సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 134వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారమని ఋజువు చేసిన శ్రీసాయి
  2. ఊదీ ఇచ్చిన క్షణంనుండి జ్వరం తిరిగి రాలేదు

శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారమని ఋజువు చేసిన శ్రీసాయి

సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా శ్రీసాయి దివ్య పాదపద్మాలకు నా శతకోటి నమస్కారాలు. నా పేరు శాంతి. నేను మార్కాపురం నివాసిని. బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అందుకాయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఎన్ని జన్మలెత్తినా సరిపోదు. 2002లో నా జీవితం చాలా అల్లకల్లోలమయింది. ఆ సమయంలో నేను పడిన బాధ, కష్టం మాటల్లో చెప్పలేనిది. ఎన్నోసార్లు సాయిలీలామృతం, గురుచరిత్ర పారాయణ చేశాను. వేలసంఖ్యలో జపాలు చేశాను. ఊరిలోని పొలంపనులు చేసుకునే చదువురానివాళ్ళకు రోజూ ఉదయం, సాయంత్రం 4, 5 అధ్యాయాలు చదివి వినిపిస్తూ ఒక సత్సంగంలా సమయాన్ని గడిపేదాన్ని. ఆ పారాయణ సత్సంగాలలో పాల్గొన్నవాళ్ళకి కోరికలు తీరటం, స్వప్నంలో బాబా దర్శనమిచ్చి వాళ్ళని ఆశీర్వదించడం వంటి ఎన్నో అనుభవాలు కలుగుతుండేవి. కానీ నా జీవితంలో ఎటువంటి మార్పూ రాలేదు. నా పారాయణలు, జపాలు నాకెటువంటి ఫలితం చూపలేదు. కనీసం బాబా నుండి ఒక సందేశం, సూచన వంటివి కూడా లేవు. అలా ఉండగా శ్రీరామనవమి సందర్భంగా మా ఊరి వాళ్లు శిరిడీ వెళ్తున్నారని తెలిసి రిజర్వేషన్ లేకపోయినా ఎలాగోలా సర్దుకుని వాళ్లతో నేను శిరిడీ వెళదామని అనుకున్నాను. కానీ మా అమ్మ అందుకు అంగీకరించలేదు. ఒకటిన్నర సంవత్సరం దాటినా నా పరిస్థితులు మారకపోయేసరికి విసుగుచెంది ఇక నా జీవితం అంతమొందించుకోవాలని అనుకున్నాను. అటువంటి స్థితిలో "నేనుండగా నీకు భయమేల?" అని బాబా మెస్సేజ్ వచ్చింది. దానితో నాకు కాస్త ధైర్యం వచ్చింది. తరువాత ఒకరోజు నేను, "బాబా! శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని మీరు చెప్పారు కదా! మరి నాకు శిరిడీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించి నా బాధలు తీర్చరాదా" అని ప్రాధేయపడ్డాను. ఆశ్చర్యంగా ఆ మరుసటిరోజే నాకు శిరిడీకి పిలుపు వచ్చింది. మా బంధువులు శిరిడీ వెళ్ళడానికి ప్రణాళిక చేసుకుని నాతో, "నువ్వు కూడా మాతో శిరిడీ వస్తావా?" అని అడిగారు. బాబా నన్ను శిరిడీ పిలుస్తున్నారు, ఇక నా బాధలు తీరిపోతాయని నా మనసుకనిపించి ఆనందం పట్టలేకపోయాను. ఈసారి మా అమ్మ కూడా అభ్యంతరం చెప్పలేదు. తరువాత శిరిడీ వెళ్లేముందు బాబా ప్రశ్నావళి పుస్తకంలో చూస్తే, "నాకోసం ఏమి తెస్తావు?" అని వచ్చింది. నేను బాబా కోసం  పాలకోవా తయారుచేసుకుని శిరిడీ ప్రయాణమయ్యాను. అప్పట్లో శిరిడీలో రద్దీ తక్కువగా ఉండేది. మాకు 15 నిమిషాలపాటు చక్కటి దర్శనం లభించింది. బాబాను చూస్తూ కన్నీళ్లతో "నా కష్టాన్ని తీర్చండి బాబా" అని వేడుకున్నాను. తరువాత నేను తీసుకుని వెళ్లిన పాలకోవా అక్కడి పూజారికి ఇస్తే, అతను బాబాకు నివేదించి మా అందరికీ ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం చేతిలో పట్టుకుని మేము పదకొండుమందిమి బయటకు వస్తుంటే, ఒక నల్లకుక్క నా చీర కొంగు పట్టుకుని లాగింది. నేను నా చేతిలో ఉన్న పాలకోవా దానికి పెడితే అది తిన్నది. తరువాత మావాళ్లంతా కూడా దానికి పాలకోవా పెట్టడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లలో ఒక్కరి వద్దనుండి కూడా అది స్వీకరించలేదు. అంతా ఆశ్చర్యపోయారు. నాకు మాత్రం "నాకోసం ఏమి తెస్తావు?" అని అడిగిన బాబా ఆ రూపంలో పాలకోవా స్వీకరించారని మహదానందంగా అనిపించింది. శిరిడీ నుండి వచ్చాక అనూహ్యరీతిన నా కష్టాలన్నీ తీరిపోయాయి. నా ఆనందాన్ని ఎలా చెప్పను? బాబా కృప అపారం. ఆయన ఒకటిన్నర సంవత్సరం పాటు నాచేత పలుమార్లు పారాయణలు, జపాలు  చేయించి నా ప్రారబ్దకర్మను తొలగించారు. తరువాత నన్ను శిరిడీ రమ్మని పిలుపునిచ్చి, అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. చివరికి నేను అనుకున్నదానికన్నా వెయ్యిరెట్లు ఎక్కువగా నన్ను ఆశీర్వదించి నా జీవితం పూలపాన్పుగా మార్చారు ఆ సాయిమహారాజు. నిజంగా శిరిడీ ప్రవేశం సర్వదుఃఖ పరిహారమేనని ఋజువు చేశారు. ఇప్పుడు నా జీవితంలో అంతా శాంతే. ఇంతచేసిన ఆయనకు ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలను?

