీరి వయస్సు ఇంటర్వ్యూ నిర్వహించినపుడు సుమారు 95 సం||లు ఉండవచ్చును. వీరు శిరిడీకి 8 కి.మీ. దూరంలో అహ్మద్ నగర్ కు పోయేదారిలో విశాల భవంతిని నిర్మించుకొని నివసిస్తున్నారు. వీరు పెద్ద భూస్వామి. శంకరరావు కోతే గారు మంచి దేహదారుడ్యంతో తమ పని తాము చేసుకొనేవారు. "సాయిపథం"తో వారు చెప్పిన విషయాల సారాంశం యీ విధంగా ఉంది.
సుమారు 12సం||ల ప్రాయంలో నేను బాబాను సందర్శించడము జరిగింది. దాదాపు అప్పటి నుండి బాబా మహాసమాధి పర్యంతం బాబాను రోజూ దర్శించేవాడిని. బాబా పాదాలు పట్టుకొని నమస్కరించేవాడిని. అప్పట్లో మేము పిల్లలం కనుక, అక్కడున్న పెద్దలు మమ్మల్ని ఎక్కువ సమయం అక్కడ ఉండనిచ్చేవారు కాదు. ప్రథమంగా నేను బాబాను చూచిన రోజుల్లో మసీదు రిపేర్లు చేయబడలేదు. బాబా ఎక్కువ సమయం మసీదులోనే గడిపేవారు. బాబా ముతక కోరాగుడ్డను కఫ్నీగా ధరించేవారు. తెల్లని తలగుడ్డ కట్టేవారు. ఆయన సుమారు 5'-5’ అడుగుల ఎత్తులో పచ్చటి పసిమి రంగు శరీర ఛాయతో ఉండేవారు. బాబా కాలకృత్యాలు తీర్చుకొనేందుకు లెండీ వెళ్ళేటప్పుడు భక్తులు బాండు మేళంతో ఒక కుండలో నీళ్ళు తీసుకొని బాబా వెంట వెళ్ళేవారు. బాబా మామూలుగా నాలుగైదు ఇళ్ళ వద్ద భిక్ష చేసేవారు. వారిలో (1) తాత్యాపాటిల్ (2) రామచంద్ర పాటిల్ (3) లక్ష్మీబాయి షిండే (4) బయ్యాజీ ఇళ్ళకు ఎక్కువగా వెళ్ళేవారు.
బాబా భిక్షకు వెళ్ళేటప్పుడు శ్మశాన భూమి మీదుగా వెళ్ళేవారు. శ్మశానం దీక్షిత్ వాడకు దగ్గర, శని ఆలయం వెనుకగా ఉండేది. బాబా ఒకరోజు చావడిలో, ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించేవారు. బాబా నిద్రించేందుకు అక్కడ ఉన్న గుడ్డపీలికలను, గోనెలను మడతపెట్టి చక్కగా పరచి పడక ఏర్పాటు చేసుకొనేవారు. బాబా సాధారణంగా మరాఠీలోనే మాట్లాడేవారు.
బాబా భిక్ష చేసిన తరువాతనే వేడినీటిలో స్నానం చేసేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా మాంసంతో పలావు వండి అక్కడున్నవారికి వడ్డించేవారు. భక్తులు అది ప్రసాదంగా భుజించేవారు.
బాబా రోజూ తాత్యాకు రూ 50/- లు ఇచ్చేవారు. బాబా ఆశీర్వదించిన పిదపనే తాత్యాకు ముగ్గురు పిల్లలు కలిగారు. నాగపూరుకు చెందిన బూటీకి కూడా బాబా ఆశీర్వాదంతోనే సంతతి కలిగారు. ఆ తర్వాత బూటీ తరచుగా శిరిడీలోనే గడిపారు. మాలేగాం ఫకీరుకు బాబా రోజూ రూ.55/ -ఇచ్చేవారు. నాట్యబృందాలకు కూడా బాబా ఒక్కొక్కరికి రూ.10/- రూ.12/- నజరానా ఇచ్చేవారు. గ్రామస్థులంతా బాబాకు నైవేద్యం తీసుకొని మసీదుకెళ్ళేవారు. 'శ్యాంసుందర్' గుఱ్ఱం ఆరతి సమయంలో బాబాకు ఎదురుగా వచ్చి బాబాకు నమస్కరించేది.
సాయిపథం తరపున శ్రీ బి కోటేశ్వరరావు గారు ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.
సోర్స్ : సాయిపథం వాల్యూం - 3
�� sai Ram
ReplyDelete