మరో విషయమేమిటంటే మావారు వెంకటేశ్వరస్వామి భక్తులు. ఆయనకు బాబా మీద నమ్మకం ఉండేది కాదు. ఎప్పుడూ బాబా గుడికి వెళ్లేవారు కాదు. అలాంటాయన పైఅనుభవం జరిగాక బాబాకు భక్తులుగా మారిపోయారు. సాయిబంధువులందరికీ నేను చెప్పేది ఒకటే - శ్రద్ధ, సబూరీ కలిగి ఉంటే బాబా ఎప్పటికీ మనతోనే వుంటారు.

ఊదీ ఇచ్చిన క్షణంనుండి జ్వరం తిరిగి రాలేదు

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 2013 నుండి సాయిభక్తురాలిని. అప్పటినుండి నా జీవితంలో అడుగడుగునా సాయి నాతో ఉన్నట్లు నేను అనుభూతి చెందుతున్నాను. ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

మా అబ్బాయికి హఠాత్తుగా జలుబు, దగ్గుతో పాటు జ్వరం కూడా వచ్చింది. తనకి ఎప్పుడు జలుబు, దగ్గు వచ్చినా సాధారణంగా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈసారి వాటితోపాటు జ్వరం కూడా జతకావడంతో తగ్గలేదు. నేను హోమియోపతి, అల్లోపతి, యాంటీ అలెర్జిక్. ఇలా చాలా మందులు తనకిచ్చాను. కానీ జ్వరం పూర్తిగా తగ్గలేదు. తగ్గినట్లే తగ్గి మళ్ళీ 10 నుండి 18 గంటల్లో తిరిగి వస్తోంది. 5వ రోజుకి కూడా పరిస్థితి అలానే ఉంది. అందువల్ల తను చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు. నేను కూడా ఆ జ్వరం పూర్తిగా తగ్గట్లేదని మనసులో వచ్చే చెడు ఆలోచనలతో చాలా ఆందోళనపడ్డాను. చివరికి 6వ రోజు నేను, "బాబా! తనకి జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించండి" అని బాబాని ప్రార్థించి, పూర్తి విశ్వాసంతో బాబా ఊదీనే ఔషధంగా మా అబ్బాయికి ఇచ్చాను. ఈ మాట చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది - 'ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిన క్షణం నుండి జ్వరం తిరిగి రాలేదు'. నేను సాయిభక్తులకు చెప్పేది ఒక్కటే, సాయిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి సహనంతో ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటూ మన కోరికలన్నీ నెరవేరుస్తారు. 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo